కరోనావైరస్: కోవాగ్జిన్‌కు అంత హడావిడిగా ఎందుకు ఆమోదం తెలిపారు?

కరోనావైరస్ వ్యాక్సీన్

ఫొటో సోర్స్, Reuters

    • రచయిత, సౌతిక్ బిశ్వాస్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

కరోనావైరస్ వ్యాక్సీన్‌ను అత్యవసరంగా ‘‘క్లినికల్ ట్రయల్ మోడ్’’లో లక్షల మందికి ఇచ్చేలా అనుమతులు ఎలా ఇస్తారు?

‘‘నాకైతే తెలియదు’’అని భారత్‌కు చెందిన ప్రముఖ వ్యాక్సీన్ నిపుణుడు గగన్‌దీప్ కాంగ్ వ్యాఖ్యానించారు.

‘‘మీరు క్లినికల్ ట్రయల్ అయినా చేపడుతూ ఉండాలి. లేదా నేరుగా వ్యాక్సీన్ ఇచ్చేస్తూ ఉండాలి’’అని ఆయన అన్నారు. క్లినికల్ ట్రయల్స్ మూడు దశల్లో జరుగుతాయి. వ్యాక్సీన్‌తో శక్తిమంతమైన రోగ నిరోధక స్పందనలు వస్తున్నాయా? ఏమైనా దుష్ప్రభావాలు ఉన్నాయా? లాంటి అంశాలు వీటిలో తేలుతుంది.

క్లినికల్ ట్రయల్స్ పూర్తికాకముందే, భారత్‌లో తయారుచేసిన వ్యాక్సీన్ ‘‘కోవాగ్జిన్’’కు భారత ఔషధ ప్రాధికార సంస్థ గత ఆదివారం ఆమోదం తెలిపింది.

ప్రభుత్వం మద్దతు ఇస్తున్న ఈ వ్యాక్సీన్‌ను భారత్ బయోటెక్ తయారుచేసింది. ఈ సంస్థకు వ్యాక్సీన్ల తయారీలో 24ఏళ్ల అనుభవముంది. 16 వ్యాక్సీన్లు తయారుచేస్తున్న ఈ సంస్థ.. 123 దేశాలకు వీటిని ఎగుమతి చేస్తోంది.

ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని అత్యవసరంగా కొన్ని వర్గాలకు ఇచ్చేందుకు ఈ వ్యాక్సీన్‌కు అనుమతులు ఇచ్చామని ఔషధ ప్రాధికార సంస్థ చెబుతోంది. కరోనావైరస్ కొత్త రకం కూడా వేగంగా వ్యాపిస్తున్న తరుణంలో క్లినికల్ ట్రయల్ మోడ్‌లోనే వ్యాక్సీన్ ఇవ్వాలని నిర్ణయించినట్లు సంస్థ తెలిపింది.

మరోవైపు ఆస్ట్రాజెనెకా, ఆక్స్‌ఫర్డ్ టీకాకు కూడా భారత్ ఆమోదం తెలిపింది.

మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగా ఇప్పటికే కోవాగ్జిన్‌ను వేల మందికి ఇచ్చారు. ఈ ట్రయల్స్ ఇంకా పూర్తికాలేదు.

కరోనావైరస్ వ్యాక్సీన్

ఫొటో సోర్స్, Reuters

ఈ వ్యాక్సీన్ సురక్షితమైనది, శక్తిమంతమైన రోగ నిరోధక స్పందనలను ఇది కలుగజేస్తోందని భారత ఔషధ ప్రాధికార సంస్థ చెబుతున్న మాటలు పరిశోధకులు, ఆరోగ్య నిపుణుల్లో ఆందోళనలను ఏ మాత్రం తగ్గించడంలేదు. ‘‘పరిశోధన పూర్తికాని వ్యాక్సీన్‌కు అనుమతులు ఇవ్వడం వెనకున్న ఆంతర్యం ఏమిటో మాకు అసలు అర్థం కావడంలేదు’’అని ఆల్ ఇండియా డ్రగ్ యాక్షన్ నెట్‌వర్క్ వ్యాఖ్యానించింది.

ప్రస్తుతం భారత్ బయోటెక్ 20 మిలియన్ డోసుల కోవాగ్జిన్‌ను సిద్దంచేసింది. ఈ ఏడాది చివరినాటికి రెండు నగరాల్లోని తమ సదుపాయాల సాయంతో 700 మిలియన్ల డోసులను సిద్ధం చేయగలమని సంస్థ చెబుతోంది.

తమ వ్యాక్సీన్ 200 శాతం సురక్షితమైనదని సంస్థ చైర్మన్ కృష్ణ ఎల్ల చెబుతున్నారు.

క్లినికల్ ట్రయల్ మోడ్‌లో తమకు ఇచ్చిన అనుమతులను ఆయన వెనకేసుకొని వచ్చారు.

‘‘భారత క్లినికల్ ట్రయల్ చట్టాల ప్రకారం.. రెండో దశ ట్రయల్స్ పూర్తయ్యాక కూడా అనుమతులు ఇవ్వచ్చు. దేశంలో ప్రాణాంతకమైన వ్యాధులు వ్యాపించేటప్పుడు ఇలాంటి అనుమతులు ఇస్తారు. మా వ్యాక్సీన్ క్రియాశీలంగాలేని కరోనావైరస్‌ సాయంతో తయారుచేశాం. చాలా వ్యాక్సీన్లను ఇలానే తయారుచేస్తారు. అందుకే మాకు అనుమతులు జారీ చేశారు’’అని ఆయన వివరించారు.

కోతులు, ఎలుకలపై చేసిన పరిశోధనల్లో కరోనావైరస్‌పై కోవాగ్జిన్ పోరాడగలుగుతోందని తేలినట్లు ఆయన చెప్పారు. మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగా 26,000 మంది వాలంటీర్లలో 24,000 మందికి ఇప్పటికే టీకాలు ఇచ్చారని పేర్కొన్నారు. ఫిబ్రవరి చివరినాటికి టీకా సామర్థ్యంపై డేటా కూడా అందుబాటులోకి వస్తుందని అన్నారు.

అయితే, పరిశోధకులు మాత్రం సందేహాలు వ్యక్తంచేస్తున్నారు. ‘‘మూడో దశ క్లినికల్ ట్రయల్స్ పూర్తికాలేదు కాబట్టి.. ఈ టీకా సామర్థ్యం గురించి మనకు తెలియదు. ఈ టీకా సురక్షితమైనది అయినంత మాత్రాన దీన్ని ప్రజలకు ఎక్కించలేం. కేవలం 50 శాతం సామర్థ్యంతో ఇది పనిచేస్తే ఉపయోగం ఏం ఉంటుంది?’’అని ప్రముఖ వైరాలజిస్టు డాక్టర్ షాహిద్ జమీల్ వివరించారు.

‘‘క్లినికల్ ట్రయల్ మోడ్’’లో వ్యాక్సీన్ ఇవ్వడం అంటే ఏమిటో, దీని ద్వారా ఏం చెప్పాలని అనుకుంటున్నారో అర్థం కావడంలేదు. మామూలు ట్రయల్స్‌లో అయితే, వాలంటీర్లకు వ్యాక్సీన్ ఇస్తున్నారో లేదా ప్లాసిబో ఇస్తున్నారో చెప్పరు. ఇతర అనారోగ్యాలతో బాధపడేవారికి కూడా వ్యాక్సీన్ ఇవ్వరు.

వ్యాక్సీన్లు తీసుకున్నాక వినియోగదారులను పర్యవేక్షిస్తామని కృష్ణ చెబుతున్నారు. ఇది వ్యాక్సినేషన్ రవాణా ఖర్చులను మరింత పెంచుతుంది.

కోవాగ్జిన్‌ను నాలుగో దశ క్లినికల్ ట్రయల్స్ తరహాలో ప్రజలకు ఇస్తున్నారా? అని ప్రశ్నించగా.. ‘‘దీన్ని క్లినికల్ ట్రయల్‌గా భావించాలో లేదో మాకు కూడా తెలియదు. కొంచెం సమయం ఇవ్వండి.. అన్నీ స్పష్టంగా తెలుస్తాయి’’అని కృష్ణ చెప్పారు.

కరోనావైరస్ వ్యాక్సీన్

ఫొటో సోర్స్, EPA

మరోవైపు కోవిడ్-19 టాస్క్ ఫోర్స్‌కు చెందిన సీనియర్ వైద్యుడు కోవాగ్జన్‌ను బ్యాకప్ వ్యాక్సీన్‌గా అభివర్ణించారు. కేసులు భారీగా పెరిగినప్పుడు ఈ వ్యాక్సీన్ ఉపయోగపడుతుందని అన్నారు. ‘‘అంటే.. కేసులు పెరిగితే.. సామర్థ్యం ఏమిటో తెలియని వ్యాక్సీన్‌ను ప్రజలకు ఇచ్చేస్తారా?’’అని ఒక సీనియర్ ఎపిడెమియాలజిస్ట్ ప్రశ్నించారు.

క్లినికల్ ట్రయల్స్‌ ఫ్రేమ్‌వర్క్‌లో ఉన్నప్పటికీ అత్యవసరంగా వ్యాక్సీన్లు ఇవ్వడం అంత అసాధారణమేమీ కాదని క్వీన్స్‌ల్యాండ్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ పాల్ గ్రిఫిన్ వివరించారు.

ఇదివరకటి ట్రయల్స్‌తోపాటు ప్రస్తుతం జరుగుతున్న ట్రయల్స్ నుంచి వచ్చే డేటా ప్రకారం వ్యాక్సీన్ సురక్షితం, శక్తిమంతమైనది తేలితే.. ఇలాంటి చర్యలు తీసుకుంటారు.

భారత్‌లో కరోనావైరస్ కేసులు కోటిని మించిపోయాయి. కేసుల పరంగా చూస్తే అమెరికా తర్వాత స్థానం భారత్‌దే. కరోనావైరస్ వ్యాప్తి నడుమ భారత్ ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. జనవరి నుంచి జులై మధ్య కాలంలో 30 కోట్ల మందికి టీకా ఇవ్వాలని భారత్ ప్రణాళికలు రచిస్తోంది. అయితే, కేసులు పెరగడం తగ్గిన తర్వాతే టీకా కార్యక్రమం మొదలవుతోంది. భారత్ బయోటెక్.. ఒక ప్రముఖ వ్యాక్సీన్ తయారీ సంస్థ. 20 దేశాల్లో 7 లక్షల మంది వాలంటీర్లపై క్లినికల్ ట్రయల్స్ చేపట్టిన అనుభవం సంస్థకు ఉంది.

అందుకే మరి కొన్ని వారాలు ఆగితే ఏమవుతుంది? అంత తొందర ఎందుకు?

కరోనావైరస్ వ్యాక్సీన్

ఫొటో సోర్స్, Getty Images

‘‘నాకైతే అసలు ఏమీ అర్థం కావడం లేదు’’అని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, ఎంపీ శశిథరూర్ వ్యాఖ్యానించారు.

‘‘నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం విషయానికంటే నినాదాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంది’’అని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘వ్యాక్సీన్ జాతీయవాదంతో ఆత్మనిర్భర భారత్ నినాదాన్ని కలిపి ఆలోచించే శక్తిని పక్కనపెట్టేశారు’’అని థరూర్ అన్నారు.

కొందరైతే సైన్స్ ప్రొటోకాల్స్‌ను పక్కనపెట్టేశారని, అనుమతుల జారీలో పారదర్శకత లేదని కూడా వ్యాఖ్యానించారు.

వ్యాక్సీన్ల తయారీకి భారత్ పవర్‌హౌస్ లాంటిది. ప్రపంచంలో 60 శాతం టీకాలు ఇక్కడే తయారవుతాయి. ప్రపంచంలో అతిపెద్ద టీకాల కార్యక్రమం కూడా భారత్‌లోనే జరుగుతోంది.

కోవాగ్జిన్ గందరగోళం భారత్‌కు చాలా పాఠాలు నేర్పిస్తోంది.

వైరస్ మరింత వేగంగా వ్యాపించేందుకు సిద్ధమవుతున్నప్పుడు చాలా వ్యాక్సీన్లు అవసరం అవుతాయి.

‘‘సురక్షితం, శక్తిమంతమని తేలాకే వ్యాక్సీన్లకు అనుమతి ఇవ్వాలి. అంతేకాకుండా ఎంత డోసు ఇవ్వాలి? ఎప్పుడు ఇవ్వాలి? అనే విషయాలు కూడా స్పష్టంగా తెలిజేయాలి’’అని పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు కే శ్రీనాథ్‌ రెడ్డి తెలిపారు.

‘‘ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని అన్ని ఆందోళనలు పరిష్కరించాలి. అప్పుడే అందరిలోనూ నమ్మకం పెరుగుతుంది. సందేహాలున్న వ్యాక్సీన్లు చేతిలో పెట్టుకొని వైరస్‌తో పోరాడలేం’’అని ఆయన వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)