డోనల్డ్ ట్రంప్‌ను అధ్యక్ష పదవిలోంచి తీసేయొచ్చా... 25వ రాజ్యాంగ సవరణ ఏం చెబుతోంది?

ట్రంప్

ఫొటో సోర్స్, WHITE HOUSE VIA TWITTER

వాషింగ్టన్‌లో బుధవారం నాడు జరిగిన క్యాపిటల్ హిల్ ముట్టడి తరువాత ట్రంప్‌ను పదవి నుంచి తప్పించడానికి అమెరికా రాజ్యాంగంలోని 25వ సవరణ ఉపయోగించవచ్చా అన్న చర్చ మొదలైంది.

ఇంతకీ, ఆ రాజ్యాంగ సవరణ ఏంటి? అది ఎలా పని చేస్తుంది?

అధ్యక్షుడు తన విధులు నిర్వహించలేని స్థితిలో ఉన్నప్పుడు ఉపాధ్యక్షుడు యాక్టింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించడానికి ఈ సవరణ అనుమతిస్తుంది. అయితే, ఇది జరగాలంటే క్యాబినెట్ మంత్రులలో మెజారిటీ సభ్యులు అధ్యక్షుడు తన విధులు నిర్వహించే స్థితిలో లేరని అంగీకరించాలి. ఆ మేరకు వారు ఒక లేఖ రాసి, సంతకాలు చేసి సెనేట్‌, ప్రతినిధుల సభ స్పీకర్లకు ఇవ్వాలి.

అలా జరిగినప్పుడు ఉపాధ్యక్ష స్థానంలో ఉన్న మైక్ పెన్స్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తారు. దానిపై లిఖిత పూర్వక సమాధానం ఇచ్చేందుకు ట్రంప్‌కు అవకాశం ఇస్తారు. ఆయన తనపై వచ్చిన ఆరోపణలను వ్యతిరేకిస్తూ సవాలు చేసినప్పుడు దానిపై అమెరికన్ కాంగ్రెస్ నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది.

అధ్యక్షుడిని తొలగించాలని తీర్మానం చేయాలంటే సెనేట్‌తో పాటు ప్రతినిధుల సభలో మూడింట రెండు వంతుల మద్దతు లభించాలి.

ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

అమెరికా పార్లమెంటు మీదకు ట్రంప్ మద్దతుదారులు దాడి ఘటన అనంతరం సెనేట్‌లోని ఉన్నత స్థాయి డెమొక్రాట్ నేత ఒకరు ఆయనకున్న అధ్యక్ష అధికారాలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

"అమెరికా క్యాపిటల్ హిల్ భవనంలోకి జరిగిన చొరబాటు ఇది. అధ్యక్షుని ప్రేరేపించడం వల్లే అది జరిగింది. ఇలాంటి అధ్యక్షుడు ఇంకెంత మాత్రం పదవిలో ఉండకూడదు" అని సెనేటర్ చుక్ షూమర్ ఒక ప్రకటన చేశారు.

ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ 25వ రాజ్యాంగ సవరణను ఉపయోగించాలని ఆయన సూచించారు. "ఒక వేళ ఉపాధ్యక్షుడు, క్యాబినెట్ మంత్రులు అందుకు నిరాకరిస్తే, అధ్యక్షుడిపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టేందుకు కాంగ్రెస్ మళ్లీ సమావేశం కావాలని అయన డిమాండ్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

హౌజ్ జ్యుడిషియరీ కమిటీ డెమొక్రాట్లు కూడా ఉపాధ్యక్షుడు పెన్స్‌కు లేఖ రాస్తూ, ట్రంప్‌ను తొలగించాలని కోరారు. 'మన ప్రజాస్వామ్య ప్రతిష్ఠను దెబ్బ తీసే విధంగా ట్రంప్ చొరబాట్లను ప్రేరేపించారు' అని వారు ఆ లేఖలో ఆరోపించారు.

రోనాల్డ్ రీగన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రోనాల్డ్ రీగన్

25వ రాజ్యాంగ సవరణను గతంలో ఉపయోగించారా?

ఈ సవరణను 1967లో ఆమోదించారు. అంతకు నాలుగేళ్ల క్రితం అప్పటి అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్. కెనడీ హత్యకు గురైనప్పుడు, అధ్యక్ష స్థానం ఖాళీ అయినప్పుడు ఆ బాధ్యతలు ఎవరు నిర్వహించాలనే ప్రశ్నలకు సమాధానంగా ఈ సవరణ తీసుకొచ్చారు.

ఆ కారణంతోనే ఆ తరువాత చాలా మంది అధ్యక్షులు ఈ సవరణను, ముఖ్యంగా అందులోని 3వ సెక్షన్‌ను ఉపయోగించి తాత్కాలికంగా తమ బాధ్యతలను తమ ఉపాధ్యక్షులకు అప్పగించారు.

2002, 2007 సంవత్సరాలలో అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యు బుష్ కొలనోస్కోపీ వైద్య పరీక్షల కోసం మత్తు మందు తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఈ సవరణను అమలు చేస్తూ తన ఉపాధ్యక్షుడికి తాత్కాలికంగా బాధ్యతలు అప్పగించారు.

అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ కూడా 1985లో క్యాన్సర్ సర్జరీ కోసం హాస్పిటల్లో చేరినప్పుడు అదే పని చేశారు.

అయితే, ఇప్పటివరకూ పదవిలో ఉన్న ఏ అధ్యక్షుడినీ 25వ సవరణ ఉపయోగించి శాశ్వతంగా తొలగించడం జరగలేదు.

ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

అధికారం అప్పగించడానికి నేను సిద్ధం - డోనల్డ్ ట్రంప్

అమెరికా కేపిటల్ హిల్ భవనంపై తన మద్దతుదారులు దాడికి దిగిన ఒక రోజు తరువాత అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ తాను అధికారాల బదిలీకి కట్టుబడి ఉన్నట్లు తెలిపారు.

తాత్కాలికంగా ఆపిన తన ట్విటర్ అకౌంట్ పునరుద్ధరణ అయిన తరువాత ఆయన ట్వీట్ చేస్తూ.. గురువారం నాటి ఘటనను హేయమైన దాడిగా పేర్కొంటూ ఖండించారు.

నిరసనలలో గాయపడిన ఓ అధికారి మరణించారన్న వార్తల మధ్య ట్రంప్ ఈ ప్రకటన చేశారు.

పోలీస్ అధికారి కాల్పుల్లో మరణించిన మహిళ సహా ఈ అల్లర్లలో నలుగురు మరణించినట్లు ఇప్పటికే నిర్ధరించారు.

కాగా నిర్ణీత విధానం ప్రకారం పదవి నుంచి దిగిపోవడానికి ఇంకా 13 రోజులు ఉండగానే ట్రంప్ అధ్యక్ష స్థానం నుంచి వైదొలగాలంటూ డెమొక్రాట్లు డిమాండ్ చేశారు.

ట్రంప్ ట్వీట్ల వల్ల మరింత హింస చెలరేగే ప్రమాదం ఉందన్న ఆందోళనల నడుమ ట్విటర్ నిన్న ఆయన ఖాతాను 12 గంటలపాటు నిలిపివేసింది.

12 గంటల నిలిపివేత అనంతరం ట్విటర్ ఖాతా తిరిగి యాక్సెస్ రావడంతో చేసిన ట్వీట్‌లో ట్రంప్.. ''అధ్యక్ష ఎన్నికల ఫలితాలను కాంగ్రెస్ ఇప్పుడు ధ్రువీకరించింది. జనవరి 20న కొత్త పాలన మొదలవుతుంది'' అన్నారు.

చనిపోయినవారు ఎవరు?

కేపిటల్ భవనంపై దాడిలో నలుగురు చనిపోయినట్లు ఇప్పటికే నిర్ధరించారు.

ఓ పోలీస్ అధికారి కాల్పులు జరపడంతో కాలిఫోర్నియాలోని శాన్ డియాగోకు చెందిన ఎయిర్ ఫోర్స్ మాజీ అధికారిణి ఆష్లీ బబిట్(35) మరణించారు.

ఈ అల్లర్లలో మరో ముగ్గురు కూడా మరణించారు. వైద్యపరమైన అత్యవసర పరిస్థితి ఏర్పడడం వల్ల వారు చనిపోయారని అధికారులు చెప్పారు.

పెన్సిల్వేనియాకు చెందిన బెంజమిన్ ఫిలిప్స్(50), అలబామాకు చెందిన కెవిన్ గ్రీసన్(55), జార్జియాకు చెందిన రోసన్నె బాయ్‌లాండ్ (34)గా వారిని అధికారులు గుర్తించారు.

జో బైడెన్, కమలా హారిస్

ఫొటో సోర్స్, EPA/BIDEN CAMPAIGN/ADAM SCHULTZ

కాగా అమెరికా తదుపరి అధ్యక్షుడిగా జో బైడెన్, ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ ఎన్నికను యూఎస్ కాంగ్రెస్ ధ్రువీకరించింది.

పెన్సిల్వేనియా, ఆరిజోనా రాష్ట్రాల ఓట్లపై వచ్చిన అభ్యంతరాలను సెనేట్‌, ప్రతినిధుల సభ రెండూ తోసిపుచ్చిన తరువాత ఎలక్టోరల్ ఓట్లను ధ్రువీకరించింది.

బుధవారం నాడు కాంగ్రెస్ చేపట్టిన విధాన ప్రక్రియకు ట్రంప్ మద్దతుదారులు క్యాపిటల్ హిల్ మీదకు దాడి చేయడంతో అంతరాయం ఏర్పడింది.

దాడికి పాల్పడిన వ్యక్తులను భవనం నుంచి పంపించిన తరువాత సభ మళ్లీ మొదలై రాత్రంతా కొనసాగింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)