మనుషులను మింగేసిన మహమ్మారులను టీకాలు ఎలా చంపాయి?

ఫొటో సోర్స్, Reuters
వ్యాధి ప్రబలితే ఎలాంటి ప్రాణాంతక, వినాశకర పరిస్థితులు తలెత్తుతాయో కరోనావైరస్ మహమ్మారి మనకు గుర్తు చేసింది.
వ్యాక్సీన్లు వస్తుండడంతో జీవితంపై మళ్లీ ఆశ కలుగుతోంది.
రోగ నిరోధకతతో పోరాడిన తొట్టతొలి వ్యాధి ఇదే కాదు.. ఒకప్పుడు ప్రపంచమంతటా ఎన్నో సమాజాలను భయభ్రాంతులకు గురిచేసిన ప్రాణాంతక మహమ్మారులను అదుపులోకి తేగలిగారు.
ప్రజల జీవితాలలో మార్పు తేవడానికి దోహదపడిన కొన్ని టీకా కార్యక్రమాలను పరిశీలిద్దాం..

ఫొటో సోర్స్, Getty Images
మశూచి (స్మాల్‌పాక్స్)
ప్రపంచంలో ఇప్పటివరకు వ్యాక్సినేషన్‌కు అతి పెద్ద శత్రువు మశూచే కావచ్చు.. అదే సమయంలో వ్యాక్సినేషన్ విజయగాథలు చెప్పాలన్నా మశూచి వ్యాధి గురించే చెప్పాలి.
ఒక్క 20వ శతాబ్దంలోనే మశూచి వ్యాధి వల్ల 30 కోట్ల మంది ప్రాణాలు కోల్పోయారు.
అంతకుముందూ ఈ వ్యాధి పదుల కోట్ల మంది ప్రాణాలను హరించినట్లు భావిస్తారు.
ఒకరి నుంచి ఒకరికి సులభంగా సోకే స్వభావం ఉన్న మశూచి బారిన పడిన వారిలో 30 శాతం మంది మరణించారు.
శరీరమంతా స్ఫోటకాలతో అంతులేని బాధ కలిగించే వ్యాధి ఇది.
ఈ వ్యాధి నుంచి ప్రాణాలతో బయటపడినవారిలోనూ చాలామంది అంధులుగా మారుతారు. అనేకమంది ఒళ్లంతా భయంకరమైన మచ్చలతో మిగిలిపోతారు.
మశూచిని ఎదుర్కొనే మార్గాల కోసం శతాబ్దాలుగా ప్రజలు అన్వేషించారు.
మశూచిపై పోరాటం అనేక రకాలుగా వైద్య ప్రగతికి దారి తీసింది.

ఫొటో సోర్స్, Getty Images
చివరికి వ్యాక్సీన్ అభివృద్ధికీ దోహదపడింది.క్రీస్తుశకం 1000 ప్రాంతాల్లో చైనాలో ప్రాథమికంగా చికిత్స విధానాన్ని కనుగొన్నారు. వ్యాధి పీడితుల పుండ్లను ఆరోగ్యవంతుల ముక్కులో చిదిమేవారు.
దానివల్ల తేలికపాటిగా వారికి మశూచి సోకి ఆ తరువాత దాన్ని తట్టుకునే శక్తి కలుగుతుందని భావించేవారు.
ఆసియా, ఆఫ్రికా ఖండంలోని కొన్ని ప్రాంతాల్లోనూ ఇలాంటివే కొన్ని విధానాలను పాటించేవారు.
క్రీస్తుశకం 1700 ప్రాంతంలో టర్కీలో మేరీ వార్ట్లీ మోంటాగూ ఇలాంటి పద్ధతుల గురించి తెలుసుకోవడంతో అక్కడి నుంచి బ్రిటన్‌కు వ్యాపించాయి.
మశూచి వ్యాక్సీన్ మొట్టమొదట బ్రిటన్‌లోనే తయారైంది. ఎడ్వర్డ్ జెన్నర్ దాన్ని అభివృద్ధి చేశారు.
పశువుల నుంచి సోకే కౌపాక్స్ వ్యాధి సోకితే దాని వల్ల మశూచి నుంచి రక్షణ పొందొచ్చని నిరూపించిన మొట్టమొదటి వ్యక్తి జెన్నర్.
అయితే, మశూచిపై పోరాటం వేగవంతంగా సాగలేదు. 1967లో ప్రపంచ ఆరోగ్య సంస్థ మశూచి నిర్మూలన కార్యక్రమాన్ని తీవ్రతరం చేసిన తరువాత వ్యాధి నియంత్రణలోకి రావడం ప్రారంభమైంది.

ఫొటో సోర్స్, Getty Images
నిల్వ చేయడానికి, రవాణాకు సులభంగా ఉండే వ్యాక్సీన్‌తో పాటు దాన్ని వేయడానికి సూదులు పెద్ద ఎత్తున అందుబాటులో ఉంచారు.
భారీగా నిధులూ వెచ్చించారు. తొలుత హెర్డ్ ఇమ్యూనిటీ డెవలప్ అయ్యేందుకు వీలుగా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి చాలా దేశాల్లో 80 శాతం జనాభా వరకు వ్యాక్సీన్ వేయడానికి ప్రయత్నాలు జరిగాయి.
ఇది గొప్ప కార్యక్రమంగా నిరూపితమైంది. భారత్‌లో ఏటా సగటున జన్మించే 2 కోట్ల మంది శిశువులకు టీకాలు వేయడం చిన్న పనేమీ కాదు.
నైజీరియా వంటి దేశాల్లో జనాభా మొత్తానికీ కాకుండా వ్యాధి ప్రబలిన ప్రాంతాలు, సమీప ప్రాంత ప్రజలను గుర్తించి టీకాలు వేశారు.
తూర్పు నైజీరియాలో కేవలం 7.5 లక్షల మందికి టీకాలు వేయడం ద్వారా 1.2 కోట్ల జనాభాకు మశూచి నుంచి రక్షణ కలిగించారు. దీంతో మిగతా ప్రపంచానికి ఇది నమూనాగా మారింది.
ఒకప్పుడు ప్రపంచాన్ని గడగడలాడించిన ఈ వ్యాధి ఇప్పుడు ప్రపంచంలో కేవలం రెండే రెండు చోట్ల ఉంది.. అందులో ఒకటి అత్యంత భద్రత మధ్య ఉన్న రష్యాలోని ఒక ప్రయోగశాల కాగా రెండోది అమెరికాలోని అత్యంత కట్టుదిట్టమైన భద్రతలో ఉన్న ప్రయోగశాల.ఆ రెండు ప్రయోగశాలల్లో తప్ప ఇంకెక్కడా ఇప్పుడు మశూచి లేదు.

ఫొటో సోర్స్, Getty Images
పోలియో
మశూచితో పోల్చితే పోలియో బారిన పడి చనిపోయినవారి సంఖ్య తక్కువే అయినప్పటికీ ఇది సోకినవారి జీవితాలు మాత్రం మశూచి నుంచి ప్రాణాలతో బయటపడినవారి జీవితాల కంటే దుర్భరమే.
ఇది ప్రధానంగా చిన్నారులపై ప్రభావం చూపుతుంది. పోలియో వైరస్ నోటి ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది.
ఇది మొదట రక్తంలోకి చేరి అక్కడి నుంచి నాడీ వ్యవస్థకూ సంక్రమించి దానిపై దాడి చేస్తుంది.పోలియో సోకిన 200 మందిలో సగటున ఒకరు కోలుకోవడానికి వీల్లేనంతగా పక్షవాతానికి గురవుతారు.
ఎక్కువగా కాళ్లు దెబ్బతిని వైకల్యానికి గురవుతారు. అలాంటి ప్రతి 10 మందిలో ఒకరు శ్వాస కండరాల వైఫల్యం వల్ల మరణిస్తారు.
పోలియో బాధితుల్లో శ్వాసక్రియకు సహాయపడేలా 1920లో ఐరన్ లంగ్స్ పరికరాన్ని కనుగొన్నారు.
అందులో కొన్నివారాల పాటు ఉండడం వల్ల ఫలితం ఉండొచ్చు. కొందరు మాత్రం జీవితమంతా అందులోనే గడిపినవారున్నారు.
మశూచిలా తక్షణం పైకి కనిపించే లక్షణాలేవీ పోలియోకు లేకపోవడం వల్ల 1905లో స్వీడన్ వైద్యుడు ఐవర్ విక్మన్ నిర్ధరించే వరకు ఇది సాంక్రమిక వ్యాధి అని ప్రపంచానికి తెలియలేదు.
అనంతరం అనేక ప్రధాన నగరాల్లో నీటి నాణ్యత పెంచడంతో పోలియో కేసులు తగ్గనారంభించాయి.. అదే సమయంలో ప్రజల రోగనిరోధక శక్తీ తగ్గుతూ వచ్చింది.
దానివల్ల వ్యాధి ప్రబలినప్పుడు తీవ్రత అధికంగా ఉండేది. అభివృద్ధి చెందిన దేశాల్లోనే ఎక్కువగా పోలియో కేసులు ఉన్నట్లు భావించేవారు.

ఫొటో సోర్స్, Getty Images
అయితే, బాల్యంలోనే వైకల్యానికి గురయినవారి సంఖ్య మాత్రం ఈ అంచనాలు తప్పని నిరూపించింది.
ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో పెద్ద సంఖ్యలో చిన్నారులు వైకల్యానికి గురయ్యారు.
1952లో అమెరికా వైద్యుడు జోనాస్ సాల్క్ మొట్టమొదటి పోలియో వ్యాక్సీన్ కనుగొన్నారు.
ఆ తరువాత 1961లో అల్బర్ట్ సాబిన్ దాన్ని మరింత అభివృద్ధి చేశారు.
సాల్క్ కనుగొన్న వ్యాక్సీన్ సూది మందు ద్వారా వేయాల్సి ఉండేది. సాబిన్ అభివృద్ధి చేసిన టీకా నోటి ద్వారా వేసేవారు.
దాంతో టీకా వేయడం మరింత సులభమైంది.ఈ టీకా అమెరికా, ఐరోపాలో పోలియోను వేగంగా తగ్గించింది.
కానీ, టీకాలు వేసే క్రమంలో భారీ తప్పులు మాత్రం జరిగాయి.
అమెరికా ఔషధ చరిత్రలోనే అత్యంత ఘోరమైన పొరపాటు జరిగింది.
కట్టర్ ల్యాబరేటరీస్ లైవ్ పోలియో వైరస్‌తో లక్షకు పైగా డోసుల వ్యాక్సీన్ ఉత్పత్తి చేసింది. ఆ టీకా వేసుకున్నవారిలో 160 మంది పిల్లలు పూర్తిగా వైకల్యానికి గురయ్యారు. 10 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఫొటో సోర్స్, Reuters
అయినప్పటికీ పోలియోపై పోరాటంలో భాగంగా టీకాల కార్యక్రమాలు సాగాయి.
1988లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచవ్యాప్తంగా పోలియోను అరికట్టేందుకు కార్యక్రమాన్ని రూపొందించింది.
1994 నాటికి అమెరికా పోలియో రహిత దేశంగా గుర్తింపుపొందింది. 2000 నాటికి పశ్చిమ పసిఫిక్ దేశాలు, 2002 నాటికి యూరప్ దేశాలు, 2014 నాటికి ఆగ్నేయాసియా దేశాలూ పోలియో రహితమయ్యాయి.
పోలియో వ్యాక్సీన్ కనుక లేకుంటే ఇప్పుడున్నవారిలో 1.8 కోట్ల మంది వైకల్యంతో బాధపడేవారని.. 15 లక్షల మంది చిన్నారులు మరణించి ఉండేవారని ఒక అంచనా.
ప్రస్తుతం పోలియో పాకిస్తాన్, అఫ్గానిస్థాన్‌లో మాత్రం ఇంకా ఉంది. ఏటా పదుల సంఖ్యలో కేసులు అక్కడ నమోదవుతున్నాయి. మరి కొన్నేళ్లలో ప్రపంచమంతటా పోలియోను నిర్మూలించొచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
తట్టు (మీజిల్స్)
వ్యాక్సినేషన్ విజయగాథల్లోనూ, వైఫల్యాలలోనూ తట్టు గురించి చెప్పాల్సి ఉంటుంది.
ఆఫ్రికాలో కొద్దికాలంగా ప్రబలుతున్న ఎబోలా ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నప్పటికీ దాని వల్ల కలిగిన మరణాలు 20 వేల కంటే తక్కువే.
కానీ, తట్టు మాత్రం ఏటా 1,40,000 మంది ప్రాణాలను హరిస్తోంది.
1963 నుంచి వ్యాక్సీన్ అందుబాటులో ఉన్నప్పటికీ తట్టు వల్ల ఇప్పటికీ మరణాలు సంభవిస్తుండడమే అసలైన విషాదం.
దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వెలువడే తుంపర్ల వల్ల ఒకరి నుంచి మరొకరికి ఇది సోకుతుంది. ఒళ్లంత దద్దుర్లు, తీవ్రమైన జ్వరం దీని లక్షణాలు. విరేచనాలు, న్యుమోనియా కూడా కొందరిలో ఉంటుంది.. ఇవన్నీ కలిసి మరణానికి కారణమవుతాయి.

ఫొటో సోర్స్, Reuters
వ్యాక్సీన్ అందుబాటులో ఉండడం వల్ల ఏటా సుమారు 26 లక్షల మరణాలను నివారించగలుగుతున్నారు.
రోగ నిరోధకత స్థాయి 95 శాతం కంటే తక్కువగా ఉన్న ఏ ప్రాంతంలోనైనా ఇది వ్యాపించే అవకాశం ఉంది.
2019 ప్రారంభం నుంచి ఈ ఏడాది వేసవి వరకు డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో 7 వేల మంది చిన్నారులు తట్టు కారణంగా ప్రాణాలు కోల్పోయారు.
ప్రపంచంచలో ఇంత భారీ స్థాయిలో ఈ వ్యాధి ఇంకా మనుగడలో ఉండడం ఆ దేశంలోనే. డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో వంటి దేశాల్లో.. మరీ ముఖ్యంగా అక్కడి మారుమూల ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ పెద్ద సమస్య.
తట్టుపై పోరాటానికి మరో 25.5 కోట్ల డాలర్లు ఖర్చు చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపునిచ్చింది.
తట్టును నిర్మూలించడంలో కాదనలేని సవాళ్లు ఉన్నప్పటికీ.. టీకా, చికిత్సులు అందుబాటులో ఉన్నా ఇంకా వేలాది మంది ప్రాణాలు పోతున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
మలేరియా
ప్రపంచ జనాభాలో సగం మందికి ఇప్పటికీ మలేరియా ముప్పు ఉంది.
దోమల ద్వారా వ్యాపించే ఈ పరాన్నజీవి కారణంగా ఏటా ప్రపంచవ్యాప్తంగా 4 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు.
సికిల్ సెల్ ఎనీమియా వంటి రక్తసంబంధిత రుగ్మతలు సాధారణంగా మారేలా మానవ పరిణామంలోనూ మలేరియా ప్రభావం ఉందని భావిస్తారు.
మలేరియా మరణాల్లో 95 శాతం ఆఫ్రికాలోనే నమోదవుతున్నాయి.
మలేరియాను ఎదుర్కోవడంలో అనేక మార్గాలు అనుసరిస్తున్నప్పటికీ ఈ పరాన్నజీవి కూడా అంతే స్థాయిలో నియంత్రణ మందులను ఎదుర్కొనే శక్తి సంతరించుకుంటోంది.
కొద్దికాలం కిందటి వరకు మలేరియాకు టీకా లేదు. అయితే, 70 కోట్ల డాలర్ల ఖర్చుతో 32 ఏళ్ల సుదీర్ఘ పరిశోధనలు ఫలించి ఇటీవలే టీకా వచ్చింది.
అయితే, 40 శాతమే ఫలితమిస్తున్నట్లు ఈ వ్యాక్సీన్ ట్రయల్స్ చెబుతున్నాయి. ప్రధాన వ్యాక్సీన్లతో పోల్చితే ఇది చాలా తక్కువ సఫలతా రేటుగానే చెప్పాలి.
ఈ వ్యాక్సీన్‌తో చికిత్స పూర్తి కావడానికి నాలుగు మోతాదులు వేయాల్సి ఉంటుంది.
మలావి, ఘనా, కెన్యాలో మలేరియా వ్యాక్సీన్ పైలట్ ప్రాజెక్ట్ 2023 వరకు చేపడుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇవి కూడా చదవండి:
- పాకిస్తాన్ అణుకేంద్రం గుట్టు ‘రా’ ఎలా కనిపెట్టింది?
- భార్యపై భర్త రేప్ గురించి ఎందుకింత గొడవ
- హిమాలయన్ వయాగ్రా: కిలో రూ.70 లక్షలకు కొంటున్నారు
- ‘అది భార్యాభర్తల పడక సీన్... అలా నటించడానికి నాకేమీ సిగ్గనిపించలేదు’
- అమెరికాలో సెక్స్ రాకెట్.. టాలీవుడ్‌పై నీలి నీడలు
- స్త్రీ గౌరవం రెండు కాళ్ల మధ్య లేదు: రేణూ దేశాయ్
- 'యూదు దేశం'గా ఇజ్రాయెల్: వివాదాస్పద బిల్లుకు పార్లమెంటు ఆమోదం
- 'భవిష్యత్తు ఉండాలంటే నిర్మాతలతో, దర్శకులతో పడుకోక తప్పదన్నారు'
- బ్రిటన్‌లో టీనేజర్లలో గర్భధారణ తగ్గడానికి కారణాలివేనా
- మీకున్న ప్రైవసీ ఎంత? మీ వ్యక్తిగత సమాచారం ఎంత భద్రం?
- అమిత్ షా జాబు.. చంద్రబాబు జవాబు
- చేపలు తినొచ్చా.. తినకూడదా? ఈ రసాయనాల గొడవేంటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








