జూదగాళ్ళ భ్రమ: మీరు ఎంతటి తెలివిగలవాళ్లైనా, ప్రతిభావంతులైనా సరే లెక్కల్లో ఈ చిన్న తేడా మిమ్మల్ని ముంచేస్తుంది..

లెక్కల్లో పొరపాట్లు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, డేవిడ్ రాబ్ సన్
    • హోదా, బీబీసీ కోసం

ఇటలీలో ప్రజలు 15 సంవత్సరాల క్రితం ఒక వింతైన "53 ఫీవర్" అనే రోగానికి మూకుమ్మడిగా గురయ్యారు.

ఈ పిచ్చితనం అంతా దేశంలో ఉన్న లాటరీల చుట్టూ తిరిగింది. ఈ ఆటలో ఆటగాళ్లు బరి, నేపుల్స్, వెనీస్ నగరాలలో ఉండే 11 విభిన్నమైన లాటరీ చక్రాలలో ఒక దానిని ఎంచుకోవచ్చు. ఒక్క సారి ఈ చక్రాలను ఎంచుకున్న తర్వాత 1 - 90 మధ్యలో ఉండే ఏదైనా సంఖ్యలను ఎంచుకుని వాటి పై బెట్టింగ్ మొదలు పెట్టవచ్చు.

మీరు మొదట్లో ఎంత బెట్ చేశారు, ఎన్ని సంఖ్యలు ఎంచుకున్నారు, అందులో ఎన్ని సరైనవన్న విషయాలపై మీ గెలుపు ఆధారపడి ఉంటుంది.

2003లో ఒక సారి వెనీస్ వీల్‌పై 53 సంఖ్య రావడం ఆగిపోయింది. దీంతో అది ఎప్పటికైనా తిరిగి వస్తుందనే నమ్మకంతో ఆ సంఖ్యపై బెట్టింగ్ చేయడం మొదలు పెట్టారు.

ఇలా మొదలైన 53 ఫీవర్ 2005 నాటికి చాలా మందిని ఆర్ధికంగా కృంగదీసేసింది. దీంతో చాలా మంది ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డారు. 182 సార్లు ఈ సంఖ్య కనపడకుండా పోయిన తర్వాత, 4,000 కోట్ల యూరోల నష్టం వాటిల్లిన తర్వాత ఫిబ్రవరి 09 నాడు జరిగిన డ్రాలో చివరకు ఈ నంబరు తిరిగి ప్రత్యక్షమయింది. దీంతో ఈ సంఖ్య చుట్టూ ఉన్న పిచ్చితనం కూడా నెమ్మదిగా తగ్గింది.

ఇదంతా పిచ్చితనంలా అనిపించినా ఇందులో బాధితులు మాత్రం ఒక భ్రమలో ఉంటారు. ఇలాంటి విచారించదగ్గ భ్రమలే చాలా వృత్తిపరమైన నిర్ణయాలను, ఫుట్ బాల్ క్రీడలో గోల్ కీపర్ తీర్పులను, స్టాక్ మార్కెట్ పెట్టుబడులను కొన్ని సార్లు శరణార్ధులకు ఆశ్రయం ఇచ్చే కేసుల్లో కోర్టు నిర్ణయాలను కూడా పక్క దారి పట్టిస్తూ ఉంటాయి.

మీరు జూదగాళ్ళ భ్రమలో పడ్డారో లేదో తెలుసుకోవాలంటే ఒక కాయిన్ ని బొమ్మ బొరుసులా వేస్తూ బొమ్మ, బొరుసు, బొరుసు, బొరుసు, బొరుసు, బొరుసు...వరసగా ఇలాగే వస్తుందని ఊహించుకోండి. ఇలా ఎన్నిసార్లు బొరుసు పడితే తర్వాత బొమ్మ పడే అవకాశం ఉంటుంది?

బేసి సంఖ్యలు మారుతూ ఉంటాయి కాబట్టి ఎక్కడో ఒక చోట సరి సంఖ్య వస్తుందని చాలా మంది ఊహిస్తారు. దాంతో బొమ్మ పడే అవకాశం తగ్గుతుందని అనుకుంటారు. కానీ, వాళ్ళలా అనుకోగానే బొమ్మ పడవచ్చు.

కానీ, సంభావ్య సిద్ధాంతం ప్రకారం ఆలోచిస్తే ఇలాంటివన్నీ గణాంకాల నుంచి స్వతంత్రంగా ఉంటాయి. అంటే కాయిన్ విసిరిన ప్రతి సారీ ఒకే రకమైన సంఖ్య రావచ్చు. కానీ, వరసగా 500 సార్లో.. లేక 5000 సార్లో బొరుసు పడిందనుకోండి, ఆ తర్వాత కూడా బొమ్మ పడే అవకాశం ఎప్పట్లాగే 50:50గా ఉంటుంది.

అందుకే వరసగా బొరుసు ఎలా పడే అవకాశం ఉందో.. వరుసగా బొమ్మ, బొరుసు, బొమ్మ బొరుసు, బొమ్మ, బొరుసు కూడా పడే అవకాశం కూడా అంతే ఉంది. దీంతో చాలా మంది అంగీకరించకపోవచ్చు? దీనికి గణాంకాలతో సంబంధం లేదు.

స్టాక్ మార్కెట్

ఫొటో సోర్స్, Getty Images

"జూదగాళ్ళ భ్రమ" గురించి పరిశోధన చేయడానికి చాలా మంది పరిశోధకులు ఆసక్తి చూపిస్తారు.

1913లో మొనాకో రౌలెట్ టేబుళ్ల దగ్గర వరసగా 26 సార్లు నలుపు రంగు రావడంతో దీనిని మోంటే కార్లో భ్రమ అని కూడా అంటారు. నేటికీ ఇలాంటి భ్రమలు బెట్టింగ్ ని ప్రభావితం చేస్తున్నాయని కాసినోలో ఉన్న సెక్యూరిటీ ఫుటేజిని పరిశీలించి చేసిన అధ్యయనాలు తేల్చాయి.

ఈ ఎంపికపై ఉండే పక్షపాతం నుంచి ఎటువంటి చదువు, తెలివితేటలు కూడా రక్షించలేవు.

ఎక్కువ ఐ క్యూ ఉన్న వారు కూడా ఈ భ్రమలకు ఎక్కువ లోనవుతారని, చైనా-అమెరికా పరిశోధకులు చేసిన ఒక పరిశోధన తెలిపింది. తెలివైన వ్యక్తులు కూడా విచిత్రంగా ఈ సరళి గురించి ఎక్కువగా అలోచించి తర్వాత ఏ సంఖ్య వస్తుందో తెలుసుకునే సమర్ధత తమకు ఎక్కువగా ఉందని అనుకుంటారు.

ఈ తప్పుడు భ్రమలకు కారణాలేవైనా కానీ, వీటి వలన కాసినోలకు అవతల కూడా తీవ్రమైన పర్యవసానాలు ఉంటాయని వీటి పై జరిగిన పరిశోధనలు తేల్చాయి. ఇలాంటి పక్షపాతం స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ లో కూడా కనిపిస్తుంది.

పక్షపాతం లేని నిర్ణయాలు తీసుకోవలసిన చోట కూడా ఇలాంటి భ్రమల వలన సమస్యలు తలెత్తుతాయి.

శరణార్ధులకు ఆశ్రయం ఇవ్వాలా వద్దా అనే అంశం పై అమెరికాలోని జడ్జీలు ఇచ్చిన నిర్ణయాలను పరిశోధకులు పరిశీలించారు.

తార్కికంగా చూస్తే కేసుల్లో ఇచ్చే ఆదేశాలు ఇలాంటి భ్రమలకు లోను కాకూడదు. కానీ, గతంలో ఇచ్చిన తీర్పులలో ఒక వేళ శరణార్ధులకు ఆశ్రయం ఇవ్వకపోతే తరువాత ఇచ్చే కేసులో ఆశ్రయం ఇచ్చే అవకాశం కేవలం 5. 5 శాతం కంటే తక్కువే ఉంటుందని పరిశోధనకారులు చెబుతున్నారు.

అలాగే, లోన్ అప్లికేషన్లను పరిశీలించే బ్యాంకు సిబ్బంది తీరును కూడా పరిశీలించారు.

బేస్ బాల్

ఫొటో సోర్స్, Getty Images

వరసగా రెండు మూడు లోను అప్లికేషన్లను ఆమోదిస్తే ఆ తరువాత అప్లికేషన్ ని తిరస్కరించే అవకాశం 8 శాతం కంటే ఎక్కువే ఉందని లేదా దానికి భిన్నంగా ఆమోదమే తెలపవచ్చని తేల్చారు.

అలాగే బేస్ బాల్ క్రీడల్లో అంపైర్ నిర్ణయాలను కూడా పరిశీలించారు.

పిచ్‌ స్ట్రైక్ అని ఇచ్చిన తర్వాత మరోసారి పిచ్‌ని స్ట్రైక్ అని చెప్పడం కేవలం 1. 5 శాతం కంటే తక్కువ సార్లు జరుగుతుంది. ఒక చిన్న పక్షపాత ధోరణి ఆట తీరునే పూర్తిగా మార్చేస్తుంది.

ఇలాంటి భ్రమలపై ఫుట్ బాల్ క్రీడాకారులు దృష్టి సారిస్తారు.

"పెనాల్టీ సమయంలో బంతి గోల్ లో పడటానికి కేవలం 0. 2 నుంచి 0. 3 సెకండ్లు పడుతుంది. గోల్ కీపర్ ఎటువైపు వెళ్ళాలి, లేదా మధ్యలోనే ఉండాలా అనే విషయం నిర్ణయించుకోవాలి. అదే సమయంలో బంతిని తన్నే వారు కూడా ఎలా గోల్ వేయాలో ఆలోచించుకోవాలి" అని ఇజ్రాయెల్ లో బెన్ గురియన్ యూనివర్సిటీ లో సించ అవుగోస్ వివరించారు.

అంటే ఎక్కడకు బంతి వేయాలి, లేదా ఎటువైపు వెళ్ళాలి అని నిర్ణయించుకోవడం ఒక జూదం లాంటిదే.

అవోగోస్ బృందం ఇటీవల ఫిఫా వరల్డ్ కప్, యూకే ఛాంపియన్స్ లీగ్ లో జరిగిన షూట్ అవుట్ లను పరిశీలించారు. అక్కడ పరిశీలించిన ఫలితాలను బట్టి, ఈ ధోరణిని ఫుట్ బాల్ ఆటగాళ్లు దుర్వినియోగ పర్చుకోవచ్చని అంటారు.

ఇలాంటి పరిస్థితుల నుంచి దూరంగా చాలా వృత్తులు ఉంటాయి. కానీ, ఈ భ్రమలు కూడా చాలా వృత్తుల్లో ఉంటాయని నిపుణులు అంటారు. ఒక్కొక్కసారి మనకి తెలియకుండానే ఊహాత్మక తీర్పులు ఇస్తూ ఉంటామని అంటారు.

ఉదాహరణకు సిబ్బంది ఎంపిక చేస్తున్నప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్న వారు ఒక మంచి అభ్యర్థిని అప్పటికే చూసి ఉంటే మరొక ప్రత్యేకమైన అభ్యర్థి కోసం చూడరు. ఆ తర్వాత వచ్చే అభ్యర్థిని ముందు వ్యక్తితో పోల్చుకుని కఠినమైన రేటింగ్ ఇచ్చే అవకాశం కూడా ఉంది.

వ్యాసాలకు మార్కులు వేసే టీచర్లు కూడా ఇదే తీరులో వ్యవహరించే ప్రమాదం ఉంది.

మీ వృత్తి ఏదైనప్పటికీ, ఇటలీ 53 ఫీవర్ తర్వాత నెలకొన్న అనిశ్చితి ని గుర్తు తెచ్చుకుంటే మంచిది.

ఎక్కడైనా ఎప్పుడైనా ఒక్కొక్కసారి ఏదైనా మనం అనుకున్నట్లుగా జరగవచ్చు. అయితే, కేవలం ఎప్పుడో ఒక సారే మన సిక్త్ సెన్స్ కచ్చితమైన ఫలితం ఇస్తుందని తెలుసుకుంటే హేతుబద్ధమైన నిర్ణయాలను తీసుకునే అవకాశం కలుగుతుంది... తప్పుల్ని తక్కువసార్లు చేస్తాం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)