సింగపూర్: రహస్యంగా స్నేహితుడిని కలిసిందన్న కారణంతో కరోనా సోకిన మహిళకు జైలు శిక్ష

సింబాలిక్

ఫొటో సోర్స్, AFP

తన స్నేహితుడిని పలుమార్లు కలిసి మాట్లాడిన విషయాన్ని దాచిపెట్టడంతో సింగపూర్‌లో కోవిడ్ సోకిన ఒక మహిళకు 5 నెలల జైలు శిక్ష విధించారు.

65 ఏళ్ల ‘ఓహ్ బీ హియోక్’ తన స్నేహితుడైన 72 ఏళ్ల లిం కియాంగ్ హాంగ్‌ను తరచు రహస్యంగా కలుసుకుంటూ ఉండేవారు.

తమ స్నేహాన్ని వివాహేతర సంబంధంగా భావించి అపార్థం చేసుకుంటారనే భయంతో ఓహ్ ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యుల దగ్గర దాచిపెట్టారు.

గత ఫిబ్రవరిలో ఓహ్‌కు కరోనా పాజిటివ్ రావడంతో ఆమెను కలుసుకున్నవారి జాబితాను కాంటాక్ట్ ట్రేసింగ్ ద్వారా అధికారులు తీయడంతో ఈ విషయం బయటపడింది.

వీరిద్దరూ కలుసుకుంటున్నట్లు సీసీ టీవీలు, ఇతర ఆధారాల ద్వారా అధికారులు కనిపెట్టారు.

సింగపూర్‌లో కరోనా వ్యాప్తిని అరికట్టడానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు.

ఆ దేశంలో ఇప్పటివరకూ 29 కరోనా మరణాలు సంభవించాయి. ఇతర దేశాలతో పోల్చి చూస్తే కోవిడ్ పాజిటివ్ కేసులు కూడా తక్కువ సంఖ్యలోనే నమోదయ్యాయి.

ఫిబ్రవరిలో ఓహ్‌కు కోవిడ్- 19 నిర్ధరణ కాకముందు లింను ఐదుసార్లు కలిశారని తెలిసింది.

ఓహ్ భర్త బ్యాడ్మింటన్ ఆడడానికి బయటకు వెళ్లినప్పుడు వీళ్లిద్దరూ లంచ్, డిన్నర్ లేదా టీ తాగడానికి కలిసేవారని ఈ కేసులో న్యాయవాదిని ఉటంకిస్తూ స్ట్రెయిట్స్ టైమ్స్ పత్రిక ప్రచురించింది.

"తామిద్దరం తరచూ కలుసుకుంటున్నట్లు తన కుటుంబానికిగానీ, లిం కుటుంబానికిగానీ తెలియకూడదని ఓహ్ భావించారు. వారి స్నేహాన్ని తప్పుగా అర్థం చేసుకుని, వివాహేతర సంబంధం అంటగట్టి వదంతులు సృష్టించే అవకాశం ఉందని ఓహ్ భయపడ్డారని" కోర్టు డాక్యుమెంట్లలో రాశారు.

కరోనా

ఫొటో సోర్స్, Reuters

ఓహ్ కోవిడ్‌తో ఆస్పత్రిలో చేరిన తరువాత ‘లిం’కు ఫోన్ చేసి వారిద్దరూ కలుసుకుంటున్న విషయాన్ని రహస్యంగా ఉంచమని అడిగారు.

మార్చిలో లింకు కూడా కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధరణైంది.

అయితే ఓహ్ ద్వారా లింకు వైరస్ సంక్రమించలేదని ఓహ్ తరపు లాయరు తెలిపారు.

కార్ పార్కింగ్ బిల్లులు, క్రెడిట్ కార్డ్ బిల్లులు, కాల్ రికార్డులు, సీసీటీవీ ఫుటేజ్‌ల ద్వారా ఓహ్, లిం తరచూ కలుసుకుంటున్నట్లు అధికారులు కనిపెట్టారు.

శుక్రవారం కోర్టులో జరిగిన విచారణలో.."కోవిడ్ సమయంలో ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని చూస్తే ఓహ్ ఉద్దేశాలు స్వార్థపూరితమైనవని" జడ్జ్ పేర్కొన్నారని బ్రాడ్‌కాస్టర్ సీఎన్ఏ తెలిపినట్లుగా ఏఎఫ్‌పీ వార్తా సంస్థ ప్రచురించింది.

అంతే కాకుండా, కాంటాక్ట్ ట్రేసర్స్‌నుంచీ సమాచారాన్ని దాచి పెట్టడం "ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాదనే" సందేశాన్ని కోర్టు ప్రజలకు అందించవలసిన అవసరం ఉందని జడ్జ్ స్పష్టం చేశారు.

కాంటాక్ట్ ట్రేసింగ్ ప్రయత్నాలను అడ్డుకున్నట్లుగా ఓహ్ నేరాన్ని అంగీకరించారు.

2020 మార్చి-మే నెలల్లో కరోనావైరస్ వ్యాప్తిని సింగపూర్ చాలావరకు కట్టడి చేయగలిగింది. తరువాత, వలస కార్మికుల వసతి గృహాలలో కోవిడ్ అధికంగా వ్యాప్తి చెందడంతో పాజిటివ్ కేసులు పెరగడం మొదలైంది. ఇప్పటివరకూ సింగపూర్‌లో 60,000 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)