భారత్‌ - చైనా ఉద్రిక్తతలు: కైలాస‌ పర్వతాన్ని భారత్‌ ఆక్రమించిందా? అసలు నిజం ఏమిటి? - BBC Fact Check

కైలాస పర్వతం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ఫ్యాక్ట్‌ చెక్‌ టీమ్‌
    • హోదా, బీబీసీ

లద్ధాఖ్‌లోని లైన్‌ ఆఫ్‌ యాక్చువల్ కంట్రోల్‌ (ఎల్‌ఏసీ) వద్ద భారత్‌ చైనాల మధ్య గత కొంతకాలంగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో అక్కడ ఏ చిన్న విషయం జరిగినా అది సంచలనంగా మారుతోంది.

భారత సైన్యం కైలాస‌ పర్వతాన్ని, మానస సరోవరాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వారం రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలు సోషల్‌ మీడియాలో విపరీతంగా షేర్‌ అవుతున్నాయి.

ఈ వార్తతోపాటు భారత సైన్యం కైలాస‌ పర్వతంపై త్రివర్ణ పతాకం ఎగరేస్తున్న ఒక ఫోటో కూడా షేర్‌ అవుతోంది.

''భారత భూభాగంలో చేరిన కైలాస‌ పర్వతం'' అంటూ ఫోటోపై వ్యాఖ్యలు పెడుతున్నారు.

రిటైర్డ్‌ మేజర్ జనరల్ జీడీ బక్షి తన ట్విట్టర్ ఖాతా నుండి ఈ ఫోటోను ట్వీట్ చేశారు. కానీ భారత సైన్యం కైలాస‌ పర్వతాన్ని ఆక్రమించుకునే దిశగా పయనిస్తోందని రాశారు. ఈ ట్వీట్‌ 3000 సార్లు రీట్వీట్ అయ్యింది.

కైలాస‌ పర్వతానికి సంబంధించిన ఈ వార్త ఇంతటితో ఆగలేదు. దీనిపై ఒక ప్రైవేట్‌ టీవీ చానల్‌ ఇచ్చిన బ్రేకింగ్‌ న్యూస్‌ను స్క్రీన్‌ షాట్ తీసుకుని సోషల్ మీడియాలో అనేకమంది యూజర్లు ట్వీట్‌ చేశారు. భారతదేశం కైలాస‌ పర్వతాన్ని ఆక్రమించిందని రాశారు.

ట్విటర్ పోస్ట్

ఫొటో సోర్స్, Twitter

అసలు నిజం ఏమిటి?

మొదట కైలాస‌ పర్వతం ముందు సైనికులు త్రివర్ణ పతాకం ఎగరేస్తున్న దృశ్యాల గురించి మాట్లాడుకుందాం.

బీబీసీ ఫ్యాక్ట్ చెక్‌ టీమ్‌ గూగుల్ రివర్స్‌ ఇమేజ్‌ విధానం ద్వారా ఈ ఫోటోను పరిశీలించింది. జవాన్లు జెండా ఊపుతున్న ఒక ఫోటో చాలాచోట్ల కనిపించింది. కానీ వాటి వెనక కైలాస‌ పర్వతం లేదు.

ఈ ఫోటోను ఈ ఏడాది జనవరి 26న ఇండియా టుడే వెబ్‌సైట్ పిక్చర్ గ్యాలరీలో ఉపయోగించారు. 71వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జమ్మూ-కాశ్మీర్‌లోని లైన్‌ ఆఫ్‌ కంట్రోల్‌ (ఎల్‌ఓసి) వద్ద పిల్లలు, సైనికులు ఈ ఉత్సవాన్ని ఎలా జరుపుకున్నారో ఆ కథనంలో వివరించారు.

ట్విటర్ పోస్ట్

ఫొటో సోర్స్, Twitter

రివర్స్‌ ఇమేజ్ సెర్చ్‌ సందర్భంగా అదే 9మంది సైనికులు ఉన్న ఫోటో ఫేస్‌బుక్‌ పేజీలో కూడా కనిపించింది. ఇందులో ఐదో జవాన్ చేతిలో త్రివర్ణ పతాకం ఉంది. ఈ ఫోటోను జూన్‌ 17న షేర్‌ చేసినట్లు ఉంది.

బీబీసీ ఫ్యాక్ట్‌ చెక్‌ టీమ్‌ దానిని 'యాండెక్స్' సెర్చ్ పోర్టల్‌లో రివర్స్ ఇమేజ్‌ సెర్చ్‌ ద్వారా పరిశీలించింది. ఆ ఫోటోను ఈ ఏడాది ఆగస్టు 17న ఒక యూట్యూబ్ వీడియోలో కూడా ఉపయోగించినట్లు తేలింది.

కైలాస‌ పర్వతాన్ని ఆక్రమించినట్లు చెబుతున్న సైనికులు, జెండా ఫోటోను, ఈ ఫోటోను పరిశీలించి చూసినప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లో కైలాస‌ పర్వతం తప్ప మిగతా అంతా ఒకేలా ఉంది. ఈ ఫోటోలో కైలాస‌ పర్వతాన్ని ఫోటోషాప్‌ ద్వారా చేర్చారని స్పష్టం తెలిసిపోతోంది.

ట్విటర్ పోస్ట్

ఫొటో సోర్స్, Twitter

ఇక రెండో విషయం- భారత్‌ కైలాస‌ పర్వతాన్ని ఆక్రమించిందంటూ ఓ టీవీ ఛానల్ ఇచ్చిన బ్రేకింగ్‌ న్యూస్‌ స్క్రీన్‌షాట్లు. సోషల్ మీడియాలో ఈ స్క్రీన్‌షాట్లు విపరీతంగా షేర్‌ అయ్యాయి.

కైలాస పర్వతం భారత ఆక్రమణలో లేదని దిల్లీ విశ్వవిద్యాలయంలో భూగోళశాస్త్రం బోధిస్తున్న ఒక ప్రొఫెసర్‌ వెల్లడించారు. ఆయన తన పేరును బహిర్గతం చేయరాదని కోరారు.

"పశ్చిమ టిబెట్‌లోని ట్రాన్స్‌ హిమాలయన్‌ రేంజ్‌లో కైలాస పర్వతం ఉంది. లద్ధాఖ్ రేంజ్ ముగిసిన తరువాత కైలాస పర్వత శ్రేణి ప్రారంభమవుతుంది" అని ఆయన వివరించారు.

భారతదేశం కైలాస పర్వతాన్ని ఆక్రమించిందంటూ ఓ ఫోటో షేర్ అవుతోంది

ఫొటో సోర్స్, Twitter

ఫొటో క్యాప్షన్, భారతదేశం కైలాస పర్వతాన్ని ఆక్రమించిందంటూ ఓ ఫోటో షేర్ అవుతోంది

భారత సైన్యం ఇప్పుడు ఎక్కడ ఉంది?

లద్ధాఖ్‌లోని ఇరు దేశాల మధ్య ఘర్షణ కారణంగా ఏప్రిల్‌ నుంచి ఎల్‌ఏసీ దగ్గర సైన్యం మోహరింపు కొనసాగుతోంది. జూన్ 15న లద్ధాఖ్‌లోని గల్వాన్ లోయలో భారత, చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగింది. ఇందులో 20మంది భారతీయ సైనికులు మరణించారు.

ఈ సంఘటనలో చైనా సైనికులు ఎంతమంది మరణించారో ఇంకా స్పష్టంగా తెలియదు. ఆ దేశ అధికార వార్తాపత్రిక గ్లోబల్ టైమ్స్ జూన్ 15న జరిగిన ఘర్షణలో తమకు కూడా నష్టం జరిగినట్లు పేర్కొంది.

ఆగస్టు 29-30 తేదీల మధ్య రాత్రిపూట ఇరు దేశాల సరిహద్దులో మళ్లీ ఉద్రిక్తతలు నెలకొన్నట్లు వార్తలు వచ్చాయి. రెచ్చగొట్టేలా వ్యవహరించారంటూ ఇరుదేశాల సైన్యాలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి.

భారత సైన్యం

ఫొటో సోర్స్, TAUSEEF MUSTAFA / AFP VIA GETTY IMAGES

ఎల్‌ఏసీ వద్ద భారత సైన్యం పెద్ద ఎత్తున మోహరించిందని, ఆయుధాలను కూడా సరిహద్దులకు చేర్చిందని రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ మంగళవారంనాడు లోక్‌సభకు తెలిపారు.

రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల గురించి గురువారంనాడు రాజ్‌నాథ్‌ సింగ్‌ రాజ్యసభలో ఒక ప్రకటన చేశారు. లద్ధాఖ్‌లో భారత్‌ ఎలాంటి సవాల్‌నైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.

సరిహద్దు ప్రాంతంలో భౌగోళికంగా మార్పుల గురించి లోక్‌సభ, రాజ్యసభలలో రక్షణమంత్రి ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. దీనినిబట్టి భారతదేశం కైలాస పర్వతం సహా ఏ స్థలాన్నీ ఆక్రమించలేదని తెలుస్తోంది.

కైలాస పర్వతం ఆక్రమణ గురించి సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారమంతా నకిలీ ప్రచారమని, భారత సైన్యం ఏ ప్రాంతాన్ని ఆక్రమించలేదని బీబీసీ ఫ్యాక్ట్‌ చెక్‌ బృందం పరిశీలనలో తేలింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)