సుమిత్రా నాయక్: రగ్బీ మైదానం లోపలా బయటా సవాళ్లతో సావాసం

సుమిత్ర నాయక్
ఫొటో క్యాప్షన్, సుమిత్ర నాయక్

భారత జాతీయ మహిళా రగ్బీ జట్టులో చేరే ప్రయాణంలో పేదరికం, హింస ఇంకా ఎన్నో సవాళ్లతో పోరాడారు సుమిత్రా నాయక్.

అది 2008 సంవత్సరం. ఒడిశాలోని ఓ క్రీడా మైదానం. దాని బయట ఓ ఎనిమిదేళ్ల బాలిక నిలుచుని చూస్తోంది.

మైదానంలో ఆటగాళ్ల జట్టు పొడవుగా ఉన్న ఓ బంతి కోసం పెనుగులాడుతున్నారు. ‘ఆ బంతి ఏదో డైనోసార్ గుడ్డులాగా ఉందే’ అనుకుందా బాలిక.

అప్పుడు ఆ చిన్నారి చూసిన ఆట పేరు రగ్బీ. ఆ ఆటను ఆ బాలిక చూడటం అదే మొదటిసారి. ఆ బాలిక ఇప్పుడు భారత మహిళా రగ్బీ జట్టులో కీలక సభ్యురాలు. ఆమే సుమిత్రా నాయక్.

భువనేశ్వర్‌లోని కళింగ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (కెఐఎస్ఎస్) క్రీడామైదానంలో సుమిత్ర లేత వయసులోనే బంతి కోసం ఆటగాళ్లతో శారీరకంగా తలపడే ఈ ఆటను ఎంచుకున్నప్పటికీ.. అప్పటికే తన చిన్ననాటి కల్లోల జీవితం ఆమెను వంద మందితో సమానంగా రాటుదేల్చింది.

చిన్నప్పుడే కష్టాల కొలిమి

సుమిత్రా నాయక్ ఒడిశాలోని జాజ్‌పూర్ జిల్లాలో డుబురి అనే గ్రామంలో 2000 మార్చి 8న జన్మించారు. కానీ భర్త చేతిలో గృహ హింసను ఎదుర్కొన్న ఆమె తల్లి తన ముగ్గురు పిల్లలతో ఆ ఊరు విడిచి వెళ్లాల్సి వచ్చింది.

సుమిత్ర తండ్రి ఒకసారి తన కుటుంబాన్ని సజీవంగా దహనం చేయటానికి కూడా ప్రయత్నించారు. కానీ వారు ఆ ప్రమాదం నుంచి బయటపడ్డారు.

తన పిల్లలు ఆ వాతావరణానికి దూరంగా పెరగాలని ఆ తల్లి భావించారు. సుమిత్రను కళింగ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌లో నాలుగో తరగతిలో చేర్చారు.

అక్కడ గిరిజన బాలబాలికలకు విద్య, క్రీడా శిక్షణ ఉచితంగా అందిస్తారు.

సుమిత్ర తల్లి ఒక బ్యూటీ పార్లర్ నడుపుతుంటారు. రగ్బీ ఆట గురించి ఆమెకు ఏమీ తెలియదు. బంతి కోసం ఆటగాళ్లు ఒకరి మీద ఒకరు పడటం చూసి ఆమె ఆందోళన చెందారు. కానీ ఆ ఆట ఆడాలని దృఢచిత్తంతో ఉన్న సుమిత్ర తన తల్లిని ఒప్పించారు.

తమ భద్రత కోసం పలు టెక్నిక్‌లు నేర్పిస్తారని ఆమెకు వివరించారు.

ఆ దశలో తన తల్లి ధైర్యం కూడగట్టుకోవడం వల్లే తాను ఈ ఆట ఆడటం కొనసాగించగలిగానని, ఇక్కడి వరకూ చేరుకోగలిగానని సుమిత్ర చెప్తారు.

సుమిత్ర నాయక్

టచ్‌డౌన్

సుమత్రి అనతి కాలంలోనే రాష్ట్ర స్థాయి పోటీల్లోకి దూసుకెళ్లారు. ఎన్నో పతకాలు గెలవటం మొదలుపెట్టారు. ఆ కాలంలో ప్రతి మ్యాచ్ ఒక కొత్త అనుభవాన్ని ఇచ్చింది. కొత్త కళలను నేర్చుకోవటానికి అవకాశం కల్పించింది.

2016లో సుమిత్ర భారత జాతీయ జట్టుకు ఎంపికయ్యారు. దుబాయ్‌లో జరిగిన ఏసియన్ చాంపియన్‌షిప్ (అండర్ 18)లో కాంస్య పతకం గెలిచారు.

విదేశీ గడ్డపై ఆడటం తనకు చాలా ఇష్టమని, అక్కడ ఇతర ఆటగాళ్లను కలవటానికి, ఎంతో నేర్చుకోవటానికి అవకాశం ఉంటుందని సుమిత్ర చెప్తారు.

2019 ఆసియా వుమన్స్ రగ్బీ చాంపియన్‌షిప్ సుమిత్రకు, భారత జట్టుకు చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఆ పోటీల్లో ఒక్కో జట్టులో ఏడుగురు ఆటగాళ్లకు బదులుగా 15 మంది సభ్యులు ఆడొచ్చు. ఈ సవాలును భారత మహిళా జట్టు చక్కగా ఎదుర్కొంది. కాంస్య పతకం గెలుచుకుంది.

సుమిత్ర నాయక్ జట్టు విజయం

భవిష్యత్ లక్ష్యాలు

ఆసియాలో ప్రస్తుతం 9/10గా ఉన్న భారత జట్టు ర్యాంకింగ్ ఐదుకు మెరుగుపడాలని, ఒలింపక్ క్రీడల్లో పాల్గొనాలని సుమిత్ర కోరుకుంటున్నారు.

ఇప్పటికీ బాలికల విషయంలో తల్లిదండ్రులే నిర్ణయాలు తీసుకుంటున్నారని, అలాకాకుండా బాలికలే తమ సొంత నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఉండాలని ఈ యువ క్రీడాకారిణి అంటారు.

బాలికలను బాలురకన్నా తక్కువగా చూడరాదని, సమాజ ఆలోచన మారాలంటే తల్లిదండ్రుల ఆలోచన మారాలని ఆమె పేర్కొన్నారు.

సుమిత్రకు చదువు, శిక్షణ సమస్య కాకపోయినప్పటికీ.. రగ్బీని ఒక కెరీర్‌గా ఎంచుకోవటం ఇంకా కష్టమే. ఎందుకంటే దీనివల్ల ఉద్యోగం రాదు. బహుమతుల రూపంలో వచ్చే డబ్బూ పెద్దగా ఉండదు.

అంతేకాదు.. భారత ప్రభుత్వం ఇంకా ఈ క్రీడను అధికారికంగా గుర్తించలేదని సుమిత్ర చెప్పారు.

(సుమిత్రా నాయక్‌కు బీబీసీ పంపించిన ఈమెయిల్ ప్రశ్నావళికి ఇచ్చిన సమాధానాలు ఈ కథనానికి ఆధారం)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)