ISWOTY - సుశ్రీ దివ్యదర్శిని ప్రధాన్: ఒడిశా నుంచి దూసుకొచ్చిన ఆఫ్-స్పిన్నర్

సుశ్రీ దివ్యదర్శిని

ఒడిశా నుంచి వచ్చి, జాతీయ స్థాయి క్రికెట్లో రాణించిన మహిళా క్రీడాకారులు తక్కువే. కానీ సుశ్రీ దివ్యదర్శిని ప్రధాన్ తనకున్న పరిమితమైన వనరులను ఆసరాగా చేసుకుని మొక్కవోని పట్టుదలతో జాతీయ స్థాయి మహిళా క్రికెటర్‌గా ఎదిగారు.

ఈ కుడి చేతి వాటం ఆఫ్-స్పిన్నర్ ఒడిశా టీం తరపున ఆడడమే కాకుండా, జాతీయ స్థాయిలో వుమెన్ అండర్-23 ఛాలెంజర్ ట్రోపీలో ఇండియా గ్రీన్ టీంకు కెప్టెన్‌గా 2019లో జట్టును ఫైనల్స్‌కు నడిపించారు.

2020లో యూఏఈలో జరిగిన వుమెన్స్ టీ20 ఛాలెంజ్‌లో శుశ్రీ పాలుపంచుకున్నారు. భారత్ సీనియర్ క్రికెటర్ మిథాలీ రాజ్ నాయకత్వం వహించిన వెలాసిటీ క్రికెట్ జట్టులో శుశ్రీ ఆడారు. ఈ టోర్నమెంట్‌ను బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) నిర్వహించింది.

చిన్నప్పటినుంచే క్రికెట్ అంటే ఇష్టం

ఏడేళ్ల వయసులో సుశ్రీ తన తోటి పిల్లలతో క్రికెట్ ఆడడం ప్రారంభించారు. క్రికెట్‌ను తన కెరీర్‌గా మలుచుకోవాలని అప్పట్లో ఆమె అనుకోలేదు.

ఇండియాకు ఒక మహిళా క్రికెట్ జట్టు ఉందని కూడా ఆమెకు తెలీదు. మహిళలు క్రికెట్‌ను వృత్తిగా ఎంచుకోవచ్చన్న అవగాహన లేదు.

సుశ్రీకి అథ్లెటిక్స్‌లో శిక్షణ ఇప్పించాలని ఆమె తండ్రి భావించారు. కానీ, ఆమె క్రికెట్‌ పైనే ఇష్టాన్ని కనబర్చారు.

స్థానిక 'జాగృతి క్రికెట్ క్లబ్'‌లో చేరి కోచ్ ఖిరోడ్ బెహరా దగ్గర శిక్షణ పొందడం ప్రారంభించారు.

సుశ్రీ దివ్యదర్శిని

క్రికెట్ ఖరీదైన క్రీడ కావడంతో ప్రారంభ దశలో తను చాలా సవాళ్లను ఎదుర్కొన్నానని శుశ్రీ తెలిపారు. అంతే కాకుండా, ఒడిశాలో క్రికెట్ ఆడడానికి ఉన్న వనరులు, అవకాశాలు కూడా తక్కువే.

కానీ సుశ్రీ మక్కువతో, పట్టుదలతో క్రికెట్ నేర్చుకోవడం చూసి ఆమె తల్లిదండ్రులు కూడా తన వెంట నిలిచారు.

క్రమంగా, సుశ్రీ 2012లో ఈస్ట్ జోన్ అండర్ 19 వుమెన్స్ క్రికెట్ టీంకు ఎంపికయ్యారు.

తరువాత ఒడిశా సీనియర్ జట్టుకు ఆడడం మొదలుపెట్టారు. టీ20 క్రికెట్ టోర్నమెంట్లలో ఒడిశా అండర్-23 జట్టుకు నాయకత్వం వహించారు.

కెరీర్‌లో మలుపులు

2019 ఛాలెంజర్ ట్రోఫీ అండర్-23 టోర్నమెంట్‌లో ఇండియా గ్రీన్ టీంకు కెప్టెన్‌గా సుశ్రీ ఎంపిక కావడంతో ఆమె కెరీర్ మలుపు తిరిగింది.

ఆ టోర్నమెంట్‌లో సుశ్రీ అద్భుతమైన ప్రతిభ కనబరుస్తూ తన జట్టుకు ఫైనల్స్‌కు నడిపించారు. అయితే, ఫైనల్స్‌లో ఇండియా బ్లూ టీం చేతిలో ఓడిపోయారు.

తరువాత, ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఎసిసి) నిర్వహించిన వుమెన్స్ ఎమర్జింగ్ ఆసియా కప్ 2019 టోర్నమెంట్లో సుశ్రీ భారత జట్టు తరపున ఆడారు. ఆ టోర్నమెంట్‌లో ఇండియా జట్టు కప్పు గెలిచింది. భారతదేశం తరుపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా సుశ్రీ ఈ విజయంలో కీలక పాత్ర పోషించారు.

ఆ తరువాత 2020లో యూఏఈలో జరిగిన వుమెన్స్ టీ20 ఛాలెంజ్‌లో వెలాసిటీ జట్టుకు ఎంపికయ్యారు.

ఈ టోర్నమెంట్‌లో భాగం పంచుకోవడం వలన అంతర్జాతీయ స్థాయి క్రికెటర్లతో ఆడే అవకాశం దక్కిందని, వారినుంచీ తాను ఎంతో నేర్చుకున్నానని సుశ్రీ తెలిపారు.

ప్రస్తుతం భారత మహిళా క్రికెటర్ల సీనియర్ జట్టులో స్థానం సంపాదించేందుకు ఆమె కృషి చేస్తున్నారు. ఏదో ఒకరోజు ఇండియాకు వరల్డ్ కప్ సాధించే జట్టులో తానూ ఉంటానని కలలు కంటున్నారు.

అయితే, క్రికెట్ ఆడే మహిళలకు ఆర్థిక భద్రత ప్రధాన సమస్యగానే ఉంటోందని సుశ్రీ భావిస్తున్నారు.

ప్రతిభావంతులైన మహిళా క్రీడాకారులకు ఆర్థిక భద్రత కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చురుకైన పాత్ర పోషించాలని ఆమె అంటున్నారు.

ఉదాహరణకు, తూర్పు భారతదేశానికి చెందిన రాష్ట్రాల మహిళా క్రీడాకారులకు తూర్పు రైల్వేస్‌లో మరిన్ని ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కల్పించాలని, ఆర్థిక భద్రత ఉంటే మహిళలు తమ ఆట మీద మరింత దృష్టి పెట్టగలుగుతారని సుశ్రీ అభిప్రాయపడ్డారు.

(సుశ్రీ దివ్యదర్శిని ప్రధాన్ బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూ ఈ కథనానికి ఆధారం)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)