పాకిస్తాన్: పిల్లలకు పోలియో చుక్కలు వేస్తే చంపేస్తున్నారు

- రచయిత, షుమైలా జాఫ్రీ
- హోదా, బీబీసీ ప్రతినిధి, ఇస్లామాబాద్
భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో పోలియో కనుమరుదైంది. కానీ, పాకిస్తాన్ మాత్రం ఇప్పటికీ పోలియో పీడిత దేశంగానే ఉంది. ఎందుకు?
పాకిస్తాన్‌లోని అనేకమంది ప్రజలకు పిల్లలను తప్పనిసరిగా వేయించాల్సిన టీకాలపై అపోహలు తొలగిపోవడంలేదు. దాంతో, లక్షల మంది చిన్నారులు పోలియో లాంటి టీకాలకు దూరంగా ఉండాల్సి వస్తోంది.
కొందరిలో అపోహలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. పిల్లలకు చుక్కల మందు వేసేందుకు ఇంటింటికీ వెళ్లే ఆరోగ్య కార్యకర్తలపై కొందరు దాడులకు దిగుతున్నారు. దాంతో, టీకాలు వేయాలంటే భయమేస్తోందని సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.

కొన్నిచోట్ల ఉపాధ్యాయులు కూడా టీకాలను నమ్మకపోవడం గమనార్హం. పెషావర్ ప్రాంతంలోని మమషోఖెల్ గ్రామ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గతంలో విద్యార్థులకు పోలియో చుక్కలు వేసేందుకు వైద్య సిబ్బందిని అనుమతించేవారు కాదు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రభుత్వం ఒత్తిడి చేయడంతో అనుమతించారు.
అయితే, ఆ స్కూలులో పోలియో చుక్కలు వేయగానే పిల్లలు సొమ్మసిల్లిపడిపోయారని, వాంతులు చేసుకుంటున్నారంటూ వదంతులు వ్యాపించాయి.
వెంటనే విద్యార్థులందరినీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వారికి ఏమీ కాలేదని వైద్యులు తేల్చారు. వైద్యులు ఈ విషయం చెప్పేలోపే వదంతులు సోషల్ మీడియాలో విస్తృతంగా వ్యాపించాయి.
అనేకమంది ఆస్పత్రిపై దాడికి దిగారు. గోడలు ధ్వంసం చేశారు. వస్తువులకు నిప్పంటించారు. ఆ దాడులను స్థానికి టీవీ ఛానెళ్లు ప్రత్యక్ష ప్రసారం చేశాయి. అంతేకాదు, పోలియో చుక్కలు వేయించిన పిల్లలను తక్షణమే ఆస్పత్రులకు తీసుకెళ్లాలంటూ స్థానిక మసీదుల్లోని మైకుల్లో తల్లిదండ్రులను కోరారు. దాంతో, ఆ వదంతులకు మరింత ఆజ్యం పోసినట్లు అయ్యిందని పెషావర్ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి చెప్పారు.

పెషావర్‌లోని 30 వేలమంది పాఠశాల విద్యార్థులను ఆస్పత్రులకు తీసుకెళ్లి పరీక్షలు జరిపించారు. అందరూ క్షేమంగా ఉన్నారని మంత్రి ప్రకటించారు. కానీ, అప్పటికే ప్రజల్లో టీకాలపట్ల అపనమ్మకం బలంగా నాటుకుపోయింది.
"చిన్నారులకు టీకాలు వేసేందుకు మేము వెళ్తే ప్రజలు అడ్డుకుంటున్నారు. తిడుతున్నారు. మీరు పిల్లలకు విషం ఇస్తున్నారని కొందరు మా మీదికొచ్చారు" అని వైద్య సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. దాంతో పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రభుత్వం కొన్ని వారాలపాట్లు వాయిదా వేసింది.

చిన్న వయసులో వచ్చే పోలియో కొన్నిసార్లు ప్రాణాంతకంగానూ మారొచ్చు. ఈ వ్యాధి వచ్చిన తర్వాత దానికి చికిత్స ఉండదు.

పోలియోను పూర్తిగా నివారించేందుకు చుక్కల మందు ప్రపంచవ్యాప్తంగా విజయవంతంగా పనిచేసింది. కానీ పాకిస్తాన్, అఫ్ఘానిస్థాన్, నైజీరియాలో మాత్రం ఈ మహమ్మారి ఇప్పటికీ ఉంది.
నైజీరియాలో 2016 నుంచి ఇప్పటి వరకు పోలియో కేసులు నమోదు కాలేదు. దాంతో, మరికొన్ని నెలల్లో ఈ దేశాన్ని పోలియో రహిత దేశంగా ప్రకటించే అవకాశం ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
చాలాకాలంగా పాకిస్తాన్ కూడా పోలియో నిర్మూలన దిశగా అడుగులు వేసింది. అందులో మంచి ఫలితాలు రాబట్టింది. 1994లో పాకిస్తాన్‌లో 22,000 పోలియో కేసులు నమోదవ్వగా, 2015లో 100 కంటే తక్కువే నమోదయ్యాయి.
కానీ, ఈ ఏడాది ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి. జూన్ ఆరంభం నాటికి ఈ ఏడాది దేశంలో 21 పోలియో కేసులు నమోదయ్యాయని ప్రభుత్వం తెలిపింది. 2017లో ఆ సంఖ్య 8 మాత్రమే.
పోలియో కేసులు పెరగడం తీవ్ర ఆందోళన కలిగించే విషయమని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. పోలియో నిర్మూలన విషయంలో పాకిస్తాన్ పురోగమన దిశలో వెళ్తోందని వ్యాఖ్యానించింది.
ఆరోగ్య సిబ్బంది మాత్రం తాము పోలియో చుక్కలు వేసేందుకు వెళ్తే ఎవరి నుంచి ఎలాంటి స్పందన వస్తుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఆరోగ్య కార్యకర్తల హత్య
పాకిస్తాన్‌లో 2,62,000 మంది ఆరోగ్య కార్యకర్తలు పనిచేస్తున్నారు. వారిలో 70 శాతానికిపైగా మహిళలే. వారే ఇంటింటికీ వెళ్లి పిల్లలకు టీకాలు వేస్తుంటారు.
అయితే, టీకాలపై కొంతమంది ప్రజల్లో ఆందోళనకర స్థాయిలో అపనమ్మకం ఉంది. కొన్ని చోట్ల టీకాలు వేసేందుకు వెళ్లిన ఆరోగ్య కార్యకర్తల మీద దాడులు కూడా జరుగుతున్నాయి. ఈ క్రమంలో కొందరు కార్యకర్తలు ప్రాణాలు కూడా కోల్పోయారు.
2012 డిసెంబర్ 18న 20 నిమిషాల వ్యవధిలోనే కరాచీలో ముగ్గురు, పెషావర్‌లో ఇద్దరు కార్యకర్తలను కొందరు కాల్చి చంపారు.
ఆ తర్వాతి రోజు మరో నలుగురు కార్యకర్తలు హత్యకు గురయ్యారు. అలా జరిగిన దాడుల్లో 2012 నుంచి ఇప్పటి వరకు 94 మంది కార్యకర్తలు, భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని పాకిస్తాన్ అధికారులు తెలిపారు.

ఎప్పుడు ఎవరు దాడి చేస్తారోనని ఆందోళన ఉంటుందని, అందుకే ఎప్పుడూ ఒకే మార్గంలో వెళ్లకుండా జాగ్రత్తపడతామని గుల్నాజ్ అనే ఆరోగ్య కార్యకర్త బీబీసీతో చెప్పారు.
2012లో దుండగుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన ఆరోగ్య కార్యకర్తల్లో గుల్నాజ్ బంధువులు ఇద్దరు ఉన్నారు.
"మొదట్లో ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా ఎవరైనా వచ్చి దాడి చేస్తారేమో అని భయపడుతూ ఉండేదాన్ని. నా దగ్గర నుంచి ఎవరైనా బైకు మీద వెళ్తున్నా భయమేస్తుండేది" అని గుల్నాజ్ చెప్పారు.
పోలియో వ్యాధి విదేశాలకు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు పాకిస్తాన్ నుంచి ఇతర దేశాలకు వెళ్లేవారందరికీ విమానాశ్రయాల్లో పోలియో చుక్కలు వేయాలని 2012 జూన్‌లో ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది.

ఆ తర్వాత పోలియో మీద పాకిస్తాన్ అధికారులు 'యుద్ధం' ప్రకటించారు. వ్యాక్సిన్ వేసేందుకు వెళ్లే కార్యకర్తలకు భద్రతగా పోలీసులను పంపడం ప్రారంభించారు.
తమ పిల్లలకు టీకాలు వేయించేందుకు నిరాకరించిన వందలాది మంది తల్లిదండ్రులను నిర్బంధించారు.
నిజానికి 2000 సంవత్సరంలోనే పాకిస్తాన్‌లో పోలియోపై దేశవ్యాప్తంగా ప్రచారం ప్రారంభించారు.
కానీ, 2007లో తాలిబన్ నేత ముల్లాహ్ ఫజలుల్లా పోలియో చుక్కలను వ్యతిరేకిస్తూ... ఆ టీకాలు వేయించుకోవద్దంటూ పాకిస్తాన్ ప్రజలకు పిలుపునిచ్చాడు. ముస్లింలను మార్చేందుకు పశ్చిమ దేశాలు కుట్ర పన్నుతున్నాయని, అందులో భాగమే పోలియో టీకాలని వ్యాఖ్యానించాడు.

ఆ బోగస్ వాదనకు 2011లో మరో బలమైన వదంతి వ్యాప్తి చెందింది.
2011 మే 2న పాకిస్తాన్‌లోని అబోటాబాద్‌లో అమెరికా సైన్యం అల్- ఖైదా అగ్రనేత బిన్‌లాడెన్‌ను హతమార్చింది. టీకాలు వేస్తామంటూ ఇంటింటికీ తిరిగిన ఓ వైద్యుడు లాడెన్‌కు సంబంధించిన రహస్యాలను అమెరికాకు చేరవేశారన్న ఆరోపణలు వచ్చాయి.
దాంతో పాటు 2012లో అఫ్ఘానిస్థాన్ సరిహద్దు ప్రాంతంలోని గిరిజన ప్రాంతాల్లోని పాకిస్తాన్ సైనిక స్థావరాలను అమెరికా డ్రోన్లు లక్ష్యంగా చేసుకున్నాయంటూ పుకార్లు వచ్చాయి. ఆ తర్వాత పోలియో చుక్కల పేరుతో తమ ప్రాంతంలో అమెరికా నిఘా పెడుతోందంటూ తాలిబన్ కమాండర్లు ఉత్తర, దక్షిణ వజీరిస్తాన్ ప్రాంతాల్లో పోలియో టీకాలను నిషేధించారు.
ఇలాంటి వార్తలు వ్యాప్తి చెందడంతో పాకిస్తాన్ వ్యాప్తంగా అనేకమంది ప్రజల్లో పోలియోపై అపనమ్మకం పెరిగిపోయింది.

అయితే, పాకిస్తాన్‌లోని విద్యావంతులు మాత్రం టీకాలపై నమ్మకం లేకపోవడం అనాగరికమని అంటున్నారు. ప్రమాదకరమైన పోలియో వ్యాధిని పూర్తిగా నిర్మూలించాలంటే టీకాలే సరైన మందు అని చెబుతున్నారు. అందుకు సదస్సులు ఏర్పాటు చేసి ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు.

పాకిస్తాన్‌లో 4 కోట్ల మందికి పైగా ఐదేళ్ల లోపు పిల్లలున్నారు. వారిలో దాదాపు ఐదు లక్షల మంది చిన్నారులు పోలియో టీకాలకు దూరంగా ఉంటున్నారని ప్రభుత్వం చెబుతోంది.

ఫొటో సోర్స్, Getty Images
టీకాలు వేసిన చిన్నారుల చేతి వేళ్ల మీద ఇంకుతో గుర్తు పెడుతున్నారు. అయితే, కొందరు ఆరోగ్య కార్యకర్తలు పోలియో చుక్కలు వేయించుకునేందుకు నిరాకరించిన చిన్నారులకూ గుర్తులు పెట్టి సంఖ్యను ఎక్కువగా చూపుతున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.
ఇవి కూడా చదవండి:
- జైళ్లలో యోగా: 'సెక్స్ కోరికలు పెరిగి హోమో సెక్సువల్స్ అవుతారు'
- భారతదేశంలో ఫిరాయింపుల చరిత్ర: నేతలు పార్టీలు మారినా ప్రజలు ఎందుకు పట్టించుకోవట్లేదు?
- వ్యాక్సిన్లు పనిచేస్తాయా.. టీకాలపై భారతీయులకు నమ్మకముందా
- బన్నీ ఛౌ: భారత్‌లో దొరకని భారతీయ వంటకం
- ఆహార వృథాయే ఆకలి కేకలకు అసలు కారణమా?
- చెన్నై నగరంలో నీటి కరువు.. నీటి కోసం పోరాడుతున్న నగరవాసులు
- భారత్ బానిసత్వంలో ఉన్నది 150 ఏళ్లా.. 1200 ఏళ్లా?
- ట్విటర్ సీఈఓ: మంచునీటి స్నానం, ఒంటి పూట భోజనం..
- టీకాలు ఎలా పనిచేస్తాయి? టీకాల విజయం ఏమిటి? టీకాలపై కొందరిలో సంశయం ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










