మదనపల్లె హత్యలు: ‘కాళికనని చెబుతూ.. నాలుక కోసి..’ - ప్రెస్‌ రివ్యూ

మదనపల్లె హత్యలు

చిత్తూరు జిల్లా మదనపల్లెలో కన్నబిడ్డలను హతమార్చిన ఘటనలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయని ఈనాడు ఓ కథనంలో తెలిపింది.

‘‘తనను తాను కాళికగా భావించుకున్న నా భార్య పద్మజ.. పెద్ద కుమార్తె అలేఖ్య (27)ను చంపిన తర్వాత ఆమె నాలుకను కోసి తినేసింది’ అని పురుషోత్తంనాయుడు వైద్యులకు తెలిపారు. పోస్టుమార్టం నివేదిక వచ్చాక.. దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

తాను పూర్వజన్మలో అర్జునుడినని అలేఖ్య చెప్పేదని పురుషోత్తం వైద్యులకు తెలిపారు. ‘కళాశాలలో పాఠాలు చెప్పడం నీ వృత్తి కాదు.. పాండవుల తరఫున అర్జునుడు ముందుండి నడిపిన పోరాటస్ఫూర్తిని కొనసాగించాలి’ అని అలేఖ్య తనకు చెప్పినట్టు ఆయన తెలిపారు.

‘కలియుగం అంతమై.. సత్యయుగం వస్తుందని అలేఖ్య అనేది. కరోనా కూడా ఇందుకు ఒక సూచిక అని చెప్పేది. ఈ మాటలన్నీ నిజమే. నేను చదివిన ఆధ్యాత్మిక పుస్తకాల్లోనూ ఈ విషయాలే ఉన్నాయి’ అని వైద్యులకు ఆయన చెప్పారు.

‘పురుషోత్తం, పద్మజ ఇద్దరికీ మానసిక వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో జైలు లాంటి వాతావరణంలో చికిత్స అందించాలి. అందుకే విశాఖలోని ప్రభుత్వ మానసిక చికిత్స కేంద్రానికి సిఫార్సు చేశాం’ అని తిరుపతిలోని రుయా మానసిక వైద్యనిపుణులు పేర్కొన్నారు.

పద్మజ మంత్రాలు పఠిస్తూ.. ‘నా బిడ్డలు తిరిగి వస్తున్నారు. ఇంటికి వెళ్లాలి. జైలులో తోడుగా ఉన్న శివుడు, కృష్ణయ్య ఇక్కడ కనిపించడం లేదు’.. అంటూనే వైద్యుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. పక్కగదిలో ఉన్న పురుషోత్తంనాయుడు ఏడుస్తూ వైద్యులతో మాట్లాడారు.

కరోనావైరస్

ఫొటో సోర్స్, Getty Images

వ్యాక్సీన్‌పై తప్పుడు పోస్టులు చేస్తే కఠిన చర్యలు

కరోనా వ్యాక్సీన్‌‌పై సోషల్ మీడియాలో ఎటువంటి వదంతులు సృష్టించొద్దని, షేర్ చేయవద్దని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు విజ్ఞప్తి చేసినట్లు వెలుగు దినపత్రిక ఓ కథనం ప్రచురించింది.

తప్పుడు పోస్టులు చేసేవారిపై డిజాస్టర్ మేనేజ్‌‌మెంట్ యాక్ట్‌‌ ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. వదంతుల కారణంగా వ్యాక్సీన్ తీసుకోవడానికి హెల్త్ స్టాఫ్ వెనుకాడుతుండటం, రోజూ టార్గెట్‌‌లో యాభై శాతం కూడా రీచ్ కాకపోవడంపై హెల్త్ డైరెక్టర్ శుక్రవారం రివ్యూ చేశారు.

ప్రైవేట్ హాస్పిటళ్ల డాక్టర్లు, మేనేజ్‌‌మెంట్ల ప్రతినిధులు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్‌‌ రాష్ట్ర ప్రతినిధులతో ఆయన భేటీ అయ్యారు. తర్వాత డాక్టర్లతో కలిసి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు సుమారు 2 లక్షల మందికి టీకా వేశామని చెప్పారు. వచ్చే నెల ఐదో తేదీ వరకూ హెల్త్ స్టాఫ్‌‌కు వ్యాక్సినేషన్ కొనసాగుతుందన్నారు. వ్యాక్సిన్లపై అపోహలు వద్దని, అందరూ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

చాక్లెట్‌తో అయోధ్య ఆలయ నమూనా శిల్పాభట్

ఫొటో సోర్స్, SAM PANTHAKY/gettyimages

గుహలో ఉండే సాధువు.. రామ మందిరానికి కోటి విరాళం

కొన్నేళ్లుగా గుహలో జీవిస్తున్న ఓ సాధువు అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి రూ.కోటి విరాళం అందజేశారని నమస్తే తెలంగాణ తెలిపింది.

83 ఏళ్ల స్వామి శంకర్‌ దాస్‌ ఉత్తరాఖండ్‌ రిషికేశ్‌లోని ఒక గుహలో 50 ఏళ్లుగా ఉంటున్నారు. తన వద్దకు వచ్చే భక్తులు సమర్పించే కానుకలతో జీవిస్తున్నారు.

రామ మందిరం కోసం వీహెచ్‌పీ కార్యకర్తలు విరాళాలు సేకరిస్తున్న విషయయాన్ని శంకర్‌ దాస్‌ తెలుసుకున్నారు. దీంతో శుక్రవారం ఆయన రూ.కోటి చెక్‌ కోసం బ్యాంకుకు వెళ్లారు. అయితే ఒక సాధువు అంత మొత్తానికి చెక్‌ కోసం రావడం చూసి బ్యాంకు సిబ్బంది ఆశ్చర్యపోయారు. ఆయన బ్యాంకు ఖాతా పరిశీలించగా పెద్ద మొత్తంలో డబ్బులు ఉన్నట్లు గ్రహించారు.

దీంతో స్థానిక ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలను సంప్రదించగా వారు వచ్చి స్వామి శంకర్‌ దాస్‌కు సహాయం చేశారు. అనంతరం బ్యాంకు అధికారులు రామ మందిరం ట్రస్ట్‌ పేరుతో రూ.కోటి చెక్‌ ఇచ్చారు. విరాళాలు సేకరిస్తున్న వీహెచ్‌పీ కార్యకర్తలకు ఆ చెక్‌ను ఆయన అందజేశారు.

రైలు ప్రయాణికురాలు

ఫొటో సోర్స్, Getty Images

దక్షిణ మధ్య రైల్వేలో 31 రైల్వే స్టేషన్లు మూత!

ఆదాయం లేని కొన్ని రైల్వే స్టేషన్లను మూసేయాలని, రోజులో ఒకట్రెండు ప్యాసింజర్‌ రైళ్లు మాత్రమే ఆగే స్టేషన్లపై వేటు వేయాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించినట్లు సాక్షి తెలిపింది. ఆదాయం కంటే నిర్వహణ ఖర్చే అధికంగా ఉండటమే ఇందుకు కారణమని పేర్కొంది.

ఈ నిర్ణయంతో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మొత్తం 31 స్టేషన్లు మూతపడనున్నాయి. ఏప్రిల్‌ 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది.

సికింద్రాబాద్‌ డివిజన్‌ పరిధిలో 16, హైదరాబాద్‌ డివిజన్‌ పరిధిలో 7 స్టేషన్లు ఉన్నాయి. గుంతకల్‌ డివిజన్‌ పరిధిలో 3, గుంటూరు డివిజన్‌ పరిధిలో 4, నాందేడ్‌ డివిజన్‌ పరిధిలో ఒకటి ఉన్నాయి.

పెద్ద స్టేషన్లతో పాటు కొన్ని చిన్న చిన్న గ్రామాల్లో కూడా రైల్వే శాఖ చిన్న స్టేషన్లను ఏర్పాటు చేస్తుంది. ఈ స్టేషన్లలో స్టేషన్‌ మాస్టర్‌ ఉండరు. సిగ్నలింగ్‌ వ్యవస్థ కూడా ఉండదు. ఒక చిన్న గది, చిన్న బుకింగ్‌ సెంటర్‌ మాత్రమే ఉంటుంది. టికెట్లను కూడా ప్రైవేటు సిబ్బందే జారీ చేస్తుంటారు. వారు కూడా రోజులో కొంత సమయమే ఉండి టికెట్లు జారీ చేసి వెళ్లిపోతారు.

ఇలాంటి స్టేషన్లలో కొన్నింటికి పెద్దగా ప్రయాణికుల నుంచి స్పందన ఉండట్లేదని తాజాగా రైల్వే గుర్తించింది. సాధారణంగా సంవత్సరానికి రూ.5 లక్షల ఆదాయం, లేదా లక్ష మంది ప్రయాణికులు ఉంటే స్టేషన్‌ను నిర్వహిస్తారు. అంతకంటే తక్కువ నమోదవుతుంటే వాటి నిర్వహణ అనవసరమని రైల్వే భావిస్తుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)