పాకిస్తాన్ - బేనజీర్ భుట్టో: మూడు బుల్లెట్లు క్షణాల్లో తలలోకి దూసుకెళ్లాయి.. ఆమె కుప్పకూలిపోయారు.

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రేహాన్ ఫజల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
అది 2007 డిసెంబర్ 26 రాత్రి.. పెషావర్ నుంచి సుదీర్ఘ కారు ప్రయాణం చేసిన బేనజీర్ భుట్టో ఇస్లామాబాద్‌లోని తన నివాసం జర్దారీ హౌస్‌కు చేరుకునేసరికి చాలా అలసిపోయారు.
కానీ, ఒక ముఖ్యమైన పనిమీద కలవాలని ఐఎస్ఐ చీఫ్ మేజర్ జనరల్ నదీమ్ తాజ్ పంపిన సందేశం అప్పటికే అక్కడకు చేరింది.
రెండు గంటలు పడుకున్న తర్వాత నదీమ్ తాజ్‌ను కలుద్దామని పాకిస్తాన్ మాజీ ప్రధాని బేనజీర్ భుట్టో అనుకున్నారు.
రాత్రి ఒంటి గంటన్నరకు ఆయనతో సమావేశమయ్యారు. అప్పుడు బేనజీర్‌తోపాటూ, ఆమె భద్రతా సలహాదారు రహమాన్ మలిక్ కూడా ఉన్నారు.
ఈరోజు మీపై ఎవరో హత్యాయత్నం చేయవచ్చని నదీమ్ తాజ్ ఆమెతో చెప్పారు. ఆయన తనకు అందిన సమాచారం పట్ల ఎంత నమ్మకంగా ఉన్నారంటే, అర్థరాత్రి ఆ విషయం చెప్పడానికి ఇస్లామాబాద్‌లో బేనజీర్ నివాసానికి ఆయనే స్వయంగా వెళ్లారు.

ఫొటో సోర్స్, OWEN BENNETT JONES
ఆ విషయాన్నీ ఇస్లామాబాద్ బీబీసీ మాజీ ప్రతినిధి ఒవెన్ బెనెట్ జోన్స్ తన 'ద భుట్టో డినాస్టీ ద స్ట్రగుల్ ఫర్ పవర్ ఇన్ పాకిస్తాన్'లో రాశారు.
బేనజీర్‌కు ఆయన చెప్పింది వినగానే, బహుశా తన కార్యక్రమాలు రద్దు చేసుకునేలా ఒత్తిడి తీసుకురావడానికే నదీమ్ తాజ్ అలా అంటున్నారేమో అని సందేహం వచ్చింది.
ఆమె తాజ్‌తో "ఆత్మాహుతి దాడి జరుగుతుందని తెలిసినప్పుడు, వారిని మీరు అరెస్ట్ చేయవచ్చు కదా" అన్నారు. ఆయన "అది కుదరదు, ఎందుకంటే, అలా చేస్తే, మాకు సమాచారం అందించిన వారి వివరాలు బయటపడతాయి" అన్నారు.
దాంతో, బేనజీర్ "మీరు నా భద్రత పెంచండి. నేను సురక్షితంగా ఉండడంతోపాటూ, నా వాళ్లు కూడా భద్రంగా ఉండేలా చూసుకోండి" అన్నారు. తప్పకుండా భద్రత కట్టుదిట్టం చేస్తానని ఐఎస్ఐ చీఫ్ ఆమెకు భరోసా ఇచ్చారు.

ఫొటో సోర్స్, PENGUIN
బేనజీర్ హత్యకు ప్రణాళిక
బేనజీర్ జనరల్ నదీమ్ తాజ్‌తో మాట్లాడుతున్న అదే సమయంలో ఆమెను హత్య చేయాలకున్నవారు తుది సన్నాహాల్లో ఉన్నారు. బెనెట్ జాన్స్ తన పుస్తకంలో దాని గురించి కూడా రాశారు.
"అర్థరాత్రి దాటాక తాలిబాన్ల హాండ్లర్ నస్రుల్లా తనతోపాటూ 15 ఏళ్ల వయసున్న ఇద్దరు పిల్లలు బిలాల్, ఇక్రాముల్లాను తీసుకుని రావల్పిండి చేరుకున్నాడు, ఆలోపు తాలిబన్లకు చెందిన హుస్సేన్ గుల్, రఫాకత్ హుసేన్ అనే ఇద్దరు రావల్పిండి లియాకత్ హుస్సేన్ పార్క్‌లో రెక్కీ చేసి వచ్చారు.
ఆ రోజు సాయంత్రం బేనజీర్ అదే పార్కులో ప్రసంగించబోతున్నారు. పోలీసులు పార్క్ మూడు గేట్ల దగ్గరా మెటల్ డిటెక్టర్లు ఏర్పాటుచేశారు. కానీ, వాటివల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. ఎందుకంటే, బేనజీర్ ర్యాలీ నుంచి తిరిగి వెళ్తున్నప్పుడు ఆమెపై దాడి చేయడానికి ప్లాన్ సిద్ధమైంది"
రెక్కీ చేసిన ఇద్దరూ పూర్తిగా సంతృప్తిచెందాక వెనక్కు తిరిగారు. వారు బిలాల్‌కు కొన్ని బుల్లెట్లు, ఒక పిస్టల్, ఇక్రాముల్లాకు ఒక హాండ్ గ్రెనేడ్ ఇచ్చారు.
బిలాల్‌తో ట్రైనర్ షూస్ బదులు వేరే ఏవైనా వేసుకోమని హుసేన్ చెప్పాడు. ఎందుకంటే, జిహాదీలు ట్రైనర్స్ వేసుకుంటారని భద్రతా బలగాలకు సమాచారం ఉంది.
దాంతో బూట్లు తీసేసిన బిలాల్ చెప్పులు వేసుకున్నాడు.
నమాజు చేసిన తర్వాత హుస్సేన్ బిలాల్‌ను.. బేనజీర్ కోసం ఉపయోగిస్తారని భావించిన గేటు దగ్గరకు తీసుకెళ్లాడు.

ఫొటో సోర్స్, Getty Images
లియాకత్ బాగ్ వెళ్లే ముందు హామీద్ కర్జాయ్‌తో భేటీ
బేనజీర్ భుట్టో హత్య కేసు దర్యాప్తు చేసిన ఐక్యరాజ్యసమితి దర్యాప్తు కమిటీ చీఫ్, దీనిపై 'గెటింగ్ అవే విత్ మర్డర్' అనే పుస్తకం కూడా రాసిన హెరాల్డో మున్యోజ్ ఆ రోజు ఘటనల గురించి రాశారు.
డిసెంబర్ 27న ఉదయం బేనజీర్ 8.30కు లేచారు. టిఫిన్ చేశాక, అమీన్ ఫహీమ్, పీపుల్స్ పార్టీ మాజీ సెనేటర్‌తో కలిసి అఫ్గానిస్తాన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్‌ను కలవడానికి వెళ్లారు.
కర్జాయ్ ఇస్లామాబాద్ సెరీనా హోటల్ నాలుగో అంతస్తులో ఉన్నారు. ఆయనను కలిశాక ఒంటి గంటకు ఆమె తిరిగి జర్దారీ హౌస్‌కు వచ్చారు.
భోంచేసి తన సహచరులతో కలిసి సాయంత్రం లియాకత్ బాగ్‌లో ఇవ్వబోయే ప్రసంగానికి మార్పులు చేర్పులు చేశారు.
మధ్యాహ్నం బేనజీర్ వాహనాల కాన్వాయ్ లియాకత్ బాగ్ వైపు బయలుదేరింది. కాన్వాయ్‌లో ముందు టయోటా లాండ్ క్రూజర్‌లో పీపీపీ భద్రతా చీఫ్ తౌకీర్ కైరా ఉన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
దాని వెనకే బేనజీర్ తెల్ల రంగు లాండ్ క్రూయిజర్ వెళ్తోంది. దానికి రెండు వైపులా కైరాకు సంబంధించిన రెండు వాహనాలు వెళ్తున్నాయి. ఆ వాహనాల వెనుక జర్దారీ హౌస్‌కు చెందిన రెండు టయోటా విగో పికప్ ట్రక్కులు నడుస్తున్నాయి.
వాటి వెనక ఒక నల్లటి మెర్సిడెస్ బెంజ్ కూడా ఉంది.
అది బుల్లెట్ ప్రూఫ్ వాహనం. అవసరమైతే బేనజీర్ కోసం బ్యాకప్‌లా ఉపయోగించడానికి దానిని తీసుకొస్తున్నారు.
బేనజీర్ ఉన్న కార్లో ముందు సీట్లో ఎడమవైపు డ్రైవర్ జావెదూర్ రహమాన్, కుడివైపు సీనియర్ పోలీస్ సూపరింటెండెంట్ మేజర్ ఇంతియాజ్ హుస్సేన్ ఉన్నారు.
మధ్య సీటులో ఎడమవైపు పీపీపీ సీనియర్ నేత మక్దూమ్ అమీన్ ఫహీమ్, మధ్యలో బేనజీర్, కుడివైపు బేనజీర్ రాజకీయ కార్యదర్శి నహీద్ ఖాన్ కూర్చుని ఉన్నారు.

ఫొటో సోర్స్, JOHN MOORE
భద్రతా నిబంధనలు పట్టించుకోలేదు
మధ్యాహ్నం 2.15కు బేనజీర్ కాన్వాయ్ ఫైజాబాద్ జంక్షన్ చేరుకుంది.
అక్కడ భద్రత బాధ్యతలు రావల్పిండి జిల్లా పోలీసులకు అప్పగించారు.
2.56కు బేనజీర్ కాన్వాయ్ లియాకత్ రోడ్ జంక్షన్ చేరుకుంది. లియాకత్ బాగ్ వీఐపీ పార్కింగ్ వైపు కదిలింది.
ఈలోపు బేనజీర్ కార్లోనే లేచి నిలబడ్డారు. లాండ్ క్రూజర్ పైకప్పుకు ఉన్న ఎస్కేప్ హాచ్ నుంచి ఆమె ముఖం కనిపిస్తోంది.
ఆమె జనాలకు అభివాదం చేస్తున్నారు. ఆ వాహనం మెల్లమెల్లగా లియాకత్ రోడ్ వైపు వెళ్తోంది.
బేనజీర్ సెక్యూరిటీగా ఉన్నవారు, అలా నిలబడడం ప్రమాదకరం అని ఆమెను ఒక్కసారి కూడా హెచ్చరించలేదు.
హెరాల్డో మున్యోజ్ ఆ తర్వాత ఏం జరిగిందో తన 'గెటింగ్ అవే విత్ మర్డర్' పుస్తకంలో వివరించారు..
3.16కు పార్కింగ్ ప్రాంతంలో గేట్ దగ్గర బేనజీర్ కాన్వాయ్ ఐదారు నిమిషాలు ఆగిపోవాల్సి వచ్చింది.
పోలీసుల దగ్గర ఆ గేటు తెరిచే తాళాలు లేకపోవడంతో అది ఆలస్యం అయ్యింది. ఈలోపు బేనజీర్ ఏ భద్రతా లేకుండానే తన వాహనంలో నిలబడి ఉన్నారు.
ఎస్కేప్ హాచ్ నుంచి, ఆమె ముఖం అందరికీ కనిపిస్తోంది.

ఫొటో సోర్స్, JOHN MOORE
ఆవేశంగా చివరి ప్రసంగం
ఆ తర్వాత బేనజీర్ 10 వేల మంది హాజరైన ఆ సభలో దాదాపు అరగంట పాటు ప్రసంగించారు.
ఆ సమయంలో ఆమె 17 సార్లు తన తండ్రి పేరు పలికారు. ప్రసంగం ముగియగానే అక్కడంతా 'బేనజీర్ జిందాబాద్' అనే నినాదాలు మారుమోగాయి.
స్పీచ్ తర్వాత బేనజీర్ తన కారులో కూర్చున్నారు. మద్దతుదారులు గుమిగూడడంతో కారు చాలాసేపు అక్కడే ఆగిపోయింది.
చుట్టూ జనాలను చూసిన బేనజీర్ నిలబడ్డారు. ఎమర్జెన్సీ హాచ్ నుంచి ఆమె తల, భుజాలు కనిపిస్తున్నాయి. అప్పుడు సమయం సాయంత్రం 5.10.

ఫొటో సోర్స్, DAWN NEWS TV
ఒక్క సెకనులో మూడు బుల్లెట్లు దూసుకెళ్లాయి
ఒవెన్ బెనెట్ జోన్స్ అక్కడ కొన్ని క్షణాల్లో ఏం జరిగిపోయిందో వివరించారు.
"ఉదయం నుంచీ అక్కడే ఉన్న బిలాల్‌కు, తన పని పూర్తి చేయాల్సిన సమయం వచ్చిందని అనిపించింది.
అతడు మొదట బేనజీర్ వాహనం ముందుకెళ్లాడు. తర్వాత కారు పక్కకు చేరుకున్నాడు. అక్కడ జనం తక్కువగా ఉన్నారు.
పిస్టల్ బేనజీర్ తలకు గురిపెట్టాడు. ఒక సెక్యూరిటీ గార్డ్ బిలాల్‌ను గమనించి, అడ్డుకోడానికి ప్రయత్నించాడు. కానీ, దూరంగా ఉన్న అతడు వెంటనే అక్కడికి చేరుకోలేకపోయాడు.
బిలాల్ ఒక్క క్షణంలో మూడు రౌండ్లు ఫైర్ చేశాడు. మూడో బుల్లెట్ దూసుకెళ్లగానే బేనజీర్ ఎస్కేప్ హాచ్ కిందక జారి, కారు వెనుక సీట్లో కుప్పకూలిపోయారు.
ఆమె కింద పడగానే బిలాల్ తను కట్టుకున్న బాంబు పేల్చుకున్నాడు.

ఫొటో సోర్స్, Getty Images
"మూడు బుల్లెట్లు పేలిన శబ్దం వినిపించింది.. బేనజీర్ కింద పడ్డారు. ఆమె తల కుడిభాగం నా ఒడిలో పడింది. తల, చెవి నుంచి వేగంగా రక్తం కారుతోంది, నా బట్టలు ఆ రక్తంతో తడిచిపోయాయి" అని బేనజీర్‌కు కుడివైపు కూర్చున్న నహీద్ ఖాన్ తనతో చెప్పారని రచయిత హెరాల్డో మున్యోజ్ తన 'గెటింగ్ అవే విత్ మర్డర్' పుస్తకంలో రాశారు.
"కింద పడగానే, ఆమె ప్రాణాలతో ఉన్న ఛాయలేవీ లేవు. వాహనంలో మిగతా ఎవరికీ పెద్ద గాయాలేవీ తగల్లేదు" అని బేనజీర్‌కు ఎడమవైపు కూర్చున్న మక్దూమ్ అమీన్ ఫహీమ్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
కారు నాలుగు టైర్లూ పేలిపోయాయి
అక్కడ ఒక్క అంబులెన్స్ కూడా లేదు. బాంబు పేలుడు ధాటికి బేనజీర్ కారు నాలుగు టైర్లూ పేలిపోయాయి.
డ్రైవర్ ఇనుప రిమ్ములతోనే కారును నడుపుతూ, రావల్పిండి జనరల్ ఆస్పత్రి వరకూ వెళ్లాలనుకున్నాడు.
లియాకత్ రోడ్‌పై 300 మీటర్లు వెళ్లాక అతడు కారును అదే స్థితిలో ఎడమవైపు తిప్పాడు. కొన్ని కిలోమీటర్లు వెళ్లిన లాండ్ క్రూజర్ యూటర్న్ తీసుకోవాల్సినప్పుడు ఆగిపోయింది.
ఘటనాస్థలంలో ఉన్న రెండు కమాండో వాహనాలు బేనజీర్ కారు వెనుక వెళ్లాలని ప్రయత్నించాయి. కానీ, వాటి ముందంతా శవాలు, గాయపడ్డవారు చెల్లాచెదురుగా ఉండడంతో ముందుకు కదల్లేకపోయాయి.
బేనజీర్‌ను ఆస్పత్రికి ఎలా తీసుకెళ్లామో నాహీద్ ఖాన్ ఒవెన్ బెనెట్ జాన్స్ కు చెప్పారు,
"బేనజీర్‌ను టాక్సీలో ఆస్పత్రికి తీసుకెళ్లడం తప్ప మాకు మరో దారి లేదు. అక్కడ పోలీసులు లేరు. మేం టాక్సీ కోసం చూస్తున్నప్పుడు, బేనజీర్ ప్రతినిధికి చెందిన ఒక జీప్ వచ్చి ఆగింది. మేం దాన్లో బేనజీర్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లాం" అన్నారు.
దాడి జరిగిన 34 నిమిషాల తర్వాత బేనజీర్‌ను ఆస్పత్రి తీసుకెళ్లినట్లు అక్కడి రికార్డులు చెబుతున్నాయి.
బేనజీర్ గొంతుకు ట్యూబ్ పెట్టారు
ఆస్పత్రికి చేరుకోగానే బేనజీర్‌ను పార్కింగ్ నుంచే స్ట్రెచర్‌పై లోపలికి తీసుకెళ్లారు. ఆమె నాడి దొరకడం లేదు, శ్వాస కూడా ఆడడం లేదు.
కనుపాపలు నిశ్చలంగా ఉన్నాయి. టార్చ్ వేసినా వాటిలో ఎలాంటి కదలికా లేదు. ఆమె తలలో గాయాల నుంచి రక్తం వస్తోంది. ఒక తెల్లటి పదార్థం బయటికి కారుతోంది. అవన్నీ, ఆమె ప్రాణాలతో లేదనే విషయాన్ని చెబుతున్నా.. డాక్టర్ సయీదా యాస్మీన్ మాత్రం బేనజీర్‌ను కాపాడాలని శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. కాసేపటికే డాక్టర్ ఔరంగజేబ్ ఖాన్ కూడా ఆమెకు సాయం కోసం వచ్చారు. బేనజీర్ గొంతుకు రంధ్రం చేసి, ఒక ట్యూబ్ పెట్టారు.
5.50కు ఆస్పత్రి సీనియర్ ఫిజీషియన్ ప్రొఫెసర్ మొసద్దిక్ ఖాన్ అక్కడికి వచ్చారు. అప్పటికీ బేనజీర్ ముక్కు, చెవుల నుంచి రక్తం కారుతూనే ఉంది.
దాడి జరిగిన 50 నిమిషాల తర్వాత, సాయంత్రం 6కు కాస్త ముందు.. డాక్టర్ ఆమెను ఆపరేషన్ థియటర్‌లోకి తీసుకెళ్లారు, బేనజీర్ చాతీని తెరిచిన ముసద్దిఖ్ ఖాన్ ఆమె గుండెను చేతులతో కదిలించడం మొదలుపెట్టారు.
కానీ, ఆమె శరీరంలో ఎలాంటి చలనం లేదు. 6.16కు బేనజీర్ చనిపోయినట్లు ప్రకటించారు.

ఫొటో సోర్స్, Getty Images
బేనజీర్ దుపట్టా ఏమయ్యిందో ఇప్పటికీ తెలీదు
తర్వాత, మగవాళ్లను ఆపరేషన్ థియేటర్ బయటకు వెళ్లాలని చెప్పారు. డాక్టర్ కుదసియా అంజుమ్ ఖురేషీ, మిగతా నర్సులు బేనజీర్ పార్థివదేహాన్ని శుభ్రం చేశారు. తలకు తగిలిన బుల్లెట్ గాయాలకు బాండేజ్ కట్టారు.
రక్తంతో తడిచిన ఆమె బట్టలు తీసేసి, ఆస్పత్రి బట్టలు వేశారు.
బేనజీర్‌ను ఆస్పత్రి తీసుకవచ్చేటప్పటికే ఆమె శరీరంపై దుపట్టా లేదని డాక్టర్లు చెప్పారు. ఆ దుపట్టా ఏమయ్యిందో ఇప్పటికీ తెలీదు.
బేనజీర్ డెత్ సర్టిఫికెట్ నంబర్ - 202877లో మృతికి కారణం రాయాల్సిన కాలమ్‌లో "పోస్టుమార్టం తర్వాత తెలియవచ్చు" అని ఉంది.
పోలీస్ చీఫ్ సవూద్ అజీజ్‌ను డాక్టర్ ముసద్దిక్ ఖాన్ మూడు సార్లు పోస్టుమార్టం కోసం అనుమతి అడిగారు. కానీ ఆయన ఇవ్వలేదు.
బేనజీర్ కుటుంబం దానికి ఒప్పుకోలేదని ఆయన తర్వాత తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు.
ఆస్పత్రి వారు బేనజీర్ చనిపోయినట్లు ప్రకటించినపుడు, బయట ఉన్న జనం షాక్ అయ్యారు. మరో భుట్టో దారుణ హత్యకు గురయ్యారని రోధించారు.
బేనజీర్ తండ్రి జుల్ఫికర్ అలీ భుట్టోకు సైనిక ప్రభుత్వం ఉరిశిక్ష విధించింది. ఆమె సోదరుడు షానవాజ్ విషంతో చనిపోతే, మరో సోదరుడు ముర్తజాను కాల్చి చంపారు.

ఫొటో సోర్స్, Getty Images
పోస్టుమార్టం చేయించడానికి జర్దారీ నిరాకరించారు
రాత్రి 10.35. బేనజీర్ పార్థివ దేహాన్ని శవపేటికలో పెట్టి దగ్గరలోని చక్‌లాతా ఎయిర్‌బేస్ తీసుకెళ్లారు.
డిసెంబర్ 28న రాత్రి ఒంటిగంటకు ఆమె శవాన్ని భర్త ఆసిఫ్ అలీ జర్దారీకి అప్పగించారు. ఆయన అప్పుడే దుబాయి నుంచి వచ్చారు.
జర్దారీ పాకిస్తాన్ చేరుకోగానే, శవానికి పోస్టుమార్టం చేయాలని ఆయన్ను కూడా అడిగారు. కానీ జర్దారీ నిరాకరించారు.
2007 డిసెంబర్ 28న బేనజీర్ భుట్టోను లర్‌కానా గడీ ఖుదాబక్ష్‌లో ఖననం చేశారు.

ఫొటో సోర్స్, AFP
బేనజీర్ తను చనిపోతానని ముందే ఊహించారా?
పాకిస్తాన్ రావడానికి ముందు అమెరికా, కొలరాడోలోని ఆస్పెన్ నగరం వెళ్తున్నారు. విమానాశ్రయంలో ఆమెతోపాటూ అమెరికా రాయబారి జాల్‌మే ఖలిల్‌జాద్ , ఆయన భార్య కూడా ఉన్నారు.
విమానంలో ఎయిర్ హోస్టెస్ నేరుగా ఓవెన్ నుంచి తీసిన కుకీస్ తీసుకొచ్చి బేనజీర్‌కు తీసుకోమని చెప్పారు. బరువు తగ్గాలనుకుంటున్నానని చెప్పిన బేనజీర్ వాటిని తిరస్కరించారు.
కానీ, క్షణంలోనే ఆమె ఎయిర్ హోస్టెస్‌ను వెనక్కు పిలిచారు. "ఇలా ఇవ్వండి. ఏం కాదులే.. కొన్ని నెలల్లో నేను చనిపోవాలిగా" అన్నారు.
ఇవి కూడా చదవండి:
- బాయ్‌ఫ్రెండ్ వల్ల గర్భం వచ్చింది.. భర్తకు తెలియకుండా బిడ్డకు జన్మనిచ్చింది.. ఆ తర్వాత...
- రైతు ఆత్మహత్యలు: ‘మా అమ్మను వ్యవసాయం చేయనివ్వను’
- అప్పు త్వరగా తీర్చేయాలని పాకిస్తాన్‌ను సౌదీ ఎందుకు అడుగుతోంది?
- అనిల్‌కపూర్ : పెద్ద హీరోలు వద్దన్న పాత్రలు చేయడానికి ఏ మాత్రం సిగ్గుపడని హీరో
- ఒక ఉల్కను అమ్మేసి, రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అవుదామనుకున్నాడు. కానీ...
- కరోనావైరస్: బాబా రామ్‌దేవ్ ‘కరోనిల్’ కోవిడ్ నుంచి రక్షిస్తుందా? - బీబీసీ పరిశోధన
- "పార్లమెంటుకు పట్టని అన్నదాతల వ్యథలు· "జీరో బడ్జెట్ వ్యవసాయం అంటే ఏమిటి? కేంద్ర ఆర్ధికమంత్రి ఏపీని ఎందుకు ప్రస్తావించారు...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








