భారత సరిహద్దుల్లో స్వచ్ఛంద కాపలాదారులు

ఫొటో సోర్స్, Congress/twitter
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించినట్లు 'ఈనాడు' ఒక కథనంలో తెలిపింది.
ఆ కథనం ప్రకారం.. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించే బిల్లును ఆమోదించడంతో పాటు, దానికి అదనంగా ఉద్యోగాల్లోనూ రిజర్వేషన్లు ఇస్తామని రాహుల్ చెప్పారు.
ఆయన తమిళనాడులో బుధవారం యూపీఏ తరఫున ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. చెన్నైలోని స్టెల్లా మేరీ కళాశాలలో విద్యార్థినులతో జరిగిన ముఖాముఖిలోనూ, విలేకరుల సమావేశంలోనూ మాట్లాడారు.
నాయకత్వ స్థానాల్లో తగినంత మంది మహిళలు లేరని, అందుకే రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. ఇది ప్రారంభం మాత్రమేనని అన్నారు.
పేదలకు కనీస ఆదాయ హామీ పథకాన్ని అమలు చేస్తామన్న వాగ్దానాన్ని పునరుద్ఘాటించారు. మరింత సరళంగా ఉండేలా జీఎస్టీలో సంస్కరణలు తీసుకొస్తామంటూ మరో హామీ ఇచ్చారు.
బెదిరించడం ద్వారా రాష్ట్రాలపై ఆధిపత్యం చలాయించవచ్చని ప్రధాని నరేంద్ర మోదీ భావిస్తున్నారని రాహుల్ ఆరోపించారు. ప్రస్తుత అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని ప్రధానమంత్రి కార్యాలయం శాసిస్తోందని, గతంలో ఇలాంటి పరిస్థితి ఎన్నడూ లేదని అన్నారు.
బెదిరింపు రాజకీయాలకు పాల్పడడం ద్వారా ఏ రాష్ట్రాన్నయినా అదుపులోకి తెచ్చుకోవచ్చన్నది మోదీ విధానం అని ఆరోపించారు. మరోవైపు అన్ని రాజ్యాంగ సంస్థలను ధ్వంసం చేస్తూ ఆర్‌ఎస్‌ఎస్ పెత్తనానికి అవకాశం ఇస్తున్నారని విమర్శించారు.
తమిళభాషను, సంస్కృతిని నాశనం చేస్తున్నారని, దీనిని కొనసాగనీయబోమని అన్నారు. అబద్ధాలు చెబుతున్న మోదీని ఓడించి సత్యం వైపు నిలవాలని తమిళ ప్రజలను కోరారు.

ఫొటో సోర్స్, Getty Images
సమాజానికి రూ. 52,700 కోట్ల అజీమ్ ప్రేమ్‌జీ విరాళం
విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ విప్రోలోని తన వాటాల్లో 34 శాతం వాటాలకు సంబంధించిన ఆర్థిక ప్రయోజనాలను తన దాతృత్వ కార్యక్రమాల ఫౌండేషన్‌కు కేటాయించినట్టు ప్రకటించారని 'సాక్షి' దినపత్రిక ఒక కథనంలో తెలిపింది.
ఆ కథనం ప్రకారం.. ప్రేమ్‌జీ నియంత్రణలోని పలు సంస్థల నిర్వహణలో ప్రస్తుతం ఈ వాటాలున్నాయని, వీటి మార్కెట్ విలువ రూ. 52,700 కోట్లుగా అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ తన ప్రకటనలో తెలిపింది.
దీంతో తన ఫౌండేషన్ కార్యక్రమాలకు ప్రేమ్‌జీ కేటాయించిన మొత్తం రూ. 1.45 లక్షల కోట్లకు (21 బిలియన్ డాలర్లు) చేరింది. ఇందులో విప్రోలోని 67 శాతం వాటాలకు సంబంధించిన ఆర్థిక యాజమాన్య హక్కులు కూడా ఉన్నాయి.
2018 డిసెంబర్ నాటికి విప్రోలో ప్రమోటర్ హోల్డింగ్ 74.3 శాతంగా ఉంది. అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్‌కు చైర్మన్‌గా ప్రేమ్‌జీనే వ్యవహరిస్తున్నారు. దాతృత్వ కార్యక్రమాలకు ఆయన గతంలోనే భారీ కేటాయింపులు జరపగా, తాజాగా వీటిని మరింత పెంచారు.
దేశంలో విద్యా సంబంధిత కార్యక్రమాలతోపాటు పలు ఇతర విభాగాల్లో పనిచేసే స్వచ్ఛంద సంస్థలకు అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ సాయం అందిస్తోంది.
కర్ణాటక, ఉత్తరాఖండ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్, పుదుచ్చేరి, తెలంగాణ, మధ్యప్రదేశ్, ఈశాన్య భారత్‌లో ఫౌండేషన్ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో పాఠశాల విద్యా వ్యవస్థ మెరుగు కోసం ఇనిస్టిట్యూషన్లను ఏర్పాటు చేస్తోంది.
బెంగళూరులో అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేసింది. వచ్చే కొన్నేళ్లలో సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేయనున్నట్టు ఫౌండేషన్ తెలిపింది. ఉత్తరభారత్‌లోనూ యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
భారత సరిహద్దుల్లో స్వచ్ఛంద కాపలాదారులు
భారత్- పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపధ్యంలో బీఎస్ఎఫ్ జవానులతో పాటు సరిహద్దు గ్రామాల ప్రజలు కూడా స్వచ్ఛంద కాపలాదారులుగా వ్యవహరిస్తున్నారని ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రిక ఒక కథనంలో పేర్కొంది.
ఆ కథనం ప్రకారం.. సరిహద్దు గ్రామాల ప్రజలు యూనిఫారంలేని సైనికుల మాదిరిగా సరిహద్దులపై అనుక్షణం దృష్టి సారిస్తున్నారు. అలాగే వదంతులను తిప్పికొట్టేలా వ్యవహరిస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులు, వస్తువుల విషయంలో అప్రమత్తంగా ఉంటున్నారు.
పాక్ సరిహద్దుల్లోని రాజస్థాన్‌కు చెందిన శ్రీగంగానగర్ జిల్లాలోని ప్రజలు స్వచ్ఛందంగా సరిహద్దుల్లో కాపలాదారులుగా ఉంటున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాము సరిహద్దు గ్రామాల్లో ఉన్నామని, అందుకే బీఎస్ఎఫ్ జవానుల తరహాలో వ్యవహరిస్తున్నామని చెప్పారు.
అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తులను బీఎస్ఎఫ్ అధికారులను అప్పగిస్తున్నామన్నారు.
ఇదిలావుంటే సరిహద్దు గ్రామాల్లో సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకూ మరింత భద్రతను కల్పించారు. ఆ సమయంలో గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని సైన్యం ఆదేశాలు జారీ చేసింది.
- చెట్టెక్కిన ఆసియా సింహం: మోదీ ట్వీట్ చేసిన ఈ ఫొటో వెనక కథ
- మహిళల్లో సున్తీ (ఖత్నా) అంటే ఏమిటి... ఐక్యరాజ్య సమితి దీన్ని ఎందుకు నిషేధించాలంటోంది... #EndFGM
- పతన దశలో వెబ్... అందరం కలసి కాపాడుకోవాలి: బీబీసీతో టిమ్ బెర్నర్స్-లీ
- 15 రాత్రుల్లో 121 మంది మహిళలతో...: ప్రాచీన చైనా చక్రవర్తుల జీవితాన్ని గణితశాస్త్రం ఎలా ప్రభావతం చేసింది?
- బోయింగ్ 737 మాక్స్ 8 విమానాలు భారత్‌లో ఎన్ని ఉన్నాయి? ఏఏ విమానయాన సంస్థలు వీటిని నడుపుతున్నాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








