అజర్‌బైజాన్, అర్మేనియాల మధ్య యుద్ధం ఎందుకు వచ్చింది? చరిత్రలో అసలేం జరిగింది?

అర్మేనియా, అజర్బైజాన్ యుద్ధం

ఫొటో సోర్స్, AFP

అర్మేనియా, అజర్‌బైజాన్‌ల మధ్య నగార్నో-కరాబక్‌ అనే ప్రాంతం కోసం యుద్ధం కొనసాగుతోంది. ఇప్పటికే ఈ పోరాటంలో వేల మంది ప్రాణాలు పోయాయి.

గత 30 ఏళ్లలో ఈ ప్రాంతంలో ఇంతటి ఘర్షణ ఎప్పుడూ తలెత్తలేదు.

రెండు దేశాల మధ్య నగార్నో-కరాబక్ ప్రాంతంపై వివాదం అసలు ఎందుకు మొదలైంది? ఈ ప్రాంతం చరిత్ర ఏంటి? ఇన్నేళ్లుగా అక్కడ ఏం జరిగింది? ఇప్పుడే ఎందుకు వివాదం తారస్థాయికి చేరింది?

ఈ ప్రశ్నలకు సమాధానాలను వెలికితీసే ప్రయత్నిం చేసింది బీబీసీ రష్యన్ సర్వీస్.

మొదలు ఇలా...

సోవియట్ యూనియన్‌ రాజకీయ, ఆర్థిక ప్రణాళికల పునర్వ్యవస్థీకరణ కోసం మిఖాయిల్ గోర్బోచోఫ్ నేతృత్వంలో జరిగిన ‘పెరెస్ట్రాయికా’ ఉద్యమంలో ఈ వివాదం మూలాలు ఉన్నాయి.

సోవియట్ యూనియన్ మనుగడలో ఉన్నప్పుడు అజర్బైజాన్‌లో అంతర్భాగంగా స్వయంప్రతిపత్తి ఉన్న ప్రాంతంగా నగార్నో-కరాబక్ ఉండేది.

అర్మేనియా, అజర్బైజాన్ యుద్ధం

ఫొటో సోర్స్, Getty Images

నగార్నో-కరాబక్‌ను అజర్‌బైజాన్‌లో అంతర్భాగంగా అంతర్జాతీయంగా గుర్తిస్తారు. కానీ, ఇక్కడ నివసించేవారిలో అత్యధికులు అర్మేనియన్లే.

నగార్నో-కరాబక్‌ను అర్మేనియాలో కలపాలని వాళ్లు ఆందోళనలు మొదలుపెట్టారు. దీనిపై అజర్‌బైజాన్‌లో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.

దీంతో ఈ రెండు వర్గాల ప్రతినిధుల మధ్య ఘర్షణలు ప్రారంభమయ్యాయి. అర్మేనియా, కరాబక్‌‌ల నుంచి అజర్‌బైజాన్‌ వాళ్లను వెళ్లగొట్టడం మొదలైంది.

దీనికి ప్రతిచర్యగా 1988లో అజర్‌బైజాన్‌లోని సుమగయిట్ నగరంలో అర్మేనియా వాళ్లను పెద్ద సంఖ్యలో చంపారు. దీన్ని 'సుమగయిట్ నరసంహారం'గా విశ్లేషకులు వర్ణిస్తుంటారు.

అప్పుడు సోవియన్ యూనియన్ బలప్రయోగంతో పరిస్థితిని శాంతపరిచేందుకు ప్రయత్నించింది. కరాబక్‌లో ఆందోళనకు ప్రతినిధులుగా ఉన్నవారిని అరెస్టు చేశారు. అర్మేనియా, అజర్‌బైజాన్‌ల మధ్య శత్రుత్వం మరింత పెరుగుతూ పోయింది.

1990లో అజర్‌బైజాన్‌ రాజధాని బాకూలో మరోసారి వందల సంఖ్యలో అర్మేనియన్లను చంపారు.

అర్మేనియా, అజర్బైజాన్ యుద్ధం

ఫొటో సోర్స్, REUTERS/UMIT BEKTAS

1991లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమవ్వగానే కరాబక్‌ సంఘర్షణ మరో కొత్త మలుపు తీసుకుంది.

అప్పుడు అజర్‌బైజాన్‌, అర్మేనియాల వద్ద సోవియట్ సైన్యం వదిలి వెళ్లిన ఆయుధాలు కూడా ఉన్నాయి. దీంతో 1992-93లో ఈ రెండు దేశాల మధ్య భీకర యుద్ధం జరిగింది. రెండు పక్షాలకూ తీవ్ర నష్టం జరిగింది.

యుద్ధ నేరాలుగా పరిగణించే ఘటనలు కూడా రెండు దేశాల మధ్య జరిగాయి.

1992లో అజర్‌బైజాన్‌లోని ఖొజాలీ సమీపంలో జరిగిన అజర్‌బైజాన్‌ పౌరుల ఊచకోత కూడా వీటిలో ఒకటి. ఖొజాలీ సమీప ప్రాంతాల్లోకి అర్మేనియా సైన్యం చొరబడి అక్కడున్నవారిని చంపింది. అధికారిక గణంకాల ప్రకారం మరణించినవారిలో 600 మంది వృద్ధులు, మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు.

ఏళ్లుగా రెండు దేశాల మధ్య జరుగుతున్న ఈ ఘర్షణల్లో దాదాపు 30 వేల మంది దాకా మరణించి ఉంటారని, పది లక్షలకుపైగా మంది శరణార్థులుగా మారి ఉంటారని ఓ అంచనా.

అర్మేనియా, అజర్బైజాన్ యుద్ధం

ఫొటో సోర్స్, AFP

శాంతి కోసం అంతర్జాతీయ ప్రయత్నాలు

నర్గానో-కరబఖ్ అంశం ఐరాసలో చాలా సార్లు ప్రస్తావనకు వస్తూ ఉంది. 1993లో ఐరాస భద్రతా మండలి నాలుగు తీర్మానాలు చేసింది. అయితే, అవేవీ అమలుకు నోచుకోలేదు.

అజర్‌బైజాన్‌, అర్మేనియాల మధ్య వివిధ స్థాయిల్లో చర్చల కోసం ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అయితే, ఈ రెండు దేశాల్లో నాయకత్వంలో మార్పులు వచ్చినకొద్దీ చర్చల ప్రక్రియలు మళ్లీ మొదటికి వచ్చేది.

1992లో బెలారూస్ రాజధాని మిన్స్క్‌లో యూరప్ ఆర్గరైజేషన్ ఫర్ సెక్యూరిటీ అండ్ కోఆపరేషన్ న్ యూరప్ (ఓఎస్‌సీఈ) సదస్సు సందర్భంగా ఓఎస్‌సీఈ మిన్స్క్ గ్రూప్‌ను ఏర్పాటు చేశారు.

రష్యా, అమెరికా, ఫ్రాన్స్ నేతృత్వంలోని ఈ గ్రూప్ కూడా అజర్బైజాన్, అర్మేనియాల మధ్య చర్చల కోసం ప్రయత్నాలు చేసింది.

ఈ మధ్యవర్తిత్వ ప్రయత్నాలు ఫలించి 1994 మేలో అజర్‌బైజాన్‌, అర్మేనియా యుద్ధ విరమణకు సిద్ధమయ్యాయి. అప్పటికి కరాబక్‌ను, దాని సమీపంలోని ఏడు ప్రాంతాలను అర్మేనియా ఆక్రమించింది.

అయితే, అప్పుడు రెండు దేశాల మధ్య సమావేశాలు, చర్చలు జరిగినా వ్యవహారాలు ఎటూ తేలలేదు.

2001లో రెండు దేశాల అధ్యక్షులు అమెరికాలో ఓ రిసార్టులో సమావేశమయ్యారు. అప్పుడు రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదురుతుందని అందరూ భావించినా, ప్రయత్నాలు చివరిదాకా వచ్చి విఫలమయ్యాయి.

అర్మేనియా, అజర్బైజాన్ యుద్ధం

ఫొటో సోర్స్, AFP VIA GETTY IMAGES

కరాబక్‌ను గణతంత్ర రాజ్యంగా ప్రకటించిన అర్మేనియా

అర్మేనియా 1991లో నగార్నో-కరాబక్‌ను గణతంత్ర రాజ్యంగా ప్రకటించింది.

కానీ, అంతర్జాతీయ సమాజం దీన్ని గుర్తించలేదు. నగార్నో-కరాబక్‌ను ఆక్రమిత ప్రాంతంగా అజర్‌బైజాన్‌ పరిగణిస్తోంది.

అధికారికంగా గణతంత్ర రాజ్యంగా ప్రకటించినప్పటికీ నగార్నో-కరాబక్‌ భద్రత వ్యవహారాలను అర్మేనియానే చూసుకుంటోంది. ఆ ప్రాంతానికి బడ్జెట్ కూడా ఆ దేశమే కేటాయిస్తోంది. సైన్య వ్యవహారాలను కూడా చూస్తోంది.

నగార్నో-కరాబక్‌లో ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే, వీటికి అంతర్జాతీయ గుర్తింపు లేదు. ఈ ప్రాంత వాసులు అర్మేనియా పాస్‌పోర్టునే వినియోగిస్తున్నారు. ఫోన్లు కూడా అర్మేనియా కోడ్‌తోనే పనిచేస్తాయి.

కాల్పుల విరమణ ఇప్పటివరకూ ఎలా కొనసాగింది?

రెండు దేశాల సరిహద్దు ప్రాంతాల్లో ఘర్షణలు జరుగుతూనే ఉంటాయి.

అయితే, 2016 ఏప్రిల్‌లో ఓ తీవ్ర ఘర్షణ నాలుగు రోజులపాటు కొనసాగింది. రెండు దేశాల సైనికులూ ఇందులో మరణించారు.

ఆ తర్వాత రెండు దేశాల ప్రతినిధులు రష్యాలో సమావేశమై, కాల్పుల విరమణకు అంగీకరించుకున్నారు.

2020 జులైలో కూడా అర్మేనియా, అజర్‌బైజాన్‌ అంతర్జాతీయ సరిహద్దుల వద్ద ఘర్షణలు జరిగాయి. అయితే, అంతర్జాతీయ ప్రయత్నాలు కారణంగా ఇవి తీవ్ర రూపం దాల్చలేదు.

అర్మేనియా, అజర్బైజాన్ యుద్ధం

ఫొటో సోర్స్, Reuters

టర్కీ పాత్ర

టర్కీ, అజర్‌బైజాన్‌ ప్రజల మధ్య చారిత్రక, సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయి. ఈ రెండు దేశాల్లో మాట్లాడే భాషలు కూడా ఒకే కుటుంబానికి చెందినవి.

సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైన తర్వాత రెండు దేశాల మధ్య రాజకీయ సంబంధాలు బాగా బలపడ్డాయి.

టర్కీతో అర్మేనియాకు మధ్య ఎప్పుడూ సంబంధాలు సరిగ్గా లేవు. టర్కీ ఒట్టమాన్ సామ్రాజ్యంగా ఉన్న సమయంలో 1914 తర్వాత అర్మేనియన్లు ఊచకోతకు గురయ్యారు.

ఇదంతా జరిగి వందేళ్లు గడిచినా, రెండు దేశాల మధ్య సఖ్యత రాలేదు.

అర్మేనియాతో తమ సరిహద్దును టర్కీ మూసివేసింది.

ఇక నగార్నో-కరాబక్‌లో అజర్‌బైజాన్‌కు మద్దతుగా టర్కీ రాజకీయంగానే కాకుండా సైన్యపరంగానూ క్రియాశీల పాత్ర పోషిస్తోంది.

అర్మేనియా, అజర్బైజాన్ యుద్ధం

ఫొటో సోర్స్, Getty Images

ఇరాన్... రష్యా...

అర్మేనియా, అజర్‌బైజాన్‌లతో తమకున్న సంబంధాల్లో సమతుల్యం ఉండాలని ఇరాన్ కూడా కోరుకుంటోంది.

అజర్‌బైజాన్‌, అర్మేనియా మూలాలున్న జనం చాలా మంది ఇరాన్ ఉత్తర ప్రాంతంలో ఉన్నారు. తాజా యుద్ధం ప్రభావంతో ఆ ప్రాంతంలో వేర్పాటువాదం పెరుగుతుందేమోనన్న ఆందోళనతో ఇరాన్ ఉంది.

ఇక అర్మేనియా, అజర్‌బైజాన్‌ రెండు దేశాలతోనూ రష్యాకు చాలా ఏళ్లుగా సంబంధాలున్నాయి.

ఓఎస్‌సీఈ మిన్స్క్ గ్రూప్ ముఖ్య సభ్య దేశంగా అర్మేనియా, అజర్‌బైజాన్‌ మధ్య మధ్యవర్తిత్వం వహిస్తున్న ఆ దేశం రెండు దేశాల వాదనలనూ వినాల్సి ఉంటుంది.

ఇక ఈ రెండు దేశాలకూ వందల కోట్ల డాలర్ల విలువైన ఆయుధాలను రష్యా విక్రయిస్తోంది.

అర్మేనియాలో రష్యా సంస్థల పెట్టుబడులు చాలా ఉన్నాయి. ఆ దేశంలో రష్యాకు ఓ భారీ సైనిక స్థావరం కూడా ఉంది.

అర్మేనియా పౌరులు పెద్ద సంఖ్యలో రష్యాలో పనిచేస్తుంటారు. అజర్‌బైజాన్‌ వాళ్లు కూడా అక్కడ కార్మికులుగా ఉన్నారు.

రష్యా పరిశ్రమలు అజర్‌బైజాన్‌ చమురు రంగంలో పెట్టుబడులు పెట్టాయి. అజర్‌బైజాన్‌ పౌరుల్లో రష్యా మూలాలున్నవారు కూడా ఉన్నారు.

ఈ కారణాల రీత్యా రష్యా ఈ రెండు దేశాల్లో ఏదో ఒక దేశం వైపు రష్యా స్పష్టంగా నిలబడే పరిస్థితి కనిపించడం లేదు.

అర్మేనియా, అజర్బైజాన్ యుద్ధం

ఫొటో సోర్స్, DEFENSE MINISTRY OF AZE / ANADOLU AGENCY

ఇప్పుడే ఎందుకు యుద్ధం?

అజర్‌బైజాన్‌ సైన్యం అర్మేనియా సైన్యం కన్నా చాలా పెద్దది. 2000ల్లో చమురు విక్రయాల ద్వారా అజర్‌బైజాన్‌ చాలా ఆదాయం సమకూర్చుకుంది. సైన్యం శిక్షణ కోసం, సామర్థ్యాలు పెంచేందుకు భారీగా ఖర్చు చేసింది.

ప్రస్తుతం కరోనా సంక్షోభంతో శక్తిమంతమైన దేశాలు కూడా ఇబ్బందుల్లో ఉన్నాయి. అమెరికా ఎన్నికల సన్నాహాల్లో ఉంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దీర్ఘకాలిక సంక్షోభం వైపు పయనిస్తోంది.

అజర్‌బైజాన్‌కు చమురుపై ఇదే స్థాయిలో ఆదాయం కొనసాగడం కష్టంగా కనిపిస్తోంది. సైనిక శక్తిపరంగా సాధ్యమైనంత మెరుగైన స్థాయికి ఆ దేశం చేరుకున్నట్లు కనబడుతోంది.

కరాబక్‌ కొండ ప్రాంతం. చలికాలం వచ్చాక, ఇక్కడ సైనిక సామగ్రి తరలింపు పెద్ద సమస్యగా మారుతుంది.

దారులన్నీ మంచుతో మూసుకుపోకముందే, ఆ దేశం సైనిక చర్యకు ఉపక్రమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే ఆ దేశం ఇప్పుడు ముందడుగు వేసినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

వీడియో క్యాప్షన్, అర్మేనియా- అజర్‌బైజాన్: ‘ఇంతటి విధ్వంసం ఎన్నడూ చూడలేదు’

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)