జాక్ మా: మూడు నెలల తరువాత కనిపించిన అలీబాబా గ్రూప్ వ్యవస్థాపకుడు - Newsreel

ఫొటో సోర్స్, Getty Images
అలీబాబా గ్రూప్ వ్యవస్థాపకుడు జాక్ మా 2020 అక్టోబరు తరువాత మళ్లీ ఇప్పుడు ప్రజలకు కనిపించారు.
జాక్ మా వ్యాపార సామ్రాజ్యంపై చైనా నియంత్రణ సంస్థల ఆంక్షలు, చర్యల తరువాత ఆయన కనిపించడం ఇదే తొలిసారి.
బుధవారం ఆయన ఒక వీడియో సమావేశం ద్వారా 100 మంది గ్రామీణ ఉపాధ్యాయులతో భేటీ అయ్యారని స్థానిక ప్రభుత్వ మీడియా వర్గాలు వెల్లడించాయి.
ఈ వార్త తెలిసిన తరువాత హాంకాంగ్ స్టాక్ ఎక్స్చేంజ్‌లో అలీబాబా షేర్ ధర 5 శాతం పెరిగింది.
తన సొంత ధార్మిక సంస్థకు సంబంధించిన ఓ కార్యక్రమంలో భాగంగా జాక్ మా బుధవారం గ్రామీణ ఉపాధ్యాయులతో వీడియో సమావేశంలో పాల్గొన్నట్లు ఝెజియాంగా్ ప్రావిన్స్ ప్రభుత్వ మద్దతు ఉన్న తియాన్ము న్యూస్ తెలిపింది.
ఏటా జాక్ మా ఈ కార్యక్రమాన్ని రిసార్ట్ సిటీ సాన్యాలో నిర్వహిస్తారు కానీ ఈ ఏడాది కోవిడ్ కారణంగా ఆన్‌లైన్‌లో నిర్వహించారు.
''కోవిడ్ కారణంగా ఈసారి మనం సాన్యాలో కలవలేకపోయాం'' అని జాక్ మా తన ప్రసంగంలో కూడా చెప్పారు.
'కరోనా మహమ్మారిని పారదోలాక మనమంతా సాన్యాలో మళ్లీ కలుద్దాం'' అన్నారాయన.
ఆ వీడియోలో జాక్ మా నీలం రంగు టీషర్ట్ వేసుకుని కనిపించారు. నేరుగా కెమేరా ముందుకొచ్చి ఆయన మాట్లాడారు.
అయితే, ఆయన ఎక్కడి నుంచి మాట్లాడారన్నది మాత్రం తియాన్ము న్యూస్ తన వార్తలో వెల్లడించలేదు.
షాంఘైలో 2020 అక్టోబరులో నిర్వహించిన ఓ కార్యక్రమంలో చైనా బ్యాంకింగ్ వ్యవస్థపై విమర్శలు చేసిన తరువాత నుంచి జాక్ మా కనిపించడం లేదంటూ అనేక మీడియాల్లో వార్తలొచ్చాయి.
ఆ తరువాత ఈ నెల ప్రారంభంలో ఆయన జడ్జిగా వ్యవహరించాల్సి ఉన్న 'ఆఫ్రికా బిజినెస్ హీరోస్' అనే టీవీ కార్యక్రమానికి కూడా వెళ్లకపోవడంతో మరిన్ని అనుమానాలు వ్యక్తమయ్యాయి.

ఫొటో సోర్స్, Reuters
ట్రంప్: అధ్యక్ష పీఠం నుంచి దిగడానికి కొన్ని గంటల ముందు సన్నిహితుడు బ్యానన్‌తో పాటు 73 మందికి క్షమాభిక్ష
ప్రజలను మోసం చేశారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న తన మాజీ సలహాదారుడు స్టీవ్ బ్యానన్‌కు డోనల్డ్ ట్రంప్ క్షమాభిక్ష పెట్టారు. అమెరికా అధ్యక్షుడిగా తన పదవీ కాలం పూర్తయ్యే ఒకరోజు ముందు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.
ర్యాపర్ లిల్ వెయిన్ పెట్టుకున్న క్షమాభిక్ష అభ్యర్థనకు కూడా ట్రంప్ ఆమోదం తెలిపారు. మరో ర్యాపర్ కోడక్ బ్లాక్, డెట్రాయిట్ మాజీ మేయర్ క్వేమ్ కిల్‌పాట్రిక్‌లకు కూడా శిక్షలు తగ్గించారు.
మొత్తంగా 73 మందికి ట్రంప్ క్షమాభిక్ష పెట్టారని, మరో 70 మందికి శిక్షలు తగ్గించారని వైట్‌హౌస్ ఒక ప్రకటన విడుదల చేసింది.
2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో ట్రంప్‌కు సలహాదారుడిగా, ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన ప్రముఖుల్లో బ్యానన్ కూడా ఒకరు. అమెరికా మెక్సికో సరిహద్దుల్లో గోడ నిర్మాణం కోసం సేకరించిన నిధుల్లో అవకతవకలకు పాల్పడ్డారంటూ గత ఏడాది ఆగస్టులో బ్యానన్‌పై ఆరోపణలు వచ్చాయి.

ఫొటో సోర్స్, Reuters
దాతల నుంచి ఒక మిలియన్ డాలర్ల కంటే ఎక్కువే నిధులను బ్యానన్ సేకరించారని, వీటిలో చాలా మొత్తాన్ని వ్యక్తిగత ఖర్చుల కోసం ఆయన ఉపయోగించుకున్నారని విచారణకర్తలు ఆరోపించారు. అయితే, ఆ ఆరోపణలను బ్యానన్ ఖండించారు.
బ్యానన్ చాలా ముఖ్యమైన నాయకుడని, ఆయనకు రాజకీయాలపై మంచి దృక్పథముందని చెబుతూ ట్రంప్ క్షమాభిక్ష పెట్టారు.
మరోవైపు లిల్ వెయిన్, కోడక్ బ్లాక్ అక్రమ ఆయుధాలు కలిగివున్నట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు. క్విల్‌పాట్రిక్‌పై అవినీతి ఆరోపణలు వచ్చాయి.
పదవి నుంచి దిగిపోయే ముందు అమెరికాలో అధ్యక్షులు చాలా మందికి క్షమాభిక్ష పెడుతుంటారు. కొన్ని నెలలుగా ట్రంప్ కూడా చాలా మందికి వరుసగా క్షమాభిక్ష పెడుతూ వచ్చారు. సన్నిహితులతోపాటు తనతో కలిసి పనిచేసిన పాల్ మెనాఫోర్ట్ లాంటి వారు కూడా క్షమాభిక్ష పొందినవారిలో ఉన్నారు.
ఇవి కూడా చదవండి:
- ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా: భారత క్రికెట్‌ను మార్చిన ఒక మ్యాచ్ కథ
- సూర్యుడ్ని కోల్పోయిన బీచ్.. ఇక్కడ పట్టపగలైనా చలి, చీకటే...
- అమెరికాలో ఆకలి కేకలు.. ఆహారం దొరక్క సంపన్న ప్రాంతాల్లోనూ ప్రజల ఇబ్బందులు
- ఒసామా బిన్ లాడెన్‌ను చంపడానికి ఎలా వ్యూహం పన్నామంటే..: వివరించిన ఒబామా
- సింగర్ సునీత వివాహం: మహిళలు రెండో పెళ్లి చేసుకోవడం తప్పా
- భారత్‌ను పొగిడిన పాకిస్తానీ టీవీ ప్రజెంటర్ - దేశద్రోహి అంటున్న నెటిజన్లు.. సమర్థిస్తున్న సెలబ్రిటీలు
- బంగారం స్మగ్లింగ్‌లో భారత్ గుత్తాధిపత్యానికి తెరదించిన పాకిస్తాన్ 'గోల్డ్ కింగ్'
- అర్నబ్ గోస్వామి వాట్సాప్ చాట్ లీక్ వివాదం.. ఇమ్రాన్ ఖాన్ వరుస ట్వీట్లు.. మోదీపై ఆరోపణలు
- సింగపూర్: కోట్లు ఇస్తామన్నా ఈ రెండు ఇళ్ల యజమానులు కదలటం లేదు.. ఎందుకు?
- కోడి రామ్మూర్తి నాయుడు: ‘కలియుగ భీముడు’గా పేరు తెచ్చుకున్న ఈ తెలుగు వీరుడి కథేంటి?
- సెక్స్ అపోహలు: లైంగిక భాగస్వాములు ఎవరికి ఎక్కువగా ఉంటారు... పరిశోధనలు ఏం చెబుతున్నాయి?
- చైనాలో వార్తలు కవర్ చేయడానికి వెళ్లిన బీబీసీ బృందాన్ని ఎలా వెంటాడారంటే..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








