రైతు ఉద్యమాన్ని మావోయిస్టు, నక్సల్ శక్తులు నడిపిస్తున్నాయి: కేంద్రమంత్రి పీయూష్ గోయల్

పీయూష్ గోయల్

ఫొటో సోర్స్, @PiyushGoyal

కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఆందోళన చేస్తున్న రైతుల ఉద్యమంలో మావోయిస్టు, నక్సల్ శక్తులు లేకపోయినట్లయితే.. రైతులు ప్రభుత్వాన్ని కచ్చితంగా అర్థంచేసుకుని ఉండేవారని రైల్వేమంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యానించారు.

ఆయన శనివారం ఏఎన్ఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ.. కొత్త చట్టాలు తమకు, దేశానికి ప్రయోజనకరమని రైతులు తెలుసుకుంటారని పేర్కొన్నారు.

రైతులకు ఇంకా ఏమైనా సందేహాలుంటే.. వారికి భారత ప్రభుత్వం తలుపులు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయని.. ప్రతి అంశాన్నీ, ప్రతి నిబంధననూ చర్చించవచ్చునని గోయల్ చెప్పారు.

''ఈ ఉద్యమం రైతుల చేతుల్లో నుంచి జారిపోయి ఉంటుందని మాకు తెలుసు. మావోయిస్టు, నక్సల్ శక్తులు ఈ ఉద్యమాన్ని భుజానమోసి నడిపిస్తున్నాయి'' అన్నారాయన.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

''నాయకులు తమ బాగోగులు చూసుకుంటారని ప్రతి ఒక్కరూ నమ్ముతారు. కానీ ఇక్కడ అటువంటి నాయకులెవరూ లేరేమో. నక్సలైట్లు ఒక భయావహ వాతావరణం సృష్టించారు. రైతు నాయకులు అసలు సమస్యల గురించి మాట్లాడాలని భావించినా వారికి ఆ ధైర్యం రావటం లేదు.. ఎందుకంటే వారిని భయపెడుతున్నారు'' అని రైల్వేమంత్రి పేర్కొన్నారు.

''రైతుల మీద తమకు విశ్వాసం ఉందని మంత్రి చెప్పారు. ''రైతులు శాంతికాముకులు. మన అన్నదాతలు. మేం వారిని గౌరవిస్తాం. మావోయిస్టులు, నక్సలైట్లు దేశ ప్రజలను ప్రభావితం చేయటానికి వారు అంగీకరించరని మాకు నమ్మకముంది'' అని వ్యాఖ్యానించారు.

line

ఇరాన్: ప్రభుత్వంపై అసమ్మతి రగిలిస్తున్నారంటూ.. జర్నలిస్ట్‌కు ఉరిశిక్ష అమలు

రుహల్లా జామ్

ఫొటో సోర్స్, Reuters

ఒక మెసేజింగ్ యాప్ ఉపయోగిస్తూ ప్రభుత్వంపై అసమ్మతి రగిలిస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న జర్నలిస్టుకు ఇరాన్ మరణ శిక్ష అమలు చేసింది.

రుహల్లా జామ్‌కు విధించిన మరణ శిక్షను అక్కడి సుప్రీంకోర్టు సమర్థించిన తరువాత శనివారం ఆయన్ను ఉరి తీసినట్లు స్థానిక టీవీ వెల్లడించింది.

ఫ్రాన్స్‌కు ప్రవాసం వెళ్లిన జామ్ ఎలా అరెస్టయ్యారన్న విషయంలో స్పష్టత లేదు. గత ఏడాది ఆయన ఇరాక్ రాగా అరెస్టు చేసినట్లు వార్తలున్నాయి.

ప్రభుత్వ వ్యతిరేక వేదికగా ఆయన అమాద్ న్యూస్ అనే వెబ్‌సైట్ నిర్వహించేవారు.

2017-18లో దేశవ్యాప్తంగా జరిగిన నిరసనలను అమాద్ న్యూస్ ప్రేరేపించిందన్నది ఇరాన్ ఆరోపణ.

మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్‌లో 10 లక్షలకు పైగా ఫాలోవర్లున్న అమాద్ న్యూస్ నిరసనలకు సంబంధించిన వీడియోలు, ఇరాన్ అధికారులకు వ్యతిరేకంగా సమాచారం అందులో షేర్ చేసేవారు.

రుహల్లా జామ్

ఫొటో సోర్స్, @Rohoolah_Zam on Twitter

ఈ గ్రూపును ఇరాన్ అధికారులు మూసివేయించినప్పటికీ ఆ తరువాత వేరే పేరుతో మళ్లీ మొదలైంది.

సంస్కర్త, మతగురువు అయిన మొహమ్మద్ అలీ జామ్ కుమారుడైన రుహల్లా జామ్‌ను 'కరప్షన్ ఆన్ ది ఎర్త్' కేసులో దోషిగా తేల్చారు. ఈ ఏడాది ప్రారంభంలో ఇరాన్‌లో అత్యంత తీవ్ర అభియోగాలు నమోదైన కేసు ఇది.

బలవంతంగా నేరాలు అంగీకరించేలా చేసి జామ్‌ను బాధితుడిని చేశారని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఆరోపించింది.

రుహల్లా జామ్‌కు విధించిన మరణశిక్షను సుప్రీంకోర్టు ఖరారు చేయడాన్ని ఫ్రాన్స్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తప్పుపట్టింది. ఇరాన్‌లో మీడియాస్వేచ్ఛ, భావప్రకటన స్వేచ్ఛలపై జరిగిన దాడిగా అభివర్ణించింది.

2009లో వివాదాస్పద ఇరాన్ అధ్యక్ష ఎన్నికల తరువాత రుహల్లా జామ్ జైలు జీవితం గడిపారు. ఆ తరువాత ఫ్రాన్స్‌లో ఆశ్రయం పొందారు.

కాగా ఫ్రాన్స్, ఇజ్రాయెల్, అమెరికాల ఇంటెలిజెన్స్ సర్వీసులు రక్షణలో ఉంటూ, వారి మార్గదర్శకత్వంలో జామ్ పనిచేస్తున్నారని 'ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్' గతంలో ఆరోపించింది.

line

అమెరికాలో రెండు రోజుల్లో ఇద్దరికి మరణశిక్ష అమలు.. ట్రంప్ దిగిపోయే లోగా మరో ముగ్గురికి

ఆల్ఫ్రెడ్ బౌర్గీస్‌

ఫొటో సోర్స్, CBS

ఫొటో క్యాప్షన్, తన రెండేళ్ల కూతురిని చంపినందుకు ఆల్ఫ్రెడ్ బౌర్గీస్‌‌కు మరణశిక్ష అమలుచేశారు

ఇరవై ఏళ్ల కిందట తన రెండేళ్ల కూతురిని దారుణంగా హత్య చేశాడన్న ఆరోపణలపై ఆల్ఫ్రెడ్‌ బౌర్గీస్‌ అనే నిందితుడికి అమెరికా న్యాయస్థానం శుక్రవారం నాడు మరణశిక్షను అమలు చేసింది.

ఇద్దరు వ్యక్తులను చంపిన కేసులో గురువారం నాడు బ్రాండన్‌ బెర్నార్డ్‌ అనే 40 ఏళ్ల వ్యక్తికి మరణశిక్షను అమలు చేసిన అధికారులు, శుక్రవారం నాడు బౌర్గీస్‌కు విషపు ఇంజెక్షన్‌ ద్వార శిక్షను అమలు చేశారు.

అమెరికాలో 17 ఏళ్ల కిందటే మరణ దండనను నిలిపేయగా, అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌ ఆ శిక్షను పునరుద్ధరించారు. ఆయన జనవరి 20న అధ్యక్షపీఠం నుంచి దిగిపోయేలోగా మరో ముగ్గురికి మరణశిక్షలు కానున్నాయి.

ఈ ముగ్గురికి కూడా శిక్షను అమలు చేస్తే వందేళ్ల తర్వాత అత్యధిక మరణశిక్షలను అమలు చేసిన అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌ చరిత్రకెక్కుతారు.

బ్రాండన్‌ బెర్నార్డ్‌

ఫొటో సోర్స్, Bernard Defense Team

ఫొటో క్యాప్షన్, బ్రాండన్‌ బెర్నార్డ్‌‌కు గురువారం నాడు మరణశిక్ష అమలుచేశారు

ఈ శిక్షల అమలుతో అధ్యక్షుడిగా పదవి నుంచి వెళ్లబోయే ముందు మరణ శిక్షలను నిలిపేసే సంప్రదాయాన్ని 130 ఏళ్ల తర్వాత పక్కనపెట్టిన చరిత్ర కూడా ట్రంప్‌ పేరిట నిలిచిపోతుంది.

డెలావేర్‌కు సెనెటర్‌గా ఉన్న కాలంలో మరణ శిక్షలను సమర్ధించిన కాబోయే అధ్యక్షుడు జో బైడెన్‌, తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ శిక్షలను నిలుపుదల చేస్తానని ఇటీవల చెప్పారు.

బౌర్గీస్ తన రెండేళ్ల కూతురును హత్య చేయడానికి ముందు ఆమెను భౌతికంగా, లైంగికంగా హింసించాడని కోర్టు తన తీర్పులో పేర్కొంది.

అయితే బౌర్గిస్‌ మానసిక ఆరోగ్యం ఏమాత్రం బాగాలేదని, అతనికి ఈ శిక్ష నుంచి విముక్తి కల్పించాలని న్యాయవాదులు కోరినా, కోర్టు అందుకు అంగీకరించలేదు.

మరణశిక్షను ఎదుర్కొంటున్నవారి జాబితాలో ఉన్న లీసా మాంట్‌గోమరి

ఫొటో సోర్స్, REUTERS

ఫొటో క్యాప్షన్, మరణశిక్షను ఎదుర్కొంటున్నవారి జాబితాలో ఉన్న లీసా మాంట్‌గోమరి

మరణశిక్షను ఎదుర్కొంటున్న మరో ముగ్గురు

లీసా మాంట్‌గోమరీ: 2004 సంవత్సరంలో ఓ మహిళ కడుపులో ఉన్న బిడ్డను కిడ్నాప్‌ చేసేందుకు ఆమెను దారుణంగా హత్య చేసిన ఆరోపణలతో లీసా శిక్షను ఎదుర్కొంటున్నారు. అయితే ఆమె మానసిక పరిస్థితి సరిగా లేదని లాయర్లు కోర్టులో వాదించారు. అమెరికాలో 130 ఏళ్ల తర్వాత మరణ శిక్షను ఎదుర్కొంటున్న తొలి మహిళ లీసా మాంట్‌గోమరి.

కారీ జాన్సన్‌ : వర్జీనియాలో అక్రమంగా మాదక ద్రవ్యాలను అమ్మే కారీ జాన్సన్‌ ఏడుగురిని హత్య చేశాడని ఆరోపణలు ఎదుర్కొన్నారు. జనవరి 14న ఆయనకు మరణశిక్షను అమలు చేయబోతున్నారు.

డస్టిన్‌ జాన్‌ హిగ్స్‌: వాషింగ్టన్‌ డీసీ ప్రాంతంలో ముగ్గురు యువతుల కిడ్నాప్‌, హత్యకు కారణమైనట్లు జాన్‌ హిగ్స్‌ మీద ఆరోపణలున్నాయి. అయితే హిగ్స్‌ స్వయంగా హత్య చేయకపోయినా, తన సహచరుడిని అందుకు ప్రేరేపించారని అభియోగాలు నమోదయ్యాయి. హత్య చేయాల్సిందిగా హిగ్స్‌ తన సహచరుడిని బెదిరించలేదని అతని లాయర్లు వాదించారు. జనవరి 15న హిగ్స్‌కు శిక్ష అమలు కాబోతోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)