రైతుల ఆగ్రహ తీవ్రతను నరేంద్ర మోదీ ఎందుకు అంచనా వేయలేకపోయారు?

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, సౌతిక్ బిశ్వాస్
- హోదా, బీబీసీ ప్రతినిధి
కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తున్న రైతులు నిరసన చేపట్టి 45 రోజులు దాటింది. ప్రభుత్వంతో ఎనిమిది విడతలు చర్చలు జరిపారు. అయినా ఏమాత్రం వెనుకడుగు వేయటానికి ఒప్పుకోవడం లేదు.
వ్యవసాయ ఉత్పత్తుల విక్రయం, ధరలు, నిల్వలకు సంబంధించిన నిబంధనలను సడలిస్తూ మార్కెట్‌కు అనుకూలంగా ఉన్న మూడు వ్యవసాయ చట్టాల ఉపసంహరణ తప్ప మరి దేనికీ అంగీకరించబోమని భీష్మించారు.
అలాగైతేనే రాజధాని దిల్లీ చుట్టూ చేపట్టిన నిరసనలను ముగించి తమ ఇళ్లకు వెళతామని స్పష్టంచేస్తున్నారు.
సుప్రీంకోర్టు మంగళవారం నాడు పలు పిటిషన్లను విచారిస్తూ సదరు మూడు వ్యవసాయ చట్టాల అమలును నిలిపివేస్తూ ఆదేశాలిచ్చింది. అనిశ్చితి అలాగే కొనసాగుతోంది.
అయితే, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈ చట్టాలపై వ్యతిరేకతను ముందుగా అంచనా వేయటంలోను, ప్రభావిత రాష్ట్రాలైన పంజాబ్, హరియాణాల్లో ప్రజల మనోగతాన్ని తెలుసుకోవటంలోను ఎందుకు విఫలమయ్యారు? పంజాబ్‌లోని తమ మిత్రపక్షం తొలుత ఈ చట్టాలకు మద్దతివ్వడంతో నిద్రపోయారా? (అకాలీదళ్ ఆ తర్వాత వైఖరి మార్చుకోవటమే కాకుండా ప్రభుత్వం నుంచీ వైదొలగింది.) ఈ చట్టాల వల్ల తమకున్న ప్రజా మద్దతు ఏమీ తగ్గబోదని నమ్మారా?

ఫొటో సోర్స్, Getty Images
ప్రధాని మోదీ కఠినంగా మాట్లాడతారని, తన విమర్శకులతో కఠినంగా వ్యవహరిస్తారని పేరుపడ్డారు. ఆయన పార్టీకి క్షేత్రస్థాయిలో చెవులున్నాయనే భావన బలంగా ఉంది. ఈ చట్టాలను గత ఏడాది సెప్టెంబరులో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి నడుమ పార్లమెంటు ఆమోదించటానికి ముందే.. పంజాబ్‌లో నిరసనలు రాజుకుంటున్నాయి. ఆగ్రహించిన రైతులు రైల్వే ట్రాక్‌ల మీద ధర్నాలు చేశారు. సెప్టెంబరు చివర్లో అకాలీ దళ్ బీజేపీ కూటమి నుంచి బయటకు వచ్చింది.
ఇప్పుడు ప్రపంచంలోనే అతి పెద్ద నిరసనగా మారిన రైతుల ఆగ్రహం విషయంలో మోదీ ఎందుకు తప్పులో కాలేశారు?
మోదీ ఇంతవరకూ తన పాలనకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాన్ని ఎదుర్కోకపోవటం ఈ పొరపాటు అంచనాకు కారణమని చాలా మంది భావిస్తున్నారు. గుజరాత్‌లో 2015లో తమకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ కోరుతూ పటేల్ కులస్తులు చేపట్టిన నిరసన నాలుగు సంవత్సరాల పాటు కొనసాగిన తర్వాత పరిష్కారమైంది. వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వ్యతిరేకంగా దిల్లీలో ప్రధానంగా ముస్లిం మహిళల సారథ్యంలో గత ఏడాది మార్చిలో మొదలైన ఆందోళన కొన్ని నెలల పాటు కొనసాగింది.
కానీ, ఇవేవీ ప్రస్తుత రైతుల ఆందోళన అంతటి భారీ, తీవ్ర నిరసనలు కావు. ఆగ్రహంతో ఉన్న రైతుల మాదిరిగా ప్రభుత్వాన్ని సవాల్ చేసినవీ కావు.
‘‘పంజాబ్‌లో నిరసనల గురించి మోదీకి తెలియలేదని, అందువల్లే ఆయన పరిస్థితిని పొరపాటుగా అంచనావేశారని నేను అనుకోను. ప్రజా ఉద్యమాలతో వ్యవహారం విషయంలో ఆయనలో అతి ఆత్మవిశ్వాసం వల్లే ఇలా జరిగిందనేది నా అభిప్రాయం’’ అని పౌర హక్కుల ఉద్యమకారుడు ప్రొఫెసర్ పరమీందర్ సింగ్ పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, EPA
రెండో విషయం ఏమిటంటే.. ప్రస్తుత నిరసనలు భారత చరిత్రలో గత నిరసనలకన్నా చాలా భిన్నమైనవి.
వలస పాలనలోని భారతదేశంలో దోపిడీ చేసే పాలకులకు వ్యతిరేకంగా పెల్లుబికిన రైతుల తిరుగుబాట్లు ఎక్కువగా హింసాత్మకంగా మారాయి. 1947లో స్వతంత్ర్యం వచ్చినప్పటి నుంచీ.. రైతులు పడిపోతున్న పంటల ధరలు, అప్పులు, వ్యవసాయ సంక్షోభాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు.
కానీ, అవేవీ ఇంతటి భారీ స్థాయిలో రైతులు కదలిరావటం చూడలేదు. మొత్తం 40కి పైగా రైతు సంఘాలు, ఐదు లక్షల మందికి పైగా నిరసనకారులు, పౌర సమాజంలో పెద్ద భాగం ప్రస్తుత ఆందోళనలో పాల్గొంటున్నాయి.
ఈ నిరసనలు.. దేశంలో మిగతా ప్రాంతాలతో పోలిస్తే సంపన్న వ్యవసాయ కేంద్రమైన పంజాబ్‌తో పాటు దాని పొరుగు రాష్ట్రమైన హరియాణాలో మొదలయ్యాయి. భారత వ్యవసాయ విధానాలతో అత్యధికంగా ప్రయోజనం పొందిన రాష్ట్రాలు ఈ రెండే. ఈ రాష్ట్రాల రైతులు.. వ్యవసాయ ఆదాయాలు స్తంభించిపోవటం, పడిపోతుండటం పట్ల ఇప్పుడు నిస్పృహలో ఉన్నారు. ప్రైవేటు వ్యాపారాల రంగ ప్రవేశంతో తమ భవిష్యత్తు దెబ్బతింటుందని ఆందోళన చెందుతున్నారు.
ఈ నిరసనలు ఇప్పుడు దేశంలో వ్యవసాయానికి ముడిపడి ఉన్న ఇతరత్రా ఆందోళనలు – వ్యవసాయ కమతాలు కుంచించుకుపోవటం, ఉత్పత్తులు పడిపోతుండటం, పంట ధరల అనిశ్చితి, వ్యవసాయ అంశాలు రాష్ట్రాల పరిధిలో ఉంటే కేంద్రీకృత చట్టాలు చేయటం వంటి అంశాలను కూడా కలుపుకుని విస్తరిస్తున్నాయి.
‘‘ఈ నిరసన కేవలం ఒక సమస్య కేంద్రంగా సాగుతున్నది కాదు. ప్రభుత్వం మీద విశ్వాసం లేదని ప్రకటించటం.. సమాఖ్య వ్యవస్థ సాధికార వ్యక్తీకరణ కూడా’’ అంటారు అశోకా యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ ప్రతాబ్ భాను మెహతా.

ఫొటో సోర్స్, Getty Images
ఈ రైతుల నిరసన ప్రదర్శనల్లో.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమాత్రం తలొగ్గని ప్రతిఘటన స్పష్టంగా కనిపిస్తోంది. ‘‘ఇది తమ హక్కుల కోసం జరుగుతున్న విప్లవం అని ఇక్కడి జనం అంటున్నారు. శక్తిమంతమైన ప్రభుత్వంతో నిర్భయంగా తలపడుతున్న భావన ఇది’’ అని నిరసన కేంద్రాల నుంచి వెలువడుతున్న డైలీ న్యూస్‌లెటర్ ‘ట్రాలీ టైమ్స్’ ఎడిటర్లలో ఒకరైన సుర్మీత్ మావి చెప్పారు.
భారతీయ రైతు అంటే అర్థ అక్షరాస్యుడని, అవిశ్రాంతంగా భూమి దున్నుతూ, జీవనం కోసం నిరంతరం సంఘర్షించేవాడనే ఒక మూస భావన దశాబ్దాలుగా ప్రధానంగా ఉండేది. కానీ వాస్తవం ఏమిటంటే.. సుమారు 15 కోట్ల మందికి పైగా ఉన్న భారతీయ రైతులు విభిన్న రకాల వారు – పెద్ద రైతులు, చిన్న రైతులు; భూమి ఉన్న వారు, భూమి లేని వారు. అందువల్లే.. ఈ నిరసనల్లో పాల్గొంటున్న వారు పిజ్జాలు తింటున్నారని వార్తలు వచ్చినపుడు.. అసలు ఈ నిరసనకారులు ఎప్పుడైనా పొలంలో పనిచేశారా అంటూ సోషల్ మీడియాలో ఎద్దేవా చేస్తూ మాట్లాడారు. పట్టణ ప్రాంత భారతీయులు తమ గ్రామీణ సోదరుల గురించి ఎంతమాత్రం తెలుసో ఇది స్పష్టం చేసింది.

ఫొటో సోర్స్, Reuters
ఈ నిరసనలు చేస్తున్న రైతులు చాలా మందికి పట్టణవాసంతో లోతైన సంబంధాలున్నాయనే విషయాన్ని అర్థం చేసుకోవటంలో మోదీ ప్రభుత్వం, ఇంకా చాలా మంది జనం విఫలమయ్యారు.
ఈ రైతాంగంలో చాలా మంది పిల్లలు సైన్యంలో ఉన్నారు. పోలీసుల్లో ఉన్నారు. ఇంగ్లిష్ మాట్లాడతారు. సోషల్ మీడియా ఉపయోగిస్తారు. విదేశాలకు వెళ్లి వచ్చారు. విదేశాల్లోనూ ఉన్నారు. ఈ నిరసన కేంద్రాలను చాలా సమర్థవంతంగా తీర్చిదిద్దారు. క్లినిక్‌లు, అంబులెన్సులు, కిచెన్‌లు, లైబ్రరీలు, సదుపాయాలు ఏర్పాటు చేశారు. సొంత వార్తా పత్రిక కూడా నడుపుతున్నారు.
చాలా పట్టణ ప్రాంత నిరసనల విషయంలో జరిగినట్లుగానే.. ఈ నిరసనలో అంతర్లీనంగా ఉన్న సంక్లిష్టతలను మీడియా ప్రేరేపణతో ప్రధాన దృశ్యంగా మారిపోయే ముప్పు ఉంది.

ఫొటో సోర్స్, PTI
‘‘ఈ రైతు ఉద్యమం భారతదేశ మధ్యతరగతి భాష మాట్లాడుతుంది. తాము దేశభక్తులమని, తమకు ప్రాణప్రదమైన హక్కుల కోసం పోరాడుతున్నామని వీరు చెప్తున్నారు’’ అని చరిత్రకారుడు మహేశ్ రంగరాజన్ ఉటంకించారు.
ఇది.. వ్యవసాయ సంక్షోభం లేదా కరవుకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసన కాదు. అటువంటి నిరసనలను చాలా ప్రభుత్వాలు విజయవంతంగా ఎదుర్కొన్నాయి. చిత్రమైన విషయం ఏమిటంటే.. వ్యవసాయంలో పంజాబ్ విజయానికి పర్యవసానం ఈ నిరసన. గోధుమలు, వరికి ప్రభుత్వ హామీ గల కనీస మద్దతు ధరల వల్ల, ప్రభుత్వ మద్దతుతో నిర్వహించే విస్తారమైన మార్కెటింగ్ వ్యవస్థల వల్ల అత్యధికంగా ప్రయోజనం పొందిన రాష్ట్రం ఇది.
ఇవి ఇప్పుడు పంజాబ్ మెడకు గుదిబండగా మారాయి. రెండు పంటల కోతతో నిల్వలు పెరిగిపోయాయి. ఆదాయాలు స్తంభించిపోయాయి. భూగర్భజలాలు పడిపోయాయి.
‘‘సమస్య ఏమిటంటే.. సంపన్నమైన భారీ వ్యవసాయ సమాజం నుంచి పర్యావరణపరంగా సుస్థిరమైన వ్యవసాయ, పారిశ్రిమిక సమాజంగా మార్పు చెందలేకపోయింది’’ అని ప్రొఫెసర్ మెహతా విశ్లేషించారు.
భారతదేశ రైతుల్లో 85 శాతం మందికి పైగా చిన్న, సన్నకారు రైతులే. ఈ 85 శాతం మంది మొత్తం వ్యవసాయ భూమిలో సుమారు 47 శాతం భూమిలో మాత్రమే పనిచేస్తారు. వ్యవసాయానికి సంస్కరణలు అవసరమైన ప్రభుత్వం, రైతులు ఇరువురూ అంగీకరిస్తారు. కానీ అవి ఏమిటి, ఎలా అనే వాటి మీద వీరి మధ్య అంగీకారం లేదు. ‘‘పరిష్కారాలు ఉన్నాయి.. కానీ ప్రభుత్వాన్ని రైతులు విశ్వసించరు’’ అంటారు ప్రొఫెసర్ మెహతా. అసలు సమస్య ఇక్కడే ఉంది.
ఇవి కూడా చదవండి:
- ఆస్ట్రేలియా క్రికెటర్లు స్లెడ్జింగ్ చేసినప్పుడు విరాట్ కోహ్లీ చెప్పిన మర్యాద కథ
- సింగపూర్: కోట్లు ఇస్తామన్నా ఈ రెండు ఇళ్ల యజమానులు కదలటం లేదు.. ఎందుకు?
- సిరాజ్‌పై మళ్లీ జాత్యహంకార వ్యాఖ్యలు.. హైదరాబాద్ క్రికెటర్‌పై ఆస్ట్రేలియాలో విద్వేషం కక్కిన ప్రేక్షకులు
- ‘అన్నీ పోను రూ. 500 నెల జీతం’.. అందుకే కార్మికులు తిరగబడి ఫ్యాక్టరీని ధ్వంసం చేశారా
- బెడిసికొట్టిన ఆస్ట్రేలియా స్లెడ్జింగ్... అసలు ఆ జట్టు సంస్కృతి మారదా?
- జస్ప్రీత్ బూమ్రా: ఆస్ట్రేలియన్లను ఆశ్చర్యపరుస్తున్న బౌలింగ్ సంచలనం
- ఎలాన్ మస్క్ ఇప్పుడు ప్రపంచ కుబేరుల్లో నంబర్ వన్... సక్సెస్‌కు ఆయన చెప్పిన ఆరు సూత్రాలు
- దారా షికోహ్: ఈ మొఘల్ యువరాజు సమాధి కోసం మోదీ ప్రభుత్వం ఎందుకు వెతుకుతోంది
- 127 ఏళ్ల కిందట ప్రపంచానికి భారత ఘనతను చాటిన వివేకానందుడి ప్రసంగం ఇదే..
- ‘ఎవరికీ ద్రోహం చేయలేను... అందుకే ఇద్దరినీ ఒకేసారి పెళ్లి చేసుకున్నా’
- మిల్లీమీటరు పురుగు ఒక దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడింది
- విదేశాల నుంచి ఆయుధాలు కొనుగోలు చేసే భారత్ 'ఆకాశ్' క్షిపణిని ఎలా విక్రయించబోతోంది?
- భయపెడుతున్న బర్డ్ ఫ్లూ.. చికెన్ తింటే వస్తుందా.. లక్షణాలు ఏమిటి.. మరణం తప్పదా
- దేశ విభజన సమయంలో కరాచీలో హిందువులను, సిక్కులను ఎలా ఊచకోత కోశారు.. ఆస్తులను ఎలా లూటీ చేశారు
- అయిదేళ్లుగా స్నానం చేయడం మానేసిన డాక్టర్.. అసలు రోజూ స్నానం అవసరమా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








