ఎయిర్ ఇండియా మళ్లీ తన పాత యజమాని టాటా దగ్గరకు చేరుకోనుందా...

ఎయిర్ ఇండియా

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, సింధువాసిని
    • హోదా, బీబీసీ ప్రతినిధి

చరిత్ర పునరావృతం అవుతుందని చెబుతారు. ఎయిర్ ఇండియా చరిత్ర కూడా అలాగే అవుతుందా. 88 ఏళ్ల తర్వాత ఈ కంపెనీ మరోసారి తన పాత యజమాని దగ్గరికే చేరుకోబోతోందా?

భారీ నష్టాల్లో ఉన్న ఎయిర్ ఇండియాను కొనుగోలు చేయడానికి టాటా గ్రూప్ ఆసక్తి చూపిస్తోందని వార్తలు రావడమే దీనికి కారణం.

మీడియా కథనాల ప్రకారం టాటా గ్రూప్ ఈరోజు ఎయిర్ ఇండియా కొనుగోలుపై తమకు ఆసక్తి ఉందని ఒక ప్రతిపాదన చేయబోతోంది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

టాటా గ్రూప్ ఈరోజు ఎయిర్ ఇండియా కోసం 'ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్' దాఖలు చేయనుందని ఏఎన్ఐ చెప్పింది. దానికి ఈరోజు (డిసెంబర్ 14) ఆఖరు రోజు

భారత్‌లో టాటా గ్రూప్ ఇప్పటికే రెండు ఎయిర్ లైన్స్ నిర్వహిస్తోంది. వీటిలో ఒకటి సింగపూర్ ఎయిర్ లైన్స్, ఇంకొకటి ఎయిర్ ఏసియాతో జాయింట్ వెంచర్.

ఎయిర్ ఇండియాను వేలంలో దక్కించుకోడానికి టాటా గ్రూప్, సింగపూర్ ఎయిర్ లైన్స్ తో కలిసి ప్రణాళికలు సిద్ధం చేస్తోందని టైమ్స్ ఆఫ్ ఇండియా ఫ్రిబవరిలో ఒక కథనం ప్రచురించింది.

ఆ కథనంలో వివరాల ప్రకారం టాటా గ్రూప్, ఎయిర్ ఇండియాను కొనుగోలు చేయాలనే తమ ప్రతిపాదనకు తుది రూపం ఇవ్వడానికి దగ్గరలో ఉంది. అది సింగపూర్ ఎయిర్ లైన్స్ తో కలిసి కంపెనీని కొనుగోలు చేయడానికి సన్నాహాలు చేస్తోంది.

నేషనల్ కేరియర్ ఎయిర్ ఇండియాలో 100 శాతం వాటాను విక్రయించాలనే నిర్ణయం గురించి భారత ప్రభుత్వం ఇప్పటికే సూత్రప్రాయంగా ప్రకటించింది.

ఎయిర్ ఇండియా

ఫొటో సోర్స్, Getty Images

ఎయిర్ ఇండియాను టాటా కొనుగోలు చేయగలదా?

ఎయిర్ ఇండియాను కొనుగోలు చేయడానికి టాటా గ్రూప్ చాలా ఆసక్తి చూపుతున్నట్లు కనిపిస్తోందని మీడియా రిపోర్టుల్లో చెబుతున్నారు. కానీ నష్టాల్లో ఉన్న ఈ కంపెనీని టాటా కొనుగోలు చేయగలదా. దానికోసం అది ప్రభుత్వం అన్ని షరతులకూ అంగీకరించగలదా.

ప్రభుత్వం ఇంతకు ముందు కూడా ఎయిర్ ఇండియాను అమ్మే ప్రయత్నాలు చేసింది. కానీ, దానికి కొనుగోలుదారులెవరూ దొరకలేదు. దాంతో ప్రభుత్వం ఈసారీ ఎయిర్ లైన్స్ విక్రయ షరతుల్లో చాలా మార్పులు చేసింది. ప్రస్తుతం ఎయిర్ ఇండియాపై దాదాపు 60 వేల కోట్ల రూపాయల రుణాలు ఉన్నాయి. కానీ, డీల్ తర్వాత కొనుగోలుదారులు దాదాపు 23,286 కోట్ల రూపాయలే చెల్లించాల్సి ఉంటుంది.

మిగతా రుణాలను స్వయంగా ప్రభుత్వమే భరిస్తుంది. రుణాలు తగ్గించడానికి ప్రభుత్వం 'ప్రత్యేక రుణ విభాగం' రూపొందించింది. దానితోపాటూ ప్రభుత్వం ఇప్పుడు 76 శాతానికి బదులు మొత్తం 100 శాతం వాటాను విక్రయిస్తామనే ప్రతిపాదనతో వచ్చింది.

వీటితోపాటూ ఈసారీ కొనుగోలుదారులు ముందుకు వచ్చేలా ప్రభుత్వం మరికొన్ని షరతులు సడలించింది. కొనుగోలుదారులకు ఎవరికైనా ప్రస్తుత షరతులపై అభ్యంతరాలు ఉంటే, వాటిపై చర్చించడానికి సిద్ధంగా ఉన్నట్లు కూడా తెలిపింది.

విమాన సంస్థను టాటా గ్రూప్ కొనుగోలు చేసే అవకాశం ఉందని ఎయిర్ ఇండియా మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, 'డిసెంట్ ఆఫ్ ఎయిర్ ఇండియా' పుస్తక రచయిత జితేంద్ర భార్గవ్ అన్నారు.

ఎయిర్ ఇండియా

ఫొటో సోర్స్, Getty Images

కేంద్రం షరతుల ప్రకారం ఎయిర్ ఇండియా కొనుగోలుదారుడి నెట్ వర్త్ విలువ కనీసం 3500 కోట్లు ఉండడం తప్పనిసరి.

టాటా గ్రూప్ పరిస్థితి ఎయిర్ ఇండియాను కొనుగోలు చేయడానికి అనుకూలంగా ఉంది. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ప్రకారం టాటా సన్స్ ప్రైవేట్ లిమిటెండ్ నెట్ వర్త్ 6.5 ట్రిలియన్ రూపాయలని జితేంద్ర భార్గవ్ చెబుతున్నారు.

టాటా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రస్తుతం సింగపూర్ ఎయిర్ లైన్స్ తో కలిసి విస్తారా ఎయిర్ లైన్స్ నడుపుతోంది. ఈ జాయింట్ వెంచర్‌లో టాటాకు 51, సింగపూర్ ఎయిర్ లైన్స్ కు 49 శాతం వాటా ఉంది.

భారత్‌లో విస్తారా ఇప్పుడు చిన్న ఎయిర్ లైన్స్ లో ఒకటిగా ఉంది. మార్కెట్ షేర్‌ను బట్టి చూస్తే ఇండిగో, స్పైస్ జెట్, ఎయిర్ ఇండియా, గో ఎయిర్ తర్వాత విస్తారా ఉంది. ఇక ఆ సంస్థ ఎయిర్ ఏసియా ఇండియా కూడా చిన్న ఎయిర్ లైన్. విమానయాన రంగంలో ముందుకెళ్లాలంటే టాటా గ్రూప్‌కు ఎయిర్ ఇండియా కొనుగోలు ఒక మంచి ప్రత్యామ్నాయం అని నిరూపితం కావచ్చు.

అప్పుల విషయాన్ని కాసేపు పక్కనపెడితే, ఎయిర్ ఇండియాకు చాలా బలమైన అనుకూలతలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు దాని దగ్గర మంచి ఏరోనాటికల్ ఆస్తులు ఉన్నాయి. అంటే మంచి విమానాలు, సుశిక్షితులైన పైలెట్లు, ఇంజనీర్లు, ఇతర నిపుణులు ఉన్నారు. ఈ సంస్థకు ప్రపంచంలో చాలా నగరాల్లో స్లాట్స్ ఉన్నాయి. ఇవి కాకుండా, ఎయిర్ ఇండియాకు అంతర్జాతీయ మార్కెట్లో దాదాపు 18 శాతం, జాతీయ మార్కెట్‌ దాదాపు 13 శాతం షేర్స్ ఉన్నాయి. వీటన్నిటినీ చూస్తే టాటా గ్రూప్ పరిస్థితి చాలా మెరుగ్గా ఉంటుంది.

కంపెనీ వెబ్‌సైట్‌లో సమాచారం ప్రకారం గత ఆర్థిక సంవత్సరంలో దాని రెవెన్యూ 729,710 కోట్లు. అదే 2019 మార్చి 31న టాటా గ్రూప్ మార్కెట్ కేపిటల్ 1,109,809 కోట్లు ఉంది.

ఈ డీల్ కుదిరితే టాటా అండ్ సన్స్ కు చాలా లాభసాటి ఒప్పందం అవుతుంది అంటారు భార్గవ్.

టాటా

ఫొటో సోర్స్, Tata Steel Archive

ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ కోసం వేరే కొనుగోలుదారులా

ఎయిర్ ఇండియాతోపాటూ, దాని లో కాస్ట్ సబ్సిడరీ ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ 100 శాతం వాటా కూడా అమ్మేయాలని కేంద్రం భావిస్తోంది. కానీ ఈ రెండింటినీ వేరు వేరు సంస్థలు కొనుగోలుదారులు చేయవచ్చా.

ఈ రెండు సంస్థలను రెండు వేరు వేరు కంపెనీలు కొనుగోలు చేయడం సాధ్యం కాదని ఏవియేషన్ నిపుణులు చెబుతున్నారు.

"ఈ డీల్ ఒక ప్యాకేజ్‌లా ఉంటుంది. ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ రెండింటినీ కొనుగోలు చేయాల్సి ఉంటుంది" అని ద హిందూ బిజినెస్ లైన్ సీనియర్ జర్నలిస్ట్ అశ్విని ఫడ్నిస్ చెప్పారు.

రెండు విమాన సంస్థల కొనుగోలుదారులు ఒకరే ఉండాలని ప్రభుత్వం తమ షరతులలో స్పష్టంగా చెప్పింది.

ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఎయిర్ ఇండియా సంస్థలా, ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ నష్టాల్లో లేదు. దక్షిణ భారత నగరాల నుంచి మధ్యప్రాచ్యం, గల్ఫ్ దేశాల్లో సేవలతో ఈ లోకాస్ట్ ఎయిర్ లైన్ ప్రాచుర్యం పొందింది.

అలాంటప్పుడు, ఎయిర్ ఇండియాను కొనుగోలు చేసే ఒక సంస్థ, ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్‌ను తన చేజారనివ్వదు అని స్పష్టంగా చెప్పచ్చు.

ప్రభుత్వ టెండర్

ఫొటో సోర్స్, GoI

ఫొటో క్యాప్షన్, ప్రభుత్వ టెండర్

పెట్టుబడుల ఉపసంహరణ-ప్రభుత్వం షరతులు

  • ప్రభుత్వం ఎయిర్ ఇండియాలో 100 శాతం వాటా అమ్మేస్తుంది. అంటే పెట్టుబడుల ఉపసంహరణ తర్వాత ప్రభుత్వం దగ్గర విమాన సంస్థకు సంబంధించి ఎలాంటి వాటా ఉండదు.
  • ఎయిర్ ఇండియా ఆపరేషన్ ఆస్తులు అసెట్స్ అమ్ముతారు. రియల్ అసెట్స్ కాదు. అంటే ప్రభుత్వం విమానాలు, కంపెనీ నిర్వహణను కొనుకోలుదారుడికి అప్పగిస్తుంది. కానీ దిల్లీ, ముంబయిలో ఉన్న ఎయిర్ ఇండియా కార్యాలయాలు వేలం పరిధికి బయట ఉన్నాయి. అయితే, కొనుగోలు తర్వాత కొనుగోలుదారులు కొంతకాలం పాటు ఈ కార్యాలయాల్లో పనిచేసుకోడానికి అనుమతి ఉంటుంది.
  • కొనుగోలు చేసే కంపెనీలు ఎయిర్ ఇండియా పేరును ప్రస్తుతానికి మార్చలేవు. అంటే పెట్టుబడుల ఉపసంహరణ తర్వాత కూడా ఎయిర్ లైన్ పేరు 'ఎయిర్ ఇండియా' అనే ఉంటుంది.
  • కొనుగోలుదారులు ఎయిర్ ఇండియాతోపాటూ, ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ కూడా కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
ఎయిర్ ఇండియా

ఫొటో సోర్స్, Getty Images

ఎయిర్ ఇండియా సిబ్బంది పరిస్థితి ఏంటి?

ఎయిర్ ఇండియాను ఏదైనా కంపెనీ కొనుగోలు చేస్తే, తర్వాత దాని ఉద్యోగుల భవిష్యత్తు ఏంటి అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఈ అమ్మకం ఏదైనా ప్రభుత్వ కంపెనీ అయితే ఆ ప్రశ్న ఇంకా తీవ్రం అవుతుంది.

ఎయిర్ ఇండియాలో ముఖ్యమైన విషయం, దీనిలోని యూనియన్లను చాలా బలమైనవిగా భావిస్తారు. సంస్థ ప్రైవేటీకరణను ఇవి వ్యతిరేకిస్తున్నాయి.

ఎయిర్ ఇండియా పెట్టుబడుల ఉపసంహరణ విషయంలో ఉద్యోగుల సందేహాలను దూరం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉండడానికి కారణం ఇదే.

ఉద్యోగుల పట్ల జాగ్రత్తలు తీసుకుంటామని, వారికి తగిన భద్రత కల్పిస్తామని ప్రభుత్వ చెబుతోంది.

ఎయిర్ లైన్ ఉద్యోగులు వీఆర్ఎస్ ప్యాకేజ్ డిమాండ్ చేస్తున్నారు.

"ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పనితీరులో చాలా తేడాలు ఉంటాయి. పైలెట్లు, ఇంజనీర్లు, కాబిన్ క్రూ లాంటి అర్హులైన, అనుభవజ్ఞులైన సిబ్బంది అవసరం, ఎయిర్ ఇండియాను కొనుగోలు చేసేవారికి కూడా ఉంటుంది" అంటారు జితేంద్ర భార్గవ్.

సంస్థలో అవసరానికి మించి ఉద్యోగులు లేరని ఎయిర్ ఇండియా చెబుతోంది. కానీ భార్గవ్ మాత్రం ఉద్యోగం పోతుందనే భయం అందరికీ ఉంటుందని చెబుతున్నారు. ఎందుకంటే, ఎయిర్ ఇండియాలో ఎక్కువ భాగం కాంట్రాక్టు ఉద్యోగులే ఉన్నారు. సంస్థ అమ్ముడైపోతే తమ ఉద్యోగాలు పోతాయని వారంతా భయపడుతున్నారని చెప్పారు.

అయితే, ఏవియేషన్ నిపుణులు హర్షవర్ధన్ ఆయనతో ఏకీభవించడం లేదు. "ప్రస్తుతం యూనియన్లకు ఇంతకు ముందులా ప్రాధాన్యం గానీ, బలంగానీ లేదు. పరిస్థితి ఇంతకు ముందులా ఉండుంటే సంస్థలో 100 శాతం వాటా అమ్మేస్తున్నందుకు యూనియన్లు రహదారులపైకి వచ్చుండేవి" అన్నారు.

"పైలెట్లు, ఇంజనీర్లు, కేబిన్ క్రూలకు కొత్త కంపెనీల్లో ఉద్యోగాలు లభిస్తాయి. మార్కెట్లో చాలా డిమాండ్ ఉండడంతో కాంట్రాక్టు టెక్నీషియన్స్ కు పెద్దగా ఇబ్బంది లేదు. వారికి వేరే సంస్థల్లో పనిచేయడానికి చాలా అవకాశాలు దొరుకుతాయి. ఎయిర్ ఇండియాలో టెక్నికల్ స్టాఫ్‌కు జీతాలు ఆలస్యం అవుతుండడంతో ఇబ్బందుల్లో ఉన్నారు. వేరే సంస్థల్లో అవకాశాలు వస్తే వారు సంతోషంగా వెళ్తారు" అని చెప్పారు.

ఎయిర్ ఇండియా

ఫొటో సోర్స్, Getty Images

టాటా ముందున్న సవాళ్లు ఏంటి?

టాటా గ్రూప్ ఎయిర్ ఇండియాను కొనుగోలు చేస్తే, తగ్గింపు తర్వాత కూడా అది దాదాపు 23,500 కోట్లు చెల్లించాలి. దానితోపాటూ తగ్గుతూ వస్తున్న ప్రయాణికుల సంఖ్యను పెంచడానికి అది బలమైన వ్యూహం సిద్ధం చేయాలి.

పడిపోతున్న వైమానిక రంగం 'ఆపరేషనల్ లాస్‌' మరింత పెంచింది. ఇప్పుడు విమాన ఇంధనం కోసం చాలా ఖర్చుచేయాల్సి వస్తోంది. దానికి కూడా సిద్ధంగా ఉండాలి.

ఇవి కాకుండా ఎయిర్ ఇండియా కొనుగోలు కోసం టాటా ఎదుట టెక్నికల్ అడ్డంకులు కూడా ఉన్నాయి. ఎయిర్ ఏసియా ఇండియాలో దానికి 51 శాతం వాటా ఉంది. మరో వాటాదారు అయిన టోనీ ఫెర్నాండెజ్‌తో చేసుకున్న ఒప్పందంలో వేరే బడ్జెట్ లేదా లో కాస్ట్ ఎయిర్ లైన్స్ లో టాటా 10 శాతం కంటే ఎక్కువ పెట్టుబడులు పెట్టకూడదనే ఒక నిబంధన కూడా ఉంది. ఎక్కువ పెట్టుబడులకు దానికి టోనీ ఫెర్నాండెజ్ అనుమతి తప్పనిసరి.

ఎయిర్ ఇండియా సబ్సిడరీ ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ ఒక బడ్జెట్ ఎయిర్ లైన్ కాబట్టి, ప్రభుత్వ షరతుల ప్రకారం ఎయిర్ ఇండియాతోపాటూ దానిని కూడా కొనాలి కాబట్టి, టాటా వంద శాతం వాటా కొనుగోలు చేయాలంటే తన వాటాదారుడి అనుమతి తీసుకోవాలి

అలా చేయకపోతే, టాటా ఈ డీల్ చేసుకోవడం దాదాపు అసాధ్యం. మరోవైపు ఎయిర్ ఏసియా బోర్డులో టాటా నామినీ ఆర్.వెంకటరమన్, ఎయిర్ ఇండియా మరో వాటాదారుడు టోనీ ఫెర్నాండెజ్‌ల నేరపూరిత కుట్ర, మనీ లాండరింగ్ కేసులు నడుస్తున్నాయి. ఈడీ వారికి సమన్లు కూడా పంపింది.

ఎయిర్ ఏసియా ఇండియా, సింగపూర్ ఎయిర్ లైన్స్ తో కలిసి టాటా ఎయిర్ ఇండియా వేలంలో పాల్గొంటుందా లేదా అనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు.

ఎయిర్ ఇండియా విమానం

ఫొటో సోర్స్, Getty Images

ఎయిర్ ఇండియా, టాటా గ్రూప్ అలనాటి బంధం

ప్రముఖ పారిశ్రామిక వేత్త జేఆర్డీ టాటా భారత్‌కు స్వాతంత్ర్యం రాక ముందే టాటా ఎయిర్ లైన్స్ స్థాపించారు.

1933 టాటా ఎయిర్ లైన్స్ మొదటి ఆర్థిక సంవత్సరం. బ్రిటన్ రాజ పరివారానికి చెందిన 'రాయల్ ఎయిర్ ఫోర్స్' పైలెట్ హోమీ భరూచా టాటా ఈ ఎయిర్ లైన్స్ మొదటి పైలెట్‌గా పనిచేశారు. తర్వాత జేఆర్డీ టాటా, విన్సెంట్ దీనికి రెండో, మూడో పైలెట్‌గా ఉన్నారు.

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత విమాన సేవలను పునరుద్ధరించినపుడు 1946 జులై 29న టాటా ఎయిర్ లైన్స్ 'పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ'గా మారింది. తన పేరును 'ఎయిర్ ఇండియా లిమిటెడ్‌' అని మార్చింది. స్వతంత్రం వచ్చిన తర్వాత 1947లో టాటా ఎయిర్ లైన్స్ లో 49 శాతం వాటాను ప్రభుత్వం కొనుగోలు చేసింది. 1953లో దానిని జాతీయం చేశారు.

తమ ఎయిర్‌లైన్‌ అందించే సేవలు, దాని కార్యకలాపాల నాణ్యతను జేఆర్డీ టాటా ముఖ్యంగా చెప్పేవారని అశ్విని ఫడ్నీస్ చెప్పారు.

స్వాతంత్ర్యానికి ముందు జేఆర్డీ టాటా తమ సిబ్బందికి శిక్షణ ఇప్పించడానికి అమెరికా నిపుణులను పిలిపించారు. టాటా ఎయిర్ లైన్స్ ఉనికిలోకి వచ్చాక బ్రిటిష్ ఎయిర్ వేస్, ఎయిర్ ఫ్రాన్స్ లాంటి ప్రముఖ విదేశీ విమాన సంస్థలతో పోటీపడి తన స్థానం సుస్థిరం చేసుకుంది. పెద్ద పెద్ద విమాన సంస్థలకే సవాలుగా నిలిచిన టాటా ఎయిర్ లైన్స్, విమాన సేవల్లో తాము ఏం తక్కువ కాదని చూపించింది.

టాటా గ్రూప్ ఎయిర్ ఇండియాను కొనుగోలు చేస్తే, దానిని తిరిగి పాత రూపంలోకి తీసుకురావడానికి సంస్థకు ఒక లాయల్టీ ఫ్యాక్టర్ కూడా ముడిపడి ఉంటుందని నిపుణులు అంటున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)