ఇంటెన్సివ్ పేరెంటింగ్ అంటే ఏమిటి? ఈ తరహా పెంపకం పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది?

చిన్నారి

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, పద్మ మీనాక్షి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

"నా కాలం‌లో పెళ్లి అయ్యే వరకు సెక్స్ అంటే ఏమిటో తెలియదు. ఇప్పుడు క్లాస్‌లో ఎవరో అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఆ అమ్మాయితో తిరగవద్దంటే మా మాట వినడం లేదు."

ప్రేమలో పడిన తన కొడుకు కోసం ఓ తల్లి మానసిక నిపుణుడిని సంప్రదించింది. ఈ సమస్య మానసిక నిపుణుల్ని సంప్రదించేంత పెద్దదా కాదా అనే అంశాన్ని పక్కన పెడితే ఇది సంప్రదాయ పెంపకంలో తలెత్తే సమస్య అని మానసిక నిపుణులు అంటారు.

వయసులో ఉన్న ఒక అమ్మాయి కానీ, అబ్బాయి కానీ ప్రేమలో పడటం సాధారణ విషయం. కానీ, సంప్రదాయ జీవన విధానంలో పిల్లల్ని పెంచిన తల్లి తండ్రులు తమ పిల్లలు తమకు ఎదురు చెబితే సహించలేరు.

సమాజం ఉమ్మడి కుటుంబ వ్యవస్థ నుంచి న్యూక్లియర్ విధానం‌లోకి మారుతున్న దశలో ఎగువ మధ్య తరగతి, మధ్య తరగతి ప్రజలు సంప్రదాయ పిల్లల పెంపకం నుంచి ఇంటెన్సివ్ పేరెంటింగ్ అంటే అధిక శ్రద్ధతో కూడిన పెంపకం వైపు నెమ్మదిగా మొగ్గు చూపుతున్నారని మానసిక వైద్య నిపుణురాలు జీసీ కవిత చెప్పారు.

సాంప్రదాయిక పెంపకానికి, ఇంటెన్సివ్ పేరెంటింగ్‌కి మధ్య ఉన్న తేడా ఒక సన్నని గీత లాంటిదని కవిత పేర్కొన్నారు.

ఇంటెన్సివ్ పేరెంటింగ్ అంటే ఏమిటి?

ఇంటెన్సివ్ పేరెంటింగ్‌లో తల్లితండ్రులు తమ సమయాన్ని, డబ్బుని సాధారణ పెంపకం పద్ధతిలో కన్నా కాస్త ఎక్కువే వెచ్చించాల్సి వస్తుందని వాషింగ్టన్ యూనివర్సిటీలో సోషియాలజీ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న పాట్రిక్ ఇషిజుక పేర్కొన్నారు. ఆయన ఇంటెన్సివ్ పేరెంటింగ్ అనే అంశం పై అధ్యయనం చేస్తున్నారు. ఈ విధానం అమెరికాలో తల్లితండ్రులు ఎప్పటి నుంచో పాటిస్తున్నారు. ఇప్పుడిప్పుడే ఇది ఐరోపాకు కూడా పాకుతోంది.

పిల్లల్ని పెంచే ఈ విధానం వివిధ దేశాల సామాజిక, సాంస్కృతిక అంశాల పై ఆధారపడి ఉంటుంది. తల్లి తండ్రులు తమ పిల్లలు ఎలా ఉండాలని కోరుకుంటారో అనే విషయంపై ఒక దేశానికీ మరో దేశానికీ మధ్య చాలా తేడాలున్నట్లు 2009లో జరిపిన ఒక అంతర్జాతీయ అధ్యయనం తెలిపింది.

ఇంటెన్సివ్ పేరెంటింగ్‌లో తల్లితండ్రులు పిల్లలపై శ్రద్ధ ఎక్కువ పెడతారు. వారి సమయాన్ని క్షణ క్షణం ఎలా వెచ్చించాలో ప్రణాళిక చేయడంతో పాటు, వారి ఇష్టాలు, ఆసక్తులను ప్రోత్సహించడం కూడా చేయాలి. వాళ్ళ అభిరుచుల్లో నిష్ణాతులు అయ్యేందుకు అవసరమైన స్కూళ్ళను, సంస్థల్ని వెతికి వాటిలో చేర్చడం కూడా ఇంటెన్సివ్ పేరెంటింగ్‌లో భాగమే. పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు పిల్లల టైం టేబుల్‌ని తల్లి తండ్రులు ముందుగానే నిర్ణయించి దానికి తగినట్లుగా వారి లైఫ్ స్టైల్‌ని మలచుకుంటారు. ఇంటెన్సివ్ పేరెంటింగ్‌లో పిల్లల స్నేహితులను కూడా తల్లి తండ్రులే నిర్ణయిస్తారు.

అమెరికా‌లో ఇపుడు ఈ విధానం‌లో పిల్లల్ని పెంచడం చాలా ఎక్కువగా ఉందని ఇషిజుక పేర్కొన్నారు.

అయితే, ఇదే విధానం భారతదేశం‌లో ఉందా లేదా అనే అంశం పై కచ్చితమైన పరిశోధనలు ఏమి లేవు. భారతదేశం‌లో ఉన్న సాంఘిక పరిస్థితులని బట్టి ఇక్కడ పిల్లల్ని పెంచే విధానం వివిధ రకాలుగా ఉంటుంది. పిల్లల పెంపకానికి ఆర్ధిక, సామాజిక కారణాలు కూడా పాత్ర పోషిస్తాయి.

తల్లితో సెల్ఫీ తీసుకుంటున్న చిన్నారి

ఫొటో సోర్స్, Getty Images

ఇంటెన్సివ్ పేరెంటింగ్ పిల్లల ఎదుగుదలకి ఎలా సహకరిస్తుంది?

తల్లితండ్రులు పిల్లలతో ఎక్కువ సమయం గడపడం వలన వాళ్ళ మానసిక ఎదుగుదలకు, చదువులో ముందంజ వేయడానికి, సత్ప్రవర్తనకు సానుకూలంగా పని చేస్తుందని జుడిత్ ట్రీస్ అనే అధ్యయనకర్త అభిప్రాయపడ్డారు. పాశ్చాత్య దేశాల్లో చాలా మంది ప్రస్తుతం ఈ విధానాన్ని అవలంబిస్తున్నారని తెలిపారు.

పిల్లలు ఇంటెన్సివ్ పేరెంటింగ్ ని ఇష్టపడుతున్నప్పటికీ, అదే సమయం‌లో వారు ఒత్తిడి కూడా ఎదుర్కొంటున్నారని నెదర్లాండ్స్ ప్రభుత్వ సహకారంతో జరిగిన ఒక అధ్యయనం పేర్కొంది.

గతంలో తల్లి తండ్రుల పాత్ర పిల్లల శారీరక , మానసిక ఎదుగుదల చూసుకోవడం వరకు మాత్రమే ఉండగా, వారి చదువు బాధ్యతను విద్యా సంస్థలు, టీచర్ లు చూసుకునేవారు. అయితే, ఇపుడు తల్లి తండ్రులు టీచర్లతో , స్కూల్ తో ఎక్కువ సంబంధాలను పెంచుకుని తమ పిల్లల అభివృద్ధిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారని , జర్మన్ పరిశోధకుడు ఫ్రెడెరిక్ డి మోల్ పేర్కొన్నారు.

ఇంటెన్సివ్ పేరెంటింగ్‌లో ఒకవేళ ఏదైనా ఇంట్లో వండిన వంటని పిల్లలు ఇష్ట పడకపోతే వెంటనే బయట నుంచి తెప్పించి వాళ్లకు కావల్సిన వాటిని ఇవ్వడం జరుగుతోంది. ఇది టెక్నాలజీ పెరగడం వలన వచ్చిన మరో పెద్ద మార్పు అని కవిత అన్నారు.

ఆడుకుంటున్న ఓ చిన్నారి

ఫొటో సోర్స్, Getty Images

తల్లితండ్రులు తమ పిల్లలు చదువుతో పాటు ఇతర కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనేందుకు తగిన అవకాశాలు కల్పించేందుకు కష్టపడుతున్నారని 2016 లో స్వీడన్ లో నిర్వహించిన ఒక సర్వే పేర్కొంది. వీటికి కొన్ని మినహాయింపులు ఉన్నప్పటికీ చాలా మంది మధ్యతరగతి కుటుంబాలు మాత్రం తమ పిల్లలు అన్ని రంగాలలో నిష్ణాతులు కావాలని కోరుకుంటున్నారని ఈ సర్వే వెల్లడించింది.

కౌన్సిలింగ్ కోసం వచ్చే కొంత మంది తల్లి తండ్రుల ఉదాహరణలని వివరిస్తూ, తల్లి తండ్రులు పక్క వాళ్ళ పిల్లల్ని చూసి కూడా తమ పిల్లల పై మార్కులు తెచ్చుకోవాలని ఎక్కువ ఒత్తిడి పెట్టడం, టీచర్ల పై ఒత్తిడి పెట్టడం, చదువుతో పాటు ఇతర కార్యకలాపాల్లో పాల్గొనేలా ఒత్తిడి చేస్తున్నారని కవిత అన్నారు.

ఇంటెన్సివ్ పేరెంటింగ్‌లో పిల్లలు హోమ్ వర్క్ చేయకపోతే కూడా ఆ ఒత్తిడిని తల్లి తండ్రులు స్వీకరిస్తున్నారని అన్నారు.

కొన్నిసార్లు పిల్లలు చేయాల్సిన పనులు కూడా తల్లితండ్రులే చేసి తమ పిల్లల ప్రతిభకు నలుగురిలో ప్రశంసలు పొందాలని కోరుకుంటున్నారు.

తల్లితండ్రులు ఇద్దరూ ఉద్యోగాలు చేసే వారైతే వారికి పిల్లలకు ఏదో చేయాలనే తపన ఎక్కువగా ఉంటోందని కవిత అన్నారు.

పిల్లలు కడుపులో ఉన్నప్పటి నుంచే ఇంటెన్సివ్ పేరెంటింగ్ మొదలైపోతుంది. ఇప్పుడు కాబోయే తల్లులు ప్రీ-నాటల్ దశలో యోగాకు వెళ్లడం, శిక్షణ తీసుకోవడం కూడా ఇంటెన్సివ్ పేరెంటింగ్ లో భాగమేనన్నారు. అంటే, బిడ్డ కడుపులో ఉన్నప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకోవడం ఎక్కువైపోతోంది.

పేరెంటింగ్, సామాజికవర్గం ఒక దానితో ఒకటి అవినాభావ సంబంధం కలిగి ఉంటాయని లారా అనే రచయత, 'అనీక్వల్ చైల్డ్ హుడ్స్' అనే పుస్తకం లో రాశారు.

మధ్య తరగతి తల్లితండ్రులు ఇంటెన్సివ్ పేరెంటింగ్‌ని అవలంబిస్తే , తక్కువ ఆదాయ వర్గాల వారు పిల్లల్ని పెంచడంలో కొంచెం సరళమైన వైఖరిని పాటిస్తున్నారు. ఈ తేడాలు స్పష్టంగా లేనప్పటికీ గతంలో ఎన్నడూ లేని విధంగా తల్లితండ్రులు ఇంటెన్సివ్ పేరెంటింగ్ చేపడుతున్నారని కెనడాలో సోషియాలజీ ప్రొఫెసర్ విల్ఫ్రెడ్ లారియర్ పేర్కొన్నారు.

పిల్లలతో ఎక్కువ సమయం గడుపుతున్న తల్లితండ్రులు

ఫొటో సోర్స్, Getty Images

ఇంటెన్సివ్ పేరెంటింగ్‌కు కారణాలు ఏమిటి?

పిల్లల పట్ల బాధ్యతారాహిత్యంగా ఉన్నారనే మాట పడకుండా ఉండాలనే ఆరాటమే ఎక్కువ మంది తల్లి తండ్రులు ఇంటెన్సివ్ పేరెంటింగ్ చేయడానికి మొగ్గు చూపుతున్నారని ఒక స్వీడిష్ అధ్యయనం పేర్కొంది.

తల్లి తండ్రులు ఇద్దరూ ఉద్యోగాలు చేయడం వలన పిల్లలకి ఎదో చేయాలనే తపన ఎక్కువగా ఉంటోందని అన్నారు. తల్లి గృహిణి అయితే, పిల్లలకు ఏమీ చేయలేకపోతున్నాననే బాధతో, ఉద్యోగం చేసేవారైతే.. పిల్లలకి తగిన సమయం కేటాయించలేకపోతున్నామనే నూన్యతా భావనతో పిల్లలు అడిగేవన్నీ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారని జి సి కవిత అన్నారు.

పిల్లల్ని పెంచే విధానాల పై ఇబ్బడి ముబ్బడిగా అందుబాటులో ఉన్న పుస్తకాలు, బ్లాగ్లు, ఆన్లైన్ సమాచారం కూడా ఈ ఇంటెన్సివ్ పేరెంటింగ్‌కి ఒక కారణమని కొందరు నిపుణులు అంటారు.

ఈ ఇంటెన్సివ్ పేరెంటింగ్ ప్రభావం దేశాల మీద తల్లితండ్రుల మీద, పిల్లల మీద కూడా ఉండే అవకాశాలు ఉన్నాయని నిపుణుల అభిప్రాయం. ఇది అసమానతలని మరింత పెంచుతుంది. 1960‌లలో పిల్లలతో గడిపే సమయం అన్ని సామాజిక వర్గాలలో ఒకేలా ఉండేదని ఇషిజుక అంటారు. ఇంటెన్సివ్ పేరెంటింగ్ వలన తల్లి మీద చాలా ఒత్తిడి ఉంటుందని అన్నారు.

కానీ చాలా మంది తల్లితండ్రులు అది తమ బాధ్యత అని అనుకుంటారు.

పిల్లలందరిని బాల ప్రతిభావంతులుగా చేయాలనే ఒత్తిడి తల్లి తండ్రులు ఎదుర్కొంటున్నారని కవిత అన్నారు. సమాజం, సోషల్ మీడియా ప్రభావం కూడా ఇంటెన్సివ్ పేరెంటింగ్ చేయడానికి ఒక కారణమని కవిత తెలిపారు.

ఇంటెన్సివ్ పేరెంటింగ్ సరైనదేనా?

పిల్లల్లో దాగిన నైపుణ్యాలని మెరుగు‌పర్చుకోవడం కోసం ఇంటెన్సివ్ పేరెంటింగ్ ఉపయోగపడుతుందని 2016లో జరిగిన ఒక స్వీడిష్ అధ్యయనం పేర్కొంది.

ఇంటెన్సివ్ పేరెంటింగ్ అనేది సరైనదా కాదా అని కచ్చితంగా చెప్పలేమని కవిత అంటారు.

ఇంటెన్సివ్ పేరెంటింగ్ వలన పిల్లలు సొంతంగా అలోచించి, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే శక్తి తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి తమ గురించి నిర్ణయాలు పెద్దవాళ్ళే తీసుకోవడం వాళ్లకి అలవాటు అయిపోతుంది. దీంతో వాళ్లకి జీవితం‌లో సమస్యలు ఎదుర్కొన్నప్పుడు ఎలా పరిష్కరించుకోవాలో అర్ధం కానీ పరిస్థితుల్లోకి జారిపోతారు" అని ఆమె అన్నారు.

ఇంటెన్సివ్ పేరెంటింగ్ లో పిల్లలు10 కోరికలు కోరితే, 12 కోరికలు తీర్చడానికి తల్లి తండ్రులు సిద్ధంగా ఉంటారు. కాబట్టి, పిల్లలు తల్లి తండ్రులని నువ్వు నాకేమి చేసావని అని అడిగే ప్రసక్తి తక్కువ ఉంటుందని అన్నారు.

తల్లితండ్రులు పిల్లలతో ఎక్కువ సేపు గడపటం వలన వారి మధ్య బంధం బలపడే అవకాశాలు ఎక్కువవుతాయని చెప్పారు.

ఇబ్బందిపెట్టే సామాజిక ఆర్ధిక కారణాలు ఉంటే తప్ప, పిల్లలు వెనకబడిపోతారేమోనని తల్లితండ్రులు భయపడాల్సిన పని లేదని ఫ్రెడెరిక్ డి మోల్ అనే జర్మన్ పరిశోధకుడు అన్నారు.

(ఈ కనంలోని కొంత సమాచారం బీబీసీ వర్క్ లైఫ్ ప్రతినిధి ఓల్గా మెకింగ్ రాసిన వ్యాసం నుంచి తీసుకున్నాం)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)