వైట్ టైగర్: హాలీవుడ్ సినిమాల్లో అసలైన భారతదేశాన్ని చూపించేదెప్పుడు

ఫొటో సోర్స్, NETFLIX
'ది వైట్ టైగర్'.. భారతీయ సమాజంపై కన్నేసిన తాజా హైప్రొఫైల్ చిత్రం ఇది.
కానీ, భారత్ గురించి కరెక్టుగానే చెప్పిందా అని 'చారుకేసి రామదురై' ప్రశ్నిస్తున్నారు.
నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన కొత్త చిత్రం 'ది వైట్ టైగర్'లోని ఒక సన్నివేశంలో గొప్పింటి బిడ్డ అయిన వ్యాపారవేత్త అశోక్(రాజ్ కుమార్ రావు) తన డ్రైవర్ బలరామ్ హల్వాయి(ఆదర్శ్ గౌరవ్)పై 'నీకు అసలైన భారతదేశం తెలుసు' అని అంటాడు.
అప్పటికి వారిద్దరూ దిల్లీలోని ఓ ధాబాలో ఉంటారు.
అప్పటికప్పుడు తిని వెళ్లిపోవడానికి భారత్‌లో ఇలాంటి రెస్టారెంట్లు చాలా ఉంటాయి. అక్కడి భోజనం సాదా భోజనంలాగే ఉంటుంది. బలరాం దాదాపుగా ప్రతి రోజూ అలాంటి భోజనమే తింటాడు. కానీ, అశోక్ పరిస్థితి వేరు.. భారతదేశమనే పజిల్‌ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న ఆయనకు ఈ భోజనం మరో చిక్కుముడిలాగే ఉంది.
తన ఇండియన్ అమెరికన్ భార్యను వెంటబెట్టకుని అమెరికా నుంచి వచ్చిన ఆయనకు 100 కోట్ల మందికిపైగా ఉన్న భారతీయ మార్కెట్ తన కొత్త వ్యాపార ఆలోచనలకు ఎంతవరకు పనికొస్తుందన్న విషయం ఇంకా పూర్తిగా అర్థం కాలేదు.

ఫొటో సోర్స్, NETFLIX
అశోక్ లాగే పాశ్చాత్య సినీ దర్శకనిర్మాతలు అసలైన భారతదేశాన్ని చూడడానికి, తమ సినిమాల్లో చూపించడానికి ఎంతోకాలంగా ప్రయత్నిస్తున్నారు.
ఈ క్రమంలో వారు భారత్‌ను ఒక అర్థం కాని వైరుధ్యాల కలబోతగా.. పేదరికానికి, అపారమైన అవకాశాలకు, మార్మికతకు కేంద్రంగా ఊహించుకుంటూవస్తున్నారు. అంతేకాదు... భారత్ అంటే చామనఛాయ గల మనుషులుండే దేశమన్నది వారి లెక్క.
2008లో మేన్ బుకర్ ప్రైజ్ గెలుచుకున్న అరవింద్ అడిగ పుస్తకం 'ది వైట్ టైగర్' ఆధారంగా వచ్చిన ఈ చిత్రంలో అసలైన భారతాన్ని చూపిస్తారో లేదో కానీ భారతీయులు మాత్రం ఈ సినిమాలో నటిస్తున్నారు.
1968లో వచ్చిన సినిమా 'ది పార్టీ'లో హృంది బక్షిగా పీటర్ సెల్లర్స్.. 1984లో వచ్చిన 'ది పాసేజ్ టు ఇండియా'లో ప్రొఫెసర్ గోడ్బోలే పాత్రలో సర్ అలెక్ గిన్నెస్ భారతీయుల్లా నటించడానికి ప్రయత్నించారు.
కానీ.. ఈ ఎక్కువమంది భారతీయులను నటింపజేయడం ద్వారా 'ది వైట్ టైగర్' మాత్రం ఒక అడుగు ముందుకు వేసిందనే చెప్పాలి.
'ది వైట్ టైగర్' దర్శకుడు రమీన్ బహ్రానీ ఇరానియన్ అమెరికన్. ఈ సినిమాలో ఎక్కువ మంది భారతీయులు నటించడం గురించి చెబుతూ ఆయన.. ''మొట్టమొదటిసారి నా చుట్టూ ఉన్న నటులంతా నాలాగే కనిపించారు. అంతా చామనఛాయలో ఉన్నారు. అంతకుముందు నేను తీసిన సినిమాల్లో ఎప్పుడూ ఇలా జరగలేదు'' అన్నారు.
ముంబయి కేంద్రంగా నిర్మితమైన ఈ సినిమా విషయంలో ముందు అనుకునే ఇలా భారతీయ నటులను తీసుకున్నారు.
ప్రియాంక చోప్రా ఇందులో నటించారు. ప్రస్తుతం హాలీవుడ్‌లో హైప్రొఫైల్ ఇండియన్ యాక్టర్ అయిన ఆమె ఈ చిత్ర ఎగ్జిక్యూటివ్ నిర్మాతల్లో ఒకరు కూడా.
ఈ సినిమాలో ఆమె అశోక్ భార్య పింకీ పాత్రలో నటించారు.
తమ సినిమాల్లో భారతీయ నటులను తీసుకోవడంపై రమీన్ మాట్లాడుతూ 2010లో వచ్చిన హాలీవుడ్ సినిమా 'ది సోషల్ నెట్‌వర్క్'ను కూడా ఉదాహరణగా చెప్పారు. ఆ సినిమాలో కూడా భారతీయ పాత్ర దివ్య నరేంద్ర కోసం భారతీయులను కాకుండా బ్రిటిష్-చైనీస్ మూలాలున్న మ్యాక్స్ మింఘెల్లా పోషించారని గుర్తు చేశారు.

ఫొటో సోర్స్, Alamy
హాలీవుడ్‌కు భారత్‌కు ఉన్న సంబంధం గురించి మాట్లాడుకుంటే భారతీయ ప్రతిభకు హాలీవుడ్ స్వాగతం చెబుతుందనే అనాలి.
గత రెండు దశాబ్దాలలో ప్రియాంకా చోప్రా మాత్రమే కాకుండా మరికొందరు భారతీయ నటులు ముంబయి నుంచి లాస్ ఏంజెలిస్‌కో, లండన్‌కో వెళ్లారు.
ఇర్ఫాన్ ఖాన్(ది నేమ్‌సేక్, ది లైఫ్ ఆఫ్ పై, స్లమ్ డాగ్ మిలియనీర్), దీపికా పదుకోణ్(ఎక్స్ఎక్స్ఎక్స్: రిటర్న్ ఆఫ్ జాండర్ కేజ్), అనిల్ కపూర్(స్లమ్ డాగ్ మిలియనీర్, మిషన్ ఇంపాజిబుల్: ఘోస్ట్ ప్రొటోకాల్), ఐశ్వర్య రాయ్ (పింక్ పాంథర్ 2, బ్రైడ్ అండ్ ప్రిజుడీస్), అమితాబ్ బచ్చన్ (ది గ్రేట్ గాట్స్‌బే) వంటివారిని ఇందుకు ఉదాహరణగా చెప్పొచ్చు.
'ది వైట్ టైగర్' కంటే ముందు 1982లో వచ్చిన గాంధీ చిత్రానికి ఎక్కువ మంది భారతీయ నటులు, టెక్నిషియన్లు పనిచేశారని 'ఫిల్మ్ కంపేనియన్' వెబ్‌సైట్ ఎడిటర్, సినీ విమర్శకుడు భరద్వాజ్ రంగన్ చెప్పారు. అయితే, దాన్ని హాలీవుడ్ సినిమాగా చెప్పలేమని.. బ్రిటిష్ ప్రొడక్షన్ అని చెప్పారు.
భారతీయ నటులతో సినిమాలు తీసే విషయంలో అమెరికా కంటే బ్రిటన్ ముందుందని 'బాంబే టు బాలీవుడ్' పుస్తక రచయిత, వర్జీనియా యూనివర్సిటీ మీడియా స్టడీస్ ప్రొఫెసర్ అశ్విన్ పూనాథంబేకర్ చెప్పారు.
'ది గ్రేట్ బ్రిటిష్ బేక్ ఆఫ్' వంటి టీవీ షోల్లో కూడా భారతీయులు పోటీపడ్డారని.. కొందరైతే షో విజేతలుగా కూడా నిలిచారని అశ్విన్ చెప్పారు.
ఆర్చీ పంజాబీ, సంజీవ్ భాస్కర్ వంటివారు కేవలం భారతీయ పాత్రలే కాకుండా ఇతర ప్రధాన పాత్రలనూ పోషించారని అశ్విన్ గుర్తు చేశారు.
బ్రిటిష్ ప్రొడక్షన్ సినిమాల్లో భారతీయులు నటించడమనేది చాలాకాలంగా ఉంది. 'మర్చంట్ ఐవరీస్ ద హౌస్ హోల్డర్'(1963), షేక్‌స్పియర్ వాలా(1965) సినిమాల్లో శశి కపూర్ నటించారు. సయీద్ జాఫ్రీ కూడా అనేక సినిమాలు, టీవీ షోల్లో నటించారు.
ఇప్పుడు కూడా పద్మలక్ష్మి, మిందీ కలింగ్ వంటి భారతీయ అమెరికన్లు అక్కడి టీవీ కార్యక్రమాల్లో నటిస్తున్నారని అశ్విన్ చెప్పారు.
హాలీవుడ్ సినిమాల్లో ప్రధాన పాత్రల కోసం భారతీయ నటులు.. మరీ ముఖ్యంగా బాలీవుడ్ నుంచి ప్రయత్నించడం ఇటీవలి కాలంలో ఎక్కువైంది.
అయితే, పాశ్చాత్య సినిమాలలో భారత్‌ను, భారతీయులను ఎలా చూపిస్తున్నారని వేరే కథ.
స్లమ్ డాగ్ మిలియనీర్ ప్రభావం..
ఇటీవలి దశాబ్దాలలో చూసుకుంటే భారతదేశం గురించి చూపించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన సినిమా ఏదైనా ఉందంటే అది స్లమ్ డాగ్ మిలియనీర్. 2008లో ఆస్కార్ అవార్డు సాధించిన ఈ సినిమాలో ఒక నిరుపేద ధనికుడెలా అయ్యడన్న కథాంశం ప్రపంచమంతటినీ ఆకట్టుకుందని భరద్వాజ రంగన్ చెప్పారు.
అవాంతరాలను ఎదుర్కొని ఎలా గెలిచాడన్నది అక్కడ ముఖ్యం. ఆఫ్రికా నేపథ్యంలోనో.. లేదంటే అమెరికాలోని స్లమ్‌ల నేపథ్యంలోనో తీసినా కూడా ఈ సినిమాకు అలాంటి ఆదరణే వస్తుందని రంగన్ అన్నారు.
అయితే, ఈ సినిమా దక్షిణాసియా ముఖాలకు హాలీవుడ్‌లో అవకాశాలు దక్కించుకోవడానికి మార్గమేసిందని అశ్విన్ అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Alamy
అయితే, ఇప్పటికీ హాలీవుడ్ భారత్‌ను చూసే విధానం వేరని.. బాక్స్ ఆఫీస్ మార్కెట్ పరంగా ఒకలా.. కథాంశాలు, ప్రతిభ కోసం మరోలా చూస్తుందని అశ్విన్ అన్నారు.
''సహ నిర్మాణం, సినిమా పంపిణీ ఒప్పందాల కోసం భారత్‌ను మంచి అవకాశంగా చూస్తారు. చైనా తరువాత ఇది అత్యంత విలువైన మార్కెట్. కానీ, కథాంశాల సంగతికొస్తే భారత్‌కు ప్రాధాన్యం తక్కువ'' అన్నారు అశ్విన్.
స్లమ్ డాగ్ మిలియనీర్, ది వైట్ టైగర్ వంటి సినిమాలు కూడా పుస్తకాల ఆధారంగా వచ్చిన కథలు. అవి కూడా ఇంగ్లిష్‌లో వెలువడి అప్పటికే అంతర్జాతీయంగా బాగా ఆదరణ పొందిన పుస్తకాలు.
భారత్‌ను ఆధ్యాత్మిక వికాస కేంద్రంగా చూపుతూనో.. లేదంటే పేదరికం, సెక్స్, కుల.. వర్గ విభజన వంటి నేపథ్యాలతోనే సినిమాలు వస్తున్నాయి.
కానీ, అసలైన భారతదేశం ఈ థీమ్‌లలో ఇమడదు.. వీటన్నిటికీ మించినది.
ఇక 'ది వైట్ టైగర్' విషయానికే వస్తే సరదాగా సాగిపోయే చిత్రమని రమీన్ చెప్పారు. అయితే, అంతర్లీనంగా ఇందులో ఒక మోస్తరు భావావేశమూ కనిపిస్తుందని చెప్పారు.
భారతదేశంలోని సంక్లిష్టమైన వర్గ విభజనపైనా ఈ సినిమా ఒకింత దృక్పథాన్ని కల్పిస్తుంది.
''ఇప్పుడు కమలా హారిస్ అమెరికా ఉపాధ్యక్షురాలైన తరువాతైనా భారత్, దక్షిణాసియా గురించి పాశ్చాత్య ప్రపంచం మరింతగా తెలుసుకుంటుందని, చర్చిస్తుందని ఆశిస్తున్నాను'' అన్నారు అశ్విన్.
ఇవి కూడా చదవండి:
- అతి సాధారణ మహిళలు నాజీ క్యాంపుల్లో ‘రాక్షసుల్లా’ ఎలా మారారు?
- ఫీటల్ ఆల్కహాల్ సిండ్రోమ్: గర్భిణులు మద్యం తాగితే పుట్టబోయే పిల్లలకు ఎంత ప్రమాదం
- సింగపూర్: రహస్యంగా స్నేహితుడిని కలిసిందన్న కారణంతో కరోనా సోకిన మహిళకు జైలు శిక్ష
- విదేశాల నుంచి ఆయుధాలు కొనుగోలు చేసే భారత్ 'ఆకాశ్' క్షిపణిని ఎలా విక్రయించబోతోంది?
- అమెరికాలో ఒప్పంద వ్యవసాయం ఎలా సాగుతుంది?
- అయిదేళ్లుగా స్నానం చేయడం మానేసిన డాక్టర్.. అసలు రోజూ స్నానం అవసరమా?
- దక్షిణ కొరియాలో ప్రమాద ఘంటికలు, తగ్గిన జననాలు, పెరిగిన మరణాలు
- కడుపు పెరుగుతుంటే కవల పిల్లలనుకున్నారు.. డాక్టర్ చెప్పింది విని ఆశ్చర్యపోయారు
- జాక్ మా: ఈ చైనా బిలియనీర్ రెండు నెలల్లో రూ.80వేల కోట్లు ఎలా కోల్పోయారు?
- మాల మాస్టిన్లు: పొట్టకూటి కోసం ప్రమాదానికి ఎదురెళ్లే ఈ సాహసగాళ్లు ఎవరు
- "నేనెలాగూ బ్రతకను.. నా బిడ్డను అయినా కాపాడండి" - మరణం అంచుల దాకా వెళ్లిన 22 ఏళ్ల మహిళ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








