బ్లాక్ మార్కెట్‌లో ఈ కప్ప ధర రూ. 1.47 లక్షలు.. 10 మందిని చంపగలిగేంత విషాన్ని ఉత్పత్తి చేయగలదు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, పీటర్ యుంగ్
- హోదా, బీబీసీ ఫ్యూచర్
ఆ లగేజీని చూస్తే సాధారణ దుస్తుల బ్యాగుల లాగే కనిపించాయి. కానీ, బొగోటా లోని ఎల్ డొరాడో అంతర్జాతీయ ఎయిర్ పోర్టులో ఆ సంచి అడుగున వింతగా ఉన్న ఒక వస్తువు కనిపించింది. సెక్యూరిటీ ఎక్స్ రే కిరణాలకు ఆ బ్యాగులో ఉన్న బట్టల మధ్యలో ముదురు రంగులో ఉన్న ఒక మూట కన్పించింది.
రహస్యంగా ఉన్న ఆ మూటలో కొన్ని వందల నల్లని ఫోటో ఫిల్మ్ డబ్బాలు ఉన్నాయి. కానీ, వాటి లోపల ఫిల్మ్ లేదు.
అందులో ప్రమాదకర స్థాయిలో అంతరించిపోతున్న 424 కప్పలు ఉన్నాయి. వాటి ఒక్కొక్కదాని విలువ బ్లాక్ మార్కెట్లో1,47,057 రూపాయిలు (2000 డాలర్ల) వరకు ఉంటుంది. అందులో కొన్ని కప్పలకు పసుపు, నలుపు చారలు ఉన్నాయి. కొన్నిటికి లేత ఆకుపచ్చ చారల మీద అక్కడక్కడా పరుచుకున్న నియాన్ కాషాయపు రంగు చుక్కలు ఉన్నాయి. కొన్ని నిర్జీవంగా పడి ఉన్నాయి. అయితే ఇవన్నీ విషపూరితమైనవే.
వీటిని కొలొంబియా పసిఫిక్ ప్రాంతంలో ఉన్న చాకో, వాలె డెల్ కోక నుంచి వేటాడి జర్మనీకి తరలిస్తున్నట్లు పోలీసులు చెప్పారు.
ఈ ఘటన 13 ఏప్రిల్ 2019లో జరిగింది. ఈ తరలింపు కొలొంబియాలో కొనసాగుతున్న వన్య ప్రాణుల అక్రమ వ్యాపారంలో భాగంగానే జరుగుతోంది. ఇలా తరలిపోతున్న వాటిలో సుమారు 850 జాతులకు చెందిన ఉభయచరాలు ఉన్నాయి. వైవిధ్యమైన కప్పల రకాలు అత్యధికంగా ఉన్న దేశాలలో కొలొంబియాలో ప్రపంచంలోనే రెండవ అత్యధిక స్థానంలో ఉంది.
యూరప్, అమెరికాలో వీటిని సేకరించేవారు ముఖ్యంగా ఈ విషపూరిత కప్పల వైపు ఆకర్షితులవుతారు. ఇవి ప్రపంచంలోనే అత్యంత విషపూరిత జీవులు.
ఇవి కనీసం 10 మందిని చంపగలిగేంత విషాన్ని ఉత్పత్తి చేయగలవు. కానీ, వాటి రంగు, మెరుపు, వాటిని తినే జీవులను హెచ్చరించే స్వభావంతో ఉండటం వలన వీటి విలువ కూడా ఎక్కువే. కొలొంబియాలో సుమారు 200 ఉభయచర జీవులలో కప్పలే అధికంగా ఉన్నాయి. వీటిని 2020లో ప్రమాదకరమైన రీతిలో అంతరించిపోతున్న జీవులుగా వర్గీకరించినట్లు జర్మనీలో హమ్బోల్ట్ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు తెలిపారు.

ఫొటో సోర్స్, Tesoros de Colombia
కానీ, టెసోరోస్ డి కొలంబియా అనే సంస్థ వీటిని చట్టబద్ధంగా పెంచి సంతానోత్పత్తి చేయించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ సంస్థను 2005లో స్థాపించారు.
దేశంలోనే వాణిజ్యపరంగా సంతానోత్పత్తిని నిర్వహిస్తున్న తొలి సంస్థ ఇది. వీరు ఇలా పెంచిన జీవులను కొలొంబియా అడవుల నుంచి వేటాడిన అక్రమ వ్యాపారుల కంటే తక్కువ ధరలకు విక్రయిస్తారు.
"ఏవైనా జాతులను సంరక్షించాలంటే వాటికి పొంచి ఉన్న ముప్పుకు ఆచరణాత్మక పరిష్కారాలను అమలు చేయాలి. నేను కాలక్రమేణా ఇవన్నీ నేర్చుకున్నాను" అని సంస్థ వ్యవస్థాపకులు ఇవాన్ లొహానో అన్నారు. ఆయన కప్పలను పెంచేందుకు సొంతంగా పెట్టుబడి పెట్టుకుంటారు. ఆయన యుకె లో డరెల్ వైల్డ్ లైఫ్ కన్సర్వేషన్ ట్రస్ట్ లో విద్యను అభ్యసించి బొగోటా వైల్డ్ లైఫ్ రెస్క్యూ సెంటర్లో పని చేశారు.
క్లిష్టమైన ప్రభుత్వ విధానాల వలన నవంబరు 2011 వరకు ఆయనకు దీనిని నిర్వహించడానికి అనుమతులు లభించలేదు.
చివరకు ఒక స్వదేశీ జాతి పసుపు చారలున్న విషపు కప్ప (డెండ్రోబెట్స్ ట్రంకేటస్)ను చట్టబద్ధంగా ఎగుమతి చేసేందుకు ఆయనకు అనుమతి లభించింది.
2015 కల్లా మరి కొన్ని రకాలైన ఆకుపచ్చ నలుపు రంగులో ఉండే విషపు కప్పు (డి ఆరాటస్ ), కొకొ పోయిజన్, ప్రసిద్ధి చెందిన గోల్డెన్ పాయిజన్ వంటి వాటిని ఎగుమతి చేయడానికి అంగీకారం దొరికింది.
ఇప్పుడు ఆయన ఏడు రకాల విషపూరిత కప్పలను పెంచుతున్నారు. వీటిని ప్రధానంగా ఆయన అమెరికా, యూరోప్ దేశాలతో పాటు కొన్ని ఆసియా దేశాలకు కూడా ఎగుమతి చేస్తారు.
ఇందులో అన్నిటి కంటే కొలొంబియాలో దొరికే ఊఫాగా రకం ఎక్కువ మంది అడుగుతారు. వీటిని పెంచడం చాలా కష్టమని చెప్పారు.
ఇవి కూడా అందరూ కోరుకునే రకాలని కానీ, వీటికి కూడా ముప్పు పొంచి ఉందని లొహానో చెప్పారు.

ఫొటో సోర్స్, Anton Sorokin/Alamy
చట్ట వ్యతిరేకంగా కప్పలను దొంగలించకుండా ఆయన చేస్తున్న ప్రయత్నాలు ఆయనకు అమెరికాలో కప్పలను సేకరించేవారి దగ్గర బాగా పేరు తెచ్చి పెట్టాయి. ఆయన చేస్తున్న ఊఫగా జాతి కప్పల ఉత్పత్తి సంవత్సరానికి 30 నుంచి 150కి పెరిగింది. కానీ, వీటికున్న డిమాండుకు అనుగుణంగా అయితే సరఫరా చేయలేకపోతున్నారు.
చట్టబద్ధంగా కప్పలను పెంచడం చాలా మంది కప్పల సేకరించే వారి ఆలోచనా సరళిలో మార్పులు తెచ్చిందని కొలొరాడోలో కప్పలను సేకరించే 37 సంవత్సరాల రాబర్ట్ జహ్రాదనిక్ భావిస్తారు. "ఇలాంటివి కొనేందుకు సహ కొనుగోలుదారుల నుంచి ఒత్తిడి ఉంటుంది" అని ఆయన అన్నారు.
ఏవైనా అనుమానాస్పద కప్పల చిత్రాలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తే ఆ కమ్యూనిటీ నుంచి అవెక్కడ నుంచి వచ్చాయనే కామెంట్లతో తీవ్రమైన ప్రతిఘటన వస్తోందని ఆయన చెప్పారు.
అయితే, కొంత మంది సంరక్షకులు మాత్రం మాత్రం వీటిని ఇలా బంధించి పెంచడాన్ని పూర్తిగా సమర్ధించటం లేదు. ఆసియాలో పులులను పెంచే ఒక కేసులో బలవంతంగా పెంచిన జంతువులకు, అడవిలో పట్టుకున్న జంతువులకు ఒకే లాంటి డిమాండును సృష్టించారు. కానీ, టెసోరోస్ విషయంలో లభించిన డేటాను జహ్రాదనిక్ చేస్తున్న వాదన సమర్ధిస్తోంది.
2014 - 2017 సంవత్సరాల మధ్యలో అమెరికాకు దిగుమతి అయినా కప్ప జాతులు చట్టబద్ధంగా పెంచినవేనని ఇటీవల జరిగిన ఒక అధ్యయనం తెలుపుతోంది. అయితే, అక్రమంగా తరలించిన కప్పల సంఖ్య గురించి సరైన సమాచారం లేకపోవడంతో , ఇవన్నీ చట్టబద్ధంగా సేకరించినవేనని ఈ అధ్యయన కర్తలు భావిస్తున్నారు.
"ఇదేమీ వృక్షాలు, జంతువుల మీటూ కాదు. కానీ, వీటి చుట్టూ ఉన్న ముఖ్యమైన విషయాలను చర్చించాల్సి ఉంది" అని ఈ నివేదిక రాసిన జస్టిన్ ఈగర్ అన్నారు.
“బయో కామర్స్ రంగం పరిపూర్ణంగా లేదు. ఇందులో ఆర్ధికంగా నిలదొక్కుకోవాలంటే తరచుగా కొనే కొనుగోలుదారులు కూడా ఉండాలి. అయితే, వీటిని వినియోగించే పద్ధతులు మార్చడానికి కూడా ఇదొక అవకాశం" అని ఆయన అన్నారు.
అక్రమ వ్యాపారాన్ని నివారించడానికి చట్టబద్ధంగా వీటిని పెంచడం ఒక సమర్ధవంతమైన విధానంగా నిరూపితమైనప్పటికీ , ఇప్పుడు జరుగుతున్న ఉత్పత్తి తగినంత లేదని కొలంబియా ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ది కన్సర్వేషన్ ఆఫ్ నేచుర్స్ ఆంఫిబియన్ స్పెషలిస్ట్ గ్రూప్ లో పని చేస్తున్న సాండ్రా ఫ్లెకాస్ అన్నారు.
"బంధించి పెంచుతున్న వాటికున్న డిమాండు చాలా ఎక్కువగా ఉంది. కానీ వాటిని పెంచే కేంద్రాలు మాత్రం తగినన్ని లేవు" అని ఆమె అన్నారు.
గత నాలుగు దశాబ్దాల్లో 80,000 లెహ్మన్ పాయిజన్ కప్పలను వేటాడినట్లు 2019లో ప్రచురితమయిన ఒక అధ్యయనం పేర్కొంది.
వీటిని ఐయుసిఎన్ ప్రమాదకరంగా అంతరించిపోతున్న జీవుల జాబితాలో చేర్చింది.
కానీ, ఈ సమస్య ఇప్పటికీ తీవ్రంగానే ఉందని ఈ నివేదిక రాసిన ఒక రచయత చెప్పారు.
"ఈ ప్రాంతంలో ఉన్న సాంఘిక ఆర్ధిక సమస్యల వలన వీటిని వేటాడేవారు తమకు సహాయం చేయడానికి స్థానికులకు డబ్బులు చెల్లిస్తారు. వారికి ఎకో టూరిజమ్, సంరక్షక కార్యక్రమాల ద్వారా ప్రత్యామ్నాయాలను చూపించగలగాలి" అని అన్నారు.
టెసోరోస్ కి కూడా ఆర్ధిక సవాళ్లు ఉన్నాయి. సంస్థ చేస్తున్న పనికి ల్యాబ్ స్థలం, అనుమతులు, న్యాయవాదులు, తనిఖీలు, ప్రభుత్వంతో లాబీలు అవసరమవుతూ ఉంటాయి.
ఈ అనుమతులు తెచ్చుకునే ప్రక్రియలో 500,000 డాలర్ల అప్పు అయిందని లొహానో చెప్పారు. కానీ, 2022 కల్లా ఆయన అప్పుల బారి నుంచి బయటపడి లాభాలను ఆర్జిస్తారనే ఆశిస్తున్నారు.
చట్టబద్ధంగా చేసే వ్యాపారం నుంచి కూడా లాభాలు సంపాదించవచ్చని నిరూపించడం ద్వారా లొహానో 7 - 23 బిలియన్ డాలర్లు విలువ చేసే చట్ట వ్యతిరేక వన్య ప్రాణుల వాణిజ్యాన్ని తరిమి కొట్టవచ్చని భావిస్తున్నారు.
ఆయన ప్రస్తుతం తన 8 మంది సభ్యుల బృందంతో కుడినమార్క రాష్ట్రంలో రెయిన్ ఫారెస్ట్ చుట్టు పక్కల ఒక ఫార్మ్ హౌస్ లో నివసిస్తున్నారు. వీరు కొలంబియా వన్య ప్రాణుల అక్రమ వ్యాపారానికి అడ్డు కట్ట వేసే ప్రయత్నంలో భాగంగా కప్పలను పెంచుతున్నారు.
లొహానో మాతో మాట్లాడుతూ ఉండగా, జపాన్ కి వెళ్లేందుకు అతని సహాయకులు ఒక ప్యాకేజిని సిద్ధం చేస్తున్నారు.
కొన్ని డజన్ల కాంతులీనే కప్పలను ప్లాస్టిక్ కుండల్లో, తడిగా ఉన్న నాచు, కొన్ని మొక్కలు, గాలి చొరబడేందుకు కన్నాలు, ఒక హీటింగ్ ప్యాడ్ తో పాటు పేర్చారు.
"వీటిలో కొన్నింటినైనా అంతరించకుండా కాపాడగలమని మేమనుకుంటున్నాం" అని ఆయన అన్నారు. "ఒక సారి ఒక కప్ప"
ఇవి కూడా చదవండి:
- చాలా ఏళ్లుగా చిప్స్ మాత్రమే తింటున్నాడు.. చివరికి కంటి చూపు కోల్పోయాడు
- ‘మనిషి లాంటి’ చేప: ఇది కేన్సర్‌కి పరిష్కారం చూపుతుందా?
- కరోనావైరస్: రొయ్యల సాగుదారుల చిక్కులేంటి.. లాక్ డౌన్‌తో నష్టం ఎంత?
- అమెరికా అధ్యక్షుడు ఏం తింటారు? వాటి అర్థం ఏంటి?
- వేరుసెనగ పప్పు తింటే చనిపోతారా?
- ఉప్పు తిన్న సముద్రానికే మనం ముప్పు తెస్తున్నాం
- డాక్టర్లు బ్రెయిన్ ట్యూమర్ ఆపరేషన్ చేస్తుంటే... ఆ అమ్మాయి పియానో వాయించింది
- కరోనా వ్యాక్సీన్ భారతదేశంలో మొదట ఎవరికి ఇస్తారు... దీని కోసం ఎలా రిజిస్టర్ చేసుకోవాలి?
- ఆడపిల్లలు వయసు రాకముందే రజస్వల కావడానికి కారణాలేమిటి? సమస్యలేమిటి? పరిష్కారాలేమిటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








