ఫీజుల పెంపుపై జేఎన్‌యూ విద్యార్థుల ఆందోళనల్లో న్యాయం ఉందా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సర్వప్రియ సంగ్వాన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
దిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో కొన్ని రోజులుగా నిరసనలు జరుగుతున్నాయి. ఫీజుల పెంపు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వర్సిటీ విద్యార్థులు ఆందోళనలకు దిగుతున్నారు.
గతంలో జేఎన్‌యూ హాస్టల్‌లో ఒక్క సీటర్ గదికి రూ.20, రెండు సీటర్ల గదికి రూ.10 నెలవారీ ఫీజు ఉండేది. కొత్త నిబంధనలు తీసుకువస్తే ఒక్క సీటర్ గదికి రూ.600, రెండు సీటర్ల గదికి నెలకు రూ.300 నెలవారీ ఫీజు చెల్లించాల్సి వస్తుంది. దీనికి అదనంగా నెలకు రూ.1700 చొప్పున సర్వీస్ చార్జ్ కూడా చెల్లించాలి.
అంటే నెలకు కనిష్ఠంగా ఒక్కో విద్యార్థి హాస్టల్ కోసం రూ.3350 చెల్లించాల్సి వస్తుంది. అంతేకాదు, దీనికి తోడు మెస్ ఫీజు, కరెంటు, మంచినీళ్లు, మెయింటెనెన్స్ చార్జీలు కూడా ఉంటాయి.

ఫొటో సోర్స్, Getty Images
జేఎన్‌యూలో ఎం.ఫిల్ చదువుతున్న ఓ విద్యార్థితో బీబీసీ మాట్లాడింది. ఆ విద్యార్థి కుటుంబం సంపాదన నెలకు రూ.12 వేల కన్నా తక్కువ. నెలకు రూ.5వేల చొప్పున ఉపకార వేతనం వస్తుంది.
నెలకు చెల్లించాల్సిన మెస్ ఫీజు రూ.3వేలు. ఇప్పుడు దీనికి అదనంగా రూ.3350 హాస్టల్ ఫీజు, మిగతా చార్జీలు కట్టాల్సి వస్తే, ఉపకార వేతనం మొత్తం సరిపోదు. పైగా పుస్తకాలు, ఇతరత్రా అవసరాలకూ డబ్బు వెచ్చించాల్సి ఉంటుంది.
ప్రతి సెమిస్టర్‌కూ ఎస్టాబ్లిష్‌మెంటు చార్జ్, వార్షిక ఫీజులు కూడా కట్టాల్సి ఉంటుంది.
విద్యార్థుల ఆందోళనల తర్వాత.. కుటుంబ ఆదాయం రూ.12వేల కన్నా తక్కువ ఉన్న విద్యార్థులకు పెంచిన ఫీజులను సగానికి తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు. అంటే ఒక్క సీటర్ గదికి రూ.300, రెండు సీటర్ల గదికి నెలకు రూ.150 చెల్లించాల్సి వస్తుంది. ఇలా తగ్గించడం పెద్ద నిర్ణయమని ప్రభుత్వం చెబుతోంది.

ఫొటో సోర్స్, jnu
జేఎన్‌యూ వెబ్‌సైట్‌లోని 2017-18 వార్షిక నివేదిక ప్రకారం 1556 మంది విద్యార్థులకు అడ్మిషన్లు దక్కాయి. వారిలో 623 మంది విద్యార్థుల కుటుంబాల నెలవారీ ఆదాయం రూ.12వేల కన్నా తక్కువే. మొత్తం అడ్మిషన్లలో ఇలాంటి విద్యార్థులు 40 శాతం ఉన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుని వచ్చిన విద్యార్థులు 570 మంది (36 శాతం). రూ.12వేలకు మించి కుటుంబ ఆదాయం ఉన్న విద్యార్థులు 904 మంది.
ఫీజుల పెంపును జేఎన్‌యూలోని ఏబీవీపీ విద్యార్థి సంఘం కూడా వ్యతిరేకిస్తోంది. అయితే, ఆందోళన ప్రదర్శనల విషయంలో మిగతా విద్యార్థి సంఘాలతో అది విభేదిస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
యూనివర్సిటీలో 30 ఏళ్లుగా హాస్టల్ గదుల ఫీజులు పెంచలేదని, మిగతా చార్జీలు కూడా పదేళ్లుగా అలాగే ఉన్నాయని జేఎన్‌యూ అధికారులు అంటున్నారు. తాజా పెంపు అనివార్యమైన చర్య అని వారు చెబుతున్నారు.
హాస్టల్ గదుల ఫీజులు మినహా మిగతా ఫీజులు పెరిగాయని గత ఏడాది పీటీఐలో ప్రచురితమైన ఓ కథనం పేర్కొంది.
ప్రస్తుతం దేశంలోని చాలా కేంద్ర విశ్వవిద్యాలయాలు నిధులలేమి సమస్యను ఎదుర్కొంటున్నాయి. విద్యార్థుల ఫీజుల ద్వారా వచ్చే మొత్తం వాటి వ్యయాల్లో 2-3 శాతం కూడా ఉండటం లేదు.
జేఎన్‌యూ 2017-18 నివేదిక ప్రకారం విద్యార్థుల నుంచి వచ్చిన ఫీజుల మొత్తం దాదాపు రూ.10 కోట్లు.

ఫొటో సోర్స్, jnu
యూనివర్సిటీకి వచ్చిన మొత్తం ఆదాయం రూ.383 కోట్లు కాగా, పెట్టిన ఖర్చులు రూ.556 కోట్లు. అంటే రూ.172 కోట్ల లోటు ఉంది.
ఈ లెక్కల చిట్టా చూస్తుంటే కొన్ని ఆసక్తికర విషయాలు కనిపిస్తున్నాయి. జేఎన్‌యూ లైబ్రరీ ఖర్చులు తగ్గించుకుంటుండగా, సెక్యూరిటీ వ్యయం పెరుగుతోంది. 2017-18లో రూ.17.38 కోట్లు సెక్యూరిటీ కోసం ఖర్చు చేశారు. అంతకుముందు ఏడాది ఆ మొత్తం రూ.9.52 కోట్లుగా ఉంది.
ఈ ఏడాది కేంద్ర బడ్జెట్‌లో జీడీపీలో 4.6% విద్య కోసం కేటాయించారు. కానీ, ఈ కేటాయింపులు కనీసం 6% ఉండాలని విశ్లేషకులు అంటున్నారు.
2019-20లో యూజీసీ బడ్జెట్‌కూ కోత పడింది. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ బడ్జెట్‌ను కూడా తగ్గించారు. ఐఐటీ, ఐఐఎమ్‌ల బడ్జెట్‌లోనూ భారీ కోతలు పడ్డాయి.
కేంద్ర బడ్జెట్‌లో ఎక్కువ భాగం ఇంజినీరింగ్, టెక్నికల్ విద్యాసంస్థలకే వెళ్తోంది. మిగతా వాటికి తక్కువ భాగం వస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
కొన్ని ఐఐటీలు నిధుల లోటును పూడ్చుకునేందుకు పూర్వ విద్యార్థుల నంచి నిధులు సేకరించే ప్రయోగాన్ని చేపట్టాయి.
ఇలాగే ఐఐటీ బొంబాయికి 1993 బ్యాచ్ విద్యార్థుల నుంచి రూ.25 కోట్లు వచ్చాయి. ఐఐటీ మద్రాస్‌కు రూ.220 కోట్లు అందాయి.
పూర్వ విద్యార్థులతో సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు ఆ సంస్థలు విదేశాల్లో కార్యాలయాలు కూడా తెరిచాయి.
జేఎన్‌యూతోపాటు ఇతర విద్యాసంస్థలు కూడా ఇలాంటి మార్గాలను అన్వేషించవచ్చు.
యూనివర్సిటీ ఆదాయం, ఖర్చుల మధ్య అంతరం తగ్గించేందుకు ఏ చర్యా తీసుకోకపోతే, ఫీజులు ఇలాగే పెరుగుతూ పోతాయి.
కానీ, ఈ అంతరం తగ్గించడానికి ఫీజుల పెంపు ఒక్కటే మార్గామా? అన్నది అసలు ప్రశ్న.
ఇవి కూడా చదవండి
- ఇంగ్లిష్ మీడియంతో తెలుగు భాషకు ప్రమాదమా...
- World Toilet Day: కడుక్కోవడమా? తుడుచుకోవడమా? ప్రపంచాన్ని విభజించే ప్రశ్న
- ఊరు దాటాలంటే వాగు దాటాలి.. వాగు దాటాలంటే చెట్టు ఎక్కాలి
- జియో వినియోగదారుల మీద ఎందుకీ ఐయూసీ చార్జీల భారం?
- పరీక్షల్లో కాపీ కొట్టకుండా విద్యార్థుల తలలకు అట్టపెట్టెలు
- తొలి రాత్రే అనుమానం... మహిళలను మానసికంగా చంపేస్తున్న ‘రక్త పరీక్షలు’
- నింజా టెక్నిక్: వ్యాసం రాయమంటే 'ఖాళీ' పేపర్ ఇచ్చిన అమ్మాయికి అత్యధిక మార్కులు.. ఎలా?
- ప్రభుత్వానికి రూ.92000 కోట్లు బకాయి పడ్డ ఎయిర్టెల్, వొడాఫోన్: ఇది 5జీ ఆశలకు విఘాతమా
- మా అమ్మకు వరుడు కావలెను
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








