టీగ్రే సంక్షోభం: ‘వారికి దొరక్కుండా పొదలో దాక్కున్నాం.. అక్కడే నా భార్య కవలలకు జన్మనిచ్చి చనిపోయింది’

ఇథియోపియాలోని టీగ్రే ప్రాంతంలో హింసాత్మక సంక్షోభ సమయంలో సైనికుల కంటికి కనిపించకుండా ఒక మహిళ కవల పిలల్లకు జన్మనిచ్చిన విషయాన్ని ఆమె భర్త బీబీసీతో పంచుకున్నారు.
ఆ పిల్లలకు జన్మనిచ్చిన కొన్ని రోజులకే ఆమె మరణించారు. దాంతో ఆ పిల్లలను ఒక బుట్టలో పెట్టుకుని పొరుగు దేశమైన సుడాన్‌కి ఆయన తరలి వెళ్లారు.
కొత్తగా పుట్టిన కవల పిల్లలతో పాటు, మరో అయిదేళ్ల కొడుకు, 14ఏళ్ల బావమరిదితో కలిసి ఆయన ఇప్పుడొక శరణార్థ శిబిరంలో తల దాచుకున్నారు.
ఈ కవల పిల్లలను చూసుకునేందుకు ఒక అమెరికా డాక్టర్ సహాయ పడుతున్నారు.
టీగ్రే ప్రాంతాన్ని కైవసం చేసుకోవడానికి ఇప్పటికే మూడు నెలలుగా పోరాటం కొనసాగుతోంది.
ప్రాచీన సాంస్కృతిక నగరం అక్సుమ్‌కి నడి బొడ్డున ఈ ప్రాంతం నెలకొని ఉంది.
ఇక్కడ ‘‘ది టీగ్రే పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్’’, ఇథియోపియా మిలిటరీల మధ్య అధికారం చేజిక్కించుకోవడం కోసం పోరాటం సాగుతోంది.
ఈ ఉద్రిక్తతల్లో కనీసం 20 లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. సుమారు 60,000 మంది పొరుగు దేశం సుడాన్‌కి వెళ్లి తల దాచుకున్నారు.
నిరాశ్రయులైన ప్రతీ వ్యక్తి దగ్గర చెప్పడానికొక కథ ఉంది. మొదటి సారి తుపాకీ పేల్చిన శబ్దం విన్నప్పుడు వారికి కలిగిన భావాలు, గగనతలం నుంచి పేల్చే కాల్పుల నుంచి తమను తాము రక్షించుకోవడానికి గుహల్లోకి వెళ్లి తల దాచుకున్నప్పటి అనుభవాలు, వారిని కాల్చినప్పుడు, లైంగికంగా హింసించినప్పుడు కలిగిన ఇబ్బందులు లాంటివి ఎన్నో ఉన్నాయి.
చాలా మంది ఈ కష్టాలను తట్టుకుని తిండీ నిద్రా లేకుండా సురక్షిత స్థానాలకు చేరడానికి రోజుల తరబడి ఎలా ప్రయాణం చేశారో కూడా చాలా మందికి గుర్తు ఉంది.
భార్యను కోల్పోయిన అబ్రహ కిన్ఫె కథ ఇది..

ఫొటో సోర్స్, Getty Images
నాకు 40 ఏళ్లు. నా భార్య 29 ఏళ్ల లెతాయి సెగే మరణించారు. మాకు 13ఏళ్ల క్రితం వివాహం జరిగింది. మాకు ముగ్గురు పిల్లలు.
మేము పశ్చిమ టీగ్రే ప్రాంతంలో మయి కాద్రా పట్టణంలో ఉన్న వ్యవసాయ భూమిలో నివసిస్తూ ఉండేవాళ్లం.
నవంబరు 10న ఫెడరల్ సేనలు మా ప్రాంతం వైపు రావడం మొదలు పెట్టాయి.
అవి మా ఇంటిని దాటుకుంటూనే వెళ్లాయి. వారు మమ్మల్ని చూడలేదు. మేము ఊపిరి పీల్చుకున్నాం.
అప్పుడే మా పొరుగు వారితో కలిసి పక్కనే ఉన్న ఒక పొదల్లోకి వెళ్లి దాక్కున్నాం. అప్పటికే నా భార్యకు పురిటి నొప్పులు వస్తున్నాయి.
కానీ, ఆ సమయంలో మయి కాద్రాలో ఉండే ఆసుపత్రికి తీసుకుని వెళ్లడానికి చాలా భయపడ్డాను.
మాతో పాటు దాక్కున్న మా పొరుగింటి మహిళ సహాయంతో నా భార్య ఇద్దరు కవల ఆడ పిల్లలకు జన్మనిచ్చారు. నేను ఆమె మంచితనానికి కృతజ్ఞతలు చెబుతున్నాను.
ఆ తరువాత రోజు మేము ఇంటికి వెళ్లిపోయాం. కానీ, లెతాయికి ప్రసవం తరవాత అందాల్సిన చికిత్స అందకపోవడంతో రక్త స్రావం ఆగలేదు.
మరో 10 రోజులకు ఆమె మరణించారు. నా గుండె పగిలిపోయింది.
మా పొరుగు వారి సహాయంతో ఆమెను మా పొలంలో పాతి పెట్టాం.
ఆమెను ఆసుపత్రికి తీసుకుని వెళ్లగలిగి ఉంటే బ్రతికి ఉండేది. కానీ, అప్పటికే పరిస్థితులన్నీ తలకిందులుగా ఉన్నాయి.
ప్రజలంతా ప్రాణాలను రక్షించుకోవడం కోసం పారిపోతున్నారు. మా ఊరొక దెయ్యాల పట్టణంగా మిగిలిపోయింది.

ఫొటో సోర్స్, Getty Images
ఐదేళ్ల క్రితం నేను, నా కుటుంబం జాత్యహంకార ఉద్రిక్తతల నడుమ మెటామా పట్టణం నుంచి నిరాశ్రయులుగా వచ్చేశాం.
అక్కడి నుంచి మేము మయి కద్రాకి వెళ్లి మా జీవితాలను తిరిగి పునర్నిర్మించుకున్నాం. అక్కడ ఉండే స్థానిక పరిపాలన కారులు మాకు ఒక చిన్న భూమిని సాగు చేసుకోవడానికి ఇచ్చారు.
ఆ కొత్త ప్రదేశంలో మట్టి, చెక్కతో కూడిన ఒక చిన్న ఇంటిని కట్టుకున్నాం. అది సౌకర్యవంతంగా ఉండేది. అక్కడే మా కొడుకు పుట్టాడు. నా కవల పిల్లలు కూడా అక్కడే పుట్టారు.
కానీ, మరో 20 రోజుల్లోనే మేము ఆ ప్రాంతాన్ని వదిలి పెట్టాల్సి వచ్చింది.
నా భార్య చనిపోయినప్పుడు నా ప్రపంచం కూలిపోయినట్లనిపించింది. నా చేతుల్లో తనని పట్టుకుని చాలా ఏడ్చాను. మా జీవితాలలో బాధను మిగిల్చిన ఆ యుద్ధాన్ని నేను చాలా ద్వేషించాను.
నా ప్రియమైన భార్యకు, నా పిల్లల తల్లికి ప్రాథమిక వైద్య చికిత్స దొరకకపోవడం వలన ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది.
పరిస్థితి ప్రమాదకరంగానే ఉండటంతో మా పొరుగువారు సుడాన్ వెళ్లిపోయారు. నేను నా పిల్లలు, బావమరిదితో కలిసి ఇక్కడే ఉండిపోయాను.

ఫొటో సోర్స్, Getty Images
ఎప్పుడైనా సైనికులు కనిపిస్తే పక్కనే ఉన్న పొదల్లోకి వెళ్లి దాక్కునేవాళ్లం. ఒక్కడినే పిల్లలను చూసుకోవడం చాలా కష్టంగా ఉండేది. పొరుగు వారు కూడా లేరు.
ఈ వయసులో పిల్లలకు తల్లి పాలు చాలా అవసరం. నీటి చుక్కలు, పంచదార, వేళ్లని సూపులో ముంచి వాళ్లకి చుక్కలుగా పట్టడం లాంటివి చేస్తూ వారిని బ్రతికించాను.
20 రోజుల తర్వాత అక్కడే ఉన్న ఫెడరల్ సేనల దగ్గరకు వెళ్లి నా పిల్లలను దగ్గరలో ఉన్న హుమేరా పట్టణంలో ఉన్న ఆసుపత్రికి తీసుకుని వెళ్లడం వీలవుతుందో లేదో కనుక్కున్నాను.
అదృష్టవశాత్తు వారు నన్ను వెళ్ళడానికి అంగీకరించారు. అప్పుడు నేను టెకెజె నది దగ్గరకు వెళ్లి బోటులో సుడాన్‌లో ఉన్న హందాయిత్ ప్రాంతానికి వెళ్లాను.
నా పిల్లలను ఒక బుట్టలో పెట్టుకుని, మిగిలిన పిల్లలను వెంట పెట్టుకుని వెళ్లాను.
ఇప్పుడు మాకు ఇక్కడ ఉన్న శరణార్థి శిబిరంలో చోటు దొరికింది. రెడ్‌క్రాస్‌కి చెందిన ఒక అమెరికా డాక్టర్ పిల్లలను చూసుకుంటున్నారు.
వారికి కావల్సినవన్నీ చూసుకుంటూ వారి పెరుగుదలను ప్రతీ మూడు రోజులకొకసారి పరిశీలిస్తున్నారు.
ఆమె శరణార్ధులపై చూపుతున్న దయ, మద్దతుకు భగవంతుడు ఆమెను ఆశీర్వదించాలి.
ఇప్పుడు కవల పిల్లలిద్దరూ రెండు నెలల వయసు వారయ్యారు. వారు బరువు పెరుగుతుండటం గమనిస్తున్నాను.
కానీ, మా ఐదేళ్ల కొడుకు మాత్రం అమ్మను బాగా అడుగుతున్నాడు. వాడు తరచూ అమ్మ గురించి అడుగుతూ ఉంటాడు. అలా అడిగినప్పుడల్లా నా గుండె పగిలిపోతూ ఉంటుంది.
ఆమె త్వరలోనే వస్తుందని అబద్ధం చెబుతున్నాను.
లెతాయ్ మాతో లేని విషయాన్ని అర్ధం చేసుకునేందుకు నేను నిరంతరం ప్రశ్నించుకుంటూనే ఉంటాను.
జీవితం చాలా కఠినంగా ఉంటుంది. నా చేతిలో ఉన్న కవల పిల్లలు.. నా భార్యను నిరంతరం గుర్తు తెస్తూనే ఉంటారు.
నా పరిస్థితిని చూసి మిగిలిన శరణార్థులు జాలి పడుతూ ఉంటారు. నన్ను ఓదార్చడానికి ప్రయత్నిస్తూ ఉంటారు.
నా పిల్లలకు ఈడెన్, ట్రెఫీ అనే పేర్లు పెట్టమని సలహా ఇచ్చారు.
సనాతన క్రైస్తవ సంప్రదాయం ప్రకారం అమ్మాయిలకు పుట్టిన 80 రోజుల తర్వాత బాప్టిజమ్ చేయాలి. ఆ రోజు దగ్గరకు వస్తోంది. కానీ, మాకు ఆ సేవలు అందించడానికి ఇక్కడ చర్చిలు లేవు.
నేనింకా బాధలోనే ఉన్నాను. నా పిల్లలను ఒక సురక్షిత వాతావరణంలో పెంచే ధైర్యం ఇవ్వమని నేను దేవుడిని ప్రార్ధిస్తున్నాను. ఈ దౌర్భాగ్యమైన ఉద్రిక్తతలు త్వరలోనే తగ్గి, మేము వదిలిపెట్టిన జీవితాన్ని తిరిగి పొందుతామని ఆశిస్తున్నాను.

ఫొటో సోర్స్, Getty Images
శాంతి భద్రతలు మా జీవితాలలో ఎందుకు కొరవడ్డాయి అనే విషయం గురించి నేను ఆలోచిస్తూ ఉంటాను. మేమెందుకు ఇలా బాధపడాలి?
మాకు ఈ విషాదాన్ని మిగిల్చిన వారు సౌకర్యవంతంగా, స్థిరంగానే బ్రతుకుతుంటే.. మాకెందుకు సురక్షితంగా నివసించే అవకాశం కూడా దొరకటం లేదు?
వారు వారి పిల్లలను ఎటువంటి సమస్యలు లేకుండా పెంచుకుంటున్నారు.
వారి పిల్లలు ఇంట్లో దొరికే ఆప్యాయతలను ప్రేమను పొందుతున్నారు. వారిని వారి తల్లితండ్రులు పెంచుకుంటున్నారు. వారు స్కూలుకు వెళుతున్నారు. పొరుగువారితో కలిసి ఆడుకుంటున్నారు.
నేను ఐదేళ్ల క్రితం మెటామా వదిలిపెట్టి మయికాద్రాలో స్థిరపడిన రోజులు గుర్తుకు వస్తున్నాయి.
నేను అక్కడ సమాజంలో నిలదొక్కుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. బ్రతకడం కోసం పొద్దున్న నుంచి రాత్రి వరకు కష్టపడుతూనే ఉండేవాడిని. నా కుటుంబాన్ని పోషించుకోవడం కోసం నేను బాగానే పని చేశాను.
ఆదాయం కోసం నాకిచ్చిన భూమితో పాటు మరి కొంత భూమిని కౌలుకు తీసుకున్నాను. నేను నువ్వులు, జొన్నలు పండించేవాడిని.
ఇక్కడ నేనేమి పని చేయటం లేదు. ప్రేమించడానికి భార్య లేదు. సమాజం లేదు. వెళ్ళడానికి చర్చి లేదు.
కాపుకొచ్చిన పంట గురించి కూడా ఆలోచిస్తున్నాను. గతం తల్చుకోవడం, నాకున్న ఆస్తులను గుర్తు చేసుకోవడం, జీవితం ఎలా ఉండేదో ఊహించుకోవడం, నా పిల్లలు ఎలా గడిపేవారో ఆలోచించుకోవడం తప్పా ఇప్పుడు నేనింకేమీ చేయలేను.
నేను ఒక శరణార్థిగా గడపడానికి ఉన్న పరిస్థితులకు అలవాటు పడేందుకు ప్రయత్నిస్తున్నాను.
ఈ ఆవేదన చాలా తీవ్రమైనది. నా పిల్లలకు ఇంత బాధ కలగకూడదు.
అంహార, టీగ్రే ప్రజల మధ్య తలెత్తిన ఈ అర్ధంపర్ధం లేని జాత్యహంకార గొడవల్లో మా సర్వస్వం కోల్పోయాం.
సుడాన్‌లో ఉన్న శిబిరాలలో కొన్ని వేల మంది శరణార్థులు తల దాచుకున్నారు. మేమంతా టీగ్రే కి చెందిన వారిమే. మేము ఈ సంక్షోభం వలన తీవ్రంగా ప్రభావితులమయ్యాం.
ఈ యుద్ధం త్వరలోనే ముగిసి శాంతి నెలకొంటుందని ఆశిస్తున్నాను. మేము ఇంటికి తిరిగి వెళ్లాలని కోరుకుంటున్నాం. మా తండ్రులు, తాతలు నివసించిన భూమి పై మేము తిరిగి జీవనాన్ని పునరుద్ధరించుకోవాలని చూస్తున్నాం.
ఇవి కూడా చదవండి:
- ‘వాయిదా కాదు.. రద్దు చేయాలి.. ఉద్యమం అప్పుడే అయిపోలేదు’.. వ్యవసాయ చట్టాలపై రైతు నాయకులు
- సేఠ్ ఆబిద్: బంగారం స్మగ్లింగ్‌లో భారత్ గుత్తాధిపత్యానికి తెరదించిన పాకిస్తాన్ 'గోల్డ్ కింగ్'
- లీసా మోంట్గోమేరీ: 67 ఏళ్ల తరువాత తొలిసారిగా ఒక మహిళకు మరణ శిక్ష అమలు చేసిన అమెరికా
- కరోనావైరస్: భారత్‌లో జనవరి 16 నుంచి కోవిడ్-19 వ్యాక్సినేషన్... ఎలా చేస్తారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- రైతుల నిరసనలు: సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీలోని ఆ నలుగురు ఎవరు?
- అమెరికాలో ఒప్పంద వ్యవసాయం ఎలా సాగుతుంది?
- అయిదేళ్లుగా స్నానం చేయడం మానేసిన డాక్టర్.. అసలు రోజూ స్నానం అవసరమా?
- ఆలయానికి వెళ్లిన మహిళపై గ్యాంగ్ రేప్, హత్య... పూజారే నిందితుడు
- దక్షిణ కొరియాలో ప్రమాద ఘంటికలు, తగ్గిన జననాలు, పెరిగిన మరణాలు
- కడుపు పెరుగుతుంటే కవల పిల్లలనుకున్నారు.. డాక్టర్ చెప్పింది విని ఆశ్చర్యపోయారు
- జాక్ మా: ఈ చైనా బిలియనీర్ రెండు నెలల్లో రూ.80వేల కోట్లు ఎలా కోల్పోయారు?
- మాల మాస్టిన్లు: పొట్టకూటి కోసం ప్రమాదానికి ఎదురెళ్లే ఈ సాహసగాళ్లు ఎవరు
- "నేనెలాగూ బ్రతకను.. నా బిడ్డను అయినా కాపాడండి" - మరణం అంచుల దాకా వెళ్లిన 22 ఏళ్ల మహిళ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








