బొల్లారం ఐడీఏలో భారీ అగ్ని ప్రమాదం.. ఎనిమిది మందికి గాయాలు

బొల్లారం ప్రమాదం

ఫొటో సోర్స్, Ani

హైదరాబాద్ శివార్లలోని బొల్లారంలో ఒక కెమికల్ ఫ్యాక్టరీలో శనివారం మధ్యాహ్నం భారీ పేలుళ్లతో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది గాయపడ్డారు.

సంగారెడ్డి జిల్లా పరిధిలోకి వచ్చే బొల్లారం ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ ఏరియాలో గల వింధ్య ఆర్గానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఫ్యాక్టరీలో ఈ ప్రమాదం జరిగినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.

బొల్లారం ప్రమాదం

మధ్యాహ్నం భోజన విరామ సమయంలో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు బీబీసీతో చెప్పారు.

ప్రమాదం జరిగినపుడు ఫ్యాక్టరీలో పదుల సంఖ్యలో కార్మికులు ఉన్నారని చెప్తున్నారు. అయితే భోజన విరమా సమయంలో ప్రమాదం జరిగినందున ప్రాణనష్టం ఉండకపోవచ్చునని భావిస్తున్నారు.

బొల్లారం ప్రమాదం

ఫ్యాక్టరీలో రియాక్షన్ కోసం ఉంచిన ఒక రసాయనానికి మంటలు అంటుకుని ఈ ప్రమాదం సంభవించినట్లు పోలీసులు చెప్పారని ఏఎన్ఐ వార్తా సంస్థ పేర్కొంది.

రియాక్టర్ పేలిందని కొందరు. రసాయనాలు లీకయ్యాయని కొందరు చెప్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియదు.

బొల్లారం ప్రమాదం

స్థానిక అధికార యంత్రాంగం, పోలీసులు ఇక్కడికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు.

ఫైరింజన్లు మంటలను ఆపుతున్నాయి. మంటలు అదుపులోకి వచ్చాయి.

ప్రమాద తీవ్రతతో పరిసరాల్లోని నిర్మాణాల అద్దాలు, పలుచటి గోడలు దెబ్బతిన్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)