కరోనావైరస్: భోపాల్‌లో చెప్పకుండానే మనుషులపై కరోనా వ్యాక్సీన్ ట్రయల్స్...

కరోనావైరస్ వ్యాక్సీన్

ఫొటో సోర్స్, SOPA IMAGES

    • రచయిత, షురేహ్ నియాజీ
    • హోదా, బీబీసీ కోసం

మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ‘‘పీపుల్స్ హాస్పిటల్’’ అనే ప్రైవేట్ ఆసుపత్రిలో ముందస్తు సమాచారం ఇవ్వకుండానే కరోనా వ్యాక్సీన్ ట్రయల్స్ చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 1984లో గ్యాస్ విషాదం జరిగిన ప్రాంతానికి ఈ ఆసుపత్రి సమీపంలో ఉంది.

చోలా రోడ్‌లో నివసిస్తున్న 37 ఏళ్ల జితేంద్ర నర్వారియాను మంగళవారం పీపుల్స్ హాస్పిటల్‌లో చేర్చారు.

"నేను ఆ ఆసుపత్రికి వెళ్లేవరకు అక్కడ టీకాలు వేస్తున్నారన్న సంగతి నాకు తెలీదు. దీనివల్ల ఏవైనా సైడ్ ఎఫెక్టులు ఉంటాయా అని కూడా అడిగాను. అలాంటివేమీ ఉండవు. పైగా దీర్ఘకాలిక వ్యాధులన్నీ కూడా నయమైపోతాయని చెప్పారు" అని జితేంద్ర బీబీసీకి తెలిపారు.

కానీ తనకు టీకా వేసిన తరువాత పచ్చకామెర్లు వచ్చాయని, జలుబు, దగ్గు ఎక్కువైపోయాయని జితేంద్ర చెప్పారు. ప్రస్తుతం ఆయన పీపుల్స్ హాస్పిటల్‌లోనే చికిత్స పొందుతున్నారు.

టీకాలు వేసిన తరువాత ఇబ్బందుల పాలైనవారికి ఉచితంగా వైద్యం అందించకుండా అలాగే వదిలేశారని ఈ ఆసుపత్రి యాజమాన్యంపై ఆరోపణలు వస్తున్నాయి.

అయితే, ఈ ఆరోపణలన్నిటినీ పీపుల్స్ హాస్పిటల్ యాజమాన్యం తిరస్కరించింది.

శంకర్ నగర్‌లో నివసిస్తున్న హరి సింగ్‌కు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. టీకా ఇవ్వడం వలన ఎలాంటి సమస్యలూ తలెత్తవని, దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయని ఆస్పత్రి సిబ్బంది భరోసా ఇచ్చారని, తనకు కూడా టీకా వేశారని హరి సింగ్ చెప్పారు.

హరీ సింగ్

ఫొటో సోర్స్, Shuriah Niazi

ఫొటో క్యాప్షన్, హరీ సింగ్

సుమారు 700 మందిపై ట్రయల్స్

గ్యాస్ ప్రభావిత బస్తీల్లో నివసిస్తున్న 700 మందిపై కోవిడ్-19 వ్యాక్సీన్ ట్రయల్స్ చేశారని ఆరోపణలు వస్తున్నాయి.

ఈ ప్రాంతంలో నివసించేవారిని పీపుల్స్ హాస్పిటల్ వాహనాల్లో తీసుకొచ్చి టీకాలు వేసి పంపించారని ఆరోపణలు వచ్చాయి.

కోవిడ్ వ్యాక్సీన్ ట్రయల్స్ నిబంధనలను ఉల్లంఘించి వీరికి టీకాలు వేశారని గ్యాస్ బాధితుల కోసం పనిచేసే భోపాల్ గ్రూప్ ఫర్ ఇంఫర్మేషన్ అండ్ యాక్షన్‌కు చెందిన రచనా ఢింగ్రా ఆరోపిస్తున్నారు.

"వీరందరినీ వాహనాల్లో ఎక్కించుకుని తీసుకెళ్లారు. ఏమీ చెప్పకుండా ట్రయల్స్‌లో భాగంగా వీరికి కోవిడ్ టీకాలు ఇచ్చారు. దానికి ప్రతిగా ఒక్కొక్కరికీ రూ.750 ఇచ్చారు. టీకాలతో వచ్చిన ఆరోగ్య సమస్యలను ఏ మాత్రం పట్టించుకోకుండా వారి కర్మకు వారిని విడిచిపెట్టారు" అని రచన బీబీసీకి తెలిపారు.

ట్రయల్స్‌కు ముందుగా నింపిన పత్రం

ఫొటో సోర్స్, Shuriah Niazi

ఫొటో క్యాప్షన్, ట్రయల్స్‌కు ముందుగా నింపిన పత్రం

"అనుమతి తీసుకోకుండా టీకాలు వెయ్యడం హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుంది. పీపుల్స్ హాస్పిటల్‌కు దగ్గర్లోనే గ్యాస్ ప్రభావిత ప్రాంతాలు, భూగర్భజల ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయి. ఈ బస్తీల్లో నివసించేవారంతా పేద ప్రజలు" అని రచన చెప్పారు.

పేదవారు, చదవడం, రాయడం రాని వారి దగ్గర అనుమతి తీసుకోవడమే కాకుండా వారికి లాభాలు, నష్టాల గురించి పూర్తిగా వివరించి చెప్పాలని చట్టం చెబుతోంది.

"అలాంటిదేమీ ఇక్కడ జరగలేదు. వాహనాలు పంపించారు. కరోనా సోకకుండా టీకాలు వేస్తున్నాం...వేయించుకున్నందుకు రూ.750 ఇస్తామని ప్రకటించారు. ఇప్పుడు కాకుండా తరువాత టీకాలు కావాలంటే మీరు డబ్బులిచ్చి కొనుక్కోవలసి వస్తుందని చెప్పారు. ట్రయల్స్‌లో పాల్గొన్నవారికి తప్పనిసరిగా ఇవ్వాల్సిన అనుమతి పత్రం కాపీ కూడా ఇవ్వలేదు" అని రచన తెలిపారు.

ఆరోపణలను తిరస్కరించిన హాస్పిటల్

బస్తీ ప్రజల అనుమతి లేకుండా ఏ వ్యాక్సీన్ ట్రయల్స్ నిర్వహించలేదని పీపుల్స్ హాస్పిటల్ యాజమాన్యం చెబుతోంది.

నిబంధనల ప్రకారమే కోవిడ్ వ్యాక్సీన్ ట్రయల్స్ జరిగాయని, ఇవన్నీ తప్పుడు ఆరోపణలని పీపుల్స్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ రాజేష్ కపూర్ తెలిపారు.

"మొదట మేము వారికి అన్నీ వివరిస్తూ అరగంటపాటూ కౌన్సిలింగ్ ఇస్తాం. ఇది వ్యాక్సీన్ కాదు, ట్రయల్స్ మాత్రమే అని చెప్తాం. తరువాత అనుమతి పత్రం మీద సంతకం తీసుకున్నాకే టీకా ఇస్తాం. టీకా వేయించుకున్న రెండుసార్లూ అనుమతి పత్రం మీద ఆ వ్యక్తి సంతకం పెట్టవలసి ఉంటుంది. అనుమతి పత్రాలు, ఇతర పత్రాలు చూపించడం లేదని ఆరోపిస్తున్నారుగానీ భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం అనుమతి పత్రాలను మా ఆస్పత్రిలోనే భద్రపరిచాం. వాటిని గోప్యంగా ఉంచాలి. ఎవరితోనూ షేర్ చేసుకోకూడదు. ఎలాంటి ఓపెన్ ప్లాట్‌ఫాంలోనూ ఉంచకూడదు" అని రాజేష్ కపూర్ బీబీసీకి చెప్పారు.

వ్యాక్సీన్ ట్రయల్స్ నియమ నిబంధనలను పూర్తిగా పాటించామని ఆసుపత్రి యాజమాన్యం చెబుతోంది. ట్రయల్స్‌కోసం ఆస్పత్రికి సమీపంలో ఉన్నవారికి ప్రాధాన్యత ఇచ్చామని, అందుకే ఈ బస్తీ ప్రజలే ఎక్కువగా ట్రయల్స్‌లో పాల్గొన్నట్లు కనిపిస్తోందని వారంటున్నారు.

భోపాల్‌లోని పీపుల్స్ మెడికల్ కాలేజ్‌లో గత నెల ‘కోవాగ్జిన్’ ట్రయల్స్ ప్రారంభమయ్యాయి. అయితే, ఈ ట్రయల్స్‌లో పాల్గొనడానికి ఎక్కువమంది ఆసక్తి చూపలేదు. ప్రారంభంలో కొంతమంది రైతులు, డాక్టర్లు, టీచర్లు టీకాలు వేయించుకున్నారు.

మొదట టీకాలు వేయించుకుంటామని అంగీకరించిన అనేకమంది వలంటీర్లు తరువాత అందుకు సంసిద్ధత వ్యక్తం చేయలేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)