వెనెజ్వెలా: మూడే మూడు నెలల్లో పళ్లు అమ్ముకునే ఈ అమ్మాయి అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది.. ఎలాగంటే..

ఫొటో సోర్స్, Masha Mosconi
- రచయిత, డానియల్ గార్సియా మాక్రో
- హోదా, బీబీసీ ప్రతినిధి
వెనెజ్వెలాలో ఆర్థిక సంక్షోభం కారణంగా ఇటీవల కాలంలో ఎంతోమంది యువత తమ కలలను నెరవేర్చుకోవడానికి విదేశాలకు తరలి వెళుతున్నారు.
అయితే, 24 ఏళ్ల గ్లాస్ మార్కానో కథ వేరు. మూడు నెలల క్రితం యరక్యూ నగరంలో తమ పళ్ల దుకాణంలో కూర్చుని పళ్లు అమ్మిన అమ్మాయి, ఇవాళ పారిస్‌లో ఆర్కెస్ట్రా నిర్వహిస్తోంది...పారిస్ సంగీత కళాకారుల మధ్య తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది.
ఈఫిల్ టవర్ దగ్గర నిల్చుని సెల్ఫీలు దిగుతున్న లాటిన్ అమెరికన్ అమ్మాయి మార్కానో మొహం సంతోషంతో వెలిగిపోతోంది.
సెప్టెంబర్‌లో, రెండు ప్రతిష్టాత్మక ఆర్కెస్ట్రా సంస్థలు ‘ది ఫిలర్మోనీ దే పారిస్’, ‘ది పారిస్ మొజార్త్ ఆర్కెస్ట్రా’..సంయుక్తంగా నిర్వహించిన అంతర్జాతీయ మహిళల ఆర్కెస్ట్రా పోటీ ‘లా మాస్ట్రా ’లో మార్కానో ప్రత్యేక బహుమతి గెలుచుకున్నారు.
పారిస్‌లో జరిగిన ఈ పోటీలో మార్కానో పలువురి దృష్టిని ఆకర్షించారు.
"ఆమె చాలా ప్రతిభావంతురాలు, కష్టించి పని చేసే తత్వం ఉన్న తెలివైన అమ్మాయి. ఆమెకు బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంది" అని పారిస్ మొజార్త్ ఆర్కెస్ట్రాకు చెందిన రొమైన్ ఫీవెట్ తెలిపారు.
పళ్లు అమ్ముకునే స్థాయినుంచీ ఆర్కెస్ట్రా నిర్వాహకురాలిగా మార్కానో ప్రయాణం మరో అద్భుతం.
కలలను సాకారం చేసుకునే దిశగా...
వెనెజ్వెలాలో యువ కళాకారులకోసం ప్రభుత్వ సహాయంతో నడిచే ప్రఖ్యాత సంస్థ ఎల్ సిస్టెమానుంచీ మార్కానో డిగ్రీ పట్టా పుచ్చుకున్నారు. ఆర్కెస్ట్రా నిర్వహించడంలో నైపుణ్యం సాధించే దిశగా ఆమె కృషి చేస్తున్నారు.
కరాకస్ నగరానికి చెందిన మార్కానో సంగీతంతో పాటుగా న్యాయశాస్త్రాన్ని కూడా అభ్యసిస్తున్నారు.
గత ఏడాది మార్చిలో ఆమెకు ‘లా మాస్ట్రా’ గురించి గూగల్ సెర్చ్ ద్వారా తెలిసింది.
"ఆర్కెస్ట్రా పోటీల్లో పాల్గొంటే బావుంటుందని అనిపించింది. అలాంటి పోటీలేమైనా ఉన్నాయేమోనని గూగుల్‌లో వెతుకుతుంటే లా మాస్ట్రా గురించి తెలిసింది. అది మహిళలకోసమే ప్రత్యేకంగా నిర్వహిస్తున్న పోటీ. నాకు ఇదొక మంచి అవకాశంగా తోచింది. కానీ ఈ పోటీలో పాల్గొనాలంటే రూ.13,248 ($180) ప్రవేశ రుసుము చెల్లించాలి. అది నాకు కష్టమైన విషయం" అని మార్కానో తన జర్నీ గురించి చెప్పుకొచ్చారు.
వెనెజ్వెలాలో వచ్చిన ఆర్థిక సంక్షోభం కారణంగా ఆ దేశ కరెన్సీ బొలీవర్ విలువ కనిష్ఠ స్థాయికి పడిపోయింది. ఉదాహరణకు సెప్టెంబర్‌లో ఆ దేశ కనీస వేతనం రూ. 150 కన్నా తక్కువ.
"నేను చాలా నిరాశ చెందాను. ఎన్నో కలలున్నాయి. కానీ వాటిని నెరవేర్చుకోడానికి నా దగ్గర డబ్బు లేదు. ఈసారికి నా అదృష్టం ఇంతే, మరోసారి చూద్దాం అని నాకు నేను సర్ది చెప్పుకున్నాను.
ఫీజు 13 వేల రూపాయలు కాకుండా మూడు, నాలుగు వేలున్నా కూడా నాకంతే కష్టమయ్యుండేది. పెద్ద తేడా ఏం లేదు. ఇంక నేను ఈ పోటీ గురించి మర్చిపోవాలనుకున్నాను. కానీ నా మనసులో ఏదో ఓ మూల ఈ పోటీ గురించి ఆలోచనలను మెదులుతూనే ఉండేవి.
నేను ఈ పోటీలో పాల్గొని గెలిచినట్టుగా ఊహించుకుంటూ ఉండేదాన్ని" అని మార్కానో వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
అన్నీ కలిసొచ్చాయి
మర్కానో తన కలను మర్చిపోలేదు. కొన్ని నెలల తరువాత సహాయం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు.
"ఆ పోటీలో ఎంట్రీకి ఇంకా మూడూ వారాలు టైమ్ ఉంది. నా స్నేహితులను, విదేశాల్లో ఉన్న బంధువులను సహాయం అడగాలని నిశ్చయించుకున్నాను" అని మార్కానో తెలిపారు.
ఈ పోటీ ఆడిషన్స్ కోసం ఒక వీడియో తయారుచేసి పంపాల్సి ఉంటుంది. దానికోసం ఆమె తన సంగీత స్నేహితుల సహాయం తీసుకున్నారు.
మార్కానో గురించి ‘ఫ్రాన్స్ మూసిక్’ అనే మ్యూజిక్ మ్యాగజీన్ అందించిన కథనం ప్రకారం...పోటీలో ప్రవేశించడానికి ఇంకా ఒక్క వారం రోజులే ఉందనగా ఆమెకు ఏడు వేల రూపాయలు మాత్రమే సమకూరాయి. అయితే, మిగిలిన డబ్బును ఆమె కోసం ప్రత్యేకంగా మినహాయిస్తున్నట్లుగా పోటీ నిర్వాహకులు ప్రకటించారు.
మార్కానో సంకల్ప బలం, ఆమెను తన ఆశయలకు చేరువగా తీసుకెళ్లింది. అక్టోబర్‌లో మార్కానో పోటీకి ఎంపిక అయినట్లు ప్రకటించారు. వచ్చే ఏడాది మార్చిలో పారిస్‌లో ఈ పోటీని నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
"మాకు 220 అప్లికేషన్లు వచ్చాయి. కమిటీ, గ్లాస్ మార్కానోను ఏకగ్రీవంగా ఎంపిక చేసింది.
"మార్కానో పంపించిన వీడియోలో తన ప్రతిభ కనబడింది. ఆ అమ్మాయికి మంచి సంగీత జ్ఞానం ఉందని అర్థమయ్యింది. ఆమెలో అద్భుతమైన తేజస్సు, ఉత్సాహం, లయ కనిపించాయి" అని రొమైన్ ఫీవెట్ తెలిపారు.
ఇంతలో కోవిడ్ కమ్ముకొచ్చింది. కరోనా మహమ్మారి కారణంగా మార్చిలో జరగాల్సిన పోటీని సెప్టెంబర్‌కు వాయిదా వేసారు.
ప్రపంచదేశాలన్నీ లాక్‌డౌన్ ప్రకటించాయి. అయితే, కొన్ని నెలల తరువాత చాలా దేశాల్లో ‘అన్ లాక్’ చేసినప్పటికీ వెనెజ్వెలాలో కరోనావైరస్ విజృంభింస్తుండడంతో ఇంకా కొన్ని ఆంక్షలు పాటిస్తూ ఉన్నారు.
"నేను యరక్యూ వెళిపోయాను. మా అమ్మ ఒక సరుకుల దుకాణం ప్రారంభించారు. వచ్చి, అందులో పని చెయ్యమని పిలిచారు. పని చేస్తే కొంత డబ్బు సంపాదించవచ్చు అని అన్నారు.
అది మంచి ఆలోచనే అనిపించింది. పారిస్ వెళ్లాలంటే నాకు కొన్ని మంచి బట్టలు కావాలి. దానికి కావలసిన డబ్బును సమకూర్చుకోవచ్చని యరక్యూ వెళిపోయాను" అని మార్కానో తెలిపారు.
అయితే, అప్పటికి వెనెజ్వెలా ఎయిర్‌పోర్టులు ఇంకా తెరుచుకోలేదు. పారిస్ ఎలా చేరుకోవాలో మార్కానోకు పాలుపోలేదు. పక్కన ఉన్న కొలంబియాకు రోడ్డు మార్గంలో ప్రయాణించి, అక్కడినుంచీ పారిస్‌కు ఫ్లైట్ తీసుకోవాలని ప్లాన్ వేసారు. కానీ ఇది రిస్కుతో కూడిన ప్రయాణం. కరోనా సోకుతుందేమోనని ఆమె భయపడ్డారు.
అప్పుడు, ఆమెకు ఒక మంచి వార్త అందింది. కోవిడ్ కారణంగా వెనెజ్వెలాలో చిక్కుకుపోయిన స్పానిష్ పౌరులను వెనక్కి తీసుకొచ్చేందుకు స్పానిష్ ప్రభుత్వం ఒక విమానాన్ని ఏర్పాటు చేస్తోందని తెలిసింది. ఈ విమానం సెప్టెంబర్ 14న కరాకస్‌నుంచీ బయలుదేరి స్పెయిన్ రాజధాని మాడ్రిడ్ చేరుతుంది.
అయితే, స్పానిష్ పాస్‌పొర్ట్ ఉన్నవారికే ఈ విమానంలో చోటు ఉన్నప్పటికీ…లా మాస్ట్రా పోటీ నిర్వాహకులు కరాకస్‌లో ఉన్న ఫ్రెంచ్ రాయబార కార్యాలయాన్ని సంప్రదించి మార్కానోకు వీసా, విమానంలో చోటు దక్కేలా ఏర్పాట్లు చేసారు.
"ఆమె సంకల్పం, ధైర్యం గొప్పవి. అవే ఆర్కెస్ట్రా నిర్వహించేవారికి ఉండవలసిన ముఖ్య లక్షణాలు" అని రొమైన్ ఫీవెట్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
‘ఏయ్ పిల్లా, ఎవరు నువ్వు?’
విమానాశ్రయం చేరుకున్న తరువాత, ఒక ఫ్రెచ్ అధికారి మార్కానో దగ్గరకొచ్చి..."ఏయ్ పిల్లా, ఎవరు నువ్వు? రాష్ట్రపతికి కూడా ఇన్ని రికమండేషన్లు రావు. అలాంటిది, ఈ విమానంలో నీకు సీటు ఇప్పించమని ఈమెయిల్స్ మీద ఈమెయిల్స్ వచ్చాయి" అని సరదాగా అన్నారు.
మార్కానోకు ఇది మొట్టమొదటి విమాన ప్రయాణమే కాకుండా వెనెజ్వెలా దాటి బయటకి రావడం కూడా ఆమెకు ఇదే మొదటిసారి.
పోటీ జరగడానికి కొన్ని గంటలముందు మార్కానో పారిస్ చేరుకున్నారు. ప్రయాణంలో ఆమెకు సరైన నిద్ర కూడా లేదు.
"ఇది నాకు కొత్త అనుభవం. అన్నీ వింతగా, అద్భుతంగా తోచాయి. నేను వేరే గ్రహం మీదకు వచ్చానేమో అనిపించింది" అని ఆమె తెలిపారు.
అయితే, మార్కానోకు ఫ్రెంచ్ భాష అస్సలు రాదు.
"నేను ఇంగ్లిష్‌లో మాట్లాడాను, కానీ అది అక్కడ ఎవరికీ కాలేదు" అని ఆమె నవ్వుతూ చెప్పారు.
అయితే, ఆమె ధైర్యంగా స్టేజిపైకి ఎక్కి ఆర్కెస్ట్రా నిర్వహించారు. ఆ ఆర్కెస్ట్రాలో వాయిద్యాలు వాయించే కళాకారులను ఆమె ఇంతకు ముందెన్నడూ కలవలేదు. అయినా కూడా చాలా అద్భుతంగా ఆ ఆర్కెస్ట్రాను నిర్వహించగలిగారు.
"ఏమి జ్ఞానం! ఎంత ప్రతిభ! 24 ఏళ్ల అమ్మాయి...ఇంతవరకూ వెనెజ్వెలా దాటి బయటకు వెళ్లని చిన్న పిల్ల..ఇంత అసమానమైన ప్రతిభ కనబరచడం మామూలు విషయం కాదు" అని ప్రసిద్ధ ఫ్రెంచ్ కళాకారులు, పారిస్ మొజార్త్ ఆర్కెస్ట్రా వ్యవస్థాపకులు అయిన క్లేర్ గిబాల్ట్ ప్రశంసించారు.
ఫిలర్మొనీ దే పారిస్‌కు చెందిన కళాకారుడు ఇమాన్యుయెల్ హాండ్రే కూడా మార్కానోను అమితంగా ప్రశంసించారు.
"ఆమెకు ఇంగ్లిష్ రాదు, ఫ్రెంచ్ భాష రాదు కానీ సంగీతం భాష వచ్చు" అని హాండ్రే, క్లాసికల్ మ్యూజిక్ మ్యాగజీన్‌కు తెలిపారు.

ఫొటో సోర్స్, Courtesy of Glass Marcano
ఆ పోటీలో మార్కానో గెలవలేదు. కానీ ఆమెకు ప్రత్యేక బహుమతి లభించింది. అంతకన్నా ఎక్కువగా, పారిస్‌లోనే ఉండి సంగీత సాధన చెయ్యమని ఆమెకు అనేక ఆఫర్లు వచ్చాయి.
పోటీ తరువాత వెనెజ్వెలా వెళ్ళిపోవాలని ఆమె అనుకున్నారు కానీ ప్రస్తుతం పారిస్‌లోనే ఉండిపోయారు.
"ఇక్కడ ఎన్నాళ్లు ఉంటానో తెలీదు కానీ ఇక్కడుండి నేను నేర్చుకోవాల్సింది నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను" అని మార్కానో తెలిపారు.
కరాకస్‌కు, పారిస్‌కు జీవనశైలిలో ఉన్న తేడా చూసి ఆమె ఆశ్చర్యపోతున్నారు.
"వెనెజ్వెలాలో మాపై చాలా ఒత్తిడి ఉంటుంది. అక్కడ ధరలు రోజు రోజుకూ పెరిగిపోతుంటాయి. కానీ జీతాలు పెరగవు. బతకాలంటే ఇంకా ఇంకా కష్టపడుతూనే ఉండాలి. కానీ పారిస్‌లో అలా కాదు. ధరలు స్థిరంగా ఉన్నాయి. ఒత్తిడి లేకుండా జీవించొచ్చు" అని మార్కానో తన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసారు.
స్పాన్సర్స్‌నుంచీ మార్కానోకు ఆర్థిక సహాయం లభిస్తోంది, కానీ తాను కూడా కొంత డబ్బు సంపాదించి ఇంటికి పంపించాలని ఆమె ఆలోచిస్తున్నారు.
"నా కుటుంబానికి నేను అండగా నిలబడాలి. సంగీతం కాకుండా మరేదైనా పని చేసి కూడా డబ్బు సంపాదించాలి. నేను చెయ్యగలను. ఇంతకుముందు వెనెజ్వెలాలో కూడా నేను అలా చేసాను" అని ఆమె తెలిపారు.
కానీ మార్కానో సంగీతం మీద మాత్రమే దృష్టి పెట్టి, ఆర్కెస్ట్రా నిర్వహణలో మరిన్ని మెళుకువలు తెలుసుకుంటూ ఎదగాలని స్పాన్సర్లు భావిస్తున్నారు.
"మరింత సంగీత జ్ఞానాన్ని పెంచుకునే దిశలో ఆమెకు సహాయం చెయ్యాలి. ఈ పోటీలో పాల్గొన్న తరువాత ఆమెకు మంచి పేరు, ఖ్యాతి వచ్చాయి. కానీ దృష్టి అంతా ఆమె నేపథ్యం, వ్యక్తిగత విషయాల మీదకు వెళుతోంది. దాన్నుంచి తప్పించి, ఆమె సంగీతం మీద దృష్టి సారించేట్టు...తనకు అండగా నిలబడడం ముఖ్యం" అని ఫీవెట్ అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి:
- వెనెజ్వెలా : కేజీ బియ్యం కొనాలంటే ఎన్ని కట్టల డబ్బు కావాలో తెలుసా?
- సముద్రపు చేపలా.. చెరువుల్లో పెంచిన చేపలా.. ఏవి తింటే ఆరోగ్యానికి మంచిది?
- విశాఖ ఏజెన్సీ: సొంతంగా నిర్మించుకున్న రోడ్డుపై గిరిజనులు ఎందుకు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
- వంట చేశాడు... ఇల్లు ఊడ్చాడు... హింసించే భర్త మనిషిగా మారాడు
- ప్రపంచంలోనే అత్యంత చల్లని కంప్యూటర్... ఇది శత్రు విమానాల్ని అటాక్ చేస్తుందా?
- ముస్లిం పెళ్లి కూతురు, క్రైస్తవ పెళ్లి కొడుకు... హిందూ సంప్రదాయంలో పెళ్లి
- #HisChoice: అవును... నేను హౌజ్ హస్బెండ్‌ని
- ఇండియా, ఇరాక్, బ్రిటన్, ఆస్ట్రేలియా.. అన్ని చోట్లా అమ్మోనియం నైట్రేట్ టెన్షన్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








