కడపలో పది రూపాయల డాక్టర్ నూరి పర్వీన్: ‘వైద్యం చేస్తే రూ.10, బెడ్ ఫీజు రూ.50’

పది రూపాయల డాక్టర్ నూరి పర్వీన్
ఫొటో క్యాప్షన్, నూరి పర్వీన్
    • రచయిత, వి.శంకర్
    • హోదా, బీబీసీ కోసం

విద్యా, వైద్య రంగాల్లో వ్యవహారాలు ఖరీదుగా మారిపోయాయని, వీటిలో ప్రజలకు ఎంత సేవ చేసినా తక్కువేనని అంటున్నారు యువ వైద్యురాలు నూరి పర్వీన్.

వీలైన రీతిలో తాను కూడా సేవ చేయాలని నిర్ణయించుకున్న ఆమె... కడప నగరంలో పేద ప్రజలకు రూ.10 ఫీజు తీసుకుంటూనే వైద్య సేవలు అందిస్తున్నారు.

క్లినిక్‌లో వైద్య సేవలు అందిస్తూనే ఇతర సేవా కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాలుపంచుకున్నారు.

కడప పాత బస్టాండ్ సమీపంలోని ఓ బస్తీలో పర్వీన్ క్లినిక్ ఉంది.

ఎంబీబీఎస్ చదువు కోసం కడపలో అడుగుపెట్టిన ఆమె ఇప్పుడు ఆ నగరంలో చాలామందికి సుపరిచితురాలిగా మారారు.

సొంత ప్రాంతంలో పని చేస్తే తండ్రి చాటు బిడ్డగానే గుర్తింపు వచ్చేదని, కానీ కడపలో తనేంటో నిరూపించుకునే అవకాశం దక్కిందని ఆమె చెబుతున్నారు.

పర్వీన్ తల్లిదండ్రులు విజయవాడలో ఉంటారు. నిండా పాతికేళ్ల వయసు లేని పర్వీన్... వారికి దూరంగానే ఉండాల్సి వస్తోంది.

చదువు కోసం కడప వచ్చిన తనకు ఇక్కడి ప్రజలతో సాన్నిహిత్యం ఏర్పడడంతో వదిలి వెళ్లలేకపోతున్నానని ఆమె బీబీసీతో అన్నారు.

పది రూపాయల డాక్టర్ నూరి పర్వీన్

‘ఆసుపత్రులంటే భయం పోగొట్టాలి’

ప్రజల్లో ప్రభుత్వ ఆసుపత్రుల మీద అనుమానాలు, కార్పొరేట్ వైద్యం తమ వల్ల కాదన్న ఆందోళనలు ఉన్నాయని పర్వీన్ అభిప్రాయపడుతున్నారు.

అందుకే తన క్లినిక్‌లో రూ.10కే వైద్యం అందిస్తున్నానని చెప్పారు. పెద్ద ఆసుపత్రి కట్టి రూ.10కే వైద్యం అందించాలనే లక్ష్యం తనకు ఉందని బీబీసీతో ఆమె చెప్పారు.

"ప్రైవేటు ఆసుపత్రి మెట్లు ఎక్కడానికే సామాన్యులు భయపడుతుంటారు. వందలూ, వేలూ చెల్లించే స్తోమత లేక ఇబ్బందిపడుతుంటారు. రూ.10 ఫీజు తీసుకుంటూ వారికి అండగా నిలవడం ఆనందంగా ఉంది. ఈ రోజుల్లో రూ. 10 అంటే ఎవరికీ భారం కాదు. అందుకే పిల్లలు కూడా రూ. 10 పట్టుకుని వచ్చి నా ఆరోగ్యం ఎలా ఉందో చూస్తావా అని అడుగుతూ ఉంటారు. డాక్టర్ వైఎస్సార్, డాక్టర్ కమల్ పాషా వంటి వారు ఒక్క రూపాయికే చికిత్స చేశారని విన్నాను. ఇలాంటి సేవ చేస్తే నాకు కూడా చరిత్రలో చోటు దక్కుతుందని భావిస్తున్నాను" అంటూ పర్వీన్ వివరించారు.

పది రూపాయల డాక్టర్ నూరి పర్వీన్

‘లాక్‌డౌన్ లో కూడా సేవలు’

పర్వీన్ మూడేళ్ళ కిందట ఎంబీబీఎస్ పూర్తి చేశారు. ఆ తర్వాత కొద్దికాలం పాటు 104 వైద్యసేవల విభాగంలో పనిచేశారు.

అనంతరం ఒక ప్రైవేటు ఆసుపత్రిలో కొంతకాలం పనిచేశారు. ఆ సమయంలోనే పేదలకు సాయపడాలనే ఆలోచన మరింత బలపడిందని ఆమె చెబుతారు.

గత ఏడాది ఫిబ్రవరిలో కడపలోని మాసాపేటలో సొంతంగా ఓ అద్దె భవనంలో క్లినిక్ ప్రారంభించినట్లు చెప్పారు.

అంతలోనే కరోనా, లాక్‌డౌన్‌ వంటి ఆటంకాలు ఎదురయ్యాయి. అయినా, ఆమె వెనకాడలేదు.

‘‘కరోనా కాలంలో జ్వరంతో వచ్చే వాళ్లని చూడటానికి కార్పొరేట్‌ ఆసుపత్రులే నిరాకరించిన రోజుల్లోనూ పర్వీన్ తన సేవలు ఆపలేదు. లాక్‌డౌన్‌ సమయంలో రోజూ వందమందికి భోజన ఏర్పాట్లు కూడా చేసి, జనం ఆకలి తీర్చే ప్రయత్నం కూడా చేశారు. కరోనా వారియర్‌కు అసలు సిసలు అర్థంగా ఆమె నిలిచారు’’ అని కడప‌కు చెందిన వైద్యుడు వెంకట సుబ్బయ్య అన్నారు.

"ఆ సమయంలో ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రులన్నీ కొద్దికాలం పాటు మూతపడ్డాయి. ప్రభుత్వ వైద్యులం పనిచేశాం. పర్వీన్ క్లినిక్ కూడా నిరంతరాయంగా పనిచేసింది. విపత్తుల సమయంలో ప్రజల్లో అపోహలు పెరగకుండా వారిని అప్రమత్తం చేయడమే కాకుండా అనేక మంది ఆరోగ్యం కుదుటపడేలా చేయడంలో ఆమె కీలకపాత్ర పోషించారు" అని ఆయన వివరించారు.

పది రూపాయల డాక్టర్ నూరి పర్వీన్
ఫొటో క్యాప్షన్, కడప వరదల సమయంలో...

‘మొదటి నుంచే సేవా రంగంలో’

ఎంబీబీఎస్‌లో చేరడానికి ముందు నుంచే పర్వీన్ సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ వస్తున్నారు.

వైద్య విద్యార్థినిగా ఉన్నప్పుడు కడప రిమ్స్‌లో సైతం వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించారు.

రెండేళ్ల కిందటే రెండు సేవా సంస్థలను ఆమె ప్రారంభించారు. వాటిలో 'ఇన్‌స్పైరింగ్‌ హెల్తీ యంగ్‌ ఇండియా' ద్వారా విద్య, వైద్య అంశాలపై స్ఫూర్తి కలిగించేందుకు పలు కార్యక్రమాలను నిర్వహించారు.

తన తాతయ్య పేరు మీద ఏర్పాటుచేసిన 'నూర్‌ ఛారిటబుల్‌ ట్రస్టు' ద్వారా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

ఈ సేవలకు గుర్తింపుగా ఇప్పటికే పర్వీన్‌కు ఎన్నో సంఘాలు, సంస్థల్లో సభ్యత్వం లభించింది. కడప ఐఎమ్ఏ సహా అనేక సంస్థల కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషించే స్థాయికి ఆమె చేరుకున్నారు.

పది రూపాయల డాక్టర్ నూరి పర్వీన్

‘పెద్దాసుపత్రి కట్టి రూ. 10కే వైద్యం అందిస్తా’

ముస్లిం సామాజిక వర్గానికి చెందిన పర్వీన్ తన ఈ ప్రయాణంలో కొన్ని సామాజిక అడ్డంకులు ఎదురైనా వెనక్కి తగ్గలేదు.

‘‘మా తల్లిదండ్రుల నుంచే ఈ సేవాగుణం అబ్బింది. వాళ్లు ఇప్పుడు ముగ్గురు అనాథలను సొంత ఖర్చులతో చదివిస్తున్నారు. నేను కడపలో క్లినిక్‌ ప్రారంభించినప్పుడు అమ్మానాన్నలకూ చెప్పలేదు. రెండు నెలల తర్వాత విషయం తెలుసుకుని వాళ్లు ఎంతో సంతోషించారు’’ అని పర్వీన్ చెప్పారు.

‘‘ప్రస్తుతం మా క్లినిక్‌కి రోజూ సుమారు 100 మంది వస్తున్నారు. ఇన్‌పేషెంట్లకు బెడ్‌ ఫీజు కూడా రూ.50 మాత్రమే వసూలు చేస్తున్నా. నేను గానీ, నా మిత్రులు గానీ నిత్యం ఎవరో ఒక డాక్టర్ అందుబాటులో ఉండేలా చూసుకుంటున్నాం. అందుకే అందరికీ నమ్మకం పెరిగింది’’ అని ఆమె అన్నారు.

తాను మానసిక వైద్యశాస్త్రంలో పీజీ చేయాలనుకుంటున్నానని పర్వీన్ చెప్పారు.

‘‘భవిష్యత్తులో మల్టీస్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలనుకుంటున్నా. అప్పుడు కూడా తక్కువ ఫీజుకే వైద్య సేవల్ని అందించాలనుంది’’ అని ఆమె వివరించారు.

వీడియో క్యాప్షన్, నూరీ పర్వీన్: ఆమెను అందరూ 10 రూపాయల డాక్టర్ అంటారు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)