పాకిస్తాన్ నుంచి సుష్మా స్వరాజ్ భారత్‌కు తీసుకువచ్చిన 'గీత’ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు... ఏం చేస్తున్నారు?

ఫొటో సోర్స్, SAJJAD HUSSAIN/AFP via Getty Images
- రచయిత, అనంత్ ప్రకాశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఒక నది, దాని ఒడ్డున ఉన్న పెద్ద అమ్మవారి గుడి, రెయిలింగ్ ఉన్న వంతెన... ఇవే గీత చిన్నప్పటి జ్ఞాపకాలు. వీటి సహాయంతో ఇరవై ఏళ్ల క్రితం దూరమైపోయిన తన కుటుంబాన్ని వెతికే ప్రయత్నం చేస్తున్నారు.
పుట్టుకతోనే మూగ, చెవిటి అయినన గీత 2000 సంవత్సరంలో పొరపాటున పాకిస్తాన్ వెళ్లే సంఝోతా ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కేసారు.
2015లో మాజీ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఆమెను భారతదేశం తీసుకువచ్చారు. అప్పటినుంచీ ఆమె తన తల్లిదండ్రుల కోసం వెతుకుతున్నారు.
అయితే, ఆమె ఏ గ్రామం, ఏ జిల్లా, ఏ రాష్ట్రంనుంచీ ఆ రైలు ఎక్కి పాకిస్తాన్ చేరుకున్నారో ఇప్పటివరకూ తెలియలేదు.
తన కుటుంబ సభ్యుల ఆచూకీ తెలుస్తుందేమోనని, ఎవరైనా ఆ శుభవార్త తనకు చేరవేస్తారేమోనని ఆమె గత ఐదేళ్లుగా ఎదురు చూస్తూనే ఉన్నారు.
సుష్మా స్వరాజ్‌తో సహా అనేకమంది సెలెబ్రిటీస్ కూడా గీత తల్లిదండ్రుల జాడ కనుక్కునే ప్రయత్నాలు చేశారు. సుష్మా స్వరాజ్ ఒక మంత్రిగా, వ్యక్తిగతంగా కూడా గీత కుటుంబ సభ్యుల గురించి ట్విట్టర్‌ద్వారా వెతికే ప్రయత్నాలు చేసారు. అయినా వారి ఆచూకీ తెలియలేదు.

ఫొటో సోర్స్, Gyanendra Purohit
ఇంతలో సుష్మా స్వరాజ్ మరణం గీతను తీవ్రంగా కలచివేసింది. కరోనా మహమ్మారి విజృంభించడం, లాక్‌డౌన్ విధించడం, ఎవరికి వారు దూరంగా ఉండడం... ఇలా పలు కారణాలతో గీత ఓపిక నశించిపోయింది.
గత కొన్ని నెలలుగా, తనకున్న జ్ఞాపకాల ఆధారంగా తానే స్వయంగా తన తల్లిదండ్రులను వెతకడం మొదలుపెట్టారు.
ఇండోర్‌లో నివసిస్తున్న జ్ఞానేంద్ర, మోనికా పురోహిత్ ఈ అన్వేషణలో గీతకు సహాయం చేస్తున్నారు. జ్ఞానేంద్ర, అతని బృందం మహరాష్ట్రనుంచీ ఛత్తీస్‌ఘడ్ మీదుగా తెలంగాణకు రోడ్డు మార్గాన చేరుకుని.. గీత జ్ఞాపకాల ఆధారంగా తను చిన్నప్పుడు నివసించిన గ్రామాన్ని అన్వేషిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
మార్గమధ్యంలో ఏదైనా నదిని చూడగానే గీతలో కొత్త ఉత్సాహం కనిపిస్తుందని జ్ఞానేంద్ర చెప్పారు. "నదిని చూడగానే తన కళ్లల్లో ఓ మెరుపు కనిపిస్తుంది. తన చిన్నతనంలో నది ఒడ్డునే ఉండేవారని గీత చెప్పారు. నదిని చూడగానే తన ఇల్లు, తల్లిదండ్రుల జాడ తెలుస్తుందనే ఓ కొత్త ఆశ ఆమె మనసులో చిగురిస్తుంది" అని జ్ఞానేంద్ర తెలిపారు.
"బాల్యంలో గీతకు తన తల్లి ఆవిరి ద్వారా నడిచే రైలు ఇంజిన్ గురించి చెప్పేవారు. మేము ఔరంగాబాద్ సమీపంలోని లాతూర్ రైల్వే స్టేషన్ చేరుకున్నప్పుడు గీత చాలా సంతోషపడ్డారు. అక్కడ విద్యుత్ లేదు, రైళ్లు డీజిల్ ఇంజిన్ సహాయంతో నడుస్తాయి. గీతకు ఎలక్ట్రిక్ ఇంజిన్ తెలీదు. ఆ రైళ్లను చూసి తనలో మళ్లీ ఆశ చిగురించింది. ఎప్పటికైనా తనవాళ్లు తనకు కనిపిస్తారని ఆశతో ఉన్నారు" అని జ్ఞానేంద్ర వివరించారు.
గీత హావభావాలు, భోజనం చేసే పద్ధతి, ఆమె చెబుతున్న చిన్ననాటి జ్ఞాపకాలు...వీటన్నిటినీ జ్ఞానేంద్రా వాళ్ల సంస్థ 'ఆదర్శ సేవా సొసైటీ' దీర్ఘకాలంపాటూ అధ్యయనం చేసింది.
ఆమె చెప్పిన వివరాల ద్వారా తను మహరాష్ట్ర సరిహద్దు ప్రాంతాలకు చెందిన వ్యక్తి అయి ఉండొచ్చని భావిస్తున్నారు.

ఫొటో సోర్స్, Gyanendra Purohit
కానీ, ఇంత సుదీర్ఘ ప్రయాణం తరువాత గీత మనసులో చిన్ననాటి జ్ఞాపకాలు మెల్లిమెల్లిగా మసకబారుతున్నాయి. ఇంతకుముందు తన బాల్యం పూర్తిగా కళ్లకు కట్టినట్టు కనిపించేది. కానీ, ఇప్పుడు ముక్కలు ముక్కలుగానే తనకు ఆ విషయాలు గుర్తొస్తున్నాయి.
సంకేత భాషను అర్థం చేసుకునే జ్ఞానేంద్ర, గీత చిన్నప్పటి జ్ఞాపకాల గురించి చెబుతూ, "నదిని చూడగానే గీత తన చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటారు. అచ్చం ఇలాంటిదే నది మా గ్రామంలో ఉంది. నది పక్కనే రైల్వే స్టేషన్ ఉంటుంది. ఒక వంతెన ఉంటుంది. దాని మీద రైలింగ్ ఉంటుంది. సమీపంలోనే ఒక రెండంతస్తుల ఆస్పత్రి ఉంటుంది. అది ప్రసూతి ఆస్పత్రి. ఎప్పుడూ జనాలతో రద్దీగా ఉండేదని ఆమె చెబుతూ ఉంటారు.
తమ పొలంలో చెరకు, ధాన్యం, వేరుశెనగ పండించేవారని చెప్పారు. దారిలో ఎక్కడైనా పొలం కనిపిస్తే బండి ఆపి, పొలం దగ్గరకు పరుగెడతారు. ఆ పొలంలో పనిచేస్తూ తన తల్లి కనిపిస్తారేమోనని ఆతృతగా అంతా వెతుకుతారు.

ఫొటో సోర్స్, Getty Images
గీతకు చాలా విషయాలు గుర్తున్నాయి. రైల్వే స్టేషన్, నది, వంతెనలాంటి భౌగోళిక విషయాలు బాగా గుర్తున్నాయి. కానీ, గత 20 ఏళ్లల్లో భారతదేశంలో అనేక మార్పులు వచ్చాయి. భౌగోళికంగా ఎన్నో మార్పులొచ్చాయి. మన చిన్నతనంలో మనం నివసించిన ప్రదేశానికి వెళితే అది చాలా మారిపోయుంటుంది. ఒక్కోసారి మనం గుర్తు పట్టలేనంతగా మారిపోతుంది. మందిరం ఉందని గీత చెబుతున్నచోట ఇప్పుడు ఆ మందిరం ఉందో లేదో తెలీదు. తన కుటుంబం ఆ గ్రామంలోనే ఉందో లేక వారు మరెక్కడికైనా వెళ్లిపోయారో తెలీదు” అని అన్నారు.
చిన్నప్పుడే తప్పిపోయి కుటుంబంనుంచీ దూరమైపోవడం, కొన్నేళ్లుగా ఎంత వెతుకున్నా తన తల్లిదండ్రుల ఆచూకీ తెలియకపోవడం గీతను బాగా కృంగదీసాయని మోనికా తెలిపారు.
"జీవితంలో ముందుకు సాగాలని, పెళ్లి చేసుకోమని చెప్తే గీత వెంటనే మా మాటలు కొట్టిపారేస్తారు. తను వయసులో ఇంకా చాలా చిన్నదని, తన తల్లి ఆచూకీ ఎలాగైనా తెలుసుకోవాలని అంటారు పట్టుకోవాలని అంటారు. పెళ్లి చేసేసుకుంటే తమకు తెలియకుండా చేసుకున్నందుకు తన కుటుంబం బాధపడుతుందని అంటుంటారు. తాను ఇంకా 16-17 ఏళ్ల చిన్న పిల్ల అనే అనుకుంటున్నారు. కానీ, ఆమె వయసు 25-28 మధ్య ఉంటుంది. గీత చాలా మంచి అమ్మాయి. కానీ అప్పుడప్పుడూ ఆమెను కంట్రోల్ చెయ్యడం కష్టమైపోతుంటుంది. చిన్న చిన్న విషయాలకు కూడా ఏడుస్తూ ఉంటారు" అని మోనిక చెప్పారు.
గీత ఇంకా పొలాలవైపూ, నదుల వైపూ, రైల్వే స్టేషన్‌వైపూ ఆశగా చూస్తూనే ఉన్నారు...ఏ పొలంలోనైనా తన తల్లి కనిపిస్తారేమోనని, ఏ నది ఒడ్డునైనా తారసపడతారేమోనని ఆశగా వెతుకుతూనే ఉన్నారు.
ఇవి కూడా చదవండి:
- క్రిస్టమస్ స్టార్: గురు, శని గ్రహాల అరుదైన కలయికను మీరూ చూడవచ్చు
- గాలీ ప్రాజెక్ట్: తిట్లన్నీ మహిళలను అవమానించేలా ఎందుకుంటాయి... కల్చర్ మారేదెలా?
- రైతుల నిరసనలు దేశాన్ని కుదిపేస్తుంటే, తెలుగు రాష్ట్రాల రైతులు ఏమంటున్నారు? వాళ్ల కష్టాలు ఏంటి?
- కొడుకు పోర్న్ కలెక్షన్ ధ్వంసం చేసిన తల్లిదండ్రులు.. పరిహారం చెల్లించాలన్న అమెరికా కోర్టు
- అయోధ్యలో రామాలయం నిర్మాణానికి రూ. 1,000 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి? ప్లాన్ ఏంటి?
- వ్యాపారం కోసం వచ్చి ఇండియాలో మారణహోమం సాగించిన కంపెనీ కథ
- ప్రపంచంలో విదేశాలపై ఆధారపడని ఏకైక ‘దేశం’ ఇదేనా?
- ‘దూదేకుల’ వివాదం ఏపీ హైకోర్టుకు ఎందుకు చేరింది
- నాసా స్పేస్ మిషన్ కమాండర్‌గా హైదరాబాదీ రాజాచారి
- ఏపీ రాజధాని చుట్టూ ఏడాదిగా ఏం జరిగింది? అమరావతి భవితవ్యం ఏంటి?
- అభిషేక్ బచ్చన్: కబడ్డీతో బాలీవుడ్ హీరో లవ్ అఫైర్.. ఈ గ్రామీణ క్రీడ పాపులర్ క్రీడగా ఎలా మారిందంటే...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








