ఇరాక్: ‘ఎవరైనా నా ఇంటి తలుపు తట్టి 5 బుల్లెట్లు పేల్చవచ్చు.. నన్ను, నా కుటుంబాన్ని చంపేయొచ్చు’

ఇరాక్ లో బ్రిటిష్ సంకీర్ణ సేనలతో కలిసి పని చేసిన సిబ్బంది బీబీసీతో మాట్లాడారు
ఫొటో క్యాప్షన్, ఇరాక్ లో బ్రిటిష్ సంకీర్ణ సేనలతో కలిసి పని చేసిన సిబ్బంది బీబీసీతో మాట్లాడారు
    • రచయిత, నఫీసే కొనావార్డ్
    • హోదా, బీబీసీ పర్షియా

"నాకు చాలా భయంగా ఉంది. ఏ సమయంలో నైనా ఎటునుంచైనా ముప్పు రావచ్చు. ముప్పు పొంచి ఉందని తెలుస్తూ ఉంటుంది. ఎవరైనా నా ఇంటి తలుపు తట్టి 5 బుల్లెట్లను పేల్చవచ్చు. ఆ బుల్లెట్లలో ఒకటి నన్ను, ఒకటి నా భార్యను, మరో మూడు నా ముగ్గురు కూతుర్లను హతమార్చవచ్చు" అని అలీ చెప్పారు.

అలీ (పేరు మార్చాం) బ్రిటిష్ సైన్యానికి ఇంటర్ప్రెటర్ (తర్జుమా చేసేవారు)గా పని చేసేవారు. దీంతో, ఇరాకీ మిలీషియా అలీని, అతని కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకోవచ్చని భయపడుతున్నారు.

అమెరికా సేనలు ఇరాన్ అత్యున్నత మిలిటరీ కమాండర్ ఖాసిం సోలేమానిని, సీనియర్ ఇరాకీ సైన్యాధిపతి అబు మహది అల్ ముహందీస్‌ని హతమార్చిన తర్వాత అలీ చేస్తున్న పని మరింత ప్రమాదకరంగా మారిపోయింది.

ఆయన సంకీర్ణ సేనలతో పని చేయడం మానేశారు. కానీ, బ్రిటిష్ సేనలు ఇరాక్ నుంచి వైదొలగడంతో ఆయన భవితవ్యం బ్రిటిష్ సేనల చేతిలో అనాథలా మారినట్లు భావిస్తున్నారు.

అలీని, అతని సహ ఉద్యోగి అహ్మద్‌ను (పేరు మార్చాం) బాగ్దాద్‌లో ఒక హోటల్లో బీబీసీ ప్రతినిధి కలిసారు.

వారి వివరాలను బయటపెట్టమని బీబీసీ హామీ ఇచ్చింది. వారిద్దరూ చాలా భయపడుతూ కనిపించారు.

"మేమెక్కడికి వెళ్ళాలో, ఎవరిని సంప్రదించాలో అర్ధం కాలేదు. మా బాధ బ్రిటిష్ ప్రజలకు, యూకే ప్రభుత్వానికి చేరాలనే ఉద్దేశ్యంతోనే మేము బీబీసీని సంప్రదించాం" అని అలీ చెప్పారు.

ఒక పెద్ద కుటుంబం

అలీ, అహ్మద్ రెండేళ్ల క్రితం బ్రిటిష్ సైన్యంతో కలిసి పని చేయడం ప్రారంభించారు. వారిద్దరూ ఒక పెద్ద కుటుంబంలో భాగమని బ్రిటిష్ సేనలు వారితో చెప్పినట్లు తెలిపారు. వారు విదేశీ భాగస్వాములకు కట్టుబడి ఉండటానికి ఆ మాటలే వారికి భరోసానిచ్చాయి.

బ్రిటిష్ ప్రత్యేక సేనలతో పని చేసిన 8 మంది ఇంటర్ప్రెటర్లలో వీరిద్దరూ కూడా ఉన్నారు. ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ కి వ్యతిరేకంగా పోరాడేందుకు అమెరికా నాయకత్వం వహించిన అంతర్జాతీయ సంకీర్ణ సేనలలో భాగంగా బ్రిటిష్ సేనలు కూడా ఇరాక్ వచ్చాయి.

గత ఆరేళ్లలో బ్రిటిష్ సేనలు 120,000 మందికి పైగా ఇరాక్, కుర్దు సైనికులకు శిక్షణ ఇచ్చాయని యూకే రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. వీరికి శిక్షణ ఇచ్చేందుకు ఈ సంకీర్ణంలో ఒక ముఖ్యమైన కేంద్రంలో పని చేసే బ్రిటిష్ సలహాదారులకు ఈ ఇంటర్ప్రెటర్లు సహాయం చేసేవారు.

కానీ, వీరి పని కేవలం తర్జుమా చేయడంతోనే ముగిసేది కాదని అహ్మద్ చెప్పారు. ఎప్పుడైనా బ్రిటిష్ సేనలు ఉన్న క్యాంపు భద్రత పై అనుమానం వస్తే క్యాంపు సరిహద్దుల చుట్టూ ప్రమాదం ఏమైనా పొంచి ఉందేమో చూసేందుకు తమను పర్యవేక్షణకు నియమించేవారని ఆయన చెప్పారు. అయితే, ఈ పనిని గర్వంగా చేసేవారిమని చెప్పారు.

"మమ్మల్ని ప్రమాదంలో పడవద్దని వాళ్లెప్పుడూ హెచ్చరిస్తూ ఉండేవారు. కానీ, మేమెప్పుడూ.. ‘‘మీరు మా సోదరుల వంటి వారు. మిమ్మల్ని మేము సురక్షితంగా చూసుకుంటాం" అని చెప్పేవాళ్ళం అని అహ్మద్ వెల్లడించారు.

"మేము మా దేశాన్ని ప్రేమిస్తాం. వాళ్ళు మా దేశానికి సహాయం చేయడానికి వచ్చారు. అందుకే వారితో కలిసి పని చేయడం మాకు చాలా గౌరవంగా అనిపించేది" అని ఆయన అన్నారు.

ఇరాకీలకు శిక్షణ ఇస్తున్న బ్రిటిష్ సేనలు
ఫొటో క్యాప్షన్, ఇరాకీలకు శిక్షణ ఇస్తున్న బ్రిటిష్ సేనలు

లక్ష్యాలు

కానీ, ఈ ఏడాది జనవరిలో పరిస్థితులన్నీ మారిపోయాయి.

అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఆదేశాలతో ఇరాన్‌లో అతి శక్తివంతమైన మిలిటరీ కమాండర్ ఖాసిమ్ సోలేమాని, అతని ఇరాకీ మిత్రుడు అబూ మహదిని బాగ్దాద్‌లో హతమార్చారు. ఈ సంఘటన ఇరాన్ మద్దతిస్తున్న పారా మిలిటరీ దళాలకు బాగా ఆగ్రహం తెప్పించింది.

దీంతో పాశ్చాత్త్య సేనలు, వారితో కలిసి పని చేసిన ఇరాకీలు వారికి లక్ష్యంగా మారారు. వారిని దేశ ద్రోహులుగా పరిగణించారు.

"దేశంలో వాతావరణం ఉద్రిక్తంగా మారింది. ఈ సంకీర్ణం శిక్షణ ఇచ్చిన కొంత మంది ఇరాకీ సేనలు కూడా మమ్మల్ని శత్రువుల్లా చూడటం మొదలు పెట్టాయి. వాళ్ళు ఇరాక్ కి కాకుండా మరేదైనా దేశం పట్ల విశ్వసనీయతతో ఉన్నారేమో మాకు తెలియదు" అని అలీ అన్నారు.

సంకీర్ణ సేనలు ఉన్న క్యాంపులు కూడా నిరంతరం రాకెట్ దాడులకు లక్ష్యంగా మారాయి. ఈ దాడులను పేరు తెలియని కొన్ని సేనలు చేసినట్లు చెప్పేవారు.

ఈ కొత్త సేనలు కేవలం షియా గ్రూపుల్లో భాగమైన కతాయిబ్ హిజ్బుల్లా లాంటి పేరు పొందిన కొన్ని గ్రూపులకు తెరముందు సంస్థలు అయి ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు.

"పాశ్చాత్త్య దేశాలకు వ్యతిరేకంగా ఇరాన్ మద్దతిస్తున్న మిలీషియా కొత్త బ్రాండులే ఈ గ్రూపులని చెప్పేందుకు మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఒక కనిపించని దెయ్యాన్ని వేటాడటం సాధ్యం కాదని వారికి తెలుసు. అందుకే వారు ఇరాకీలను, సంకీర్ణ సేనలను కూడా భయపెట్టేందుకు ఈ వ్యూహాన్ని అమలు చేస్తారు. ఈ గ్రూపుల వెనక ఉండి నడిపించే అసలైన మిలీషియా ఈ గ్రూపుల సంగతి తమకు తెలియదని సులభంగా తప్పించుకోవచ్చు" అని ఒక యూఎస్ అధికారి చెప్పారు.

ఈ గ్రూపులన్నీ ఇప్పుడు సంకీర్ణ సేనలతో కలిసి పని చేసిన ఇరాకీలను లక్ష్యంగా చేసుకున్నాయని ఆయన అన్నారు

అదృశ్యంగా పని చేస్తున్న మిలీషియా

సంకీర్ణ సేనలతో కలిసి పని చేస్తున్న ఇరాకీలను వెంటనే తమ ఉద్యోగాలను వదిలి పెట్టమని ఇప్పటికే ఈ గుర్తు తెలియని మిలీషియా చాలా సార్లు హెచ్చరికలు జారీ చేసింది.

అందులో ఒక గ్రూపు ఆషాబ్ అల ఖాఫ్ అని పిలుచుకుంటారు. సంకీర్ణ సేనలపై దాడులు చేయడంతో పాటు, బాగ్దాద్‌లో ఉన్న అమెరికా దౌత్య కార్యాలయంపై దాడిని కూడా తామే చేసినట్లు ఈ గ్రూపు ప్రకటించుకుంది.

అమెరికా నాయకత్వం వహిస్తున్న సంకీర్ణ సేనలతో కలిసి పని చేస్తున్న ఇంటర్ప్రెటర్లకు డబ్బులు ఇస్తామని ఈ గ్రూపు టెలిగ్రామ్ యాప్ లో ఒక ప్రకటన కూడా చేసింది.

"అమెరికా, బ్రిటిష్ సేనలకు, ఇరాక్ దేశపు శత్రువులకు సేవలు చేసి ఈ దేశానికి, తమకు కూడా స్వీయ హాని చేసుకున్నవారిని మేము క్షమిస్తున్నాం. మీకు మేము నెల జీతం ఇస్తాం. మమ్మల్ని సంప్రదిస్తే మీకు భద్రత కూడా కల్పిస్తాం" అంటూ ఆ ప్రకటనలో రాశారు.

"వాళ్ళు తర్జుమా చేసే వారికి సుమారు 2 లక్షల 19 వేల రూపాయలు (3000 డాలర్లు), యూఎస్ బ్రిటిష్ ఇంటలిజెన్స్ సర్వీసెస్ వారికి సహాయం చేసిన వారికి 36,63,400 రూపాయలు (50,000 డాలర్లు) వరకు జీతాలు ఇస్తామని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

అందులో ఒక అంతర్గతమైన సందేశం ఉంది. "మీరు మాతో సహకరించకపోతే మిమ్మల్ని మేము శత్రువుగా పరిగణిస్తాం’ అన్నదే ఆ సందేశం. సంకీర్ణ సేనలను కత్యుష రాకెట్లతో దాడి చేశారు. మమ్మల్ని బుల్లెట్లతో చంపేస్తారు. అదే మాకు సంకీర్ణ సేనలకు మధ్యనున్న తేడా " అని అహ్మద్ చెప్పారు.

అమెరికా సేనలు ఇరాన్ అత్యున్నత మిలిటరీ కమాండర్ ఖాసిం సోలేమనిని, సీనియర్ ఇరాకీ సైన్యాధిపతి అబు మహది అల్ ముహందీస్ ని హతమార్చారు
ఫొటో క్యాప్షన్, అమెరికా సేనలు ఇరాన్ అత్యున్నత మిలిటరీ కమాండర్ ఖాసిం సోలేమానిని, సీనియర్ ఇరాకీ సైన్యాధిపతి అబు మహది అల్ ముహందీస్ ని హతమార్చాయి

దాడులు

ఈ మాటలు అప్పుడే కార్యాచరణ దాల్చడం మొదలుపెట్టాయి. సోలేమాని హత్య జరిగినప్పటి నుంచి ఇరాక్ లో సంకీర్ణ సేనలకు కావాల్సిన సరుకులు తీసుకుని వెళుతున్న వాహనాల పై కూడా పేలుడు పదార్ధాలతో దాడి జరిగింది. వాటిని ఇరాకీ డ్రైవర్లే నడుపుతూ ఉంటారు.

"ఈ గుర్తు తెలియని మిలీషియా మీడియాలో అమెరికా సేనలపై జరిగిన దాడుల వీడియోలను పోస్టు చేసి ఆ దాడులకు భాద్యత వహించి సంబరం జరుపుకుంటారు. వారు చేసిన బెదిరింపులకు కార్య రూపం ఇవ్వడం మొదలుపెట్టినట్లు మాకు కనిపిస్తోంది" అని అహ్మద్ చెప్పారు.

వీటన్నిటి మధ్య ఇంటర్ప్రెటర్లు సంకీర్ణ సేనలతో కలిసి పని చేయడం మొదలు పెట్టారు. ఇది చాలా ప్రమాదంతో కూడిన పనే. కానీ, వారికి అక్కడ రక్షణ దొరుకుతుందని భావించారు. వారి వ్యక్తిగత వివరాలు సంకీర్ణం దాటి బయటకు వెళ్లవని హామీ ఇచ్చారు.

"నేనెక్కడ పని చేస్తానో ఎవరికీ తెలియదు. నా పిల్లలు , నా పొరుగు వారితో సహా. నేను ఏమి చేస్తానో పూర్తిగా నా భార్యకు కూడా తెలియదు. మా సమాచారం అంతా రహస్యంగా ఉంచుతామని మాకు హామీ ఇచ్చారు" అని అలీ చెప్పారు.

నిరుద్యోగం, అభద్రత, బహిర్గతం

కానీ, కోవిడ్ మహమ్మారితో దేశం అంతా లాక్ డౌన్ లోకి వెళ్ళింది.

ఎవరైనా ప్రయాణం చేయాలంటే ఇరాక్ ప్రభుత్వం జారీ చేసిన ప్రత్యేక అనుమతులు పొందాల్సిన అవసరం ఉంటుంది. ఈ వివరాలను ఇరాక్ లో అన్ని చెక్ పాయింట్లకు పంపిస్తారు.

ఇరాక్ భద్రతా దళాలు పంచిన జాబితాను బీబీసీ చూసింది. అందులో8 మంది ఇంటర్ప్రెటర్ల పూర్తి పేర్లు, ఉద్యోగ వివరాలు , ఐడి నంబర్లు , కార్ రిజిస్ట్రేషన్ నంబర్లతో సహా ఉన్నాయి.

వారి కదలికలను సులభతరం చేసేందుకు ఈ జాబితాను ఇరాక్ చెక్ పాయింట్లకు పంపినట్లు వారికి అందిన మెయిల్ లో రాశారు.

అది వారికి భయోత్పాతాన్ని కలిగించే వార్త

ఇరాక్ లో చెక్ పాయింట్లను వివిధ రకాల భద్రతా విభాగాలు కాపలా కాస్తూ ఉంటాయి. అందులో శక్తివంతమైన అమెరికా వ్యతిరేక షియా సేనలు కూడా ఉంటాయి

"అంటే మిలీషియా దగ్గర ఇప్పుడు మా సమాచారం ఉంది" అని అహ్మద్ అన్నారు

ఒక వైపు కోవిడ్ మహమ్మారి, మరో వైపు నిరంతర దాడులతో సంకీర్ణం నిర్వహించే చాలా శిక్షణా కార్యక్రమాలు ఆగిపోయాయి. ఈ సైన్యం క్యాంపులను ఇరాకీలకు అప్పగించే ప్రక్రియ కూడా మొదలయింది.

మార్చి 2020 నుంచి ఇప్పటికే సంకీర్ణ సేనలు 8 బేస్ క్యాంపులను ఇరాకీలకు అప్పగించారు. సిబ్బంది సంఖ్య కూడా బాగా తగ్గిపోయింది

ఇందులో ఒక బేస్ లో అహ్మద్, అలీ పని చేస్తున్నారు. ఈ క్యాంపులను అప్పచెప్పడం మొదలు పెట్టగానే బ్రిటిష్ ప్రత్యేక సేనలు అనుకున్న సమయం కంటే ముందే ఇరాక్ నుంచి వెళ్లిపోయాయి.

ఇప్పుడు అహ్మద్, అలీతో పాటు మిగిలిన ఆరుగురు కూడా ఉద్యోగాలను కోల్పోయారు. వీరి వివరాలు బహిర్గతం కావడంతో వారి జీవితాలు అభద్రత లోకి నెట్టుకుపోయాయి.

దీంతో వారి కుటుంబాలను వేరే చోట్లకు తరలించాల్సి వచ్చింది. వీరు అజ్ఞాతంలో ఉండిపోవలసి వచ్చింది. కానీ, ఇది తాత్కాలిక పరిష్కారం మాత్రమే. ఈ లోపు మిలీషియా తమను బంధిస్తుందేమోననే భయంతో ఉన్నారు.

ఇరాక్ లో దళాలు

ఫొటో సోర్స్, AFP

వ్యక్తిగత సమాచారం

వారున్న సంకట స్థితిని బీబీసీ బ్రిటిష్ డిప్యూటీ కమాండర్ మేజర్ జనరల్ కెవ్ కోప్సి దృష్టికి తీసుకుని వెళ్ళింది.

వారి వ్యక్తిగత వివరాలను ఇతరులతో పంచుకున్న విషయాన్ని ఆయన ఖండించారు.

"మేము పని చేసిన మిగిలిన వారి లాగే ఇంటర్ప్రెటర్లు కూడా మా పనిని చేయడానికి కావాల్సిన సహాయం చేస్తారు. మేము వారి వ్యక్తిగత సమాచారాన్ని భద్రంగానే ఉంచుతాం. ఈ సమాచారాన్ని మేము ఎవరితోనూ పంచుకోము. ఇరాకీ సైన్యంతో, ప్రభుత్వంతో కూడా వారి వివరాలను వెల్లడి చేయం" అని చెప్పారు.

కానీ, ఆ జాబితాను బీబీసీ చూసిందని చెప్పినప్పుడు, ఈ విషయం గురించి ఆరా తీస్తానని చెప్పారు.

వీటిపై విచారణ జరుగుతున్నట్లు బ్రిటిష్ రక్షణ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది.

ఆ పత్రంపై బాగ్దాద్‌లో ఉన్న అమెరికా కార్యాలయం స్టాంపు ఉంది.

దీని గురించి బీబీసీ అమెరికా దౌత్య కార్యాలయాన్ని కూడా సంప్రదించింది.

"మేము ఇరాక్ ప్రభుత్వంతో చేసిన దౌత్య సంబంధ విషయాల గురించి వ్యాఖ్యానించం. కానీ, అమెరికా మిషన్ కోసం పని చేసే సిబ్బంది భద్రతను దృష్టిలో పెట్టుకుని వ్యక్తులు, సరుకుల రవాణా కోసం ఇరాక్ ప్రభుత్వాన్ని సంప్రదించడం మేము సాధారణంగా చేసే ప్రక్రియ" అని దౌత్య కార్యాలయ ప్రతినిధి చెప్పారు.

ఇరాకీ ఇంటర్ప్రెటర్ల పై వచ్చే బెదిరింపులకు సుదీర్ఘ చరిత్ర ఉంది.

సద్దాం హుస్సేన్ మరణం నుంచి బ్రిటిష్ సేనలతో కలిసి పని చేసిన కనీసం 40 మంది ఇంటర్ప్రెటర్లను వివిధ తీవ్రవాద గ్రూపులు హతమార్చాయి.

2003లో అమెరికా ఇరాక్ పై దాడి చేసినప్పటి నుంచి బెదిరింపులు జరుగుతున్నప్పటికీ, బ్రిటిష్ సైన్యంతో కలిసి పని చేసిన ఇంటర్ప్రెటర్లకు బ్రిటన్ మాత్రం ఎటువంటి నిబంధనలు లేకుండా వీసా ఇవ్వడానికి ఒప్పుకోవడం లేదు.

సొలేమాని, అల్ ముహన్ దిస్ మరణం నుంచి పరిస్థితులు పూర్తిగా మారాయి.

అహ్మద్, అలీ సురక్షితంగా ఉన్నట్లుగా భావించటం లేదు. ఇరాక్ లో ఇప్పటి వరకు హతమార్చిన వారిలో వారి పేర్లు కూడా చేరుతాయేమో అని వారు భయపడుతున్నారు.

"మేము వాళ్ళను నమ్మాము. వాళ్ళు మమ్మల్ని నమ్మారు . ఇలా మమ్మల్ని వదిలేస్తారని మేము అనుకోలేదు. నేను ఎవరినీ నిందించటం లేదు. కానీ, మాకు మానవ హక్కులు లేవా?" అని అలీ గొంతులో వెలక్కాయ పడినట్లుగా మాట్లాడారు.

అహ్మద్ మౌనంగా తల ఊపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)