రైతుల ఆందోళన: నెల రోజులు గడిచినా ఉద్యమాన్ని ఎలా కొనసాగించగలుగుతున్నారు?

దిల్లీ, హరియాణా సరిహద్దుల్లో గత నెలరోజులుగా రైతులు ఆందోళన చేస్తున్నారు.

ఫొటో సోర్స్, akib Ali/Hindustan Times via Getty Images

ఫొటో క్యాప్షన్, దిల్లీ, హరియాణా సరిహద్దుల్లో గత నెలరోజులుగా రైతులు ఆందోళన చేస్తున్నారు
    • రచయిత, చింకీ సిన్హా
    • హోదా, బీబీసీ ప్రతినిధి

మొదట్లో ట్రాలీల లోపల మాత్రమే లైట్లుండేవి. బైట చీకటిగా ఉండేది. అక్కడ ఆందోళన చేస్తున్న మహిళలు, పురుషులు ఆరు బయట వంటలు చేసేవారు.

రైతులు నిలబెట్టిన ట్రాక్టర్లను దాటుకుంటూ వెళుతుంటే నీళ్ల చప్పుడు వినిపించేది. కాలం గడుస్తున్న కొద్దీ అక్కడ ట్రాక్టర్ల సంఖ్య పెరిగింది. ప్రతి 100 మీటర్లకు ఒకచోట వంటలు తయారు చేయడం కనిపిస్తోంది.

కొందరు యువకులు అక్కడ పాటలు పాడుతూ ఆందోళనకు సంఘీభావం ప్రకటిస్తున్నారు. మరికొందరు పురుషులు కర్రలు పట్టుకుని ఆందోళనలో పాల్గొనడానికి వచ్చిన మహిళలకు రక్షణగా నిలబడ్డారు.

రైతులతోపాటు వారి గ్రామాల నుంచి వాటర్‌ ట్యాంకులు అమర్చిన ట్రాక్టర్లు కూడా పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతున్న ప్రదేశానికి వచ్చాయి. దిల్లీ సరిహద్దుకు, రైతులకు మధ్యన బఫర్‌జోన్‌కు కొద్దిదూరంలో ఒక స్టేజ్‌ను కూడా నిర్మించారు.

రైతులు సరిహద్దులు దాటకుండా పోలీసులు ముళ్ల కంచెలు పాతి ఉంచారు. చేతులలో తుపాకులు, టియర్‌ గ్యాస్‌ను ప్రయోగించే ఆయుధాలు పట్టుకుని వారు కాపలా కాస్తున్నారు. సరిహద్దుకు ఆవల రైతులు జెండాలు ఊగుతున్నాయి.

రైతుల కోసం ఆందోళన జరుగుతున్న ప్రాంతంలో ప్రత్యేకంగా దుకాణాలు వెలిశాయి

ఫొటో సోర్స్, Chinki Sinha/BBC

ఫొటో క్యాప్షన్, రైతుల కోసం ఆందోళన జరుగుతున్న ప్రాంతంలో ప్రత్యేకంగా దుకాణాలు వెలిశాయి

కదిలేది లేదంటున్న ఆందోళనకారులు

కేంద్రం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళన రెండో నెలలోకి ప్రవేశించింది. తాజాగా రాజస్థాన్, మహారాష్ట్ర రైతులు కూడా వారితో చేరారు.

యూపీ నుంచి వచ్చి ఈ ప్రాంతంలో రోడ్డు పక్కన సెలూన్‌ పెట్టుకున్న ఓ వ్యక్తి కస్టమర్లకు షేవింగ్‌, కటింగ్‌ చేసే పనిలో నిమగ్నమై ఉన్నాడు.

రైతుల ఆందోళన మొదలయ్యాకే ఆయన ఇక్కడ షాప్‌ తెరిచారు. ఆయనలాంటి మరికొందరు కూడా ఉద్యమం మొదలైన వారంలోనే ఇక్కడ షాపులు పెట్టారు.

మరో దుకాణదారు రైతులకు చెప్పులు అమ్మతున్నారు. కొంత దూరంలో కొందరు చలికోట్లు అమ్ముతున్నారు. ఇక్కడ నిరసన స్థిరరూపం దాల్చింది. ఈ ప్రాంతం ఆందోళన చేసే గ్రామంగా మారింది.

ఇదే ప్రాంతంలో జిమ్‌లు, లైబ్రరీలు, కమ్యూనిటీ సెంటర్లు పని చేస్తున్నాయి. ‘ట్రాలీటైమ్‌’ అనే వార్తా పత్రిక కూడా వస్తోంది. రైతుల కోసమే ప్రారంభించిన పత్రిక. ఇది దేశంలో వేగంగా సర్క్యులేషన్‌ పెంచుకుంటున్న పత్రిక అని కొందరు అన్నారు.

ఉద్యమం కోసమే పుట్టిన ఆ పత్రికలో అనేకమంది రాసిన కథనాలు, వ్యాసాలు ఉన్నాయి. ఆందోళనకు సంబంధించిన సమాచారం ఉంటుంది. ఉద్యమానికి మద్దతుగా రైతులు, విద్యార్ధులు రాసిన కవితలు ప్రచురితమయ్యాయి.

డిసెంబర్‌ 18న విడుదలైన తొలి సంచికలో జస్విందర్‌ సింగ్‌ రాసిన ‘స్వెటర్‌’ అనే కథ ప్రచురితమైంది. ఇది స్వెటర్‌లు అల్లుకుని జీవించే ఓ మహిళ కథ. ఆమె ఆ పని మానేసి ఎలా ఉద్యమంలోకి వచ్చిందో ఇందులో చెబుతారు.

‘ట్రాలీటైమ్స్‌’ అనే పత్రికను తీసుకురావాలన్న ఆలోచనతో ఓ దంతవైద్యుడు, ఫిజియోథెరపిస్ట్, సినీ రచయిత, వీడియో డైరెక్టర్, ఇద్దరు డాక్యుమెంటరీ ఫొటో ఆర్టిస్టులు కలిసి పని చేశారు.

పత్రిక మాస్ట్‌హెడ్‌ కింద భగత్‌సింగ్‌ చేసిన ఉద్యమ నినాదాలను రాశారు. ప్రధాన స్రవంతి మీడియాలో తమ ఉద్యమానికి సరైన కవరేజ్‌ రావడంలేదన్న ఆగ్రహం నుంచి ఈ ‘ట్రాలీటైమ్స్‌’ పత్రిక పుట్టుకొచ్చిందని పత్రిక నిర్వాహకులు చెప్పారు.

రైతుల ఆందోళనలో మహిళలు కూడా పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు
ఫొటో క్యాప్షన్, రైతుల ఆందోళనలో మహిళలు కూడా పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు

ప్రపంచవ్యాప్తంగా వినిపించిన రైతు గళం

నిరసన ప్రారంభమైన తొలిరోజుల్లో ఉద్యమ కేంద్రాలైన సింఘు, త్రిక్రీ ప్రాంతాలలో మరుగుదొడ్డి సౌకర్యాలు కూడా లేవు. బహిర్భూమికి వెళ్లాలంటే రైతులు ఇబ్బంది పడేవారు.ఇది గమనించిన స్థానికులు తమ టాయిలెట్లను వాడుకొమ్మని చెప్పారు.

కొద్దిరోజుల తర్వాత అక్కడికి మొబైల్ టాయిలెట్లు వచ్చాయి. హరియాణా మునిసిపల్ కార్పొరేషన్ వీటిని ఏర్పాటు చేసింది. అనేక స్వచ్ఛంద సంస్థలు కూడా రైతులకు టాయిలెట్లతోపాటు గుడారాలను కూడా నిర్మించాయి.

ఆందోళనకారులకు వినోదం కలిగించేందుకు అక్కడ అనేకమంది గాయకులు, కళాకారులు కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. పలువురు కళాకారులు ఇక్కడి దృశ్యాలను తమ వీడియో ఆల్బమ్‌లలో వాడుతూ రైతు ఉద్యమానికి మద్దతిచ్చారు.

“ఈ పాటలు స్ఫూర్తినిస్తున్నాయి. వీటిని తయారు చేసిన కళాకారులు కూడా రైతు బిడ్డలే. వారు కూడా అన్నదాతల సమస్యలను అర్ధం చేసుకున్నారు"అని తన మామతో కలిసి ఆందోళనలో పాల్గొనడానికి వచ్చిన హర్‌ప్రీత్‌ సింగ్‌ అనే మహిళా రైతు వ్యాఖ్యానించారు.

షాహీన్‌బాగ్‌ ఆందోళన సందర్భంగా తయారైన పాటలు ప్రపంచవ్యాప్తమైనట్లు తమ పాటలు కూడా రైతుల గొంతుగా మారతాయని అక్కడి రైతులు అంటున్నారు.

“ఈ పాటలు మీరు ఒంటరి వారు కాదు అని రైతులకు గుర్తు చేస్తున్నాయి’’ అని అమన్‌దీప్‌ సింగ్‌ అనే రైతు అన్నారు. రైతులకు మద్దతివ్వడం, వారి త్యాగాలను గుర్తు చేస్తూ వారిలో ఐక్యత పెంపొందేందుకు పాటలు రూపొందిస్తున్నారు.

రైతుల నిరసన

పంజాబ్‌ రైతులకు హరియాణ కళాకారుల సంఘీభావం

హరియాణాకు చెందిన అనేకమంది కళాకారులు కూడా పంజాబ్‌ రైతులకు మద్దతుగా పాటలు కట్టారు. హరియాణా జానపద నాటక సంప్రదాయంలోని అనేక పాటలను ఈ ఆందోళనకు మద్దతుగా రూపొందించారు.

ఉద్యమం ప్రారంభంలో ఈ కళాకారులు కనిపించలేదు. కానీ ఆందోళన మొదలైన వారం తర్వాత నుంచి వీరు బైటికి రావడం ప్రారంభించారు. టెంట్లు వేసుకుని రైతులకు సంఘీభావంగా కళారూపాలను ప్రదర్శిస్తున్నారు.

దీంతోపాటు రైతులు తమ ఉద్యమ స్థలిలో సెక్షన్‌ 288ని విధించుకున్నారు. అంటే ఇది 144 సెక్షన్‌ రెట్టింపు. ఈ సెక్షన్‌ ప్రకారం నిరసన స్థలంలో రైతులు తప్ప మరెవరూ ప్రవేశించడానికి వీలులేదు.

1988లో దిల్లీలోని బోట్‌ క్లబ్‌లో చౌదరి మహేంద్ర సింగ్‌ తికాయత్‌ ధర్నాకు దిగినప్పుడు భారత్‌ కిసాన్‌ యూనియన్‌ (బీకేయూ) తొలిసారి ఈ సెక్షన్ 288ను ఉపయోగించింది.

రైతుల నిరసన

ఫొటో సోర్స్, Chinki Sinha/BBC

రైతుల కోసం అంబులెన్స్‌లు

ఇక్కడ కొందరు వలంటీర్లు అంబులెన్స్‌లు నిర్వహిస్తున్నారు. ప్రతిచోటా ఆరోగ్య తనిఖీ కేంద్రాలను నడుపుతున్నారు. రక్తదాన శిబిరాలు కూడా కొనసాగుతున్నాయి.

“ఈ నిరసనల ప్రారంభంలో మౌలిక సదుపాయాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇప్పుడిప్పుడే పెరుగుతున్నాయి’’ అని దర్శన్‌ సింగ్‌ అనే రైతు అన్నారు.

గ్రామాలలోని గురుద్వారాలు ఆందోళనకారులకు ఆహారం, నీరు, వస్తువులు సేకరించే కేంద్రాలుగా మారాయి. వాట్సాప్‌ గ్రూప్‌లు, కరపత్రాల ద్వారా రైతులు ఉద్యమాన్ని సమన్వయం చేసుకోవడం ప్రారంభించారు.

“మాలో చాలామందికి స్మార్ట్‌ఫోన్‌లు లేవు. కానీ మాకు సమాచారం అందుతూనే ఉంది’’ అని దర్శన్‌ సింగ్‌ అన్నారు.

నిరసనలో ప్రతి గ్రామం నుంచి రైతులు పాల్గొనాలని నియమం పెట్టుకున్నారు. ఆ ఊరి పెద్ద, ఇతర నేతలు ప్రతి ఇంటి నుంచి ఒకరు ఉద్యమంలో పాల్గొనేలా చూసుకుంటున్నారు. ఒక బృందం తిరిగి రాగానే మరో బృందం ఆందోళన జరిగే ప్రాంతానికి వెళ్లాల్సి ఉంటుంది.

దిల్లీ సరిహద్దుల్లో కొనసాగుతున్న ఆందోళనకు ఆహారం, నీరు అన్నీ గ్రామాల నుంచే వస్తున్నాయి. మహిళలు ఈ ఏర్పాట్లలో ముందున్నారు. రైతులు ఆందోళనలో పాల్గొంటుండగా, మహిళలే పొలాలను చూసుకుంటున్నారు.

రైతుల నిరసన

ఫొటో సోర్స్, Chinki Sinha/BBC

ఎటు చూసినా ఉద్యమ స్ఫూర్తి

సింఘు, తిక్రి సరిహద్దులు పూర్తిగా నిరసనకారులతో నిండిపోయాయి. ఎక్కడ చూసినా బ్యానర్లు, రకరకాల ప్రదర్శనలు, ఫొటో గ్యాలరీలు కనిపిస్తున్నాయి. కథలు, నాటకాలతో ఉద్యమానికి కళాకారులు మద్దతుగా నిలుస్తున్నారు.

దిల్లీకి చెందిన డాక్యుమెంటరీ ఫిల్మ్‌ మేకర్‌ ప్రతీక్‌ శేఖర్‌ ఈ ఆందోళనలను కెమెరాలలో చిత్రించి దాన్ని సోషల్‌ మీడియాలో పెడుతున్నారు.

“సినిమాలు తీయడం వేరు, ఇలాంటివి చిత్రించడం వేరు. సినిమాలతో మన అభిప్రాయం చెబుతాం. కాని ఇది ప్రజల అభిప్రాయాన్ని చెప్పడం” అన్నారాయన. సోషల్‌ మీడియాలో మంచి రెస్పాన్స్‌ వస్తోందని ప్రతీక్‌ శేఖర్‌ వెల్లడించారు.

పబ్లిక్‌ కారవాన్‌

దేశవ్యాప్తంగా అనేమంది రైతులు రోజూ ఇక్కడి కి వచ్చి ఆందోళనలో పాల్గొంటున్నారు. ఎంతమంది వచ్చినా తినడానికి ఇబ్బంది లేకుండా ఆహారపదార్ధాలను సిద్ధం చేసి పెడుతున్నారు.

ట్రాలీలలో దుప్పట్లు పరిచి, పైన టార్పాలిన్‌ పట్టాలు వేసి చలి లేకుండా రైతులు పడుకోవడానికి ఏర్పాట్లు చేశారు. వంటల కోసం పెద్ద ఎత్తున గ్యాస్‌ సిలిండర్లు, స్టవ్‌లను తెచ్చారు.

చపాతీ మేకర్‌లను కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి తరలించారు. రైతులకు కాలక్షేపానికి టీవీలు కూడా ఉన్నాయి. అయితే ఏ సౌకర్యాన్ని వినియోగించుకోవాలన్నా ఒక నియమం ఉంటుంది. దాన్ని అందరూ పాటించాల్సిందే.

“హరియాణా రైతులు మా సోదరులు. వారు మా కోసం వాటర్‌ ట్యాంకులు, కూరగాయలు కూడా తెస్తున్నారు’’ అని దర్శన్‌ సింగ్‌ అనే రైతు వెల్లడించారు.

కొనసాగనున్న చర్చలు

గత కొన్ని రోజులుగా రైతులతో ప్రభుత్వ చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడింది. జనవరి 4వ తేదీన తదుపరి రౌండ్‌ సమావేశాలు జరగబోతున్నాయి.

ఎంత చలి ఉన్నా కూడా దాన్ని తట్టుకుంటూ ఆందోళనను కొనసాగిస్తామని రైతులు చెబుతున్నారు. “ ఇక్కడ మరణించిన వారి త్యాగాలు వృథా కానివ్వం’’ అన్నారు దర్శన్‌ సింగ్‌.

వీడియో క్యాప్షన్, Farmers Protest: డ్రమ్ములకొద్దీ పాలు దానం చేస్తున్న రైతులు

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)