‘వాయిదా కాదు.. రద్దు చేయాలి.. ఉద్యమం అప్పుడే అయిపోలేదు’.. వ్యవసాయ చట్టాలపై రైతు నాయకులు

ధాన్యం రవాణా

ఫొటో సోర్స్, Getty Images

కొత్త వ్యవసాయ చట్టాల అమలును ఏడాదిన్నరపాటు నిలిపివేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది.

బుధవారం విజ్ఞాన్ భవనలో రైతులకు, ప్రభుత్వానికి మధ్య జరిగిన పదో విడత చర్చలు కొంత సానుకూలంగా సాగాయి.

అనంతరం కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మాట్లాడుతూ..చర్చలు సరైన దిశలో జరుగుతున్నాయని చెప్పారు.

వ్యవసాయ చట్టాల అమలును ఏడాదిన్నర పాటు నిలివేస్తామని కేంద్రం ప్రతిపాదించింది. ఈ చట్టాల గురించి చర్చించడానికి ఒక జాయింట్ కమిటీని కూడా ఏర్పాటు చేస్తామని తెలిపింది.

అయితే రైతులు వెంటనే ఆ ప్రతిపాదనకు అంగీకారం తెలుపలేదు. తమలో తాము మరోసారి చర్చించుకుని తుది నిర్ణయం తెలియజేస్తామని చెప్పారు.

తదుపరి చర్చలు శుక్రవారం జరగనున్నాయి.

శుక్రవారం జరగబోయే చర్చల్లో రెండు పక్షాలకు ఆమోదయోగ్యమైన ఒక ఒప్పందానికి రాగలమని కేంద్ర మంత్రి తోమర్ విశ్వాసం వ్యక్తం చేశారు.

రాకేశ్ తికాయత్

ఫొటో సోర్స్, Getty Images

ఈ చర్చలకు హాజరైన భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేశ్ తికాయత్ కూడా శుక్రవారం జరగబోయే చర్చల్లో ఒక నిర్ణయానికి రాగలమని ఆశాభావం వ్యక్తం చేశారు.

అయితే, రైతుల ఆందోళనలు పూర్తి కాలేదని, జనవరి 26న తప్పక ర్యాలీ చేస్తామని ఆయన అన్నారు.

రిపబ్లిక్ డే లోపల రైతులను ఒప్పించడం అంత సులభం కాదని రాకేశ్ అన్నారు.

రైతుల ఆందోళన

ఫొటో సోర్స్, Getty Images

‘మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలి’

రైతు స్వరాజ్య వేదిక సభ్యులు కన్నెగంటి రవి తాజా పరిణామాలపై స్పందిస్తూ చట్టాలను వాయిదా వేయడం కాదు. రద్దు చేయాలని అన్నారు.

“మద్దతు ధరలపై చర్చించడానికి ప్యానల్ కాదు..చట్టబద్ధత కల్పిస్తూ చట్టం చేయాలి.

కాలయాపనతో రైతు ఉద్యమాన్ని చీల్చే ఎత్తుగడలను మానుకుని తక్షణమే రైతు ఉద్యమ డిమాండ్లను కేంద్రం ఆమోదించాలి.

రైతులు మొండిపట్టు పట్టడం లేదు. మాట ఇచ్చి తప్పే ప్రభుత్వాలను చూసి ఉన్నారు కనుక అనుమానిస్తున్నారు. చట్టాలను, ఎన్నికల వాగ్దానాలను బుట్టదాఖలు చేసిన ప్రభుత్వాలు ఇవి.

స్వామినాథన్ కమిషన్ సిఫారసు చేసినట్లు..సమగ్ర ఉత్పత్తి ఖర్చు (C 2)కు 50 శాతం కలిపి అన్ని పంటలకు కనీస మద్దతు ధరలు నిర్ణయించడం, ప్రతి 5 కిలోమీటర్ల పరిధిలో ప్రభుత్వ మార్కెట్ యార్డ్ నెలకొల్పడంతో పాటు, నరేంద్ర మోదీ అధ్యక్షతన పని చేసిన కమిటీ 2012లో సిఫారసు చేసినట్లుగా కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించడం చేయగలిగితే అప్పుడు కొందరు కోరుకుంటున్నట్లుగా రైతులు ఉద్యమాన్ని విరమించే అవకాశం ఉంది’’

రైతుల నిరసన

ఫొటో సోర్స్, Reuters

‘రాష్ట్రాలకూ చర్చల్లో భాగస్వామ్యం కల్పించాలి’

‘‘ఈ సిఫారసుల అమలుకు ఎవరు (కోర్టు, ప్రభుత్వం) బాధ్యత తీసుకుంటారో కూడా స్పష్టంగా ప్రకటించాలి. అప్పుడే రైతులు నమ్ముతారు. మూడు చట్టాల రద్దు కేంద్రం చేతుల్లో ఉంది.

పంటల ప్రణాళిక, మార్కెట్లు, ధరలు రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉన్న అంశాలు. అందుకే కేంద్రం, రాష్ట్రాలను కూడా పరిగణనలోకి తీసుకుని చర్చలు కొనసాగించాలి. అప్పుడే ఒక జాతీయ విధానం, ఆయా రాష్ట్రాలకు ప్రత్యేక అంశాల చేర్పు కూడా సాధ్యం అవుతాయి.

రాజ్యాంగం అదే చెప్పింది..రిపబ్లిక్ డే దగ్గరలో ఉన్నందున కేంద్రం ఇప్పుడైనా రాజ్యాంగాన్ని పాటించడానికి ప్రయత్నం చేయాలి.

రైతులు ఇళ్లకు వెళ్ళాలి అని చెప్పే కోర్టు, రైతులు మొండిగా ఉన్నారని వాదించే కొన్ని మీడియా సంస్థలు, తామేమైనా రైతులకు భరోసా ఇచ్చే ప్రణాళిక ఉంటే చెప్పాలి.

ప్రభుత్వాన్ని ఇంకో రూపంలో ఒప్పించే అవకాశం ఉంటే రైతుల ముందు ప్రకటించాలి. రైతులు ఇళ్లకు వెళ్లి , ప్రభుత్వం హామీలు ఉల్లంఘిస్తే ఆ ప్రభుత్వం పై ఎటువంటి చర్యలు తీసుకుంటారో కూడా రైతుల ముందు ప్రకటించాలి” అని రవి అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)