విశాఖ ఏజెన్సీ: సొంతంగా నిర్మించుకున్న రోడ్డుపై గిరిజనులు ఎందుకు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు?

- రచయిత, శ్రీనివాస్ లక్కోజు
- హోదా, బీబీసీ కోసం
వందల మంది గిరిజనుల శ్రమదాన విజయం.. ప్రభుత్వ అలసత్వం ముందు ఓడిపోతోంది. కొండలను పిండి చేసి.. బండలను పెకిలించి.. సొంతంగా గిరిజనులు మట్టి రోడ్లు నిర్మించుకున్నారు.
విషయం తెలిసిన ప్రభుత్వం వాటిని తారు (బీటీ) రోడ్లుగా మార్చేందుకు నిధులు కేటాయిచింది. కానీ వాటిని విడుదల చేయడం మర్చిపోయింది. దాంతో గిరిజనుల కష్టంతో నిర్మించుకున్న మట్టి రోడ్డుపై మొక్కలు పెరగడం, వర్షాలకు మట్టి జారిపోవడం జరుగుతోంది.
ఉత్తరాంధ్ర ఏజెన్సీలోని వందలాది గ్రామాలకు ఇప్పటికీ రోడ్డు లేని పరిస్థితి. ఆరోగ్యం బాగోలేకపోతే డోలిలే అంబులెన్సుల్లా మారాలి. ఆ డోలి ప్రయాణాల్లోనే ప్రాణాలు పోవడం ఇక్కడ సర్వసాధారణం. దశాబ్దాలుగా తమ గ్రామాలకి రోడ్డు సదుపాయం కల్పించండని గిరిజనులు అధికారులకి అర్జీలు ఇవ్వడమేకానీ... అందులో ఒక్కటీ కూడా ప్రభుత్వాన్ని కదిలించలేకపోయింది.
దీంతో విశాఖలోని అనంతగిరి మండల గిరిజనులు పలుగు, పార చేతబట్టి... కొండలను తవ్వి తమ గ్రామాలను మైదాన ప్రాంతాలకు కలిపే విధంగా ఏకంగా 14 కిలోమీటర్ల రోడ్డుని నిర్మించుకున్నారు. ఈ విషయాన్ని బీబీసీ వెలుగులోకి తీసుకుని వచ్చింది. రోడ్డు నిర్మాణం పూర్తైన తరువాత మళ్లీ ఇప్పుడు ఆ ప్రాంతాన్ని బీబీసీ పరిశీలిస్తే... గిరిజనుల శ్రమదానం వృథా అవుతున్న పరిస్థితులు కనిపించాయి.
విశాఖ ఏజెన్సీలోని గిరిజనులు శ్రమదానం చేసి వేసుకున్న రోడ్డు ఎందరికో స్ఫూర్తినిచ్చింది. ఈ గిరిజనుల ఆదర్శంతో ఉత్తరాంధ్రాలోని ఇతర ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా గిరిజనులు తామకు తామే రోడ్లు నిర్మించుకున్నారు.
ప్రభుత్వంపై ఆధారపడకుండా గిరిజనులే రోడ్లు నిర్మించుకుంటున్నారనే విషయం తెలుసుకున్న నటుడు సోనూసూద్ త్వరలోనే ఆ ప్రాంతాలకు వచ్చి గిరిజనులను కలిసి...తనవంతు సహాయం చేస్తానని కూడా చెప్పారు.
ఇలా ఎందరినో కదిలించిన విశాఖ గిరిజనులు శ్రమదానంతో నిర్మించుకున్న రోడ్డును ప్రభుత్వం మాత్రం పట్టించుకోలేదు.

‘‘మాది పరాయి దేశం కాదు’’
గతేడాది అనంతగిరి మండలం పినకోట, కివర్ల పంచాయతీకి చెందిన ప్రజలే శ్రమదానంతో రోడ్డు వేసుకున్న విషయం తెలుసుకున్న అధికారులు...ఈ ఏడాది ఫిబ్రవరిలో బీటీ రోడ్డు నిర్మాణానికి ఎన్ఆర్ఈజీఎస్ పధకం కింద నిధులు మంజూరు చేశారు.
అయితే పది నెలలైనా ఆ నిధులు విడుదల కాలేదు. బీటీ రోడ్డు పనులు మొదలవ్వలేదు. దీంతో గిరిజనులు నిర్మించుకున్న ఆ రోడ్డు కాస్త మళ్లీ మొక్కలు, తుప్పలతో నిండిపోవడడం, వర్షాలకు మట్టి పేరుకుపోవడం జరుగుతోంది.
దీంతో రోడ్డు కోసం గిరిజనులు ఆందోళనలకు దిగారు. వెంటనే పనులు ప్రారంభించాలని కోరుతూ ఆకులు ధరించి, డోలి మోస్తూ విశాఖ నగరంలో వినూత్నంగా నిరనస తెలిపారు. కొండకొనల్లో ఉన్న ఆ గ్రామాలకి ఎవరు వచ్చినా...రోడ్డేసే సిబ్బందే అనుకుంటున్నారు. బీబీసీ బృందాన్ని కూడా అలాగే అనుకుని...రోడ్డు వేసేస్తారా సారూ..! అని అడిగారు.
"త్వరలోనే మీకు తారు రోడ్డు వస్తుంది. ఇక మీ గ్రామాలకి, మీ ఇళ్లకి వాహనాలపైనే వెళ్లొచ్చు. మేం కూడా జీపులు, కార్లపైనే మీ దగ్గరకు వస్తాం. మీ రోడ్డు కష్టాలు తీరిపోయినట్లే. ఇక ప్రభుత్వ అధికారులు మీ గ్రామాలకు తరుచూ వస్తారు. మేం రోడ్డు వేసుకున్న తరువాత అధికారులు వచ్చి ఇలా అనేక మాటలు చెప్పారు. దాదాపు సంవత్సరం అయిపోతుంది ఇందులో ఏ ఒక్క మాట నిజం కాలేదు. ఏ అధికారి మా ఇంటికి కాదు కదా...మా గ్రామా పొలిమేరలో కూడా మాకు కనిపించలేదు. పనులు మానుకుని...పిల్లా జెల్లా, ముసలిముతక అని చూడకుండా అందరం కష్టపడి రోడ్డు తవ్వుకున్నాం. అయినా కూడా మా శ్రమని గుర్తించలేదు. ఇక ఈ ప్రభుత్వాలు, అధికారులు ఉండి ఏం లాభం...? అసలు మమ్మల్ని దేశ జనాభాగా గుర్తిస్తున్నారా...? లేదంటే మాది పరాయి దేశం అనుకుంటున్నారా...? అని ఆవేదనతో ప్రశ్నించారు బోనూరు గ్రామవాసి సన్యాసిరావు.

మా అందరి చిరకాల కోరిక...రోడ్డే
భౌగోళికంగా వినూత్నంగా ఉండే విశాఖ జిల్లా వైశాల్యంలో సగం ఏజెన్సీయే. జిల్లాలోని పాడేరు ఐటీడీఏ పరిధిలో ఉన్న 11 గిరిజన మండలాల్లో 245 గ్రామ పంచాయతీలు, 4,210 గ్రామాలు ఉన్నాయి. వీటిలో చాలా గ్రామాలు కొండల్లో ఎక్కడో విసిరేసినట్లు ఉంటాయి. ఈ గ్రామాల ప్రజలు విద్య, వైద్యం, ఆరోగ్యం ఇలా ఏ అవసరమైనా మైదాన ప్రాంతాలకి వెళ్లాల్సిందే.
విశాఖ ఏజెన్సీలో మట్టి రోడ్డుని నిర్మించుకున్న పినకోట, కివర్ల పంచాయతీ ప్రజలు తమ అవసరాల కోసం మైదాన ప్రాంతాలైన 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న దేవరాపల్లి లేదా 50 కిలోమీటర్లున్న అనంతగిరి వెళ్లాల్సిందే. పైగా వీటిని చేరుకోవడానికి ముందుగా దాదాపు 15 కిలోమీటర్లు నడిచి కొండ దిగువకు చేరుకుని...అక్కడ నుంచి ఏదైనా వాహనం పట్టుకుని మైదాన ప్రాంతాలకి చేరుకోవాలి.
"నాకు ఇప్పుడు 63 ఏళ్లు. నేను ఇక్కడే పుట్టాను. నా చిన్నతనం నుంచి మన ఊరికి రోడ్డు వస్తుంది...వచ్చేస్తుంది...ఇలా అనేక మాటలు విన్నాను. నేను ముసలోడిని అయిపోయాను. ఇంకా రోడ్డు పడలేదు. మా గ్రామాల ప్రజలంతా కలిసి రోడ్డు నిర్మించుకుంటే దానిని కూడా అధికారులు కాపాడలేకపోతున్నారు. బీటీ రోడ్డు వేస్తే కానీ ఈ మట్టి రోడ్డు నిలబడదు. ప్రస్తుతానికి ఈ మట్టి రోడ్డు మీద ముందుకంటే కాస్త సులభంగా నడుచుకుంటూ వెళ్లగలుగుతున్నాం. త్వరలో బీటీ రోడ్డు వేయకపోతే...ఈ రోడ్డు మూసుకుపోవడం ఖాయం. మా మండలంలోని బోనూరు, నడుమ వలస, చీడిమెట్ట, వంట్ల మామిడి, గడ్డి బంద, మెట్టి వలస, పందిరి మామిడి...అలాగే కివర్ల పంచాయతీకి చెందిన పుతిక పుట్టు, జగడాల మామిడి గ్రామాల ప్రజలందరి కోరిక ఒక్కటే...మా గ్రామాల్లోని రోడ్డుని చూడటం. అది నేరవేరుతుందో లేదో...?’’ అని పినకోట మండలం చీడిమెట్ల గ్రామానికి చెందిన రాము బీబీసీతో అన్నారు.

మట్టి రోడ్డుతో...మోటారు సైకిళ్లు వచ్చాయి
మైదాన ప్రాంతాలతో అనుసంధానం లేని గిరిజన గ్రామాలకు చెందిన కొందరు యువకులు విశాఖ నగరంలో చదువుకుంటున్నారు. వీరు నగరానికి చేరుకోవాలంటే 100 కిలోమీటర్లుపైనే వెళ్లాల్సి ఉంటుంది. అందులో కొండదిగువకు చేరుకోవడానికి ఏ గ్రామం నుంచైనా సరాసరి 15 కిలోమీటర్ల కాలినడక తప్పనిసరి. ఇప్పడు పినకోట, కివర్ల పంచాయతీ ప్రజలు మట్టి రోడ్డు నిర్మించుకోవడంతో...ఆ మండల గ్రామాలకు చెందిన యువత ద్విచక్ర వాహనాలను సమకూర్చుకున్నారు. ఇప్పుడు వీరు ఈ వాహనాలపైనే మైదాన ప్రాంతాలకు వెళ్తున్నారు.
"మట్టిరోడ్డు నిర్మించుకోవడంతో...ద్విచక్రవాహనాలు అతి కష్టం మీద తిప్పగలుతున్నాం. అయితే మేం పండించే చింతపండు, కొర్రలు, సామలతో పాటు కలపను పెద్ద మొత్తంలో తీసుకుని మైదాన ప్రాంతాలకు వెళ్లాలంటే జీపులు అవసరమవుతాయి. అలాగే ఆరోగ్యం బాగోలేని వారిని, గర్భిణులను ఆసుపత్రికి తీసుకుని వెళ్లాలంటే అంబులెన్స్ రావాలి. దానికి కూడా బీటీ రోడ్డు ఉండాలి. గత ఏడాది డిసెంబరులో మేం రోడ్డు నిర్మించుకున్నాం. ఇప్పటీకి ఏడాదైంది. బీటీ రోడ్డు నిర్మాణానికి కాగితాలపై ఆర్డర్లు ఇచ్చినా...అది కార్యరూపం దాల్చలేదు. ఇలాగైతే మేం అంతా కష్టపడి నిర్మించుకున్న ఈ మట్టి రోడ్డు ఎక్కువ కాలం ఉండే అవకాశం లేదు" అని విశాఖలో సివిల్ ఇంజనీరింగ్ డిప్లామో చేస్తున్న వెంకటరావు చెప్పారు.

కూలీలు, కాంట్రాక్టర్లు, ఇంజనీర్లు అన్నీ మేమే
పినకోట, కివర్ల పంచాయతీలకు చేరుకోవాలంటే...ముందుగా దేవరాపల్లి నుంచి రావాలి. అక్కడ నుంచి ఏదైనా ఆటో పట్టుకుని చటాకంబా గ్రామం వరకు వెళ్లాలి. అక్కడ నుంచి ఏటవాలుగా ఉండే కొండపైకి 15 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తే కానీ... ఈ పంచాయతీలకు చేరుకోలేం. అది కూడా దట్టమైన వెదురు మొక్కలతో నిండిన అడవి గుండా ప్రయాణం చేయాలి. ఈ అడివి నుంచి మైదాన ప్రాంతాన్ని కలిపే చటాకంబా గ్రామం వరకు మట్టి రోడ్డు నిర్మించుకోవాలని అనుకున్నారు గిరిజనులు.
"ఈ గిరిజన గ్రామాల్లో చదువుకున్న కొందరు కలిసి ఈ రోడ్డు నిర్మాణం చేయాలని అనుకున్నారు. ఈ విషయాన్ని గ్రామంలోని మా పెద్దలకు చెప్పారు. వీరి ఆలోచనకు అందరు సరే అన్నారు. ముందుగా రోడ్డు నిర్మాణం కోసం అడవిలోని చెట్లను నరుకుతూ... కొండను చదును చేశాం. మాలో మేమే చర్చించుకుని రోడ్డు ఎక్కడ మలుపు తిరగాలి...? ఎటువైపు రోడ్డు తవ్వాలి...? వంటి నిర్ణయాలు తీసుకునే వాళ్లం. పొలం పనులు, పశువుల పనులు అన్ని మానుకుని కనీసం ఇంటి నుంచి ఒక్కరైనా వచ్చి రోడ్డు నిర్మాణంలో కూలీలుగా పని చేశాం. పనికి వచ్చేప్పుడు ఎవరి భోజనం వారే తెచ్చుకున్నాం. రోజూ పని ప్రారంభించే ముందు ఈ రోజు ఏలా చేయాలి...? ఎంత వరకు చేయాలి...? పని ముగిసిన తరువాత రేపు ఎంత ఎక్కడ మొదలు పెట్టాలి...? ఎవరేవరు ఎక్కడెక్కడ పనులు చేయాలి...? వంటి నిర్ణయాలను తీసుకుని మాకు మేమే కాంట్రాక్టర్లుగా మారాం" అని కివర్ల పంచాయతీకి చెందిన శివరాం బీబీసీతో చెప్పారు.

మా శ్రమని గుర్తించకపోవడం అన్యాయం
గిరిజనులు రోడ్డు వేసుకున్నారనే విషయం తెలిసిన అప్పటీ పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బాలాజీ స్పందించి...గిరిజనులు చేసిన పనిని ఎన్ఆర్ఈజీఎస్ పనులు కింద వారికి కూలీ చెల్లించారు. అప్పుడే బీటీ రోడ్డు వేస్తామని గిరిజనులకు హామీ ఇచ్చారు. గిరిజనులు ధృడ సంకల్పంతో సొంతంగా రోడ్డు నిర్మించుకోవడాన్ని ఆయన ప్రశంసించారు.
"ప్రభుత్వం చేయాల్సిన పనిని మేమే చేసుకున్నాం. సొంతంగా రోడ్డు తవ్వుకున్నాం. ఈ ఏజెన్సీ ప్రాంతంలో సుమారు 40 గ్రామాలు ఉన్నాయి. ఇప్పుడు మేం రోడ్డు నిర్మించుకోవడంతో స్ఫూర్తి పొందిన మిగిలిన గ్రామాల వారు కూడా రోడ్డు నిర్మించుకోవడానికి సిద్ధమవుతున్నారు. మాకు బీటీ రోడ్డు రాకపోతే వారిలోనూ నిరుత్సాహం వస్తుంది. అందుకే మేం నిర్మించుకున్న మట్టి రోడ్డుని కాపాడేందుకు...నిధులు విడుదల చేసి బీటీ రోడ్డు నిర్మించాలని కోరుతున్నాం. దీనిని కూడా పట్టించుకోకపోతే...ఇక అధికారులు, ప్రభుత్వ ఉండి ఎందుకు...? ముఖ్యంగా మా శ్రమని గుర్తించకపోవడం మాకు చాలా బాధగా ఉంది" అని బోనూరు గ్రామానికి చెందిన మల్లిఖార్జున బీబీసీతో అన్నారు.

ఐదు నెలల్లో బీటీ రోడ్డు
పినకోట, కివర్ల పంచాయతీ గ్రామాల గిరిజనుల ఆవేదనను కొత్త వచ్చిన ఐటీడీఏ పీవో ఎస్. వెంకటేశ్వర్ దృష్టికి బీబీసీ తీసుకుని వెళ్లింది. గిరిజనులు శ్రమదానంతో నిర్మించుకున్న మట్టి రోడ్డు ప్రస్తుతం ఏలా పాడైపోతోందో...? బీటీ రోడ్డు కోసం గిరిజనులు చేస్తున్న అందోళనలను ఆయనకు వివరించింది.
''ఇప్పటీకి చాలా గిరిజన గ్రామాలకు రోడ్లు లేకపొవడం బాధాకరం. పాడేరు ఐటీడీఏ ప్రాంతంలో దాదాపు 1400 గ్రామాలకు రోడ్డు లేదు. మేం అన్ని గ్రామాలకూ శాశ్వత రోడ్లు వేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. అనంతగిరి మండలం పినకోట, కివర్ల పంచాయతీ ప్రజలు శ్రమదానంతో రోడ్డు నిర్మించుకోవడం నిజంగా హార్షనీయం. వీరితో పాటు ఇతర గ్రామాలకు కలిపి మొత్తం 27.5 కిలోమీటర్ల బీటీ రోడ్డు కోసం దాదాపు 20 కోట్ల రూపాయలు నిధులు మంజూరైయ్యాయి. అయితే కొన్ని సాంకేతిక కారణాలతో అవి రద్దైపోయాయి. దీనికి సంబంధించి నేను మళ్లీ కొత్తగా నిధుల కోసం ప్రయత్నిస్తున్నాను. మరో ఐదు నెలల్లో గిరిజనులు శ్రమదానంతో నిర్మించుకున్న మట్టి రోడ్డుని బీటీ రోడ్డుగా మారుస్తాం. దీనితో పాటు ముందుగా చిన్నచిన్న రోడ్డులను సైతం పూర్తి చేస్తాం. త్వరలోనే విశాఖ ఏజెన్సీలోని అన్ని గ్రామాలకు బీటీ రోడ్లను వేస్తాం" అని ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ బీబీసీకి తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- అనసూయ సారాభాయ్: కార్మిక ఉద్యమానికి బాటలు వేసిన మహిళ
- ఫౌజీ గేమ్ పబ్జీని మరిపించగలదా? అక్షయ్ కుమార్ మద్దతిస్తున్న ఈ ఆటలో స్పెషాలిటీ ఏంటి?
- 3 వేల మంది చైనా సంతతి ప్రజలు భారత్లో బందీలుగా మారినప్పుడు ఏం జరిగిందంటే..
- కరోనావైరస్: డాక్టర్ల మీద దాడులు... ఉమ్మి వేస్తూ అవమానాలు
- చలికాలంలో కరోనా మరింత విజృంభిస్తుందా.. ప్రాణనష్టం పెరుగుతుందా
- కరోనావైరస్: ప్రపంచ మహమ్మారి మీద యుద్ధంలో మానవాళి గెలుస్తోందా?
- మోదీ చెప్పినట్లు దేశంలో రోజుకు 10 లక్షల టెస్టులు చేయడం సాధ్యమేనా...
- కరోనావైరస్ ఆదివాసీ తెగలను అంతం చేస్తుందా...
- కరోనావైరస్తో అల్లాడిన వూహాన్ నగరంలో ఇప్పుడు అంబరాన్నంటే సంబరాలు
- ఎక్స్ పొనెన్షియల్ గ్రోత్ బయాస్: కోవిడ్-19 కేసులు లెక్కించడంలో జరుగుతున్న కామన్ తప్పిదం ఇదే..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









