పాకిస్తాన్ పోలీసులతో ప్రశాంత్: ‘‘గూగుల్ మ్యాప్‌ను ఫాలో అవుతుండగా అనుకోకుండా పాకిస్తాన్ భూభాగంలోకి వచ్చేశాం’’

ఫొటో సోర్స్, facebook/XchangeVictory
- రచయిత, బళ్ల సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
పాకిస్తాన్‌లో బందీగా ఉన్న హైదరాబాద్ యువకుడు ప్రశాంత్ విడుదల కోసం ఆయన కుటుంబం ప్రయత్నాలు ప్రారంభించింది . ప్రశాంత్ పాకిస్తాన్ ఎందుకు వెళ్లాడన్న కారణం తెలియలేదు. ఆయన తీవ్రవాది అన్న అనుమానం తమకు లేదని బీబీసీకి పాకిస్తాన్ పోలీసులు ధ్రువీకరించారు.
దాదాపు రెండేళ్ల నుంచి ప్రశాంత్ కనపడడం లేదని తల్లిదండ్రులు చెపుతున్నారు. తాజాగా ఆయన వీడియో ఒకటి బయటకు వచ్చాక మళ్లీ కొడుకు దొరుకుతాడన్న ఆశ మొలకెత్తిందని అంటున్నారు.
ఫేస్‌బుక్‌లో అతని చివరి పోస్ట్ 2017 నవంబర్ 8న ఉంది. ‘యూత్ ఫర్ సేవ’ అనే స్వచ్ఛంద సంస్థకి వాలంటీర్‌గా ఉన్నట్టు ఆయన తన ప్రొఫైల్‌లో రాసుకున్నారు.
"2017 నాటికి ప్రశాంత్ మాదాపూర్‌లోని ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేసేవాడు. ఆ ఏడాది ఏప్రిల్ 11న ఉదయం ఆఫీసుకు వెళ్లిన వాడు తిరిగి రాలేదు. రెండు మూడు రోజులు వెతికి చూసి చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశాం. వారు ప్రయత్నించారు. దొరికితే చెబుతాం అన్నారు. అప్పటి నుంచీ జాడలేదు" అని ప్రశాంత్ తండ్రి బాబూరావు చెప్పారు.
కుటుంబం - చదువు:
ప్రశాంత్ తండ్రి బాబూరావు విశాఖపట్నంలో ఒక ప్రైవేటు ఉద్యోగం చేసేవారు. కుమారులు ఉద్యోగ రీత్యా హైదారాబాద్‌లో స్థిరపడడంతో, విశాఖ నుంచి హైదరాబాద్ వచ్చేశారు.
ప్రశాంత్ చదువు విశాఖలోనే సాగింది. ఎనిమిదవ తరగతి నుంచి ఇంజినీరింగ్ వరకూ విశాఖపట్నంలోనే చదువకున్నారు.
2010 తరువాత బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేశారు. 2016లో హైదరాబాద్ వచ్చారు.
"ఇంట్లో మిగిలిన వాళ్లందరం హైదరాబాద్‌లోనే ఉన్నాం, నువ్వు మాత్రం బయట ఎందుకు ఇక్కడకే వచ్చేయమని చెబితే వచ్చేశాడు. ఇక్కడ ఉద్యోగం చేసేప్పుడే ‘డెఫ్ అండ్ డంబ్’ పిల్లలకు పాఠాలు చెబుతుండే వారు. సాఫ్ట్‌వేర్‌లో ఉంటూ సేవ చేయడం కుదరదని, సాఫ్ట్‌వేర్ ఉద్యోగాన్ని వదలిపెట్టి, అమీర్‌పేటలో వేరే ఉద్యోగం చూసుకున్నారు. ఇంట్లో సర్దిచెప్పడంతో నెలలోపే తిరిగి కొత్త ఉద్యోగంతో సాఫ్ట్‌వేర్‌లో చేరారు" అన్నారు బాబూరావు.
‘‘సోమవారం ఎవరో మిత్రుడు టీవీలో వచ్చిన క్లిప్ నాకు పంపించారు. అప్పుడే తెలిసింది ప్రశాంత్ గురించి’’ అని బాబూరావు చెప్పారు.

మీడియా ముందు కొడుకు గురించి చెబుతూ కన్నీళ్లు పర్యంతం అయ్యారు ఆయన. తన ముందు కూర్చుని ఏడుస్తోన్న బాబూరావును సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ ఓదార్చారు.
ప్రశాంత్ పాకిస్తాన్ ఎందుకు వెళ్లాడో తెలియదనీ, ఆయన పాకిస్తాన్ నుంచి తిరిగి వచ్చాకే కారణాలు తెలుస్తాయనీ కమిషనర్ సజ్జనార్ చెప్పారు.
‘‘ఏప్రిల్ 29, 2017న మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ప్రశాంత్ మిస్సింగ్ కేసు నమోదయింది. పోలీసులు వెతికేందుకు తమ వంతు ప్రయత్నాలు చేశారు. కానీ సమాచారం దొరకలేదు. నిన్న వీడియోల ద్వారా పాకిస్తాన్లో ఉన్నట్టు తెలిసింది. ఈ విషయమై రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను అలర్ట్ చేశాం. వారు ప్రక్రియ ప్రారంభించారు. పాకిస్తాన్ ఎందుకు వెళ్లారు? అనేది తెలుసుకోవాల్సి ఉంది. ప్రశాంత్ బయటకు వచ్చాకే కారణాలు తెలుస్తాయి" అన్నారు సజ్జనార్.
ముందుగా దిల్లీ వెళ్లి విదేశాంగ కార్యాలయం ద్వారా ప్రశాంత్ ఆచూకీ కోసం ప్రయత్నించాలని ఆయన తండ్రి భావించారు. కానీ, సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్‌ని కలసిన తరువాత తన నిర్ణయం మార్చుకున్నారు. హైదరాబాద్‌లో ఉంటూనే, అవసరమైన వారిని కలవాలని నిర్ణయం తీసుకున్నారు.
పాకిస్తాన్ ఎందుకు వెళ్లారు?
ప్రశాంత్ పాకిస్తాన్ ఎందుకు వెళ్లి ఉంటారు అన్న దానిపై స్పష్టత లేదు. దీనికి రెండు కారణాలు ఉండొచ్చని ఆయన తండ్రి బాబూరావు భావిస్తున్నారు. ఒకటి అతనికి ఉద్యోగంపై ఆసక్తి లేక విరక్తితో ఇంటి నుంచి వెళ్లిపోవడం, రెండు ప్రేమించిన అమ్మాయిని వెతుక్కుంటూ వెళ్లడం.
జాబ్ చేయడం ప్రశాంత్‌కి ఇష్టం లేదని బాబూరావు బీబీసీతో చెప్పారు. అయితే ప్రశాంత్‌కి ఒక ప్రేమ వ్యవహారం ఉందని ఆయన అన్నారు.
‘‘లవ్ అఫైర్ ఉండడం కూడా తను కనిపించకపోవడానికి ఒక కారణమని మేం అనుకున్నాం. అతను కనిపించకుండా పోయిన చాలా కాలం తరువాత మాకా ఆలోచన వచ్చింది. బెంగళూరులో పనిచేస్తున్నప్పుడు తన సహోద్యోగి, మధ్యప్రదేశ్ కి చెందిన అమ్మాయి ఒకరు ప్రశాంత్‌కు ప్రపోజ్ చేశారు. ఆ విషయం ఇంట్లో చెప్పాడు. మాకేం అభ్యంతరం లేదు అని చెప్పాం. ఆ అమ్మాయి కొంత కాలం స్విట్జర్లాండులో ఉందని తెలుసు" అన్నారు ఆయన తండ్రి బాబూరావు.
పాకిస్తాన్‌లో ఉన్నట్టు ఎప్పుడు తెలిసింది?
ప్రశాంత్ తండ్రి బాబూరావు కథనం ప్రకారం దాదాపు 8 నుంచి 10 నెలల క్రితం ఒక వ్యక్తి వారి ఇంటికి వచ్చి ప్రశాంత్ పాకిస్తాన్‌లో ఉన్నాడని చెప్పారు.
‘‘8-10 నెలల క్రితం నేను అనుకుంటున్నా. ఒక వ్యక్తి ఇంటికి వచ్చి చాలా వివరాలు అడిగారు. తనను తాను ఎలా పరిచయం చేసుకున్నాడో గుర్తులేదు. అతను మా ఇంటికి వచ్చి వివరాలు అన్నీ తీసుకుని, ‘మీ అబ్బాయి పాకిస్తాన్లో ఉన్నాడు’ అని మాత్రం చెప్పారు. ‘అలా అయితే మరి విడిపించడానికి మేమేం చేయాలి’ అని అడిగితే, మీ చేతుల్లో ఏమీ లేదని పక్కాగా చెప్పారు. అదే విషయాన్ని మేం స్వయంగా పోలీసులకు చెప్పాం. ఒకవేళ నిజంగా పాకిస్తాన్ వెళ్లి ఉంటే అప్పుడు విచారణ తమ పరిధిలో ఉండదని పోలీసులు మాతో అన్నారు. మేం ప్రశాంత్‌ను విడిపించడానికి ఏ ప్రయత్నం చేయాలని ఆ వ్యక్తిని అడిగినా ఏమీ అక్కర్లేదు.. వారే స్పందిస్తారని చెప్పారు’’అన్నారు బాబూరావు.
అయితే పాకిస్తాన్‌లో ప్రశాంత్‌పై కేసు నమోదు అయ్యింది మాత్రం ఈ నెలలోనే.

ఫొటో సోర్స్, Getty Images
పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ నుంచి బీబీసీ ప్రతినిధి ఫరాన్ రఫీ అందించిన వివరాల ప్రకారం.. ప్రశాంత్‌తో పాటు మధ్యప్రదేశ్‌కి చెందిన మరోవ్యక్తిని నిబంధనలకు విరుద్ధంగా సరిహద్దు దాటినందుకు అదుపులోకి తీసుకున్నారు. ఆ ఇద్దరూ ఇప్పుడు అక్కడి జైల్లో ఉన్నారు.
వారిని అక్రమంగా సరిహద్దు దాటుతున్నందుకు అరెస్ట్ చేసినట్టుగా బహవాల్పూర్‌లోని సద్దార్ యాజ్మాన్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ షేక్ అస్జద్ బీబీసీకి చెప్పారు. ఈ కేసుపై పాకిస్తాన్లో 2019 నవంబర్ 14న ఎఫ్ఐఆర్ నమోదు అయింది. హైదరాబాద్‌కి చెందిన ప్రశాంత్ వైందం (తండ్రి బాబూ రావు), మధ్యప్రదేశ్‌కి చెందిన వారి లాల్ (తండ్రి సోబి లాల్) అని పేర్లు నమోదై ఉన్నాయి.
‘తీవ్రవాదులుగా అనుమానించడం లేదు’
భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో గూగుల్ మ్యాప్‌ను ఫాలో అవుతుండగా అనుకోకుండా పాకిస్తాన్ భూభాగంలోకి వచ్చినట్టు ప్రశాంత్ చెప్పాడని ఎస్‌హెచ్ఓ షేక్ అస్జద్ బీబీసీతో అన్నారు. అయితే వారు సరిహద్దు నుంచి చెప్పుకోదగ్గ దూరం వచ్చేశారనీ, చొలిస్తాన్ ఎడారిలో తిరుగుతున్నారని ఆయన చెప్పారు.
అయితే వీరిపై ఎటువంటి తీవ్రవాద ఆరోపణలూ లేవని పోలీస్ అధికారి ధృవీకరించారు. పాకిస్తాన్‌లోకి ప్రవేశాన్ని నియంత్రించే చట్టం.. పాకిస్తాన్ కంట్రోల్ ఆఫ్ ఎంట్రీ యాక్ట్ 1952లోని సెక్షన్ 3, 4 కింద ప్రశాంత్, వారి లాల్ పై కేసు నమోదైంది. సరైన వీసా, పాస్‌పోర్ట్ లేని భారత పౌరులు పాకిస్తాన్‌లోకి ప్రవేశించడం నేరమని ఈ సెక్షన్ చెబుతోంది.
ప్రస్తుతం వీరు జైల్లో ఉన్నారు. విచారణ జరగాల్సి ఉంది. ఒకవేళ వారు కోరితే న్యాయవాదిని అందిస్తామనీ, దాని కోసం పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖకు ఒక అప్లికేషన్ పెడతామని ఎస్‌హెచ్ఓ అన్నారు.
వీరిని అదుపులోకి తీసుకోగానే కోర్టులో ప్రవేశపెట్టినట్టు బీబీసీకి చెప్పారు బహవాల్పూర్ జిల్లా పోలీస్ పిఆర్ఒ ఇన్‌స్పెక్టర్ ఎజాజ్ హుస్సేన్.
ఈ కేసు విషయాన్ని పాకిస్తాన్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎఫ్ఐఏ) దృష్టికి తీసుకెళ్లాలని కోర్టు సూచించింది. కానీ, కేసు తమ పరిధిలోకి రాదని ముల్తాన్‌లో ఉన్న ఎఫ్ఐఎ కేసు తీసుకోవడానికి నిరాకరించింది.
దీంతో ఇప్పుడు ప్రశాంత్, వారి లాల్ ఇద్దరూ పాకిస్తాన్ లోని పంజాబ్ రాష్ట్ర పోలీసుల కస్టడీలో ఉన్నారు. త్వరలో న్యాయ విచారణ ఎదుర్కోనున్నారు.
ప్రశాంత్, వారిలాల్‌లను తీవ్రవాదులుగా అనుమానించడం లేదని ఇనస్పెక్టర్ ఎజాజ్ హుస్సేన్ కూడా ధృవీకరించారు.
అయితే బహవాల్‌పూర్ దగ్గర సాధారణంగా ఇలా అక్రమంగా సరిహద్దు దాటడం ఉండదనీ, ఇటువంటి ఘటన జరగడం గత కొన్నేళ్లలో ఇదే మొదలు అనీ పోలీసులు బీబీసీతో చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- భారత సరిహద్దుల్లో స్వచ్ఛంద కాపలాదారులు
- కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభం.. ఇమ్రాన్‌ఖాన్‌కు థ్యాంక్స్ చెప్పిన మోదీ
- స్నేహానికి సరిహద్దులు లేవని నిరూపించిన చిన్నారులు
- భర్త పాకిస్తాన్లో, భార్య భారత్‌లో
- కుల్‌భూషణ్ జాధవ్ మరణశిక్షను పాకిస్తాన్ ఎలా సమీక్షిస్తుంది...
- ఉత్తర, దక్షిణ కొరియాల్లాగా భారత్-పాకిస్తాన్ దగ్గరవడం సాధ్యమేనా?
- భూపత్ డాకూ: భారత్‌లో ఎనభై హత్యలు చేసి పాకిస్తాన్ పారిపోయిన దోపిడీ దొంగ
- ఐఐటీ మద్రాస్: "ఇస్లామోఫోబియా, కులతత్వం, వర్గపోరుతో మా క్యాంపస్ కంపు కొడుతోంది"
- ఈ దేశంలో ఒక్క ఏడాదిలో 30 వేల హత్యలు... ఈ బీభత్సానికి కారణం ఎవరు?
- హైదరాబాద్: బడి దగ్గర అన్నం గిన్నెతో చిన్నారి ఫొటో వెనుక నిజాలేమిటి?
- కాలం ఎప్పుడూ ముందుకే వెళ్తుంది.. వెనక్కి పోదు... ఎందుకు?
- World Toilet Day: కడుక్కోవడమా? తుడుచుకోవడమా? ప్రపంచాన్ని విభజించే ప్రశ్న
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








