‘కొకైన్ హిప్పోలు’: శాస్త్రవేత్తలు వీటిని చంపేయాలని ఎందుకు చెబుతున్నారు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఫెర్నాండో డువార్టే
- హోదా, బీబీసీ ప్రతినిధి
గత 30 ఏళ్లుగా కొలంబియా దేశం మరిచిపోయేందుకు ప్రయత్నిస్తున్న పేరు పాబ్లో ఎస్కోబార్.
ప్రపంచం ఇప్పటివరకూ చూసిన అతిపెద్ద నేరస్థుల్లో ఒకడు ఎస్కోబార్. 1980ల్లో అతడి నేతృత్వంలో మెడెలిన్ డ్రగ్స్ సామ్రాజ్యం కొలంబియాలో అనేక అక్రమాలకు పాల్పడింది. పెద్ద ఎత్తున కొకైన్ వ్యాపారం చేశాడు.
కొలంబియా భద్రతా సంస్థలపై ఎస్కోబార్ హింసాత్మక దాడులకు కూడా తెగబడ్డాడు. అపహరణలు, బాంబు దాడులు, హత్యలు... ఇలా అనేక అక్రమాలు సాగించాడు.
అప్పట్లో ఎస్కోబార్‌ను ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు అని చెప్పేవారు.
అతడిని కొలంబియా మట్టుపెట్టి మూడు దశాబ్దాలు కావస్తోంది.
ఎస్కోబార్ వల్ల కొలంబియా ఎదుర్కొన్న సమస్యలు అన్నీఇన్నీ కావు. కానీ, వీటికి తోడు అతడి వల్ల ఇప్పుడు ఓ జీవావరణ సమస్య కూడా వచ్చిందని అంటున్నారు శాస్త్రవేత్తలు.

ఫొటో సోర్స్, Getty Images
ఎస్కోబార్ బతికి ఉన్న సమయంలో తన విలాసవంతమైన ఎస్టేట్‌లోని ప్రైవేట్ జూ కోసం కొన్ని హిప్పోపొటమస్ జంతువులను తెప్పించుకున్నాడు.
ఇప్పుడు ఆ జంతువుల జనాభా విపరీతంగా పెరిగింది. కొలంబియాలోని ప్రధాన నదుల్లో ఒకటైన మగడలెనా అంతటా అవి వ్యాపిస్తున్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు.
పర్యావరణంపై దుష్ర్పభావం పడకుండా చూడటానికి వీటిని చంపడం ఒక్కటే మార్గమని వాళ్లు అభిప్రాయపడుతున్నారు.
వారు చేసిన అధ్యయనం ఇటీవల బయోలాజికల్ కన్సర్వేషన్ జర్నల్‌లో ప్రచురితమైంది.
‘‘ఆ జంతువుల విషయంలో మాకు బాధగానే ఉంది. కానీ, శాస్త్రవేత్తలుగా మేం నిజాయితీగా ఉండకతప్పదు. కొలంబియాలో హిప్పోలు ఆక్రమణాత్మకంగా ఉన్నాయి. వాటిలో కొన్నింటిని ఇప్పుడే చంపకపోతే, మరో 10-20 ఏళ్లలో పరిస్థితి అదుపుతప్పుతుంది’’ అని కొలంబియాకు చెందిన బయోలజిస్ట్ నటాలీ కాస్టెల్‌బ్లాంకో బీబీసీతో అన్నారు.
ఈ అధ్యయనం చేసిన బృందంలో ఆమె కూడా ఉన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఎస్కోబార్ తీసుకువచ్చినవి కావడంతో ఇక్కడి హిప్పోలను కొకైన్ హిప్పోలు అని పిలుస్తున్నారు. కొలంబియాపై ఆయన చెరగని ముద్రకు సాక్ష్యాలుగా అవి అక్కడ సంచరిస్తూనే ఉన్నాయి.
ఎస్కోబార్ మరణానికి, వీటి సంఖ్య పెరగడానికి సంబంధం ఉందని అంటున్నారు శాస్త్రవేత్తలు.
కొలంబియా రాజధాని బొగోటాకు 250 కి.మీ.ల దూరంలో ఎస్కోబార్‌కు నాపోలెస్ అనే పెద్ద విలాసవంతమైన ఎస్టేట్ ఉండేది. దీన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.
ఈ ఎస్టేట్‌లోని ప్రైవేట్ జూను ధ్వంసం చేసింది. హిప్పోలు మినహా ఇందులో ఉన్న జంతువులన్నింటినీ దేశంలో వివిధ జూలకు తరలించింది.
‘‘హిప్పోలను తరలించడం కష్టంతో కూడుకున్న పని. అందుకే అధికారులు వాటిని అలాగే వదిలేశారు. వాటికవే చచ్చిపోతాయని వాళ్లు అనుకుని ఉండొచ్చు’’ అని నటాలీ అన్నారు.
కానీ, అవి ఎడాపెడా సంతతిని పెంచుకున్నాయి.
కొంలబియాలో ఇప్పుడు 80 నుంచి 120 వరకూ హిప్పోలు ఉన్నట్లు అంచనాలు ఉన్నాయి.
‘‘హిప్పోలు ఆఫ్రికాకు చెందినవి. ఆఫ్రికా బయట ఇప్పుడు వాటికి అతిపెద్ద ఆవాసం కొలంబియానే’’ అని జంతువైద్యుడు కార్లోస్ వాల్డెర్రామా బీబీసీతో చెప్పారు.
కొలంబియాలో హిప్పోల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని, 2034 కల్లా వీటి సంఖ్య 1,400కు చేరుకుంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
ఇలా జరగకుండా ఉండాలంటే, ఏటా 30 హిప్పోలను చంపడం గానీ, వాటికి సంతాన సామర్థ్యం లేకుండా చేయడం గానీ అవసరమని వారు అంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఎందుకు సమస్య?
సాధారణంగా హిప్పోల పిల్లలను సింహాలు, మొసళ్లు వేటాడుతుంటాయి. కానీ, దక్షిణ అమెరికాలో అవి లేవు.
ఆఫ్రికాలో కరువు పరిస్థితుల వల్ల వాటి సంఖ్య అక్కడ అదుపులో ఉండేది. కానీ, కొలంబియాలో వాటికి ఆ సమస్య లేకుండా పోయింది.
హిప్పోలకు దక్షిణ అమెరికా వాతావరణం బాగా అనుకూలించినట్లుంది.
ఆఫ్రికాలో ఉన్నవాటితో పోల్చితే కొలంబియాలోని హిప్పోలు తక్కువ వయసులోనే సంతానం కనడం మొదలుపెడుతున్నాయని నటాలీ చెప్పారు.
ఈ కారణాలన్నీ హిప్పోల సంఖ్య పెరిగేందుకు దోహదపడుతున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
హిప్పోల ఉనికి స్థానిక జీవావరణ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపిస్తోందని శాస్త్రవేత్తలు అంటున్నారు. అంతరించిపోతున్న స్థానిక జీవ జాతులు వలస పోవాల్సి వస్తోందని, హిప్పోల వల్ల నీటి వనరుల్లో రసాయన మార్పులు జరిగి మత్స్యసంపదకు కూడా నష్టం జరుగుతోందని వారు చెబుతున్నారు.
‘‘కొలంబియాలోని అతిపెద్ద నది బేసిన్ వ్యాప్తంగా హిప్పోలు విస్తరిస్తున్నాయి. ఈ బేసిన్‌పై ఆధారపడి వేల మంది జీవనం సాగిస్తున్నారు. నాపోలెస్ నుంచి 370 కి.మీ.ల దూరంలో కూడా ఇప్పుడు హిప్పోలు కనిపిస్తున్నాయి’’ అని నటాలీ చెప్పారు.
హిప్పోలను చంపకూడదని అభిప్రాయపడుతున్న శాస్త్రవేత్తలు కూడా ఉన్నారు.
‘‘ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్సర్వేషన్ ఆఫ్ నేచర్ లాంటి ఎన్జీఓలు హిప్పోలను ముప్పు ఎదుర్కొంటున్న జీవులుగా గుర్తించాయి. వాటిని చంపడం కన్నా, సంతాన సామర్థ్యం లేకుండా చేయడం మంచిది’’ అని కొలంబియా నేషనల్ యూనివర్సిటీకి చెందిన బయోలజిస్ట్ ఎన్రీకే ఒర్డానెజ్ అన్నారు.

ఫొటో సోర్స్, Courtesy of Carlos Valderrama
హిప్పోలకు సంతాన సామర్థ్యం తీసేసే పని అంత సులువు కాదని, చాలా ఖర్చుతో కూడుకున్న ప్రక్రియ కూడా అని కార్లోస్ వాల్డెర్రామా అంటున్నారు.
అధ్యయనం కోసం 2009లో ఒక మగ హిప్పోకు ప్రయోగాత్మకంగా ఆయన సంతాన సామర్థ్యం లేకుండా చేశారు.
‘‘హిప్పోలు ఐదు టన్నుల వరకు బరువుంటాయి. బాగా దూకుడుగా ఉంటాయి. మేం మత్తు ఇచ్చినా, ఆ జంతువు వల్ల దాదాపు క్రేన్ పడిపోయే పరిస్థితి వచ్చింది. జురాసిక్ పార్క్ సినిమాలో డైనోసార్లతో ఉన్నట్లు అనిపించింది’’ అని ఆయన ఆ అనుభవాన్ని వివరించారు.
‘‘హిప్పోలు చాలా వరకూ అడవుల లోపల నివసిస్తాయి. వాటి దగ్గరికి వెళ్లడం అంత సులభం కాదు. మరోవైపు అవి సంతానం కంటూనే ఉంటాయి. మగ హిప్పోలు చాలా ఆడ హిప్పోలను కలుస్తూ, సంతానం కంటుంటాయి’’ అని కార్లోస్ వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
అయితే, హిప్పోల విషయంలో చర్యలు తీసుకునేందుకు కొలంబియా ప్రభుత్వం వెనుకాడుతోంది.
ప్రజల నుంచి వస్తున్న స్పందనే ఇందుకు కారణం. హిప్పోలను చంపడాన్ని చాలా మంది వ్యతిరేకిస్తున్నారు.
హిప్పోలను చంపాలని సూచించిన శాస్త్రవేత్తలకు సోషల్ మీడియాలో బెదిరింపులు కూడా వస్తున్నాయి.
ఆఫ్రికాలో ఏటా 500కుపైగా మంది హిప్పోల దాడుల్లో చనిపోతున్నారని బీబీసీ 2016లో తెలిపింది.
కొలంబియాలో అలాంటి కేసులేవీ నమోదు కాలేదు. అయితే, గత ఏడాది మేలో ప్యూర్టో ట్రయన్ఫో ప్రాంతంలో ఓ ఫామ్ వర్కర్ హిప్పో దాడిలో తీవ్రంగా గాయపడినట్లు స్థానిక మీడియాలో కథనాలు వచ్చాయి.
ఎస్కోబార్ ఎస్టేట్ పరిసరాల్లోని జనాలకు ముప్పుగా మారిందని చెబుతూ 2009లో కొలంబియా సైనికులు ఓ హిప్పోను కాల్చి చంపారు.
ఈ చర్యపై చాలా వ్యతిరేకత వచ్చింది. దీంతో ప్రభుత్వం హిప్పోలకు చట్టపరమైన రక్షణ కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.
‘‘ఆక్రమణాత్మక జంతువులకు రక్షణ కల్పిస్తూ కొలంబియా చట్టం చేసింది. ఈ దేశం హిప్పోల పాలిట స్వర్గంగా మారింది. కానీ, ఇవి ‘టైం బాంబు’లన్న విషయం మనం మరిచిపోకూడదు’’ అని నటాలీ హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి:
- చైనా: ‘అర్ధరాత్రి వస్తారు.. నచ్చిన ఆడవాళ్లను ఎత్తుకెళ్లిపోతారు.. అడిగేవారే లేరు’
- ఉత్తరాఖండ్: వరద వేగానికి మృతదేహాలపై బట్టలు కూడా కొట్టుకుపోయాయ్
- ఎర్రకోటను షాజహాన్ ఎందుకు కట్టించారు? చరిత్రలో అక్కడ జరిగిన కుట్రలెన్ని? తెగిపడిన తలలెన్ని
- బైరిపురం: పంచాయితీ ఎన్నికల్లో ఒక్కసారి కూడా ఓటు వేయని గ్రామమిది.. ఏకగ్రీవాలతో ఇక్కడ అభివృద్ధి జరిగిందా?
- ‘నా భార్య నన్ను పదేళ్ళు రేప్ చేసింది'
- విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమానికి ‘గంటా’ పిలుపు.. ఇంతకీ అక్కడ ఏం జరుగుతోంది
- ‘18 మందిని చంపిన సీరియల్ కిల్లర్’: ఒంటరి మహిళలతో మాట కలుపుతాడు... కోరిక తీర్చుకుని కడతేరుస్తాడు...
- నియాండర్తాల్ మానవులు, తొలి తరం ఆధునిక మానవుల మధ్య సెక్స్ గురించి శాస్త్రవేత్తలు ఏం తెలుసుకున్నారు?
- నేపాల్ వెళ్తే జేబు ఖాళీయే
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









