అయోధ్యలో రామాలయం నిర్మాణానికి రూ. 1,000 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి? ప్లాన్ ఏంటి?

ఫొటో సోర్స్, SANKET WANKHADE
విరాళాలు సేకరించడం ద్వారా అయోధ్యలో ఆలయ నిర్మాణం పూర్తి చేస్తామని, విశ్వ హిందూ పరిషత్ ఉపాధ్యక్షుడు, శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
రామ మందిరం నిర్మాణానికి కావలసిన నిధులు సమకూర్చుకునేందుకు తమ ప్రచారాన్ని 50 కోట్ల మంది ప్రజల వద్దకు తీసుకువెళతామని, ఇంత పెద్ద సంఖ్యలో సాధారణ ప్రజలు అనుసంధానమయ్యే బృహత్ కార్యక్రమాన్ని ప్రపంచ చరిత్రలో ఎవరూ చూసి ఉండరని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమానికి ఇచ్చే విరాళాలను ‘చందాలు’ అని అనకుండా ‘రామ మందిర నిధి సమర్పణ ప్రచారం’ అని పిలుస్తారు. అంటే ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భక్తితో, అంకితభావంతో విరాళాలు సమర్పించుకుంటారు.
ఈ ప్రచారం గురించి వివరంగా చెబుతూ..."ఈరోజుల్లో 35 ఏళ్ల వాళ్లకు రామ జన్మభూమి చరిత్ర పెద్దగా తెలీదు. అప్పట్లో ఏం జరిగిందో ఎవరూ చూసి ఉండరు. యువత శాతం అధికంగా ఉన్న దేశం మనది. యువతకు మన చరిత్ర తెలియజెప్పడం మన కర్తవ్యం" అని చంపత్ రాయ్ అన్నారు.
ఈ ప్రచారంలో 3 నుంచీ 4 లక్షలమంది కార్యకర్తలు పాల్గొంటారని తెలిపారు. వీరంతా రామ జన్మభూమి చరిత్రను 50 కోట్లమంది ప్రజలకు, 11 కోట్ల కుటుంబాలకు, 5 లక్షలకు పైగా గ్రామాలకు తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తారు. ఈ ప్రచార కార్యక్రమం 2021లో జనవరి 14, మకర సంక్రాంతినాడు ఆరంభమై, ఫిబ్రవరి 27, మాఘ పూర్ణిమనాడు ముగుస్తుంది.
42 రోజులపాటూ సాగే ఈ ప్రచార కార్యక్రమంలో కార్యకర్తలు తమతోపాటూ రామ మందిరం చరిత్ర, ఆలయ చిత్రాలు, కంట్రిబ్యూషన్ కూపన్లు తీసుకువెళతారు. రామ జన్మభూమి చరిత్రను హిందీ, ఇంగ్లిష్‌లో మాత్రమే కాకుండా అన్ని రాష్ట్రాల మాతృభాషల్లోనూ ముద్రిస్తారు.
దేశ ప్రధాని, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లతో సహా రాజాకీయ పార్టీ నాయకులందరికీ రామ జన్మభూమి చరిత్రను అందిస్తారు.

ఫొటో సోర్స్, VHP/FB
రామ మందిర నిధి సమర్పణ ప్రచారం
"ఆలయం అంటే దేవుడి నివాసం. భగవంతుడి పాదాల చెంత లక్ష్మీదేవి ఉంటుంది. కాబట్టి డబ్బుకు ఏ విధమైన కొరతా ఉండదు. డబ్బు గురించి చింత పడొద్దని అనేకమంది మహానుభావులైన సాధువులు నాకు చెప్పారు...భగవంతుని వెనుకే లక్ష్మి కూడా ఉంటుంది. అందుకే ఎవరినీ డబ్బులు అడగక్కర్లేద సమాజమే స్వచ్ఛందంగా ముందుకొచ్చి విరాళాలు అందిస్తుందని అన్నారు. అందుకే మేము కూడా ప్రజలకు అదే చెప్పదలుచుకున్నాం...స్వఛ్చందంగా విరాళాలివ్వండి. ఇదంతా దేవుడు సృష్టించిన సంపద..దేవుడికే ఇవ్వండి అని చెప్తున్నాం. ఎవరినీ డబ్బులు అడగవలసిన అవసరం రాదు" అని చంపత్ రాయ్ వివరించారు.
“స్వచ్ఛందంగా విరాళాలు ఇచ్చేవారికోసం కొన్ని కూపన్లు ముద్రించాలని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు నిర్ణయించింది. ఎన్ని ఇళ్లకు వెళ్లాలనుకుంటున్నామో అన్ని కూపన్లు ముద్రిస్తాం...10, 100, 1000 రూపాయల కూపన్లు ముద్రిస్తాం. ఎవరైనా రూ.10 ఇచ్చిన సరే...మా తల్లిదండ్రులు ఈ బృహత్ కార్యక్రమంలో పాల్గొన్నారని వారి పిల్లలు ఆనందంగా చెప్పుకోవాలి అందుకని 10 రూపాయల దగ్గరనుంచీ కూపన్లు ముద్రిస్తాం.
10 రూపాయలవి 4 కోట్ల కూపన్లు, 100 రూపాయలవి 8 కోట్ల కూపన్లు, 1000 రూపాయలవి 12 లక్షల కూపన్లు ముద్రిస్తాం. వీటన్నిటికీ రశీదు ఇస్తాం. ఈ కూపన్లన్నింటినీ ప్రజలకు పంచిపెట్టడం ద్వారా రామ మందిర నిర్మాణానికి 960 కోట్ల రూపాయలను జమ చెయ్యలన్నదే మా ప్రయత్నం" అని చంపత్ రాయ్ తెలిపారు.

పారదర్శకత
"నిధి సమర్పణ ప్రచారంలో పారదర్శకత కోసమే కూపన్లను ముద్రించాలని నిర్ణయించుకున్నాం. ఈ విధంగా సేకరించిన సొమ్మును దేశంలోని మూడు పెద్ద బ్యాంకులు..స్టేట్ బ్యాక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడాలలో జమ చేస్తాం. భారతదేశంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 22 వేల శాఖలున్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడాలకు వరుసగా 14వేల శాఖలు, 10వేల శాఖలు ఉన్నాయి. అంటే మొత్తం 46 వేల శాఖలనుంచీ మొత్తం దేశాన్ని కవర్ చేసేలా ప్లాన్ చేస్తున్నాం.
ఈ పని కోసం మా కార్యకర్తలు రోజులో మూడు నుంచీ నాలుగు కేటాయిస్తారు. కనీసం ముగ్గురితో కూడిన బృందాలను ఏర్పాటు చేస్తాం. ఈ బృందాలన్నింటినీ ప్రాంతాలవారీగా విభజించి ఒక బ్యాంకు శాఖను కేటాయిస్తాం. ఒక రోజు మొత్తంలో సేకరించిన డబ్బులు 48 గంటలలోగా ఆ బ్యాంకు శాఖలో జమ చెయ్యాలి. 42 రోజులపాటూ సేకరించిన సొమ్మును ఈ బృందాలు తమకు కేటాయించిన శాఖలోనే జమ చెయ్యాలి. బ్యాంకుల్లో డబ్బులు జమ చెయ్యడానికి వేరే స్లిప్పులు ముద్రిస్తాం. దాన్లో అకౌంట్ నంబర్ కాకుండా కోడ్ నంబర్ ఉంటుంది. పారదర్శకత కోసమే ఇన్ని ఏర్పాట్లు చేస్తున్నాం" అని చంపత్ రాయ్ తెలిపారు.

ఫొటో సోర్స్, SHAMIM A AARZOO
విదేశాలనుంచీ వచ్చే నిధుల సంగతేంటి?
రామ మందిర నిధి సమర్పణ ప్రచారంలో భాగంగా విదేశాలనుంచీ వచ్చే విరాళాలను స్వీకరిస్తారా అనే ప్రశ్నకు జవాబిస్తూ..విదేశాలనుంచీ వచ్చే నిధికి సంబంధించి వేరే చట్టం ఉంటుంది. ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ (ఎఫ్‌సీఆర్ఏ) అంటారు.
ప్రస్తుతానికి ట్రస్ట్ ఈ చట్టాన్ని అనుసరించి రిజిస్టర్ చేసుకోలేదు, కాబట్టి ఆలయ నిర్మాణ కార్యక్రమానికి విదేశీ విరాళాలను స్వీకరించలేమని చెప్పారు. ఈ చట్టం కింద రిజిస్టర్ చేసుకోవాలంటే ట్రస్ట్‌కు సంబంధించిన మూడేళ్ల ఆడిట్ పత్రాలు సమర్పించాలనే నిబంధన ఉంది.
ఈ ట్రస్ట్ పెట్టి ఒక్క ఏడాదే అయ్యింది కాబట్టి ఎఫ్‌సీఆర్ఏ కింద రిజిస్టర్ చేసుకోలేమని తెలిపారు.

ఫొటో సోర్స్, ANI
ప్రభుత్వంనుంచీ విరాళాలు ఆశిస్తున్నారా?
ఆగస్ట్ 5న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయోధ్యలో ఆలయ నిర్మాణానికి సంబంధించిన భూమి పూజ నిర్వహించారు. అలాంటప్పుడు ఆలయ నిధికి ప్రభుత్వం విరాళాలిస్తుందా అనే సందేహం తలెత్తుతుంది.
దీనిపై చంపత్ రాయ్ స్పందిస్తూ "ప్రభుత్వంనుంచీ సహకారం మాత్రమే ఆశిస్తున్నాం. నిధులు కాదు. మందిరం నిర్మించడం ప్రభుత్వం పని కాదు. ప్రజలకి సేవ చెయ్యడమే ప్రభుత్వం పని. అయితే, వ్యక్తిగతంగా ఎవరైనా ప్రజా ప్రతినిధులు విరాళాలు సమర్పించవచ్చు. భారత ప్రభుత్వ ఖజానానుంచీ మాకు ఒక్క రూపాయి విరాళం వచ్చింది. దాన్ని బ్యాంకులో డిపాజిట్ చేశాం. బ్యాకులో ఆ రూపాయికి ఫ్రేమ్ కట్టి పెట్టారు.
మందిర నిర్మాణానికి ప్రత్యేక కమిటీ
సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఆలయ నిర్మాణానికి ప్రత్యేక ట్రస్ట్ ఏర్పాటు చేశారు. ఈ ట్రస్ట్ ఇప్పుడు సొంతంగా ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి నిపేంద్ర మిశ్రాను అధ్యక్షుడిగా నియమించింది. నిధుల ఖాతాలను నిర్వహించడానికి ప్రత్యేకంగా ఒక ఆడిటర్ జనరల్‌ను కూడా ఏర్పాటు చేసింది.
ఆలయ భద్రతకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు ఉండేలా మందిరం రూపురేఖలపై కసరత్తు చేస్తున్నారు. ప్లాన్ తయారైన వెంటనే ప్రభుత్వాన్ని సంప్రదిస్తారు.
ఆలయ ట్రస్ట్ కోసం టాటా కన్సల్టింగ్ ఇంజినీర్స్ కంపెనీని ప్రోజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టంట్‌గా నియమించారు.
ప్రస్తుతం ఆలయ పునాదులపై దృష్టి పెడుతున్నారు. అయోధ్యలోని భూమికి 60 మీటర్ల అడుగున ఇసుక ఉంది. ఈ ఇసుక రాళ్ల బరువును ఎలా మొయ్యగలదు అనే విషయమై ఆలోచిస్తున్నారు.

ఫొటో సోర్స్, SHAMIM A AARZOO
మందిర నిర్మాణానికి రాయి ఎక్కడినుంచీ తీసుకొస్తారు?
"మందిర నిర్మాణానికి రాజస్థాన్‌లోని భరత్‌పూర్ జిల్లాలో బన్సీ పహార్పూర్ గ్రామానికి చెందిన రాయి అవసర పడుతుంది. అక్కడి రాయి లేత గులాబీ రంగులో చాలా అందంగా ఉంటుంది. ఈ రాతి మీద చెక్కడం చాలా సులభం. ఇంతకుముందు, మందిరం కోసం ఈ రాళ్లపైనే చెక్కారు. కానీ, ఇప్పుడు అనేక కారణాల వల్ల ఆ ప్రాంతాన్ని అటవీ ప్రాంతంగా ప్రకటించారు.
1990నుంచీ 2006 వరకూ మేము ఈ ప్రాంతంనుంచే రాతిని తెప్పించాం. ఏ ప్రభుత్వం మమ్మల్ని అడ్డగించలేదు. అయితే, ఇప్పుడు దీన్ని అటవీ ప్రాంతంగా గుర్తించాక..ఇకపై ఏం చెయ్యాలో ఆలోచించాల్సి ఉంది" అని చంపత్ రాయ్ తెలిపారు.
మందిర నిర్మాణం కోసం 4లక్షల క్యూబిక్ అడుగుల రాయి కావాలి. అయితే, ప్రస్తుతం 70వేల క్యూబిక్ అడుగుల రాయి అందుబాటులో ఉంది. ఇంకా 3 లక్షల పై చిలుకు క్యూబిక్ రాయి కావాల్సి ఉంది.
రాబోయే మూడేళ్లల్లో మందిర నిర్మాణం పూర్తి కాగలదని ట్రస్ట్ భావిస్తోంది.
ఇవి కూడా చదవండి:
- బ్లూ రెవల్యూషన్: భవిష్యత్తులో ప్రజల ఆకలి తీర్చే కొరత లేని సరికొత్త ఆహారం ఇదే...
- కరోనావైరస్ వ్యాక్సీన్: భారత్‌లో వచ్చే నెల నుంచి వ్యాక్సినేషన్ మొదలయ్యే అవకాశం
- ATM - ఎనీ టైమ్ మీల్: అన్నార్తులను ఆదుకుంటున్న హైదరాబాదీ ఆలోచన
- అమెరికాలో ఆకలి కేకలు.. ఆహారం దొరక్క సంపన్న ప్రాంతాల్లోనూ ప్రజల ఇబ్బందులు
- సముద్రపు చేపలా.. చెరువుల్లో పెంచిన చేపలా.. ఏవి తింటే ఆరోగ్యానికి మంచిది?
- ఇల్లు, ఫర్నీచర్ అమ్మేసి ఓ వ్యాన్ కొనుక్కున్నారు... ఇప్పుడు ఆ వ్యానే వారి ఇల్లు
- ఆడపిల్లలు వయసు రాకముందే రజస్వల కావడానికి కారణాలేమిటి? సమస్యలేమిటి? పరిష్కారాలేమిటి?
- విద్యార్థులకు జంతువులకు వేసినట్లు సంకెళ్లు వేసే బడి... బీబీసీ రహస్య చిత్రీకరణలో వెలుగు చూసిన గగుర్పొడిచే వాస్తవాలు
- కఠినమైన సవాళ్ల నడుమ ‘కమలం’ ఎలా వికసించింది
- రాయల్ ఎన్ఫీల్డ్: ఆసియాలో విస్తరిస్తున్న భారత మోటార్ సైకిల్ బుల్లెట్ అమ్మకాలు
- టైటానిక్ ప్రమాదంలో 700 మంది ప్రాణాలను ఆ రేడియో ఎలా కాపాడిందంటే...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








