2021లో మీలోని సృజనాత్మకతను వెలికి తీయడం ఎలా

ప్రతీకాత్మక చిత్రం

మనందరిలో ఎంతో కొంత సృజనాత్మజత ఉంటుంది. ఆ సృజనాత్మకత బయటకు రావాలంటే మనకు చాలా స్వేచ్ఛ కావాలి, ఎక్కువ ఖాళీ సమయం చేతిలో ఉండాలి అనుకుంటాం. కానీ ఇది ఎంతవరకు నిజం?

మనకున్న అడ్డంకులు, పరిమితులే మనలోని సృజనను వెలికి తీసుకొస్తాయేమో! ఎప్పుడైనా ఆలోచించారా?

అదెలా సాధ్యం అనుకుంటున్నారా?

'నెసెసిటీ ఈజ్ ది మదర్ ఆఫ్ ఇన్వెన్షన్' అంటారు కదా. అంటే అవసరమే కొత్త ఆవిష్కరణలకు ఊపిరి పోస్తుంది అని అర్థం.

మనకు ఏదైనా అత్యవసరం అనుకున్నప్పుడే మనలోని సృజన బయటకి వస్తుంది. అవసరం తప్ప మరేదీ మనల్ని కొత్త ఆలోచనల దిశగా ముందుకు నెట్టదని నిపుణులు అంటున్నారు.

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Thinkstock

స్వేచ్ఛ ఉంటేనేసృజన సాధ్యమా?

"సృజన ఉంటే అనంతమైన అవకాశాలు మన ముందున్నట్టే అనుకోవడం ఒక భ్రమ" అని ప్రొఫెసర్ కాట్రినెల్ ట్రోంప్ అంటున్నారు.

ప్రొఫెసర్ ట్రోంప్ యూకేలోని ఓపెన్ యూనివర్సిటీలో కాగ్నిటివ్ సైకాలజిస్ట్‌గా ఉన్నారు.

వాస్తవంలో అలాంటి అనంతమైన అవకాశాలు ఎదురుపడితే, మనం స్తంభించిపోతాం. ఏది ఎంచుకోవాలో తెలియక అచేతనంగా ఉండిపోతామని ఆమె అన్నారు.

నిజానికి న్యూటన్ క్వారంటీన్‌లో ఉన్నప్పుడే థియరీ ఆఫ్ కాలిక్యులస్ కనిపెట్టారు. ఒక పందెం కోసం డాక్టర్ సీస్ 50 పదాలను మాత్రమే వాడి ఒక మొత్తం పుస్తకం రాశారు.

అంటే పరిమితులు, అడ్డంకులు ఉన్నప్పుడే మనలోని సృజన వెలుపలికి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట.

ప్రొఫెసర్ ట్రోంప్ మాటల్లో చెప్పాలంటే "అడ్డకులు, పరిమితులే సృజనకు ప్రాణం పోస్తాయి".

న్యూరోసైంటిస్ట్ బారోనెస్ సూసన్ గ్రీన్‌ఫీల్డ్ కూడా ఇది నిజమే అని అంగీకరిస్తున్నారు.

"అయితే, ఇక్కడ మధ్యలో ఒక సన్నని గీత ఉంది...అడ్డంకులు, పరిమితులు సృజనకు పదును పెట్టొచ్చు లేదా సమస్యలుగా మారొచ్చు" అని ఆమె అంటున్నారు.

ఏ అడ్డంకులు లేకుండా కావలసినంత స్వేచ్ఛ ఉంటే మనకి బోర్ కొట్టొచ్చు, ఏదైనా చెయ్యాలన్న తపన ఉండకపోవచ్చు.

అయితే, పరిమితులు ఎక్కువ ఉంటే మనపై ఒత్తిడి పెరుగుతుంది. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితికి చేరుకోవచ్చు.

సృజనాత్మక వక్రరేఖ (క్రియేటివిటీ కర్వ్) అనేది ఒకటి ఉంటుందని, అది తలకిందులుగా ఉన్న U ఆకారంలో ఉంటుందని రిసెర్చ్ చెబుతోంది. సృజనాత్మకత కొంచం కొంచంగా పెరుగుతూ ఉత్తమ స్థాయికి చేరుకుని మళ్లీ తరుగుతూ ఉంటుంది.

క్విల్లా కాన్స్‌టాన్స్
ఫొటో క్యాప్షన్, క్విల్లా కాన్స్‌టాన్స్

అసలు సృజనాత్మకత అంటే ఏమిటి?

"సృజనత్మకత అంటే కింద పడిపోయినప్పుడు మళ్లీ పైకి లేవగలగడం అని చెప్పుకోవచ్చు. మనల్ని సమస్యలు, సవాళ్లు చుట్టుముట్టినప్పుడు, వాటన్నిటినీ తట్టుకుని నిలబడి మళ్లీ వెనక్కి జీవితంలోకి రావడం. అలా వెనక్కి వస్తున్నప్పుడు మనకు సృజనాత్మక ఆలోచనలు వస్తాయి" అని బారోనెస్ గ్రీన్‌ఫీల్డ్ అభిప్రాయపడ్డారు.

"ఇంకా సరళంగా చెప్పాలంటే...సృజనాత్మకత అంటే మన చుట్టూ జరుగుతున్న విషయాలను, రోజువారీ అంశాలను కొత్తగా చూపించడమే కాకుండా అర్థవంతంగా చూపించగలగాలి. ప్రజల దృష్టి మార్చగలిగేలా ఉండాలి. వాళ్లు ప్రపంచాన్ని చూసే దృష్టి మెరుగుపడేలా రూపొందించగలగాలి" అని ఆమె అన్నారు.

ఓపెన్ యూనివర్సిటీలో సైకాలజీ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డా. వోల్కర్ పేటెంట్ సృజనాత్మకతను మరింత సరళంగా వివరిస్తున్నారు.

"ఇంతకుముందు లేనిదాన్ని సృష్టించడమే సృజనాత్మకత. అయితే, అడ్డంకులు, పరిమితులు సృజనకు ప్రేరణనిస్తాయి అన్నది వాస్తవమే అయినా వీటిల్లో కొన్ని ఉద్దేశపూర్వకమైనవి ఉంటాయి, కొన్ని ఉద్దేశపూర్వకం కానివి ఉంటాయి" అని డా. పేటెంట్ తెలిపారు.

"ఈ రెండిటికీ మధ్య తేడా నాకు బాగా తెలుసు" అని ఆర్టిస్ట్ క్విల్లా కాన్స్‌టాన్స్ అంటున్నారు.

"అడ్డంకులు, పరిమితులు రాజకీయమైనవి కావొచ్చు, సాఘికమైనవి లేదా ఆర్థికమైనవి కావొచ్చు. చారిత్రకంగా పితృస్వామ్య భావజాలంతో నిండి, తెల్లజాతీయులకు మాత్రమే సొంతమైన కళా ప్రపంచంలో శ్రామిక తరగతినుంచీ వచ్చిన నల్లజాతి మహిళా ఆర్టిస్ట్‌ను ఒక పరిమితిగా చూసే అవకాశం ఉంది" అని కాన్స్‌టాన్స్ తెలిపారు.

కళా ప్రపంచంలో తనకంటూ ఒక స్థానాన్ని కల్పించుకోవడం కోసం తన ఫేవరెట్ ఆర్టిస్ట్ ఫెయిత్ రింగ్‌గోల్డ్ ఎంత కష్టపడ్డారో కాన్స్‌టాన్స్ గుర్తు చేసుకున్నారు.

"ఆధునిక కళాకృతులను తయారుచేస్తున్న చాలా మంది పురుషుల్లాగానే ఆమె కూడా భారీ కాన్వాసులను తయారుచేయాలనుకున్నారు.

కానీ అవన్నీ చెయ్యడానికి వాళ్లింట్లో జాగా లేదు. అందుకని వాటన్నిటినీ బొంతల్లాగ కుట్టడం ప్రారంభించారు. ఆ బొంతలన్నిటినీ చుట్టిపెట్టి పలు గ్యాలరీలకు తీసుకెళ్లేవారు. అక్కడ ఈ బొంతలను వేలాడదీసి తన కళాకృతులను ప్రదర్శనకు పెట్టేవారు. ఎన్నో పరిమితులు ఉన్నప్పటికీ కళాకారులు ఎంత బాగా రాణించగలరు అనేదానికి ఫెయిత్ రింగ్‌గోల్డ్ ఒక గొప్ప ఉదాహరణ" అని కాన్స్‌టాన్స్ చెప్పారు.

కాబట్టి బాహ్య పరిమితులను ప్రతికూల అంశాలుగా భావించకుండా, అవి మీకు ఎలా ఉపయోగపడతాయో ఆలోచించండి. వాటిల్లోంచే మీరు అద్భుతాలను సృష్టించే అవకాశం ఉంది.

ఒకవేళ అలాంటి బాహ్య పరిమితులు ఏమీ లేకపోతే మీకు మీరే అంతర్గతంగా పరిమితులు సృషించుకోండి. దాని ద్వారా మీ సృజనాత్మకతను వెలికి తీసే అవకాశాలు రావొచ్చు.

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

పరిమితులను సృష్టించుకోవడం ఎలా?

"తెలిసిన విషయాలను వదిలేయండి...కొత్త విషయాలను ప్రయత్నించండి. మీకు కవిత్వం రాసే అలవాటుంటే, అది మానేసి కథ రాసేందుకు ప్రయత్నించండి" అని ప్రొఫెసర్ ట్రోంప్ సలహా ఇస్తున్నారు.

"మీరు ఒక మ్యూజికల్ బ్యాండ్‌లో ఏదైనా వాయిద్యం వాయిస్తున్నారనుకోండి లేదా పాడుతున్నారనుకోండి. కొత్తగా సృజనాత్మకంగా చెయ్యడానికి ఏమీ లేకపోతే వాయిద్యాలను మార్చండి. కొత్త పరికరాలను ప్రయత్నించండి. దానివలన మీకు కొత్త కొత్త ఐడియాలు రావొచ్చు" అని డా. పేటెంట్ అంటున్నారు.

"రోజులో కొంత సమయాన్ని మీ సృజనాత్మకత కోసం కేటాయించండి. ఒక నిర్దిష్ట సమయం పెట్టుకోండి. మీ కుటుంబంలో అందరికీ చెప్పండి...ఫలనా టైంలో నేను నా కోసం పని చేయాలనుకుంటున్నాను. అది నా సృజనాత్మకత కోసం కేటాయించిన సమయం అని చెప్పేయండి. ఇలాగే కొందరు రచయితలు తక్కువ సమయంలో ఎక్కువ పుస్తకాలు రాయగలుగుతుంటారు" అని డా. పేటెంట్ తెలిపారు.

అంతేకాకుండా, మీకు మీరే ఒక కాల పరిమితిని విధించుకోవడం కూడా చాలా అవసరం అంటున్నారు అని ఆర్టిస్ట్ క్విల్లా కాన్స్‌టాన్స్ అంటున్నారు.

"మనకు తక్కువ సమయం ఉంది అనుకున్నప్పుడే మనకు కావలసిన అత్యవసర సమాచారమో, గొప్ప ఆలోచనో మనకు తారసపడుతుంది" అని ఆమె అన్నారు.

ఈ ప్రయత్నాలన్నీ విఫలమైనా కూడా, కొత్తగా ఏదైనా ప్రయత్నిస్తూ ఉండండి అని ప్రొఫెసర్ ట్రోంప్ అంటున్నారు .

"మీరు పెయింటిగ్ చెయ్యాలనుకుంటున్నారు అనుకోండి. కాన్వాస్ మీద ఒక ఎర్రటి చుక్క లేకపోతే ఒక నీలం గీత గీయండి. ఇప్పుడు ఆ చుక్కను లేదా గీతను ఒక అర్థవంతమైన బొమ్మగా ఎలా మార్చొచ్చో ఆలోచించండి.

ఇది వినడానికి వింతగా ఉండొచ్చు కానీ మీకు మీరే సృషించుకున్న పరిమితులు మీకు కొత్త ఆలోచనలు కలిగించడానికి దోహదపడతాయి. ఆ పరిమితుల చుట్టూ ఆలోచిస్తూ ఉంటే కొత్త ఐడియాలొస్తాయి" అని ట్రోంప్ అన్నారు.

"అవి కాకపోతే మరో రకమైన పరిమితులు పెట్టుకోండి. ఇలా రకరకాలుగా ప్రయత్నించడం వలన మీ ఊహా ప్రపంచం విస్తరిస్తుంది. మీ సృజనాత్మకత మెరుగుపడుతుంది" అని ఆమె తెలిపారు.

మరింకెందుకు ఆలాస్యం? వెంటనే మొదలుపెట్టండి..మీలోని సృజనాత్మకతను వెలికి తీయండి.

(ఈ వ్యాసం బీబీసీ ఐడియాస్ వీడియోనుంచి తీసుకున్నది)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)