పాకిస్తాన్‌లో ప్రశాంత్.. హైదరాబాద్‌లో ఇక్రమ్... - ప్రెస్‌రివ్యూ

ఫొటో సోర్స్, Sakshi.com
పాకిస్తాన్‌లో అడుగుపెట్టి బందీగా మారిన విశాఖ యువకుడు ప్రశాంత్ వ్యవహారం సంచలనం సృష్టిస్తుండగా.. ఓ మహిళ కోసం అక్రమ మార్గంలో పాక్ నుంచి హైదరాబాద్‌కు వచ్చి ఏడాదిగా ఖైదీగా ఉన్న ఇక్రమ్ కేసు తెరపైకి వచ్చిందని 'సాక్షి' కథనం తెలిపింది.
''ఇక్రమ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైల్లో రిమాండ్‌లో ఉండగా, నాంపల్లి కోర్టులో కేసు విచారణ ముగియగానే పాక్‌కు డిపోర్టేషన్ (బలవంతంగా తిప్పి పంపడం) చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
పాతబస్తీకి చెందిన మహిళ కొన్నేళ్ల క్రితం భర్తను కోల్పోయారు. ఆమెకు ఇద్దరు కుమార్తెలు. పన్నెండేళ్ల క్రితం దుబాయ్ వెళ్లి అక్కడ ఉద్యోగం చేస్తున్న ఈమెకు పాకిస్తాన్‌కు చెందిన మహ్మద్ ఉస్మాన్ ఇక్రమ్ అలియాస్ మహ్మద్ అబ్బాస్ ఇక్రమ్ పరిచయమయ్యాడు. తాను భారతీయుడినని, స్వస్థలం దిల్లీ అని నమ్మించి, ప్రేమ వివాహం చేసుకున్నాడు. కొన్నాళ్లకు అసలు విషయం తెలిసిన ఆమె హైదరాబాద్ వచ్చేశారు.
2011లో ఇక్రమ్ సదరు మహిళను వెతుక్కుంటూ, దుబాయ్ నుంచి నేపాల్ వరకు విమానంలో వచ్చాడు. ఆపై రోడ్డు, రైలు మార్గాల్లో దిల్లీ వెళ్లి, అట్నుంచి హైదరాబాద్ చేరాడు. ఆరు నెలల తరువాత ఇక్రమ్ అక్రమంగా దేశంలోకి వచ్చాడని తెలిసి ఆమె అతడిని దూరం పెట్టారు. కక్షగట్టిన ఇక్రమ్ ఆమె 12 ఏళ్ల కుమార్తె నగ్న చిత్రాలు చిత్రీకరించి, వాటిని కొందరికి ఆన్‌లైన్‌లో విక్రయించానని బెదిరించాడు. డబ్బివ్వకపోతే ఫొటోలను బయటపెడతానని బాధిత మహిళ స్నేహితురాలికీ వాట్సాప్ సందేశం పంపాడు. దీంతో బాధితురాలు సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయగా, అధికారులు గతేడాది జూన్‌లో ఇక్రమ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
ఇక్రమ్ అరెస్టయినపుడు.. మహారాష్ట్రలోని ఓ ప్రైవేట్ విద్యాసంస్థలో టెన్త్ నుంచి డిగ్రీ చదివినట్టున్న సర్టిఫికెట్లు, అబ్బాస్ పేరుతో గోల్నాక చిరునామాతో 2012లో తీసుకున్న భారత పాస్‌పోర్ట్, ఆధార్, ఇతర గుర్తింపుకార్డులు, పాక్ పాస్‌పోర్ట్‌కు చెందినదిగా అనుమానిస్తున్న ఓ పేజీ జిరాక్సు ప్రతి స్వాధీనమయ్యాయి. సర్టిఫికెట్ల ప్రకారం 2003లో టెన్త్, 2003-05ల్లో ఇంటర్, 2005-08ల్లో డిగ్రీ పూర్తి చేసినట్లు ఉంది. వాస్తవానికి ఇక్రమ్ 2009 వరకు పాక్ పాస్‌పోర్ట్‌తో దుబాయ్‌లో ఉన్నాడు. దీంతో ఇతడి వద్ద ఉన్నవి బోగస్ పత్రాలని, వాస్తవానికి పాక్ జాతీయుడని నిర్ధారించడానికి సైబర్ క్రైమ్ పోలీసులు విదేశీ మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) ద్వారా పాక్ ఎంఈఏకు లేఖ రాశారు. దీనిపై స్పందించిన ఆ దేశ రాయబార కార్యాలయం అతడు తమ జాతీయుడేనంటూ ఇచ్చిన జవాబు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు చేరింది. దీంతో ఇక్రమ్‌పై అభియోగపత్రాలు దాఖలయ్యాయి. ఈ కేసు విచారణ ముగిసి, అతడు దోషిగా తేలినా, నిర్దోషిగా బయటపడినా తక్షణం ఆ దేశానికి పంపేయాల్సిందేనని ఎంఈఏ నుంచి అందిన ఉత్తర్వులు స్పష్టం చేస్తున్నాయి. దీంతో కోర్టులో కేసు పెండింగ్ లేకుండా డిస్పోజైన వెంటనే అతడిని దిల్లీలోని పాక్ ఎంబసీలో అప్పగిస్తామని సైబర్ క్రైమ్ అధికారులు చెబుతున్నారు'' అంటూ ఆ కథనంలో వివరించారు.

ఫొటో సోర్స్, facebook
సినీ ప్రముఖుల ఇళ్లలో ఐటీ సోదాలు
టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ప్రముఖ నిర్మాత సురేశ్‌బాబు ఇళ్లు, కార్యాలయాల్లో ఆదాయపన్ను శాఖ ప్రత్యేక బృందాలు బుధవారం సోదాలు నిర్వహించాయని 'ఆంధ్రజ్యోతి' కథనం తెలిపింది.
''సురేశ్ బాబు సోదరుడు, ప్రముఖ హీరో వెంకటేశ్‌తోపాటు హీరోలు నాగార్జున, నాని ఇళ్లల్లో.. హారిక హాసిని క్రియేషన్స్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ వంటి ప్రముఖ నిర్మాణ సంస్థల కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు జరిపినట్లు సమాచారం. వేర్వేరు బృందాలుగా ఏర్పడ్డ ఐటీ అధికారులు బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కూకట్‌పల్లి తదితర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు.
ఆయా ప్రముఖుల ఆదాయవ్యయాలు, పన్ను చెల్లింపులకు సంబంధించిన కీలకపత్రాలు, సాంకేతిక ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. ఒకే రోజు.. ఒకే సమయంలో.. ఇలా సినీ, రాజకీయ ప్రముఖుల ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ తనిఖీలు నిర్వహించడం సంచలనంగా మారింది. కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కుమారుడు సందీప్‌రావు ప్రణీత్ హోమ్స్ అనే రియల్‌ఎస్టేట్ వ్యాపార సంస్థలో డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. ఆయన కూకట్‌పల్లిలోని వెంకట్రావు నగర్‌లో తన తండ్రితో కలిసి నివాసం ఉంటున్నారు. ప్రణీత్ హోమ్స్ లావాదేవీలు, పన్ను చెల్లింపులకు సంబంధించి.. ఆ ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేశారు'' అని అందులో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రమాదంలో శ్రీశైలం డ్యాం
తెలుగు రాష్ట్రాలకు అత్యంత కీలకమైన శ్రీశైలం ప్రాజెక్టు భవిష్యత్ ప్రమాదంలో పడిందని వాటర్‌మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేందర్‌సింగ్ హెచ్చరించారని 'నమస్తే తెలంగాణ' కథనం తెలిపింది.
''గంగాజల్ సాక్షరత యాత్రలో భాగంగా దేశవ్యాప్తంగా పర్యటిస్తున్న ఆయన రెండ్రోజులుగా నేషనల్ జల్ బిరాదరి కన్వీనర్ బొలిశెట్టి సత్యనారాయణతో కలిసి నల్లమల అటవీప్రాంతంతో పాటు శ్రీశైలం ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. శ్రీశైలం డ్యాంకు మరమ్మతులు చేయాల్సిన అవసరముందని, లేనిపక్షంలో పెనువిషాదం తప్పదని హెచ్చరించారు. ప్రభుత్వాలు నదులపై ప్రాజెక్టులు నిర్మిస్తున్నాయే తప్ప, నిర్వహణ బాధ్యతలు సరిగా చూసుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఏదైనా విపత్తు సంభవిస్తే భారీనష్టం సంభవిస్తుందని పేర్కొన్నారు. డ్యాం సమీపంలోని నిర్మాణాలపై ప్రభుత్వం దృష్టిసారించాలని కోరారు. శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిధిలో ఉందన్న విషయం తెలిసిందే.
నేషనల్ జల్ బిరాదరి కన్వీనర్ బొలిశెట్టి సత్యనారాయణ నమస్తే తెలంగాణతో మాట్లాడుతూ... ప్రాజెక్టు ఎస్‌ఈ చంద్రశేఖర్‌రావుతో కలిసి డ్యాంను పరిశీలించామని పేర్కొన్నారు. ప్లగ్‌పూల్ దగ్గర మరమ్మతులు అవసరమని గుర్తించినట్టు చెప్పారు. డ్యాం నిర్వహణకు కేంద్ర జల సంఘం మార్గదర్శకాల ప్రకారం 600 మంది సిబ్బంది అవసరమని, ప్రస్తుతం కేవలం వంద మందే ఉన్నారని చెప్పారు. డ్యాం రీహాబిటేషన్ ఇంప్రూవ్‌మెంట్ ప్రాజెక్టు-2 కింద నిధులు తీసుకోవచ్చని, కేవలం రూ.60 కోట్లతో మరమ్మతులు పూర్తవుతాయని తెలిపారు. నల్లమల అటవీప్రాంతంలో యురేనియం తవ్వకాలను చేపట్టబోతున్నారనే అంశంపైనా పరిశీలన చేశామని, ఈ ప్రాంతమంతా కృష్ణాబేసిన్‌లో ఉన్నందున యురేనియం తవ్వకాలు జరిపితే కావిటీలు ఉన్న డ్యాంకు పెనుప్రమాదం తప్పదని చెప్పారు. ఇప్పటికైనా ఏపీ ప్రభుత్వం శ్రీశైలం డ్యాం నిర్వహణలో భాగంగా మరమ్మతులు చేపట్టాలని కోరారని ఆ కథనంలో వివరించారు.

ఫొటో సోర్స్, facebook
ఎమ్మెల్యే చెన్నమనేని పౌరసత్వం రద్దు
తెలంగాణలో వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ బాబు పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్ర హోం శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసిందని 'ఈనాడు' కథనం తెలిపింది.
''వాస్తవాలను దాచిపెట్టి మోసపూరిత విధానాలతో ఆయన భారతీయ పౌరసత్వం పొందినట్లు కేంద్ర హోం శాఖ పేర్కొంది. ఈ మేరకు భారత పౌరసత్వ చట్టం-1955లోని సెక్షన్ 10 ప్రకారం ఆయన పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
రమేశ్ బాబు పౌరసత్వం చెల్లదంటూ 2009లో ఆయనపై పోటీ చేసి ఓడిపోయిన కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ కేంద్ర హోం శాఖకు ఫిర్యాదు చేశారు'' అని ఆ కథనంలో పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
- అమెజాన్ అలెక్సా మరింత స్మార్ట్ అవుతోంది... మీకు తోడుగా ఎక్కడికైనా వచ్చేందుకు సిద్ధమవుతోంది
- మనీ లాండరింగ్‌పై పుస్తకం రాసిన ప్రొఫెసర్ అదే కేసులో అరెస్టు
- గూగుల్ డుప్లెక్స్: మీ పని గూగుల్ చేసి పెడుతుంది!
- టీఎస్ఆర్టీసీ సమ్మె: ‘షరతులు లేకుండా ఆహ్వానిస్తే... వచ్చి విధుల్లో చేరతాం’ - జేఏసీ
- ఐఐటీ మద్రాస్: "ఇస్లామోఫోబియా, కులతత్వం, వర్గపోరుతో మా క్యాంపస్ కంపు కొడుతోంది"
- హిట్లర్ ఇంట్లో పోలీస్ స్టేషన్
- సిరియా, ఇరాన్ దళాలపై ‘విస్తృతంగా దాడులు’ చేశామన్న ఇజ్రాయెల్
- ఇసుక కొరత ప్రపంచమంతటా ఎందుకు ఏర్పడింది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








