పూజ గెహ్లాట్: రెజ్లర్‌గా మారిన వాలీబాల్ క్రీడాకారిణి - BBC ISWOTY

పూజ గెహ్లాట్

పూజ గెహ్లాట్‌కి చిన్నప్పటి నుంచే క్రీడలంటే ఆసక్తి ఉండేది. ఆమె రెజ్లింగ్ సాధన కోసం అఖాడాకి తన మేనమామ ధర్మవీర్ సింగ్‌తో పాటు వెళ్తున్నప్పుడు ఆమె వయస్సు కేవలం 6 సంవత్సరాలు.

ఆమెకు రెజ్లింగ్‌పై ఆసక్తి పెరిగింది. కానీ, ఆమె తండ్రి విజేందర్ సింగ్‌కి మాత్రం ఆమె రెజ్లర్ అవ్వాలనుకుంటున్న ఆలోచన నచ్చలేదు.

రెజ్లింగ్ కాకుండా మరేదైనా క్రీడలో ప్రావీణ్యం సంపాదించుకోమని ఆయన సూచించారు. దాంతో ఆమె వాలీబాల్ క్రీడను ఎన్నుకుని జూనియర్ జాతీయ స్థాయిలో ఆడటం ప్రారంభించారు.

కానీ, హరియాణాకు చెందిన గీత ఫోగట్, బబిత కుమారి ఫోగట్ దిల్లీలో 2010లో జరిగిన కామన్ వెల్త్ క్రీడల్లో పతకాలు సాధించడం చూసిన తర్వాత ఆమె జీవితం మారిపోయింది.

ఫోగట్ అక్క చెల్లెళ్ళ దారిలోనే నడవాలని గెహ్లాట్ నిశ్చయించుకున్నారు.

ఆమె నిర్ణయం ఆమె తండ్రిని అంతగా ఆకట్టుకోలేదు. కానీ, ఆమె సాధనకు అడ్డురామని, అందుకు తగిన ఏర్పాట్లు ఆమే చేసుకోవాలని చెప్పారు.

తద్వారా ఆమెకు రెజ్లింగ్‌పై ఉన్న ఆసక్తి త్వరలోనే సమసిపోతుందని ఆయన భావించారు.

ఆరంభంలోనే ఆటంకాలు

ఆమె నివాసం ఉన్న నరేలాలో అమ్మాయిలు రెజ్లింగ్ నేర్చుకునేందుకు తగిన శిక్షణా సౌకర్యాలు లేకపోవడంతో ఆమెకు రెజ్లింగ్‌లో శిక్షణ తీసుకోవడం అంత సులభంగా జరగలేదు.

దాంతో ఆమె శిక్షణ తీసుకోవడానికి దిల్లీకి వెళ్లాల్సి వచ్చింది. తాను నగరానికి చేరడానికి బస్సులో రోజుకి 3 గంటలు ప్రయాణం చేయవలసి వచ్చేది అని పూజ గెహ్లాట్ చెప్పారు. అందుకోసం ఆమె తెల్లవారుజామున 3 గంటలకు లేచేవారు.

విలువైన సమయమంతా ప్రయాణంలోనే పోతుండటంతో ఇంటి దగ్గరలో ఉన్న అబ్బాయిలకు శిక్షణ ఇచ్చే రెజ్లింగ్ కేంద్రంలోనే శిక్షణ తీసుకోవాలని ఆమె నిర్ణయించుకున్నారు.

అబ్బాయిలతో కలిసి రెజ్లింగ్ చేయడాన్ని ఆమె కుటుంబం, బంధువులు సానుకూలంగా తీసుకోలేదు. కానీ, ఆమె ఆసక్తి, పడుతున్న శ్రమను చూసి ఆమె తండ్రి మాత్రం చాలా సంతోషించారు. ఆమె శిక్షణ కోసం రోహతక్‌కి కుటుంబాన్ని తరలించాలని నిర్ణయించుకున్నారు.

విజయం ఆమె తలుపు తట్టింది

కుటుంబం నుంచి వస్తున్న సహకారంతో పూజ చాలా ఆనందించి, మరింత శ్రమించారు. దాంతో ఆమె 2016లో రాంచీలో జరిగిన జూనియర్ నేషనల్ రెజ్లింగ్ ఛాంపియన్ షిప్‌లో 48 కేజీల బరువు విభాగంలో స్వర్ణ పతకం సంపాదించారు.

కానీ, 2016లో తగిలిన గాయం ఆమెను ఒక సంవత్సరం పాటు రెజ్లింగ్‌కి దూరం చేసింది.

సరైన వైద్య సదుపాయాలు, దృఢ చిత్తం ఆమెను తిరిగి మైదానం మీదకు తెచ్చేందుకు సహకరించాయి.

2017లో తైవాన్‌లో జరిగిన ఆసియన్ జూనియర్ ఛాంపియన్ షిప్ 51 కేజీల విభాగంలో పూజ స్వర్ణ పతకం సాధించారు.

2019లో హంగరిలోని బుడాపెస్ట్‌లో జరిగిన అండర్ 23 రెజ్లింగ్ ఛాంపియన్ షిప్‌లో వెండి పతకం సాధించి మరో అడుగు ముందుకు వేశారు.

ఆమెకు సోనిపత్ తిరిగి రాగానే ఘన స్వాగతం లభించింది. ఆమె తన తల్లితండ్రులతో కలిసి అక్కడే నివాసం ఉంటున్నారు.

రెజ్లింగ్‌నే కెరీర్‌గా చేసుకోవడం పట్ల ఆమె తండ్రిని కూడా విమర్శించి, ముఖం చిట్లించిన ఇరుగు పొరుగు, బంధువులు ప్రస్తుతం ఆమె సాధించిన విజయాలు చూసి గర్వపడుతున్నారు.

క్రీడాకారిణులకు.. ప్రత్యేకంగా అల్పాదాయ వర్గాల నుంచి వచ్చే వారికి క్రీడా వాతావరణం మద్దతిచ్చేలా ఉండాలని, గెహ్లాట్ అన్నారు.

సాధారణంగా పేద కుటుంబాలకు చెందిన వారే క్రీడలను కెరీర్‌గా మలుచుకుంటారని చెప్పారు.

క్రీడలు ఆడేందుకు అవసరమైన ఖరీదైన ఆహారం, శిక్షణా సౌకర్యాలు అందించేందుకు ప్రభుత్వం కానీ, ఇతర క్రీడా సహకార సంస్థలు కానీ సహాయపడాలని ఆమె అభిప్రాయ పడ్డారు.

(ఈ కథనంలోని అంశాలు పూజ గెహ్లాట్ తో బీబీసీ ఈ-మెయిల్ ఇంటర్వ్యూ ఆధారంగా రాసినవి)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)