పశ్చిమ బెంగాల్: తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ రాజకీయ జీవితంలో అత్యంత గడ్డు కాలం ఇదేనా?

ఫొటో సోర్స్, Debajyoti Chakraborty/NurPhoto via Getty Images
- రచయిత, ప్రభాకర్ మణి తివారీ
- హోదా, బీబీసీ కోసం, కోల్‌కతా నుంచి
'బెంగాల్ సివంగి'గా పేరు తెచ్చుకున్న తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన రాజకీయ కెరియర్‌లోనే అత్యంత కఠిన పరిస్థితిని ఎదుర్కుంటున్నారా.
అయితే, మమత మొత్తం రాజకీయ కెరీర్‌ను మనం గమనిస్తే, అది సవాళ్లు, సంఘర్షణలతోనే నిండిపోయి కనిపిస్తుంది.
కానీ, ఇప్పుడు వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ వైపు నుంచి వస్తున్న సవాళ్లు, పార్టీలో వరుసగా పెరుగుతున్న తిరుగుబాటును దృష్టిలో పెట్టుకుని రాజకీయ వర్గాల్లో ఈ ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
ఇటీవల వరకూ ప్రభుత్వంలో, పార్టీలో ఎవరి మాటను వేదవాక్కుగా భావిస్తూ వచ్చారో, ఆమెకు వ్యతిరేకంగా పదుల సంఖ్యలో నేతలు ఇప్పుడు గళం వినిపిస్తున్న సమయంలో అలాంటి ప్రశ్నలు రావడం మామూలే.
కాంగ్రెస్ అంతర్గత సవాళ్లతో పోరాడిన తర్వాత వేరే పార్టీ పెట్టి, వామపక్షాలతో తలపడిన మమత.. ఆ సవాళ్లకు బెదిరిపోయి వెనకడుగు వేయడానికి బదులు, వాటిని ఎదుర్కోవడానికి వ్యూహాలు సిద్ధం చేయడంలో మునిగిపోయారు.
2006 అసెంబ్లీ ఎన్నికల సమయం నుంచీ, అంటే దాదాపు గత 15 ఏళ్లుగా తృణమూల్ కాంగ్రెస్, మమతా బెనర్జీ ఒకే నాణేనికి రెండు ముఖాలుగా ఉన్నారు.

ఫొటో సోర్స్, ANI
ప్రశాంత్ కిశోర్ సారథ్యం
మమత ఏ నిర్ణయం తీసుకున్నా, దాన్ని వేలెత్తి చూపే ధైర్యం పార్టీలో ఏ నేతకూ లేదు. కానీ, ఇప్పుడు గత మూడు నాలుగేళ్లుగా పార్టీపై ఆమె పట్టు బలహీనం అయ్యింది.
దాదాపు పదేళ్లు అధికారంలో ఉన్న తర్వాత పార్టీ నేతల్లో కొంత అసంతృప్తి, ఆగ్రహం ఉండడం సహజం. కానీ, బీజేపీ, ముఖ్యంగా గత లోక్‌సభ ఎన్నికల నుంచి దూకుడు చూపిస్తుండడం, పార్టీ నేతలను తమవైపుకు తిప్పుకోవడం మమతకు పెద్ద సవాలుగా మారింది.
లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత మమతా బెనర్జీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సేవలు కూడా ఉపయోగించుకున్నారు. కానీ, ఆయన పాచికలు కూడా పెద్దగా పారుతున్నట్లు కనిపించడం లేదు.
పార్టీకి మందు వేయాలని వచ్చిన ప్రశాంత్, ఆ పార్టీకే జబ్బులా మారినట్టుంది. చూస్తుంటే, చాలా మంది నేతలు పార్టీ వదలడానికి, పార్టీ లోపల అసంతృప్తి పెరగడం వెనుక ప్రశాంత్ కిశోరే కారణం అయినట్టుంది. అయినప్పటికీ, మమతా బెనర్జీకి ఆయనపై ఉన్న నమ్మకం కాస్త కూడా తగ్గలేదు.

ఫొటో సోర్స్, ANI
ఇమేజ్ పెంచే ప్రయత్నం
మమతా బెనర్జీ ప్రభుత్వం ఇమేజ్‌కు మెరుపులు అద్దడానికి ప్రశాంత్ కిశోర్ ఎన్నో వ్యూహాలు సిద్ధం చేశారు. వాటిలో భాగంగా గత ఏడాది "దీదీ కో బోలో'(అక్కతో చెప్పుకోండి) ప్రచారం ప్రారంభించారు. రాష్ట్రంలోని ఏ పౌరుడైనా నేరుగా మమతకు ఫోన్ చేసి తన సమస్య చెప్పుకోవచ్చని అన్నారు.
దీనితోపాటూ వివిధ ప్రభుత్వ పథకాల్లో, వాటాలు తీసుకుంటున్న నేతలపై మమత చర్యలు కూడా తీసుకున్నారు. వాటి ద్వారా, కొందరు తృణమూల్ నేతలు పార్టీ, ప్రభుత్వం ప్రతిష్టను మంటగలుపుతున్నారని సందేశం ఇచ్చే ప్రయత్నం చేశారు.
ప్రశాంత్ కిశోర్ సలహాతో మమత పార్టీలో భారీ స్థాయిలో ప్రక్షాళనకు కూడా సిద్ధమయ్యారు. మచ్చ పడిన నేతలను పక్కకు పెట్టి, కొత్త ముఖాలను తెరపైకి తెచ్చారు.
అయినప్పటికీ, ప్రస్తుతం నెలకొన్న గందరగోళం, పార్టీలో అంతా సరిగా లేదని అనడానికి కారణం అవుతోంది.

ఫొటో సోర్స్, Sanjay Das/BBC
ముందు కఠిన సవాళ్లు
బీజేపీ నుంచి రాజకీయంగా, పాలనాపరంగా ఎదురయ్యే కఠిన సవాళ్ల నుంచి అధికారం కాపాడుకోడానికి ప్రయత్నించే ఏ పార్టీకీ, ఇలాంటి పరిస్థితి మంచిది కాదు.
మమత ఒకేసారి ఎన్నిటినో ఎదుర్కోవాల్సి వస్తోంది. మొదట రాజకీయంగా బీజేపీ బలంతో, వనరులతో పోటీ పడడం ఆమెకు కఠిన సవాలుగా మారింది.
వచ్చే ఎన్నికల్లో విజయం కోసం బీజేపీ తన మొత్తం బలాన్ని, అన్ని వనరులనూ బెంగాల్‌లో ప్రయోగించింది. అర డజనుకు పైగా కేంద్ర నేతలు, మంత్రులకు బెంగాల్ బాధ్యతను అప్పగించారు. మరోవైపు మమతకు వరుసగా పాలనాపరమైన ఇబ్బందులు కూడా పెరుగుతున్నాయి.
గత వారం బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాపై దాడి జరిగిన తర్వాత ఒకవైపు ప్రభుత్వం నుంచి నివేదిక కోరిన కేంద్రం, మరోవైపు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డీజీపీని దిల్లీ రావాలని ఆదేశించింది.

ఫొటో సోర్స్, Sanjay Das/BBC
బీజేపీ తీర్థం పుచ్చుకుంటున్న నేతలు
అయితే, కేంద్రం ఒత్తిడి చేసినప్పటికీ మమత వారిని దిల్లీ పంపించలేదు. ఆ తర్వాత ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులను బలవంతంగా సెంట్రల్ డిప్యుటేషన్ మీద వెళ్లాలని ఆదేశించారు.
ఈ అంశంపై కూడా సంఘర్షణ కొనసాగుతోంది. రాష్ట్రంలో శాంతి భద్రతలతోపాటూ వివిధ అంశాలపై గవర్నర్ జగదీప్ ధన్‌ఖడ్ కూడా ప్రభుత్వంపై పదునైన వ్యాఖ్యలు చేస్తున్నారు.
కానీ గోటిచుట్టుపై రోకలిపోటులా, నిన్నటివరకూ అత్యంత నమ్మకస్తులుగా భావించిన పార్టీ నేతల నుంచే మమతకు అతిపెద్ద సవాలు ఎదురవుతోంది.
వారిలో మొట్టమొదట బీజేపీ తీర్థం పుచ్చుకున్న ముకుల్ రాయ్‌ను రాష్ట్రంలో, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో టీఎంసీకి వేళ్లూనుకోడానికి ప్రధాన కారణం అని భావిస్తారు.
ఆయన తర్వాత గత రెండేళ్లుగా బరక్‌పూర్ బలమైన నేత, ప్రస్తుత బీజేపీ ఎంపీ అర్జున్ సింగ్‌తోపాటూ కొంతమంది నాయకులు తిరుగుబాటు వైఖరిని అవలంభిస్తూ వచ్చారు.

ఫొటో సోర్స్, ANI
శుభేందు అధికారి పార్టీ వీడారు
కానీ, ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో బేరసారాలతో జోరందుకున్న గందరగోళం మమతకు తీవ్ర సమస్యగా మారింది.
వీరిలో మెదినీపూర్ ప్రాంతానికి చెందిన అగ్ర నేత శుభేందు అధికారి సహా చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇంత గందరగోళం ఉన్నప్పటికీ, మమతా ధైర్యంగా ముందుకు వెళ్తున్నారు.
పార్టీ ఫిరాయింపులపై చర్చించి, తగిన వ్యూహం సిద్ధం చేయడానికి ఆమె శుక్రవారం సాయంత్రం తన నివాసంలో పార్టీ అగ్ర నేతలతో సమావేశం అయ్యారు.
"మన బలం సామాన్యులే. నేతలు కాదు. కొందరు నేతలు పార్టీని వదలడం వల్ల ఏ తేడా ఉండదు. అలాంటి వాళ్లు పార్టీకి భారం. ఈ నమ్మకద్రోహానికి సామాన్యులే వారికి బుద్ధి చెబుతారు. బెంగాల్ ప్రజలకు విశ్వాస ఘాతకులు అంటే నచ్చరు" అని మమత ఆ సమావేశంలో అన్నారు.
"మమత నేతలందరితో పదేళ్ల ప్రభుత్వ పనితీరుతో ప్రజల్లోకి వెళ్లాలని ఆదేశించారు. దానితోపాటూ తృణమూల్‌ను బీజేపీ ఎలా ముక్కలు చేయడానికి ప్రయత్నిస్తోందో ప్రచారం చేయాలని చెప్పారు" అని ఆ సమావేశానికి హాజరైన టీఎంసీ సీనియర్ నేత ఒకరు చెప్పారు.

ఫొటో సోర్స్, ANI
చరిత్ర పునరావృతం
"పార్టీ వదిలి వెళ్లాలనుకునేవారికి, తలుపులు తెరిచే ఉన్నాయి. అధికార దాహం ఉన్న నేతలు, సామాన్యులను పట్టించుకోకుండా ఎప్పుడూ తమ మంచి గురించే ఆలోచిస్తారు. వారు ఉన్నా, లేకపోయినా ఎలాంటి తేడా ఉండదు" అని మమత గత వారం రోజులుగా తన అన్ని ర్యాలీల్లో చెబుతూనే ఉన్నారు.
బహిరంగ సభల్లో మధ్య మధ్యలో నీళ్లు తాగుతూ, ప్రస్తుత గందరగోళానికి బీజేపీనే కారణమని ఆమె విమర్శలు సంధిస్తున్నా, బెంగాల్‌లో పార్టీ ఫిరాయింపులను మొదట ప్రోత్సహించింది మమతే అని ప్రతిపక్ష నేతలు, రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. దశాబ్దం తర్వాత ఇప్పుడు అదే చరిత్ర పునరావృతం అవుతోందని అంటున్నారు.
టీఎంసీ నేతలను కేంద్ర ఏజెన్సీల పేరుతో భయపెడుతున్న బీజేపీ నేతలు, వారు పార్టీ మారేలా చేస్తున్నారని మమత వరుస ఆరోపణలు చేస్తున్నారు.
"చరిత్ర పునరావృతం అవతుంది. ఇప్పుడు మమతకు తను చేసిన వాటికి సమాధానం లభిస్తోంది. కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న మాల్దా, ముర్షిదాబాద్‌లో ఎంతోమంది ఎమ్మెల్యేలు, నేతలను తప్పుడు కేసుల్లో ఇరికిస్తామని బెదిరించిన మమత, వారు టీఎంసీలో చేరేలా చేశారు. అప్పట్లో పార్టీ మారిన ఎంతోమంది ఇప్పుడు బీజేపీలోకి వెళ్లిపోయారు" అని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అధీర్ రంజన్ చౌధరి అన్నారు.

ఫొటో సోర్స్, ANI
పశ్చిమ బెంగాల్ రాజకీయాలు
2011లో టీఎంసీ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి మానస్ భుయియా, అజయ్ డే, సౌమిత్ర ఖాన్, హుమయూ కబీర్, కృష్ణేందు నారాయణ్ చౌధరి సహా ఎంతోమంది కాంగ్రెస్ నేతలు టీఎంసీలోకి వెళ్లిపోయారనే మరో విషయాన్ని ఇక్కడ ప్రస్తావించాలి.
వారిలో కొంతమందికి మంత్రిమండలిలో చోటిచ్చారు. ఇంకొంతమందిని ఎంపీలుగా చేశారు. అలాగే ఛాయా దొలుయీ, అనంత్ దేబ్ అధికారి, దశరథ్ తీర్కీ, సునీల్ మండల్ లాంటి వామపక్ష నేతలు కూడా టీఎంసీలో భాగం అయ్యారు.
"2011లో తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మమత ఈ గేమ్ మొదలు పెట్టారు. ఆ తర్వాత వామపక్షాలకు చెందిన ఎంతోమంది ఎమ్మెల్యేలు టీఎంసీలోకి వెళ్లిపోయారు" అని అసెంబ్లీలో లెఫ్ట్ నేత జన్ చక్రవర్తి చెప్పారు.
మరోవైపు, "ఉనికి కోసం పోరాడుతున్న పార్టీలు కూడా ఇలా నిరాధార ఆరోపణలు చేస్తున్నాయి. మమత మొదటి నుంచీ సామాన్యుల కోసం పనిచేస్తూ వచ్చారు. ఇక ముందు కూడా చేస్తారు. ఇలా ఇద్దరు-ముగ్గురు నేతలు పార్టీ వదిలి వెళ్లినంత మాత్రాన, పెద్ద తేడా రాదు’’ అని మంత్రి, తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నేత చంద్రిమా భట్టాచార్య అన్నారు.
60లలో తప్ప పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో పార్టీలు మార్చే సంప్రదాయం ఎప్పుడూ లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
"ఇక్కడ పార్టీలు మారే సంప్రదాయాన్ని టీఎంసీ ప్రభుత్వమే ప్రారంభించంది. విపక్ష నేతలను బెదిరించి లేదంటే ఆశచూపి టీఎంసీలోకి వచ్చేలా చేశారు. కానీ, కాలం మారింది. ఇప్పుడు స్వయంగా తృణమూల్ కాంగ్రెస్ లక్ష్యంగా మారింది" అని రాజనీతి శాస్త్రం ప్రొఫెసర్ సునీల్ కుమార్ కర్మాకర్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- ‘ఆలయ ప్రవేశాన్ని సమర్థించిన గాంధీ హరిజన బాంధవుడేనా?’
- భగత్‌సింగ్ ఇల్లు చూద్దాం రండి..
- భారతదేశంలో సైనిక తిరుగుబాటు ఎందుకు సాధ్యం కాదు?
- హైదరాబాద్ పేరెత్తకుంటే.. కశ్మీర్‌ను పాకిస్తాన్‌కు వదిలేస్తామని పటేల్ చెప్పింది నిజమేనా?
- ప్రశాంతంగా నిద్ర పోవాలనుకునే వారి కోసం పది విషయాలు
- రాబిన్ హుడ్ బాపు: 'కృష్ణా నది దగ్గర బొబ్బిలి పులి'
- మొట్టమొదటి కేంద్ర బడ్జెట్: 'ఆకలి తీర్చుకునేందుకు విదేశాల దయాదాక్షిణ్యాలపై ఆధారపడలేం'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








