భారత ఆర్మీ చీఫ్‌కు నేపాల్ తమ సైన్యంలో గౌరవ జనరల్ హోదా ఎందుకు ఇస్తోంది

ఫొటో సోర్స్, Hindustan Times/getty images
- రచయిత, సల్మాన్ రావి
- హోదా, బీబీసీ ప్రతినిధి
భారత్, నేపాల్ సైన్యాల మధ్య ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయాన్ని అనుసరిస్తూ భారత ఆర్మీచీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నర్వాణేకు నేపాల్ సైన్యం గౌరవ జనరల్ హోదా ఇవ్వనుంది.
నర్వాణే ఈ వారం నేపాల్‌లో పర్యటనకు వెళ్తున్నారు. ఈ సందర్భంగా ఆ దేశ రాష్ట్రపతి విద్యా దేవీ భండారీ ఆయనకు గౌరవ జనరల్ హోదా ప్రదానం చేయనున్నారు.
ఇంతకుముందు 2017లో అప్పుడు భారత ఆర్మీ చీఫ్‌గా ఉన్న జనరల్ బిపిన్ రావత్‌కు కూడా నేపాల్ ఈ హోదా ఇచ్చింది. గత జనవరిలో ఆయన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా నియమితులయ్యారు.
గత కొన్ని నెలలుగా భారత్, నేపాల్‌ల మధ్య వివాదాలు సాగుతున్న నేపథ్యంలో నర్వాణే పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.
ఉత్తరాఖండ్‌లోని లిపులేఖ్, ధార్చులాలో భారత్ నిర్మించిన 80 కి.మీ.ల పొడవైన రోడ్డు మార్గం విషయమై ఈ ఏడాది జూన్‌లో నేపాల్ అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
ఆ తర్వాత కొన్ని రోజులకు లిపులేఖ్, కాలాపానీ, లింపియధురా తమ దేశంలోని ప్రాంతాలుగా చూపిస్తూ రూపొందించుకున్న మ్యాప్‌ను నేపాల్ పార్లమెంటు ఆమోదించింది.
ఈ ప్రాంతాలు నేపాల్ అంతర్భాగాలని ఆ దేశ ప్రధాని కేపీ శర్మ ఓలీ ప్రకటించారు.
దీంతో రెండు దేశాల మధ్య వివాదం రాజుకుంది.

ఫొటో సోర్స్, NurPhoto/getty images
సరిహద్దుల్లో నేపాల్ సైన్యం జరిపిన కాల్పుల్లో భారత పౌరులకు గాయాలైనట్లు ఆరోపణలు వచ్చాయి. భారత్‌తో సరిహద్దుల్లో తొలిసారి నేపాల్ 'బార్డర్ పోస్ట్' ఏర్పాటు చేసింది.
ఈ ఉద్రిక్తతలపై జనరల్ నర్వాణే చేసిన వ్యాఖ్యలు కూడా వివాదాస్పదమయ్యాయి.
నేపాల్ 'ఎవరి సైగల ప్రకారమో' నడుచుకుంటోందని ఆయన అన్నారు.
ఆయన నేరుగా ఏ దేశం పేరూ చెప్పకున్నా, ఆయన పరోక్షంగా చైనా గురించే అన్నారన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
గత ఏడాది నేపాల్ ఆర్మీ చీఫ్ పూర్ణ చంద్ర థాపాకు భారత సైన్యం గౌరవ జనరల్ హోదా ఇచ్చింది.

ఫొటో సోర్స్, Hindustan Times/getty images
1950లో మొదటిసారి భారత సైన్యం 'కమాండర్ ఇన్ చీఫ్' జనరల్ కేఎం కరియప్పకు తొలిసారి నేపాల్ గౌరవ జనరల్ హోదా ఇచ్చిందని, అప్పటి నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతోందని భారత సైన్యంలోని గోర్ఖా రెజిమెంట్‌లో పనిచేసిన కర్నల్ సంజయ్ శ్రీవాస్తవ్ అన్నారు.
గోర్ఖా రెజిమెంట్లలో నేపాల్ పౌరులను భర్తీ చేసుకుంటారని, బ్రిటిష్ పాలన కాలం నుంచి ఈ పద్ధతి కొనసాగుతూ వస్తోందని ఆయన చెప్పారు.
నేపాల్ సైన్యంలోని జూనియర్, సీనియర్ కమిషన్డ్ అధికారులకు భారత్‌లో శిక్షణ కూడా ఇస్తూ వస్తున్నారని శ్రీవాస్తవ్ చెప్పారు.
గత ఏడాది భారత రాష్ట్రపతి చేతుల మీదుగా గౌరవ జనరల్ హోదా అందుకున్న నేపాల్ ఆర్మీ చీఫ్ జనరల్ పూర్ణ చంద్ర థాపా... భారత్‌లోని 'నేషనల్ డిఫెన్స్ కాలేజీ' నుంచి స్నాతక డిగ్రీ తీసుకున్నారని శ్రీవాస్తవ్ వివరించారు.

ఫొటో సోర్స్, The India Today Group/getty images
భారత సైన్యంలో పనిచేసే నేపాల్ పౌరులకు రెండేళ్లలో నాలుగు నెలల సెలవులు ఇస్తారు. భారతీయ పౌరులకు మాత్రం ఒకే నెల సెలవులు వస్తాయి.
గోర్ఖా రెజిమెంట్లలో పనిచేసే అధికారులందరూ 'గోర్‌ఖాలీ' అంటే నేపాల్ భాషను పూర్తిగా నేర్చుకోవడం తప్పనిసరి అని సైన్యంలోని ఆర్మ్డ్ కోర్‌లో పనిచేసిన కర్నల్ చంద్ర మోహన్ జగోటా బీబీసీతో చెప్పారు.
గోర్ఖా రెజిమెంట్‌లో ప్రతి సభ్యుడి దగ్గరా 'ఖుఖరీ' అనే ఓ కత్తి వ్యక్తిగత ఆయుధంగా ఉంటుంది.
బిహార్, ఝార్ఖండ్‌లలో నేపాల్ పౌరులకు పోలీసు ఉద్యోగాలు కూడా ఇస్తుంటారని కర్నల్ సంజయ్ శ్రీవాస్తవ్ చెప్పారు.
బిహార్ మిలిటరీ పోలీస్, ఝార్ఖండ్ ఆర్మ్డ్ పోలీస్ (జైప్) విభాగాల్లో ఇలా నేపాల్ పౌరుల నియామకాలు జరుగుతాయి. రాంచీలో ఉన్న జైప్ అతిథి గృహం పేరే 'ఖుఖరీ గెస్ట్ హౌస్'.
జనరల్ నర్వాణే పర్యటన గురించి నేపాల్ సైన్యం కూడా ఓ ప్రకటన విడుదల చేసింది. నేపాల్ అధికారిక ఆహ్వానం మేరకు ఆయన పర్యటన జరుగుతున్నట్లు పేర్కొంది.
ఇక ఈ పర్యటన సందర్భంగా నర్వాణే నేపాల్ ప్రధాని కేపీ ఓలీతోనూ భేటీ కానున్నారు. శివపురిలో ఏర్పాటు చేసిన నేపాల్ ఆర్మీ కమాండ్ అండ్ స్టాఫ్ కాలేజీలో శిక్షణ పొందుతున్న అధికారులను ఉద్దేశించి ఆయన ప్రసంగించనున్నారు.
ఇవి కూడా చదవండి:
- ప్రపంచంలో విదేశాలపై ఆధారపడని ఏకైక ‘దేశం’ ఇదేనా?
- పోస్ట్ వెడ్డింగ్ ఫొటోషూట్: ‘లోపల అసలు బట్టలేసుకున్నారా అని అడిగారు’
- పాకిస్తాన్: నిన్నటి దాకా అక్కా చెల్లెళ్లు... ఇప్పుడు అన్నాతమ్ముళ్లు
- ‘నేను బెంగాలీ.. నా బాయ్ ఫ్రెండ్ నల్ల జాతీయుడు - మా అమ్మ ఏం చేసిందంటే..’
- మహిళల శరీరాలు ఎప్పుడంటే అప్పుడు సెక్స్‌కు సిద్ధంగా ఉంటాయా?
- మూడుసార్లు ఉరికంబం వరకు తీసుకెళ్లినా ఆయన్ను ఉరి తీయలేకపోయారు
- సిబ్బంది బాగోగులు చూడటం భారతదేశంలో ఒక వ్యాపారంగా మారనుందా?
- కరోనావైరస్ - రంగస్థల కళాకారులు: "నాటకాలు వేయకపోతే మేం శవాలతో సమానం"
- యూరప్ అణు కేంద్రంలో నటరాజ విగ్రహం ఎందుకుంది, సోషల్ మీడియా దాని గురించి ఏమంటోంది?
- ‘ఐ రిటైర్’ అంటూ పీవీ సింధు కలకలం.. ఇంతకీ ఆమె ఏం చెప్పారు?
- ఇల్లు, ఫర్నీచర్ అమ్మేసి ఓ వ్యాన్ కొనుక్కున్నారు... ఇప్పుడు ఆ వ్యానే వారి ఇల్లు
- రాయల్ ఎన్ఫీల్డ్: ఆసియాలో విస్తరిస్తున్న భారత మోటార్ సైకిల్ బుల్లెట్ అమ్మకాలు
- టైటానిక్ ప్రమాదంలో 700 మంది ప్రాణాలను ఆ రేడియో ఎలా కాపాడిందంటే...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








