స్వదేశీగా కనిపించే విదేశీ బ్రాండ్లు.. విదేశీగా కనిపించే స్వదేశీ బ్రాండ్లు... ఏవేమిటో మీకు తెలుసా?

ఫొటో సోర్స్, hidesign/Instagram
- రచయిత, పద్మ మీనాక్షి
- హోదా, బీబీసీ ప్రతినిధి
వినియోగదారులు జుట్టుకు వాడే హెయిర్ ఆయిల్ నుంచి కాలికి ధరించే చెప్పుల వరకు బ్రాండ్ల పేర్లతోనే వస్తువులను గుర్తు పెట్టుకునే వినిమయ ప్రపంచంలో బ్రాండ్లకున్న ప్రాముఖ్యతను విస్మరించలేం.
అయితే.. మార్కెట్లో దేశీ బ్రాండ్లని చాలా మంది భావించే బ్రాండ్లన్నీ దేశీయమైనవి కాదు. అలాగే, విదేశీ బ్రాండ్లగా చెలామణి అయ్యే కొన్ని ఉత్పత్తులు పూర్తిగా భారతీయ బ్రాండ్లే.
ఎన్నో తరాలుగా.. స్కూలు తెరిచారనగానే పిల్లలకు షూలు, బ్యాగులు కొనాలంటే చాలా మందికి గుర్తు వచ్చే పేరు బాటా. కానీ, బాటా భారతీయ బ్రాండు కాదు.
126 ఏళ్ల సంస్థ చరిత్రలో తొలిసారిగా భారతీయ వ్యక్తి సందీప్ కటారియా.. బాటా సంస్థ అంతర్జాతీయ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా నియమితులయ్యారు. ఇలాంటి కొన్ని బ్రాండ్లు భారతదేశంలో చాలా ఉన్నాయి.
థామస్ బాటా 1894లో జెకోస్లోవేకియా బాటా సంస్థను స్థాపించారు. ఇప్పటికీ కుటుంబ యాజమాన్య ఆధీనంలోనే ఉన్న ఈ సంస్థ ప్రపంచంలోనే చెప్పుల ఉత్పత్తుల్లో అగ్రగామిగా ఉంది. బాటా ప్రధాన కేంద్రం స్విట్జర్లాండ్‌లోని లసానేలో ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
భారతదేశంలో సంస్థ కార్యకలాపాలు 1931లో కోల్‌కతాలో మొదలయ్యాయి. సంస్థ వెబ్‌సైట్ ప్రకారం ఈ సంస్థకు దేశ వ్యాప్తంగా 1,375 స్టోర్లు ఉన్నాయి. 2019 -20 సంవత్సరానికి గాను రూ. 3,053 కోట్ల ఆదాయంతో, రూ. 327 కోట్ల లాభాలను ఆర్జించినట్లు బాటా విడుదల చేసిన వార్షిక నివేదిక వివరించింది.
భారతదేశం ఫుట్ వేర్ తయారీలో చైనా తర్వాత రెండో స్థానంలో ఉన్నట్లు భారత చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ నివేదిక చెప్తోంది. ప్రపంచ ఫుట్ వేర్ ఉత్పత్తిలో భారతదేశపు వాటా 13 శాతం.
బాటా, అమూల్, ఎల్ఐసీ లాంటి బ్రాండ్లు ఒకప్పటి తరాన్ని బాగా ప్రభావితం చేసిన బ్రాండ్లు. ప్రస్తుతం వినియోగదారులను ప్రభావితం చేయడానికి మార్కెట్లో లెక్కలేనన్ని బ్రాండ్లు ఉన్నాయని స్టార్ట్ అప్ బ్రాండ్ కన్సల్టెంట్ రంగ ఇందుర్తి అన్నారు.
పొద్దున్న లేచిన తర్వాత తాగే కాఫీ టీల నుంచి రాత్రి నిద్రపోయే పరుపుల వరకు ఉపయోగించే ఉత్పత్తులను వాటి బ్రాండ్ల ఆధారంగానే గుర్తించడం వినియోగదారుల జీవితాల్లో సాధారణంగా మారిపోయింది.
"మేరా జూతా హై జపానీ... ఏ పట్లూ ఇంగ్లిష్‌స్థానీ... సర్ పే లాల్ టోపీ రూసీ... ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ..." అనే బాలీవుడ్ పాటలో చెప్పినట్లుగా.. బ్రాండును బట్టి అది స్వదేశీయా, విదేశీయా అనేది గుర్తించటం ఇప్పుడంత సులభం కాదు.

ఫొటో సోర్స్, Getty Images
హిందూస్తాన్ యూనిలివర్
హిందూస్తాన్ యూనిలివర్ పేరు చూడగానే ఇది భారతీయ కంపెనీ అనే అనుకుంటాం. ఎందుకంటే ఈ సంస్థ నుంచి వచ్చే అనేక ఉత్పత్తులు ప్రతి ఇంటా కనీసం ఒక్కటన్నా ఉంటాయి.
నిజానికి ఇది బ్రిటిష్ డచ్ యూనిలివర్ అనుబంధ సంస్థ. ఈ సంస్థ ఉత్పత్తుల్లో రోజూ ఇంట్లో వాడే సబ్బులు, కాఫీ, టీ, ఐస్ క్రీంలతో సహా చాలా రకాల నిత్యావసర సరుకులు ఉంటాయి.
యూనిలివర్ 1931లో హిందూస్తాన్ వనస్పతి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీని ప్రారంభించింది. 1933లో లివర్ బ్రదర్స్ ఇండియా లిమిటెడ్, 1935లో ఇండియా ట్రేడర్స్ లిమిటెడ్‌ని స్థాపించారు. ఇవి మూడూ కలిసి 1956లో హిందూస్తాన్ యూనిలివర్ లిమిటెడ్‌గా అనుసంధానం అయ్యాయి.
అయితే, ఇప్పుడు ఈ సంస్థలో భారతీయ షేర్ హోల్డర్లు కూడా ఉన్నారు.
బ్రూక్ బాండ్ కాఫీ 1900 నుంచి భారతదేశంలో ఉంది. 1903 నాటికి సంస్థ రెడ్ లేబుల్‌ను స్థాపించింది. 1984లో బ్రూక్ బాండ్ , 1972, 77లో లిప్టన్ సంస్థలు కూడా యూనిలివర్‌తో అనుసంధానం అయ్యాయి.
సౌందర్య సాధనాల బ్రాండ్ పాండ్స్ కూడా.. చీస్బ్రో పాండ్స్ యూఎస్ఏ అనుసంధానంతో 1986లో యూనిలివర్ గొడుగు కిందకు చేరిపోయింది.

ఫొటో సోర్స్, Getty Images
ప్రముఖ సౌందర్య సాధనాల బ్రాండ్ లాక్మే కూడా 50 శాతం వాటాను హిందూస్తాన్ యూనిలివర్‌కి అప్పగించింది. ఈ పేరు విదేశీ బ్రాండును తలపిస్తుంది కానీ, నిజానికి ఇది దేశీ బ్రాండు.
టాటా ఆయిల్ మిల్స్ అనుబంధ సంస్థగా 1952లో ఇది మార్కెట్లోకి వచ్చింది. దీనికి ఫ్రెంచ్ ఓపెరా లాక్మే పేరును పెట్టడంతో దీనిని చాలా మంది విదేశీ బ్రాండుగా పొరపడుతూ ఉంటారు.
బ్రాండుల ప్రకటనలకు వాడే ట్యాగ్ లైన్లు అన్ని వయసుల వారిలో ప్రాముఖ్యత పొందాయి.
"బూస్ట్ ఈజ్ ది సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ’’ అనే సచిన్ ప్రకటన జ్ఞాపకం వచ్చే బూస్ట్ కూడా గ్లాక్సో స్మిత్‌క్లైన్ ఉత్పత్తి అయినప్పటికీ తరువాత హిందూస్తాన్ యూనిలివర్‌తో అనుసంధానం అయింది.
'మీ టూత్ పేస్టులో ఉప్పు ఉందా' అనే ప్రకటనతో జనంలోకి చొచ్చుకుపోయింది కోల్గేట్. భారతీయ ఉత్పత్తి అని అనుకునే ఈ బ్రాండు నిజానికి, ఒక అమెరికన్ సంస్థ.

ఫొటో సోర్స్, Getty Images
దీనిని విలియం కోల్గేట్ 1806లో న్యూయార్క్‌లో స్థాపించారు. దీనికి 200 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ సంస్థ తొలి పత్రికా ప్రకటన 1817లో ఒక న్యూయార్క్ పత్రికలో వచ్చింది.
ఇది సబ్బులు, కొవ్వొత్తులు తయారు చేసే కంపెనీగా ప్రారంభమై, నెమ్మదిగా సంస్థ ఉత్పత్తులను విస్తరిస్తూ 1896లో టూత్ పేస్టులను తయారు చేయడం మొదలు పెట్టింది. నేడు దేశంలో పల్లె పల్లెలోనూ ఈ బ్రాండు కనిపిస్తుంది.
అమెరికాలో తొలి బాల్ పాయింట్ పెన్ తయారు చేసింది ఈయనే అని రెనాల్డ్స్ వెబ్‌సైట్ చెబుతోంది. 1980లలో ఈ పెన్ భారతీయ మార్కెట్‌లోకి ప్రవేశించింది.
'లైఫ్‌బోయ్ ఎక్కడ ఉంటే ఆరోగ్య అక్కడే' అనే ప్రకటన పల్లె పల్లెలోనూ రేడియోలలోనూ, నగరాల్లో సినిమా థియేటర్ల లోనూ తరచుగా వినిపిస్తూ ఉంటుంది. ఇది భారతీయ ఉత్పత్తి అని అనుకుంటూ ఉంటారు. ఇప్పటికీ ఇది చాలా మంది కొనుక్కోగలిగే ధరలో ఉండే సబ్బు. 1895లో ఇంగ్లాండ్‌లో వీటి ఉత్పత్తి మొదలయింది.
వీటిని ప్రోక్టర్ అండ్ గాంబిల్ సంస్థ ఉత్పత్తి చేస్తుంది.
మనలో చాలా మంది విరివిగా వాడే రేనాల్డ్స్ పెన్ కూడా దేశీయ ఉత్పత్తి కాదు. దీనిని మిల్టన్ రెనాల్డ్స్ 1945లో తొలిసారి తయారు చేశారు. తర్వాత ఇది ప్రపంచ వ్యాప్తంగా ప్రయాణం చేసింది.

నాగరికత తొలి నాళ్ల నుంచే బ్రాండ్ల సంస్కృతి...
బ్రాండ్ల సంస్కృతి ప్రపంచీకరణతో మొదలయినది కాదని వీటికి కూడా మానవ నాగరికతకు ఉన్నంత చరిత్ర ఉందని మెక్ గిల్స్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ కార్ల్ మూర్, బిషప్స్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ సూసన్ ఇ రీడ్ రాసిన ‘ది బర్త్ ఆఫ్ బ్రాండ్’ పరిశోధన పత్రంలో పేర్కొన్నారు.
బ్రాండ్ల గురించి హెచ్ డి వుల్ఫ్ రాసిన పుస్తకంలో 1942లో ప్రస్తావన వచ్చినప్పటికీ.. క్రీస్తు పూర్వం 2250 నాటి సింధులోయ నాగరికత నుంచి క్రీస్తు పూర్వం 300 నాటి గ్రీస్ కాలంలో కూడా బ్రాండ్ల సంస్కృతి కనిపిస్తుందని ఈ పరిశోధన పత్రం చెబుతోంది.
అయితే, వీటిని కచ్చితంగా బ్రాండులని చెప్పలేమని, కానీ ఆయా కాలమానాలలో వస్తువులను గుర్తించేందుకు ఏర్పాటు చేసిన చిహ్నాలు అయి ఉండవచ్చని భావిస్తున్నారు.
పులులు, ఎడ్లు, ఏనుగులు మరి కొన్ని జంతువుల చిత్రాలతో కూడిన చిహ్నాలను కొన్ని ఉత్పత్తుల మీద ముద్రించడం పురాతన కాలం నుంచే ఉన్నట్లు కాలిఫోర్నియా యూనివర్సిటీ ఇండియనాలజిస్ట్ స్టాన్లీ వాల్పర్ట్ పేర్కొన్నారని మూర్ రాసిన పరిశోధన పత్రం పేర్కొంది.
ఇవి భారతదేశపు తొలి వాణిజ్య పత్రాలుగా అనుకోవచ్చని వీటిపై కనీసం 400 రకాల బొమ్మలను ముద్రించేవారని చెప్పారు. ఇవి బహుశా వర్తకుల పేర్లతో కూడి ఉండేవని కూడా స్టాన్లీ పేర్కొన్నారు.
మొహెన్జోదారోలో లభించిన ఒక చిహ్నం మీద ఒక యోగి చుట్టూ కూర్చున్న ఏనుగు, పులి, రైనోసారస్, నీటి ఏనుగు, జింక బొమ్మలు ముద్రితమై ఉన్నాయి. ఇది భారతీయులు పూజించే శివుడు అయి ఉండవచ్చని ఆయన రాశారు.
ఇలాంటి చిహ్నాలను వాడటం ఆయా బ్రాండ్లకు సూచికగా పరిశోధకులు భావిస్తున్నారు. కానీ, వాటి మీదున్న సమాచారం ఆధునిక బ్రాండ్లను పోలినట్లే ఉండటంతో బ్రాండ్లు అనాదిగా వస్తున్నవనేనని పరిశోధకులు తేల్చారు.

ఫొటో సోర్స్, @HidesignHQ
విదేశీ బ్రాండ్లుగా అనిపించే స్వదేశీ బ్రాండ్లు...
ఎయిర్ పోర్టులలో, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్‌లో కనిపించే హై డిజైన్ బ్రాండు ఉత్పత్తి చేసే బ్యాగులు చూడగానే దానిని విదేశీ బ్రాండుగా పొరబడుతూ ఉంటారు. వీటి ధరలు కూడా ఎక్కువగానే ఉంటాయి.
కానీ, ఇవి నిజానికి పుదుచ్చేరిలో ప్రధాన కేంద్రంగా తయారవుతున్న భారతీయ ఉత్పత్తులు.
తమిళనాడు టానరీస్ పరిశ్రమ ప్రపంచంలో చాలా పెద్ద బ్రాండులకు కూడా తోలును సరఫరా చేస్తుంది.
అల్లెన్ సోలీ పేరు వినగానే విదేశీ ఫ్యాషన్ బ్రాండు అనుకుంటాం. కానీ, నిజానికి ఇదొక భారతీయ బ్రాండు. ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్‌కి చెందిన ఉత్పత్తి. దీని ఉత్పత్తి, రూపకల్పన అంతా భారతదేశంలోనే జరుగుతుంది.
అలాగే, ఫ్రెంచ్ పేరును తలపించే లా ఓపాల డిన్నర్ సెట్లు, కాఫీ కప్పుల బ్రాండు కూడా దేశీయ బ్రాండే. యువతరం క్రేజిగా కొనుక్కునే ఫ్లైయింగ్ మెషీన్ జీన్స్ బ్రాండు కూడా దేశీయ ఉత్పత్తే. దీనిని అరవింద్ మిల్స్ ఉత్పత్తి చేస్తుంది.
లూయి ఫిలిప్, పీటర్ ఇంగ్లండ్ కూడా దేశీయ ఉత్పత్తులే.

ఫొటో సోర్స్, Getty Images
‘బ్రాండు పాత్రను విస్మరించలేం’
వినియోగదారుల జీవితాలలో బ్రాండ్లు వినిమయ నిర్ణయాలను ప్రభావితం చేస్తాయని కొంత మంది వ్యాపారవేత్తలు అంటున్నారు.
“ఒకే లాంటి ఉత్పత్తులను ఒకే విధమైన నాణ్యతతో ఒక బ్రాండు లేని సంస్థ తయారు చేస్తే వినియోగదారుడు దానిని కొనడానికి వెనుకాడవచ్చు. ఇక్కడే బ్రాండుకుండే విలువ తెలుస్తుంది” అని విజయవాడలో టైటన్ ఫ్రాంచైజీ నిర్వహిస్తున్న వ్యాపారవేత్త జోగులాంబ వల్లూరుపల్లి అన్నారు.
"వినియోగదారులు, టెక్నాలజీతో కూడిన ఉత్పత్తులను, ఎక్కువ కాలం మన్నే లాంటి ఖరీదైన ఉత్పత్తులను కొనేటప్పుడు మాత్రం కచ్చితంగా పేరున్న బ్రాండునే కొనడానికి ఇష్టపడతారు’’ అని చెప్పారామె.
అయితే.. ‘‘నిత్యావసర సరుకుల వరకు వచ్చేసరికి దేశీయ, సేంద్రియ ఉత్పత్తులను కొనడానికి బ్రాండు విషయాన్ని అంతగా పట్టించుకోవడం లేదు. అందుకు ఉదాహరణ.. ఆర్గానిక్, కాన్షియస్ లివింగ్‌కి అలవాటు పడుతున్న వర్గం కూరగాయలు, తృణ ధాన్యాలు, నూనెలు లాంటివి కొనాలన్నప్పుడు నేరుగా రైతుల దగ్గర కొనడానికే ఇష్టపడుతున్నారు. ఇలాంటి విషయాలలో బ్రాండులకు అంత ప్రాధాన్యత ఇవ్వటం లేదు. బ్రాండ్ల ప్రాధాన్యత కొనే వస్తువును బట్టీ మారిపోతుంది" అని ఆమె వివరించారు.
“ఏదేమైనా బ్రాండు విలువను మాత్రం తీసి పడేయలేం" అని ఆమె పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
- పంజాబ్ రైతుల మాదిరిగా.. వేరే రాష్ట్రాల రైతులు ఎందుకు ఆందోళనలు చెయ్యట్లేదు?
- చిదంబరం నటరాజ ఆలయం.. భూ అయస్కాంత క్షేత్రం నడిబొడ్డున ఉందా?
- జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్‌లో మద్యం అమ్మకాలు పెరిగాయా?
- ఎడారిలో అంతుచిక్కని లోహస్తంభం... అకస్మాత్తుగా ప్రత్యక్షం.. అదే తీరులో అదృశ్యం.. ఏలియన్స్ పనా?
- ఆ రోజు ఈ ఫొటో తీసింది ఎవరు? కసబ్ గురించి ఆ ఫొటో జర్నలిస్టు ఏమంటున్నారు?
- బిచ్చగాడు అనుకుని దానం చేయబోయారు.. ఆయనెవరో తెలిసి సెల్యూట్ చేశారు
- కరోనావైరస్: కేరళలో దాచి పెట్టిన కోవిడ్ మరణాల గుట్టు రట్టు చేసిన వలంటీర్లు
- పొగాకు వదిలి తీపి పంట వైపు మళ్లిన రైతులు.. లాభాల దిశగా పయనం
- టెడ్ గోయి: రెండు సార్లు... బికారి నుంచి బిలియనీర్‌గా ఎదిగిన డోనట్ కింగ్
- కన్యత్వాన్ని పునరుద్ధరిస్తామంటూ క్లినిక్‌ల అనైతిక వ్యాపారం
- 2,000 ఏళ్ల కిందటి రోమ్ సామ్రాజ్యపు యజమాని, బానిస... బయటపడ్డ బూడిద శిలలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








