తల్లితండ్రులకు పిల్లలు ఆర్థికంగా సహాయపడాలా?

తల్లితండ్రులు పిల్లలు

ఫొటో సోర్స్, Alamy

లమీస్ వజాహాత్ కెనడాలోని ఒంటారియోలో తన తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నారు. అక్కడ ఆమె కంటెంట్ క్రియేటర్‌గా పనిచేస్తున్నారు.

నాలుగేళ్లుగా వారి కుటుంబం లమీస్ ఒక్కరి సంపాదన మీదే జీవనం సాగిస్తోంది. ఆమె తల్లిదండ్రులకు ఉద్యోగాలు లేవు.

లమీస్‌ తల్లిదండ్రులది పాకిస్తాన్‌. వాళ్లు చాలా కాలం కిందట అక్కడి నుంచి దుబయికి వలస వెళ్లారు. పదేళ్ల క్రితం అక్కడి నుంచి కెనడాకు వచ్చేశారు. పిల్లల చదువులకు కెనడా అయితే బాగుంటుందని వాళ్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే, కెనడాకు వచ్చిన తర్వాత వారి ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా తయారయ్యింది.

లమీస్ తల్లి పనిచేయరు. తండ్రికి కెనడాలో ఉద్యోగం దొరకలేదు.

‘‘మొదటిసారి నా తల్లిదండ్రులు నన్ను డబ్బులు అడిగినప్పుడు నాకు 19-20 ఏళ్లు ఉంటాయనుకుంటా. అప్పుడు నేను అవాక్కయ్యా. అప్పట్లో నేను ఓ ఐస్‌క్రీమ్ షాపులో పార్ట్ టైమ్ ఉద్యోగం చేసేదాన్ని. ‘ఇంట్లో ఎవరూ పనిచేయడం లేదుగా. పరిస్థితులు ఎలా ఉన్నాయో చూడు. నువ్వు కూడా వీలైనంత తోడ్పాటు అందించాలి’ అని మా అమ్మ నాతో అన్నారు. అలా అప్పుడప్పుడు అమ్మకు ఐదు వేల రూపాయలు ఇవ్వడం మొదలుపెట్టా. ఇప్పుడు ప్రతి నెలా 25 వేల రూపాయలు మా తల్లిదండ్రుల కోసం పక్కనపెడుతున్నా’’ అని లమీస్ చెప్పారు.

సొంత డబ్బులు తల్లిదండ్రులకు ఇవ్వాల్సి రావడంతో మొదట్లో తనకు చిరాగ్గా అనిపించిందని ఆమె అన్నారు.

తల్లితండ్రులు పిల్లలు

ఫొటో సోర్స్, Alamy

‘‘నేను దుబయి జీవనశైలికి అలవాటుపడి ఉన్నా. అమాయకంగా ఉండేదాన్ని. మా తల్లిదండ్రుల దగ్గర ఎప్పుడూ డబ్బులు ఉంటాయని అనుకునేదాన్ని. ఇలాంటి పరిస్థితి వస్తుందని అనుకోలేదు’’ అని లమీస్ చెప్పారు.

‘‘నా స్నేహితులు కొందరు నా పరిస్థితిని విచిత్రంగా చూశారు. ఇంకొంతమంది నాలాగే చేస్తున్నారని తెలిసింది. కెనడా లాంటి దేశాల్లో 18 ఏళ్లు రాగానే పెద్దవాళ్లమైపోయామని అనుకుంటాం. సొంతంగా, ఆర్థికంగా స్వతంత్రంగా బతికేస్తాం’’ అని లమీస్ అన్నారు.

నెమ్మదిగా పరిస్థితులకు తగ్గట్లుగా తాను మారనని, కుటుంబ అవసరాలు తీర్చడం మొదలుపెట్టానని ఆమె చెప్పారు. ఎవరూ ఎవరినీ అడిగే పరిస్థితి లేకుండా ఏర్పాటు చేసుకున్నామని వివరించారు.

తల్లిదండ్రులకు పిల్లలు ఆర్థికంగా తోడ్పాటు అందించడం వింతేమీ కాదని, పశ్చిమ దేశాల్లో ఇది పరోక్షంగానూ జరుగుతూ ఉంటుందని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ సారా హెర్పర్ అన్నారు.

‘‘నేరుగా పిల్లలు తల్లిదండ్రులకు డబ్బులు ఇవ్వకపోయినా... ఏదైనా పెన్షన్ లేదా వృద్ధుల సంక్షేమ కార్యక్రమాలకు వారు కట్టే పన్నులు ఉపయోగపడతాయి’’ అని ఆమె చెప్పారు.

ప్రజాకర్షక విధానాలు పెరగడం, ప్రభుత్వాల వద్ద నిధులు తగ్గుతుండటం, జనాలు ఆయువు పెరుగుతుండటం, కోవిడ్ సంక్షోభం ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపించడం... ఇలా రకరకాల కారణాలతో వృద్ధుల కోసం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలకు అవరోధాలు పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో భావి తరాల్లో తల్లిదండ్రులు, పిల్లల మధ్య పరస్పర తోడ్పాటు ఎలా ఉంటుందన్న అంశం ఆసక్తికరంగా మారింది.

ఎవరు ఎవరికి సాయపడుతున్నారు? ఎంతగా సాయపడాలి? ఎవరు కష్టకాలం ఎదుర్కుంటున్నారు? అన్న విషయాలు కూడా ఆసక్తికరమైనవే.

తల్లితండ్రులు పిల్లలు

ఫొటో సోర్స్, Alamy

తమ తల్లిదండ్రుల వల్ల మిలీనియల్స్ ఇబ్బందులు పడుతున్నారన్న భావన చాలా వరకూ ఉంది.

అయితే, మిలీనియల్స్ కన్నా వారి తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉందన్న వాదన సరికాదని హార్పెర్ అంటున్నారు.

కొత్త తరాలకు జీవితంలో విజయవంతమయ్యేందుకు బోలెడు అవకాశాలు ఉన్నాయని, ఈ విషయంలో వారితో వెనుకటి తరాలను పోల్చే పరిస్థితే లేదని ఆమె అభిప్రాయపడ్డారు.

ఈ పరిస్థితిని తరాల మధ్య సంఘర్షణలా కూడా చూడకూదని హార్పెర్ అన్నారు.

‘‘ఒకరికొకరు సాయపడటం గురించి మనం ఆలోచించే తీరే మారాలి. తల్లిదండ్రులు వృద్ధాప్యం కోసం ముందుచూపుతో ఆలోచించి, ఆర్థిక ప్రణాళికలు వేసుకోవాలి. డబ్బు పొదుపు చేయాలి. వృద్ధాప్యంలో పెన్షన్ వంటివి వచ్చేలా చూసుకోవాలి’’ అని ఆమె వ్యాఖ్యానించారు.

‘‘తోడ్పాటు అందించాల్సింది పిల్లలా? తల్లిదండ్రులా? అన్న వాదనకు మనం పోకూడదు. ఇంతకన్నా పెద్ద సమస్య ఒకటి ఉంది? అసలు మొత్తంగా కుటుంబాలే తమను తాము పోషించుకునే పరిస్థితిలో ఉన్నాయా?’’ అని ఆమె అన్నారు.

తల్లితండ్రులు పిల్లలు

ఫొటో సోర్స్, Alamy

కోవిడ్ సంక్షోభ సమయంలో చాలా కుటుంబాలు విచ్ఛిన్నమయ్యాయని, అయితే ఇది కరోనా రాకముందు నుంచే జరుగుతోందని హార్పెర్ అన్నారు.

‘‘ప్రపంచవ్యాప్తంగా మధ్య తరగతి కుటుంబాలే చాలా ఎక్కువ. తల్లిదండ్రులు, పిల్లలు భావోద్వేగపరంగా, ఆర్థికంగా పరస్పరం తోడ్పాటు అందించుకునే నేపథ్యం వారికి ఉంది. అయితే, మొత్తంగానే ఆర్థికంగా నిలదొక్కుకోలేకపోతున్న కుటుంబాల సంఖ్య పెరుగుతోంది’’ అని ఆమె చెప్పారు.

‘‘కొన్ని కుటుంబాల్లో తల్లిదండ్రులు చదువు లేనివారై ఉండొచ్చు. పేదవారై ఉండొచ్చు. అలాంటి కుటుంబాల్లో పిల్లలు విఫలమైతే, వారికి ఓ రక్షణ కవచం అంటూ ఉండదు’’ అని హార్పెర్ అన్నారు.

కోవిడ్ సంక్షోభ సమయంలో వృద్ధులకు ఎక్కువ ముప్పు ఉండటంతో పిల్లలు తల్లిదండ్రుల విషయంలో జాగ్రత్త వహించాల్సి వచ్చిందని... ఫలితంగా రెండు తరాల మధ్య తోడ్పాటు అంశం కూడా తెర మీదకు వచ్చిందని ఆమె అభిప్రాయపడ్డారు.

సంక్షోభ పరిస్థితులైనా, సాధారణ పరిస్థితులైనా కలిసి బతకడం వల్ల అందరికీ మేలని లమీస్ అంటున్నారు.

‘‘నా కుటుంబానికి సాయపడుతున్న కొద్దీ ఈ విషయంలో నేను మరీ గర్వంగా భావించాల్సిందేమీ లేదని నాకు అర్థమైంది. చిరాకు కూడా దూరమైంది’’ అని ఆమె చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)