పరాంత్రోపస్ రోబస్టస్: 20 లక్షల ఏళ్ల కిందటి మన ‘కజిన్’ పుర్రె లభ్యం.. తవ్వకాల్లో వెలుగులోకి

ఫొటో సోర్స్, LA TROBE UNIVERSITY
దక్షిణాఫ్రికాలో 20 లక్షల ఏళ్ల నాటి మానవ కపాలం తవ్వకాల్లో బయటపడిందని ఆస్ట్రేలియా పరిశోధకులు తెలిపారు. మానవ పరిణామక్రమం గురించి ఈ పుర్రె మరిన్ని విషయాలు తెలియజేయగలదని ఆశిస్తున్నారు.
దీన్ని ‘పరాంత్రోపస్ రోబస్టస్’ అనే జాతికి చెందిన మగ జీవి పుర్రెగా గుర్తించారు.
పరాంత్రోపస్ రోబస్టస్ జాతిని, ఆధునిక మానవులకు పూర్వీకులైన ‘హోమో ఎరక్టస్’ జాతికి ‘కజిన్స్’గా చెప్పుకోవచ్చు.
ఈ రెండు జాతులూ ఒకే కాలంలో మనుగడ సాగించాయి. కానీ పరాంత్రోపస్ రోబస్టస్ జాతి ముందుగా అంతరించిపోయింది.
"సాధారణంగా తవ్వకాల్లో దొరికే అవశేషాల్లో ఒకటో, రెండో పళ్లు లేదా దంతాలు అక్కడా ఇక్కడా దొరుకుతాయి. కానీ ఇలా పుర్రె మొత్తం దొరకడం అరుదు"అని డా. ఏంజలిన్ లీస్ బీబీసీకి తెలిపారు.

ఫొటో సోర్స్, LA TROBE UNIVERSITY
మెల్‌బోర్న్‌లోని లా ట్రోబ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధనా బృందానికి 2018లో ఉత్తర జోహన్నెస్‌బర్గ్‌లోని డ్రిమోలెన్ పురావస్తు ప్రదేశంలో ఈ పుర్రె లభ్యమయ్యింది.
2015లో ఇదే ప్రాంతానికి కొన్ని మీటర్ల దూరంలో సుమారు 20 లక్షల సంవత్సరాల నాటి హోమో ఎరక్టస్ జాతికి చెందిన చిన్న పిల్ల పుర్రె దొరికింది.
2018లో ఈ పుర్రె దొరికిన దగ్గర నుంచీ దీనిపై పరిశోధనలు చేస్తూ, అవశేషాలను విశ్లేషించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీరి పరిశోధనా ఫలితాలు ‘నేచర్, ఎకోలజీ అండ్ ఎవల్యూషన్ జర్నల్’లో మంగళవారం ప్రచురించారు.
"అవశేషాలతో చాలా జాగ్రత్తగా, సున్నితంగా వ్యవహరించాలి. ఈ పుర్రెపై ఉన్న దుమ్మును పూర్తిగా తొలగించడానికి ప్లాస్టిక్ స్ట్రాలను వాడాల్సి వచ్చింది"అని పరిశోధకులు జెస్సి మార్టిన్ తెలిపారు.

ఫొటో సోర్స్, LA TROBE UNIVERSITY
పోటీ పడుతూ మనుగడ సాగించిన జాతులు
దక్షిణాఫ్రికాలో ఒకే కాలంలో మూడు రకాల ‘హోమినిన్స్’ (మానవుల్లాంటి జీవులు) ఒకదానితో ఒకటి పోటీ పడుతూ మనుగడ సాగించి ఉంటాయని పరిశోధకులు భావిస్తున్నారు.
“ఒకే జాతిలో జరిగిన పరిణామానికి సూచనగా ఈ పుర్రె కనిపిస్తోంది. ఇది చాలా అరుదైన విషయం”అని మార్టిన్ తెలిపారు.
పరాంత్రోపస్ రోబస్టస్ జాతి జీవులకు పెద్ద పెద్ద పళ్లు, దంతాలు, చిన్న మెదడు ఉండేది. కానీ హోమో ఎరక్టస్ జాతికి పెద్ద మెదడు, చిన్న పళ్లు ఉండేవి.
పరాంత్రోపస్ రోబస్టస్ జాతి ఎక్కువగా శాకాహారమే తినేదని, కఠనమైన వృక్ష జాతికి చెందిన ఆహారాన్నే తీసుకుని ఉండొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.
పరిణామ క్రమంలో కఠినమైన పదార్థాలను కొరికి, నమిలి తినడానికి వీలుగా ఉండేలా పరాంత్రోపస్ రోబస్టస్ జాతికి పెద్ద పెద్ద దంతాలు ఏర్పడి ఉంటాయని డా. లీస్ అభిప్రాయపడ్డారు.
అయితే, చిన్న దంతాలున్న హోమో ఎరక్టస్ జాతి.. శాకాహారం, మాంసాహారం కూడా తీసుకుని ఉండేవని పరిశోధకులు భావిస్తున్నారు.
ఈ రెండు జాతుల మధ్య కూడా చాలా వ్యత్యాసాలు ఉండేవని, అందుకే వాటి పరిణామక్రమం విభిన్నంగా సాగిందని డా. లీస్ తెలిపారు.
‘‘చివరికి పోటీ జీవితంలో హోమో ఎరక్టస్ జాతి నిలదొక్కుకుని ఆధునిక మానవులుగా పరిణామం చెందింది. కానీ ఈ పుర్రె ఆధారంగా ఆ కాలంలో ఈ భూమి మీద పరాంత్రోపస్ రోబస్టస్ జాతి జీవులు ఎక్కువగా ఉండేవని భావించవచ్చు"అని డా. లీస్ తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- నేపాల్: హిమాలయాల్లో ఎనిమిది మంది పర్వతారోహకుల ప్రాణాలు తీసిన మంచు తుపాను
- ముస్లిం కుటుంబాల నుంచి పిల్లలను మేం వేరు చేయడం లేదు: చైనా
- 64 ఏళ్ల మిస్టరీని సోషల్ మీడియా సాయంతో ఛేదించిన ఇటలీ అధికారులు
- 'నందాదేవి' పర్వతారోహణలో చనిపోయినవారు తీసుకున్న చివరి వీడియో
- అనంతపురం కాలేజీ వైరల్ వీడియో వెనుక అసలు కథ
- లింగమనేని గెస్ట్ హౌజ్ గురించి చంద్రబాబు, లింగమనేని రమేశ్ 2016లో ఏమన్నారు....
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








