జయకిశోర్ ప్రధాన్: కూతురి కోసం 64 ఏళ్ల వయసులో ఎంబీబీఎస్ చేస్తున్న తండ్రి

ఫొటో సోర్స్, DEEPAK SHARMA
- రచయిత, సందీప్ సాహు
- హోదా, బీబీసీ కోసం, భువనేశ్వర్ నుంచి
ఒడిషాకు చెందిన ఒక రిటైర్డ్ బ్యాంకు అధికారి, ఇప్పుడు ఎంబీబీఎస్ చదివేందుకు ఈ ఏడాది నీట్ పరీక్ష పాసయ్యారు. ఆయన పేరు జయకిశోర్ ప్రధాన్, వయసు 64 ఏళ్లు.
తన కూతుళ్ల ఆశయాన్ని నెరవేర్చేందుకు ఆయన మెడిసిన్ చదువుతున్నారు. ప్రధాన్ వయసు మీదే కాదు, ఒక ప్రమాదం తర్వాత కలిగిన అంగవైకల్యంపై కూడా విజయం సాధించారు. 2003లో ఒక కారు యాక్సిడెంటులో ఆయన ఒక కాలు చచ్చుబడిపోయింది.
ఇప్పుడు తన కాలులో ఉన్న స్ప్రింగ్ సాయంతో ఆయన కష్టంగా నడవగలుగుతున్నారు. డాక్టర్ కావాలనే కోరిక తనకు చిన్నప్పటి నుంచీ ఉండేదని జయకిశోర్ బీబీసీకి చెప్పారు.
1974-75లలో 12వ తరగతి పాసైన తర్వాత ఆయన మెడికల్ ప్రవేశపరీక్ష రాశారు. కానీ అప్పుడు పాస్ కాలేకపోయారు.
మళ్లీ మెడికల్ పరీక్ష రాయడం కోసం సంవత్సరం వృథా చేయడం ఎందుకనుకున్న ప్రధాన్, బీఎస్సీలో చేరిపోయారు. పిజిక్స్ ఆనర్స్ గ్రాడ్యుయేషన్ చేశారు. తర్వాత, ఆయనకు స్టేట్ బ్యాంకులో ఉద్యోగం వచ్చింది.

ఫొటో సోర్స్, WWW.VIMSAR.AC.IN
డాక్టర్ కావాలని...
1982లో ప్రధాన్ తండ్రి అనారోగ్యానికి గురైనప్పుడు ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సి వచ్చింది.
ఆ సమయంలో ప్రధాన్ మనసులో మరోసారి డాక్టర్ కావాలనే కోరిక మెదిలింది. కానీ, అప్పటికే ఆయన మెడిసిన్ చదివేందుకు వయోపరిమితి దాటేశారు. దాంతో, ఆ కోరికను చంపుకున్నారు.
డాక్టర్ కాలేకపోయిన ప్రధాన్, 2016 సెప్టంబర్ 30న రిటైరయ్యాక కవలలైన తన కూతుళ్ల ద్వారా ఆ కలను నెరవేర్చుకోవాలని నిర్ణయించుకున్నారు.
మెడిసిన్ చేయాలనుకునేలా ఆయన ఇద్దరిలో స్ఫూర్తి నింపారు. వారిని నీట్ పరీక్షకు సిద్ధం చేశారు. ఆయన కష్టం ఫలించింది. ఆయన ఇద్దరు కూతుళ్లు బీడీఎస్(డెంటల్ సైన్స్)లో చేరారు.
2019లో నీట్ పరీక్షలో వయో పరిమితిని సవాలు చేస్తూ ఒక పిటిషన్ దాఖలు కావడంతో, సుప్రీంకోర్టు ఆ కేసులో తుది తీర్పు వచ్చే వరకూ వయోపరిమితిని ఎత్తివేసింది. ప్రధాన్ ఆ అవకాశాన్ని ఉపయోగించుకున్నారు. అదే ఏడాది నీట్ పరీక్ష రాశారు. కానీ, అప్పుడు ఆయన పాస్ కాలేకపోయారు.
"నిజం చెప్పాలంటే నేను గత ఏడాది నీట్ కోసం ప్రత్యేకంగా ఎలాంటి సన్నాహాలూ చేయలేదు. కానీ మా పిల్లలు పట్టుపట్టడంతో పరీక్ష రాశాను. అప్పుడు పాస్ కాలేదు. కానీ, దానివల్ల కచ్చితంగా ఒక ప్రయోజనం కలిగింది. నీట్ పరీక్ష ఎలా ఉంటుంది, అందులో ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు అనేది తెలిసింది. దాంతో, ఈసారీ బాగా చదివి పరీక్ష రాశాను. పాస్ కాగలిగాను" అన్నారు ప్రధాన్.

ఫొటో సోర్స్, Getty Images
కుమార్తె మృతి
ప్రధాన్ సెప్టెంబర్‌లో నీట్ పరీక్ష రాశారు. డిసెంబర్‌లో ఆ ఫలితాలు వచ్చాయి. కానీ ఆలోపే కుటుంబంలో జరిగిన ఒక ఘటన ఆయనను తీవ్రంగా కుంగదీసింది. నవంబర్‌లో ఒక ప్రమాదంలో ఆయన కవల కూతుళ్లలో ఒకరు చనిపోయారు.
"నేను ఎంబీబీఎస్ చదవడానికి ఎక్కువ ప్రోత్సహించింది తనే. ఈరోజు తను బతికుంటే అందరికంటే ఎక్కువగా సంతోషించి ఉండేది. కానీ ఫలితాలు వచ్చేలోపే తను చనిపోవడం నా దురదృష్టం" అన్న ప్రధాన్ గొంతు ఆయన మనసులోని బాధెంతో చెబుతోంది.
గత గురువారం బుర్లాలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ "వీర్ సురేంద్ర సాయె ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్"(విమ్‌సార్)లో అడ్మిషన్ తీసుకున్నారు.
అయితే, ఆయనకు ఇంకా తరగతులు ప్రారంభం కాలేదు. ఆ కాలేజీ ఆయన నివసిస్తున్న అతాబీరా నుంచి 15 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ప్రధాన్ ఇంటి నుంచి వెళ్తూ చదువుకోవాలా, లేక హాస్టల్లో ఉండాలా అనేది ఇంకా నిర్ణయించుకోలేదు.
"ఇప్పుడు మాకు దగ్గర్లోని కాలేజీలో సీటు వచ్చింది. వేరే రాష్ట్రంలో వచ్చినా సరే వెళ్లేవాడిని. ఎందుకంటే అది నాకు మాత్రమే కాదు, నాకు దూరమైన నా కూతురి కల కూడా" అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, WWW.VIMSAR.AC.IN
డాక్టర్ల లాగే ప్రాక్టీస్ చేస్తారా
మీ పిల్లల వయసున్న తోటి విద్యార్థులతో చదవడం, మీకంటే తక్కువ వయసున్న ప్రొఫెసర్లు చెప్పే పాఠాలు వినడం మీకు ఇబ్బందిగా ఉండదా? అనే ప్రశ్నకు సమాధానంగా..
"నాతో చదివే విద్యార్థులందరూ నన్ను, వారి క్లాస్‌మేట్ అనుకునేలా, నాతో అలాగే ప్రవర్తించేలా నేను నా వైపు నుంచి పూర్తి ప్రయత్నం చేస్తాను. ఇక ప్రొఫెసర్ల విషయానికి వస్తే వాళ్లు నాకంటే వయసులో చిన్నవారైనా నాకు గురువులే అవుతారు" అని ప్రధాన్ చెప్పారు.
డాక్టర్ చదువు ముగిసిన తర్వాత మిగతా డాక్టర్ల లాగే ప్రాక్టీస్ చేస్తారా అనే ప్రశ్నకు...
"నేను దీనిని వృత్తిగా తీసుకోవాలని పరీక్ష రాయలేదు. బ్యాంక్ ఉద్యోగం నుంచి రిటైర్ కాగానే నా వృత్తి జీవితం ముగిసిపోయింది. డాక్టరుగా పనిచేసి ఆ సంపాదనతో జీవితం గడపాలని నాకు ఎలాంటి కోరికా లేదు. పెన్షన్‌తో నాకు గడిచిపోతుంది. మా ప్రాంతంలో వైద్యం చేయించుకోడానికి డబ్బు లేని నిరుపేదలకు చికిత్స అందించాలని నేను కోరుకుంటున్నాను. అలా చేయగలిగితే, నేను చాలా అదృష్టవంతుడినే అనుకుంటాను" అని ఆయన చెప్పారు.
ఇవి కూడా చదవండి.
- కరోనావైరస్: హంతక మహమ్మారిపై శాస్త్రవేత్తల వేటలో వెలుగు చూసిన నిజాలేమిటి?
- కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్, హెర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏంటో మీకు తెలుసా?
- కరోనావైరస్తో మన రోగనిరోధక వ్యవస్థ ఎలా పోరాడుతుందంటే.
- కరోనావైరస్ నుంచి 90 శాతం రక్షణ కల్పించే తొలి వ్యాక్సీన్ ఇదే
- ‘దూదేకుల’ వివాదం ఏపీ హైకోర్టుకు ఎందుకు చేరింది
- ఔరంగజేబ్ నిజంగానే వేల హిందూ దేవాలయాలను కూల్చారా?
- ‘నేను బెంగాలీ.. నా బాయ్ ఫ్రెండ్ నల్ల జాతీయుడు - మా అమ్మ ఏం చేసిందంటే..’
- భారత్-చైనా ఉద్రిక్తతలు: భారత్ ఎందుకు వరుసగా క్షిపణి పరీక్షలు చేపడుతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








