ఒసామా బిన్ లాడెన్‌ను చంపడానికి బరాక్ ఒబామా బృందం ఎలా వ్యూహం పన్నింది? 'ఎ ప్రామిస్డ్ ల్యాండ్’ పుస్తకంలో వివరించిన అమెరికా మాజీ అధ్యక్షుడు

ఒసామా బిన్ లాడెన్‌

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఒసామా బిన్ లాడెన్‌
    • రచయిత, రేహాన్ ఫజల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లోని సిట్యుయేషన్ రూమ్‌లో 2009 మే నెలలో ఒక అత్యవసర సమావేశం జరిగింది. అది ముగిసిన వెంటనే అధ్యక్షుడు బరాక్ ఒబామా తన సలహాదారులు కొంతమందిని వెంటబెట్టుకుని ఓవల్ ఆఫీస్‌కు దారి తీశారు. అందరూ లోపలికెళ్లి తలుపులు బిగించుకున్నారు.

వారిలో వైట్‌హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ రహమ్ ఇమాన్యుయేల్, సీఐఏ డైరెక్టర్ లియోన్ పనేటా, డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ టామ్ డానిలన్ ఉన్నారు.

ఒసామా బిన్ లాడెన్ జాడ కనుక్కోవడం తక్షణ కర్తవ్యమని, ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చెయ్యాలని, ప్రతి 30 రోజులకు ఒకసారి ఎంత ప్రగతి సాధించామనే విషయాన్ని తనకు వివరించి చెప్పాలని ఒబామా వారిని కోరారు.

ఒబామా పుస్తకం ‘ఎ ప్రామిస్డ్ ల్యాండ్’

ఫొటో సోర్స్, NurPhoto

ఆ ప్రణాళిక గురించి ఒబామా తన పుస్తకం ‘ఎ ప్రామిస్డ్ ల్యాండ్‌’లో ఈ విధంగా రాశారు:

"9/11 దుర్ఘటన జరిగి 9 ఏళ్లు పూర్తవుతున్నాయనగా.. ఒక్క రోజు ముందు సీఐఏ డైరెక్టర్ లియోన్ పనేటా, ఆయన నంబర్ టూ మైక్ మోరెల్ నన్ను కలవడానికి వచ్చారు. ఒసామా బిన్ లాడెన్ గురించి ముందస్తు సమాచారం అందిందని లియోన్ నాకు చెప్పారు.

‘మా గూఢచారులు అహ్మద్ అల్ కువైతీ అనే వ్యక్తిని కనుగొన్నారు. అతను అల్‌ఖైదాకు దూతగా పనిచేస్తాడు. కువైతీకి, లాడెన్‌తో దగ్గర సంబంధాలున్నాయని తెలిసింది. అతనికి వస్తున్న ఫోన్లు, రోజువారీ కార్యకలాపాలపై మా గూఢచారులు ఒక కన్నేసి ఉంచారు. మాకొచ్చిన సమాచారం ప్రకారం పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్‌ నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న అబోటాబాద్ నగర శివార్లలో ఒక పెద్ద ఆవరణ ఉంది. ఆ ప్రదేశం, అక్కడి వాతావరణం చూస్తుంటే ఆ భవనంలో అల్‌ఖైదాకు చెందిన పెద్ద మనుషులెవరో నివస్తిస్తున్నట్లు తోస్తోంది’ అని మైక్ చెప్పారు.”

అబోటాబాద్‌లో లాడెన్ నివాసం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అబోటాబాద్‌లో లాడెన్ నివాసం

ఆ ఆవరణలో నివసిస్తున్న వ్యక్తి – ‘ది పేసర్’

2009, డిసెంబర్ 14వ తేదీన లియోన్, మైక్ మళ్లీ ఒబామాను కలవడానికి వెళ్లారు. ఈసారి వారితో పాటూ సీఐఏకు చెందిన మరొక అధికారి కూడా ఉన్నారు. ఈయన కౌంటర్ టెర్రరిజం సెంటర్ అధిపతి, అమెరికాకు చెందిన బిన్ లాడెన్ క్యాంపైన్ ముఖ్య సభ్యులు. వీళ్లిద్దరూ అబోటాబాద్‌లో వారు కనిపెట్టిన స్థలం గురించి ఒబామాకు వివరించారు.

లియోన్ పనేటా తన పుస్తకం "వర్దీ ఫైట్స్"లో దీని గురించి రాస్తూ...

"ఈ ఆవరణ, చుట్టుపక్కల ఉన్న అన్ని ఫ్లాట్స్ కన్నా పెద్దది. దీని యజమానులు ఇబ్రహీం, అతని సోదరుడు. అయితే, ఇబ్రహీం ఆ ఇంట్లో ఉండకుండా ఆ ఆవరణలోనే ఉన్న గెస్ట్ హౌస్‌లో ఉంటున్నారు.

ఈ భవనంలో మూడు అంతస్థులున్నాయి. పై అంతస్థులో బాల్కనీ ఉంది. కానీ దాని ముందు ఒక గోడ కట్టి, బాల్కనీ కనబడకుండా కవర్ చేసారు. ఆ ఇంటికి ల్యాండ్‌లైన్ ఫోన్‌గానీ, ఇంటర్నెట్ కనెక్షన్‌గానీ లేదు. మాకొచ్చిన సమాచారం ప్రకారం ఆ ఇంట్లో ఉన్న ఒక వ్యక్తి అప్పుడప్పుడూ బయటకి వచ్చి ఆ కాంపౌండ్‌ లోపలే వడివడిగా అడుగులేస్తూ అటూ ఇటూ పచార్లు ఉంటారు.

మేము ఆ వ్యక్తికి ‘ది పేసర్’ అని పేరు పెట్టాం. చెత్త ఎత్తేవాళ్లు ఆ ఇంటి చుట్టుపక్కలకి వస్తుంటారు. కానీ ఆ ఇంట్లోవాళ్లు చెత్త బయటపడేయకుండా, ఇంటి ఆవరణలోపలే కాల్చేస్తూ ఉంటారు.

ఆ పేసర్... ఒసామా బిన్ లాడెన్ అయ్యుండొచ్చని మా గూఢచారులు అనుమానించారు" అని వివరించారు.

అబోటాబాద్‌లో లాడెన్ నివాసం

ఫొటో సోర్స్, Getty Images

ఆ భవనంపై వైమానిక దాడికి వ్యూహం

పాకిస్తాన్ ప్రభుత్వం అమెరికాకు సహకరిస్తున్నప్పటికీ, అఫ్ఘానిస్తాన్‌లో తమ కార్యకలాపాలకు మద్దతు ఇస్తున్నప్పటికీ, పాకిస్తాన్ సైన్యం, గూఢచార సంస్థలో తాలిబన్, అల్‌ఖైదా సానుభూతిపరులు ఉన్నారని ఒబామా విశ్వసించారు.

అబోటాబాద్ శివార్లలో ఉన్న ఆ ఆవరణకు పాకిస్తాన్ మిలటరీ అకాడమీ దగ్గరగా ఉండడంతో ఒబామాకు ఈ విషయంలో మరింత గట్టి నమ్మకం ఏర్పడింది.

తమ వ్యూహం గురించి పాకిస్తాన్‌కు తెలిస్తే, ఎలాగోలా ఆవిషయం ఆ భవనంలో ఉన్న వ్యక్తికి చేరిపోతుందని ఒబామా భావించారు.

"మా దగ్గర రెండే మార్గాలున్నాయి. ఒకటి వైమానిక దాడి... నేరుగా విమానాలతో ఆ భవనంపై దాడి చేసి ఆ ఆవరణను నాశనం చెయ్యడం. దీనివల్ల అమెరికా అధికారులెవరికీ హాని జరగకుండా పని జరిగిపోతుంది. అయితే, దీనివల్ల ఒక పెద్ద సమస్య ఉంది... ఆ భవనంలో లాడెన్ ఉన్నారని, దాడిలో చనిపోయాడని ఎలా నిర్థారిస్తాం? ఆ దాడిలో లాడెన్ లేడని అల్‌ఖైదా నిరూపిస్తే?

అంతే కాకుండా, ఆ చుట్టుపక్కల నివసిస్తున్నవారికి ప్రమాదం సంభవించొచ్చు. అక్కడ లాడెన్ ఉన్నాడన్న సంగతి స్పష్టంగా తెలియనప్పుడు, దాడిలో కనీసం 30-40 మందిదాకా మరణించే అవకాశం ఉంది కాబట్టి ఈ వ్యూహానికి అనుమతించలేనని జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ వైస్ చైర్మన్ హాస్ కార్ట్‌రైట్‌కు సష్టంగా చెప్పేశాను" అని ఒబామా వివరించారు.

అబోటాబాద్‌లో లాడెన్ నివాసం

ఫొటో సోర్స్, Getty Images

అఫ్ఘానిస్తాన్ ద్వారా పాకిస్తాన్‌లోకి ప్రవేశించడం

"రెండో మార్గం... స్పెషల్-ఆప్స్ మిషన్‌ను అనుమతించడం. హెలికాప్టర్లలో మా సైన్యం పాకిస్తాన్‌లోకి దూసుకెళ్లి ఆ భవనంపై దాడి చేస్తారు. ప్రతిస్పందించడానికి పాకిస్తాన్ పోలీసులకు, సైన్యానికి అవకాశం లేనంత వేగంగా దాడి చెయ్యాలి. అందుకోసం వైస్ అడ్మిరల్ మైక్‌ రావెన్‌ను పిలిపించాను" అని ఒబామా తన పుస్తకంలో రాశారు.

పైనుంచి తీసిన చిత్రాల సహాయంతో ఆ ఆవరణ యొక్క త్రిమితీయ నమూనాను రూపొందించారు. మైక్‌ రావెన్ మొత్తం వ్యూహాన్ని ఒబామాకు వివరించారు. అమెరికా సైనుకులు ఒకటి లేదా రెండు హెలికాప్టర్లలో అఫ్ఘానిస్తాన్‌లోని జలాలాబాద్‌ నుంచి రాత్రిపూట ప్రయాణం చేసి అబోటాబాద్ చేరుకుంటారు.

ఈ వ్యూహం గురించి చర్చించడానికి మార్చి 29న ఒబామా, అధికారులతో సమావేశమయ్యారు.

అమెరికా హెలికాప్టర్లు పాకిస్తాన్‌లో ప్రవేశిస్తున్నప్పుడు లేదా అక్కడి నుంచి బయలుదేరినప్పుడు పాకిస్తాన్ సైన్యం వాటిని అడ్డుకుంటే ఏం చెయ్యాలి? అని ఒబామా సందేహం వ్యక్తం చేశారు.

అంతేకాకుండా, లాడెన్ ఆ భవనంలో ఏ మూలో దాక్కొని ఉంటే, సైనికులు ఆయన్ని వెతికి పట్టుకోవడానికి ఎక్కువ సమయం పట్టిందంటే అప్పుడు ఏం చెయ్యాలి? ఆ సమయంలో పాకిస్తాన్ సైన్యం ఆ ఆవరణను చుట్టుముడితే మన వ్యూహం ఏమిటి? అని మైక్‌ రావెన్‌ను ఒబామా ప్రశ్నించారు.

దానికి మైక్‌ రావెన్ స్పందిస్తూ.. పాకిస్తాన్ సైన్యం చేతికి చిక్కకుండా తప్పించుకునే విధంగా వ్యూహం పన్నామని, ఒకవేళ పాకిస్తాన్ సైన్యం చుట్టుముట్టినా, లక్ష్యం నెరెవేరేవరకూ మన సైనికులు ఆ ప్రదేశాన్ని వదిలి వెళ్లరని, ఈలోగా మన రాయబారులు పాకిస్తాన్ ప్రభుత్వంతో చర్చలు జరిపి, అక్కడి నుంచి బయటపడే మార్గాన్ని అన్వేషిస్తారని తెలిపినట్లు ఒబామా రాశారు.

అయితే, హాస్ కార్ట్‌రైట్ మరో ఉపాయం సూచించారు. పేసర్ తన దినచర్యలో భాగంగా బయట ఆవరణలోకొచ్చి నడుస్తున్నప్పుడు, డ్రోన్ సహాయంతో 13 పౌండ్ల మిస్సైల్‌ను ప్రయోగించి ఆయన్ను అంతమొందించొచ్చని సూచించారు.

ఒబామా అందరి సూచనలనూ విన్నప్పటికీ, దేనికీ అంగీకారం తెలుపలేదు. తన అంగీకారం లేకుండా ఎవరూ అడుగు ముందుకు వెయ్యకూడదని స్పష్టం చేశారు.

బరాక్ ఒబామా

ఫొటో సోర్స్, Getty Images

ఒబామా సలాహాదారుల మధ్య అభిప్రాయ భేదాలు

లియోన్ పనెటా, జాన్ బ్రెనాన్, మైక్ ముల్లెన్ ఒసామాపై దాడికి మద్దతిచ్చారు.

కానీ, ఈ దాడి వల్ల అమెరికా, పాకిస్తాన్ మధ్య సంబంధాలు దెబ్బతింటాయని హిల్లరీ క్లింటన్ ఆందోళన వ్యక్తం చేశారు.

రక్షణ మంత్రి రాబర్ట్ గేట్స్ ఈ రకమైన దాడికి అంగీకరించలేదు. 1980లో ఇరాన్‌లో బందీలుగా ఉన్న 53 మంది అమెరికన్లను విడిపించడానికి ఇదే రకమైన వ్యూహం పన్నారని.. అది విఫలమవ్వడమే కాక అమెరికా ఎంతో నష్టపోయిందని గేట్స్ గుర్తు చేశారు.

అమెరికా ఉపాధ్యక్షుడు జో బైడెన్ కూడా ఈ రకమైన దాడికి అంగీకరించలేదు. ఒకవేళ తమ వ్యూహం విఫలమైతే పర్యవసానాలు ఘోరంగా ఉంటాయని ఆందోళన వ్యక్తం చేశారు. లాడెన్ ఆ భవనంలోనే ఉన్నారని పూర్తిగా నిర్థారణ అయ్యేంతవరకూ ఎటువంటి దాడికీ పాల్పడకూడదని సూచించారు.

బరాక్ ఒబామా

ఫొటో సోర్స్, Getty Images

దాడికి అనుకూలంగా ఒబామా ఆదేశాలు

ఏప్రిల్‌లో ఒబామా అలబామా, మియామీలను సందర్శించడంతో పాటు స్పేస్ షటిల్ ఎండీవర్‌ను తన కుటుంబానికి చూపించడానికి బయలుదేరారు.

"మేమంతా హెలికాప్టర్ ఎక్కబోతున్నాం. హెలికాప్టర్ పెద్ద శబ్దం చేస్తోంది. ఆ చప్పుళ్ల మధ్యలో నేను అబోటాబాద్ మిషన్‌కు అంగీకారం తెలిపాను. ఈ మిషన్‌కు మైక్‌ రావెన్ నాయకత్వం వహిస్తారని, ఎప్పుడు దాడి చెయ్యాలన్నది ఆయనే నిర్ణయిస్తారని చెప్పాను" అని ఒబామా తన పుస్తకంలో వివరించారు.

2011 మే నెల.. ఒబామా వైట్ హౌస్‌కు తిరిగొచ్చారు. ఆ రోజు మధ్యహ్నం ఒబామా, మిగతా అధికారులతో సహా ఓవల్ ఆఫీసులో ఉన్న సమయంలో ఈస్ట్రన్ స్టాండర్డ్ టైం ప్రకారం తెల్లవారుఝామున 2 గంటలకు రెండు బ్లాక్ హాక్ హెలికాప్టర్లు జలాలాబాద్ నుంచి అబోటాబాద్‌కు బయలుదేరాయి.

వాటిలో 23 మంది అమెరికా సైనికులు, పాకిస్తాన్‌కు చెందిన ఒక అనువాదకుడు ఉన్నారు. మిలటరీ కుక్క కైరో కూడా ఉంది.

తరువాత, ఒబామా, లియోన్ పనేటాతో వీడియో కాంఫరెన్స్‌లో సమావేశమయ్యారు. ఆ సమావేశానికి టాం, హిల్లరీ, జో బైడెన్, డెనిస్ మెక్డానో, గేట్స్, ముల్లెన్ కూడా హాజరయ్యారు. ఈ మిషన్ విజయం లేదా వైఫల్యాన్ని ప్రపంచానికి ఎలా తెలియజెయ్యాలన్న అంశంపై చర్చించారు.

అప్పటికే అడ్మిరల్ మైక్‌ రావెన్ జలాలాబాద్‌ చేరుకున్నారు. అఫ్ఘానిస్తాన్‌లో బయలుదేరిన అమెరికా సైన్యంతో సంప్రదింపులు జరుపుతూ ఉన్నారు. కాసేపటి తరువాత, బ్లాక్ హాక్ హెలికాప్టర్లు అబోటాబాద్‌లో దిగబోతున్నట్లు ఒబామాకు సమాచారం అందింది.

ఒబామా, సహచరులు

ఫొటో సోర్స్, Getty Images

మిషన్ లైవ్ చూసిన ఒబామా

ఈ ఆపరేషన్ ఎలా జరిగిందనే విషయాన్ని ఒబామా తన పుస్తకంలో ఇలా వివరించారు...

"సైన్యం అక్కడికి చేరుకోగానే ఈ మిషన్ లైవ్ చూడాలనుకున్నాను. లైవ్ ఫీడ్ వస్తున్న గదికి వెళ్లాను. అక్కడ ఎయిర్‌ఫోర్స్ బ్రిగేడర్ జనరల్ బ్రాడ్ వెబ్ ఉన్నారు. ఆయన ఈ మొత్తం ఆపరేషన్‌ను కంప్యూటర్‌లో వీక్షిస్తున్నారు.

నేను కూడా ఈ ఆపరేషన్ లైవ్ చూస్తున్నానని మైక్‌ రావెన్‌కు తెలియజేశారు. మిగతా అధికారులు కూడా నాతో పాటూ ఆ గదిలో సమావేశమయ్యారు."

జెరోనిమో - ఎనిమీ కిల్డ్ ఇన్ యాక్షన్

"ఒక బ్లాక్ హాక్ రెక్క కొంచం ఒంగి ఉంది. అది చూసి నేను కాస్త భయపడ్డాను. ఏదో కీడు జరగబోతోందన్న తలంపు వచ్చింది. అయితే అంతా సవ్యంగా సాగుతోందని, బ్లాక్ హాక్ నడుపుతున్న వ్యక్తి ఉత్తమ పైలట్ అని, హెలికాప్టర్ సురక్షితంగా దించుతారని మైక్‌ రావెన్ ధైర్యం చెప్పారు.

తరువాత 20 నిముషాలు మైక్‌ రావెన్‌కు కూడా అక్కడ ఏం జరుగుతోందో స్పష్టంగా తెలియలేదు.

అప్పుడు, ఏ మాట వినడం కోసమైతే మేము ఆతృతగా ఎదురుచూస్తున్నామో ఆమాట మైక్‌ రావెన్, పనెటా.. ఇద్దరి నోటి నుంచీ ఒకేసారి వచ్చింది.... ‘జెరోనిమో EKIA’ (ఎనిమీ కిల్డ్ ఇన్ యాక్షన్).

ఆ గదిలో అందరూ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. నేను లైవ్ చూస్తూ ప్రశాంతంగా అన్నాను.. ‘వుయ్ గాట్ హిమ్.”

ఒసామా బిన్ లాడెన్‌

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఒసామా బిన్ లాడెన్‌

సైనికుడిని పడుకోబెట్టి లాడెన్ పొడవు కొలిచారు

తరువాత 20 నిముషాల వరకూ ఎవ్వరూ కదల్లేదు. హెలికాప్టర్లు వెనక్కి బయలుదేరినప్పుడు జో బైడన్, ఒబామా దగ్గరకు వచ్చి "కంగ్రాచ్యులేషన్ బాస్" అని అభినందనలు తెలిపారు.

ఒబామా లేచి నిలబడి అక్కడున్న అందరితోనూ కరచాలనం చేశారు. కానీ బ్లాక్ హాక్స్ పాకిస్తాన్ సరిహద్దులో ఉన్నంతవరకూ కాస్త టెన్షన్‌గానే ఉన్నారు. అవి జలాలాబాద్ చేరుకున్నాక పూర్తిగా ఊపిరి పీల్చుకున్నారు.

తరువాత, వీడియో కాన్ఫరెన్స్‌లో మైక్‌ రావెన్‌తో మాట్లాడారు.

"మీతో మాట్లాడుతున్నప్పుడు లాడెన్ శవం నా ముందు పడి ఉంది. మన సైన్యంలో ఆరు అడుగుల రెండు అంగుళాల పొడవున్న వ్యక్తిని ఆ శవం పక్కన పడుకోబెట్టి కొలిచాం. చనిపోయిన వ్యక్తి ఆరు అడుగుల నాలుగు అంగుళాల పొడవు ఉన్నాడు" అని మైక్‌ రావెన్ తెలిపారు.

"ఇంత పెద్ద ఆపరేషన్ నిర్వహించారు గానీ కొలవడానికి టేప్ తీసుకెళ్లడం మర్చిపోయారా" అని ఒబామా నవ్వుతూ, మైక్‌ రావెన్‌తో చమత్కరించారు.

వర్తీ ఫైట్స్

ఫొటో సోర్స్, Publication house

లాడెన్‌ను సముద్రంలో ఖననం చేశారు

ముందే అనుకున్న విధంగా లడెన్ శరీరాన్ని సముద్రంల్లో ఖననం చేశారు. లాడెన్ మృతదేహాన్ని అమెరికన్ యుద్ధ నౌక కార్ల్ విన్సన్ వద్దకు తరలించారు. మృతదేహాన్ని తెల్లటి వస్త్రంతో చుట్టి, ఒక పెద్ద నల్ల సంచిలో ఉంచారు.

దీని గురించి లియోన్ పనేటా తన పుస్తకం "వర్దీ ఫైట్స్" లో ఇలా రాశారు:

"లాడెన్ శరీరం సముద్రంలో పూర్తిగా మునిగిపోయేలా.. మృతదేహాన్ని ఒక బ్యాగ్‌లో పెట్టి అందులో 150 కిలోల బరువున్న ఇనుప గొలుసులను ఉంచారు. తరువాత ఆ సంచిని యుద్ధ నౌక రైలింగ్ పక్కన ఉన్న తెల్లటి టేబుల్‌పై ఉంచారు.

ఆ సంచిని సముద్రంలోకి జార్చినప్పుడు టేబుల్‌తో సహా పడిపోయింది. నల్ల సంచి మునిగిపోయింది కానీ కాసేపటి తరువాత టేబుల్ నీళ్లపై తేలింది."

ఒసామా బిన్ లాడెన్‌

ఫొటో సోర్స్, Getty Images

ఒబామా సైన్యాన్ని కలిసి అభినందనలు తెలిపారు

ఆ మర్నాడు ఒబామా, బైడెన్ కెంటకీలోని పోర్ట్ క్యాంప్‌బెల్ వెళ్లారు. అక్కడ ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న సైన్యాన్ని కలిశారు.

ఒబామా వారందరినీ అభినందించి, సత్కరించారు.

వాళ్లంతా తమతోపాటుగా అబోటాబాద్ తీసుకెళ్లిన అమెరికా జెండాపై సంతకాలు చేసి, దానికి ఫ్రేం కట్టించి ఒబామాకు బహుమతిగా ఇచ్చారు.

అయితే, లాడెన్‌పై నేరుగా కాల్పులు జరిపిన వ్యక్తి ఎవరు అని ఒబామా అడగలేదు. వారూ చెప్పలేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)