ఈ రెండు నెలలు వేలాది కుటుంబాల పోషణభారం మహిళలదే

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, వి.శంకర్
- హోదా, బీబీసీ కోసం
సముద్రంలో చేపల వేటపై నిషేధం అమలులోకి వచ్చింది. ఏటా రెండు నెలల పాటు సముద్రంలో మత్స్య సంపద పరిరక్షణ కోసం ప్రభుత్వం ఈ నిషేధాన్ని అమలు చేస్తోంది.
గతంలో నెల రోజులే ఉండే ఈ నిషేధాన్ని క్రమంగా పెంచారు. ప్రస్తుతం 61 రోజులు పాటు ఉంటుంది. పుష్కర కాలంగా అమలవుతున్న ఈ చేపల వేట నిషేధం వల్ల సాధించిన ఫలితాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఏపీ మెరైన్ ఫిషింగ్ రెగ్యులేషన్ యాక్ట్-1995 ప్రకారం సముద్రంలో చేపల వేటకు సంబంధించి పలు ఆదేశాలున్నాయి. ఈ చట్టం 1997 నుంచి అమలులోకి వచ్చింది. ఇక 2007 నుంచి ఏపీలో ఏటా వేసవిలో చేపల వేటపై నిషేధం అమలవుతోంది.
ఈ ఏడాది ఏప్రిల్ 15 నుంచి అమలులోకి వచ్చింది. జూన్ 14 వరకూ సముద్రంలో వేట కోసం ఎటువంటి బోట్లు అనుమతించరు. తొలుత మెటార్ బోట్లపై మాత్రమే నిషేధం పెట్టినప్పటికీ ప్రస్తుతం నాటు పడవలలో వెళ్లి వేటాడడాన్నీ నిషేధించారు.
మత్స్యసంపద కాపాడుతున్నాం
చేపల వేటను నిషేధించడం వల్ల ఈ కాలంలో మంచి ఫలితాలు సాధించామని మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ వీవీ రావు బీబీసీకి తెలిపారు.
"బంగాళాఖాతంలో గతంలో విలువైన జీవరాశులుండేవి. కానీ, రానురాను వాటి సంపద తగ్గిపోతోంది. ముఖ్యంగా వేసవిలో గుడ్లు పెట్టే దశలో వేట కారణంగా పునరుత్పత్తి పడిపోతోంది. దాంతో అరుదైన జాతులు కూడా కనుమరుగవుతున్నాయి. ఏప్రిల్ నుంచి జూన్ వరకూ చేపల వేట నిషేధం అమలు చేస్తే.. సముద్రజీవులు గుడ్లు పెట్టే సమయంలో ఎలాంటి ఆటంకం ఉండదు. వేట నిషేధంతో మంచి ఫలితాలు వస్తున్నట్టు రికార్డులు చెబుతున్నాయి. తొలుత ఏపీలో మొదలయిన ఈ ప్రయత్నం ప్రస్తుతం బంగాళాఖాతం తీర ప్రాంతంలో ఉన్న అన్ని రాష్ట్రాలలోనూ అమలు చేస్తున్నారు. వేట నిషేధ సమయంలో ప్రభుత్వం మత్స్యకారులకు పరిహారం కూడా అందిస్తూ వారి జీవనోపాధికి ఆటంకం లేకుండా చూస్తోంది" అని ఆయన వివరించారు.
జీవితంలో సగం రోజులు కడలి కెరటాలపై పయనం సాగించే మత్స్యకారులకు ప్రస్తుతం ఏటా రెండు నెలల పాటు వేట విరామం పాటించాల్సిన పరిస్థితి తప్పడం లేదు.
తొలుత వేట నిషేధం అమలు చేసేందుకు అనేక చోట్ల అధికారులు పెద్ద స్థాయిలో ఒత్తిడి తీసుకురావాల్సి వచ్చేది. కానీ, ప్రస్తుతం వేట నిషేధం సులువుగానే అమలులోకి వస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
చేపలు దొరికే సమయంలోనే వేటకు ఆటంకం
సముద్రంలో వేట విరామం తమ జీవనోపాధికి పెద్ద సమస్యగా మారుతోందని తూర్పు గోదావరి జిల్లా ఉప్పాడకు చెందిన బందన రాంబాబు బీబీసీకి తెలిపారు.
"మామూలుగా అయితే మే నెలలోనే చేపలు బాగా పడతాయి. కానీ ఇప్పుడు అది కుదరదని ఆపేస్తున్నారు. బోట్లన్నీ ఒడ్డున నిలిపేస్తున్నాము. జూన్ 15 తర్వాత పోనిస్తామంటున్నారు. కానీ, వర్షాలు ప్రారంభమయిన తర్వాత చేపలు పెద్దగా దొరకవు. ఆ తర్వాత వరదలు వచ్చినప్పుడు అసలు దొరకవు. అయినా, చేపలు పట్టుకోవడానికి వీలు లేకుండా చేయడంతో మా జీవితాలు నెట్టుకురావడమే కష్టం అవుతోంది. వేట లేకపోవడం, మరో పని రాకపోవడంతో రెండు నెలల పాటు ఖాళీగానే గడిపేయాల్సి వస్తోంది. ప్రభుత్వం ఇస్తున్న డబ్బులు కూడా ఏమూలకు సరిపోవడం లేదు. నెలకు రెండు వేలు ఇస్తున్నారు గానీ చాలవు. అయినా రేషన్ సరుకుల మీద ఆధారపడి నెట్టుకొస్తున్నాము" అంటూ వాపోయారు.
మత్స్యసంపద తగ్గిపోవడానికి కారణమేంటి?
సముద్ర జలాల్లో మత్స్యసంపద అడుగంటుతున్న విషయం వాస్తవమేనని పర్యావరణ వేత్త పతంజలి శాస్త్రి తెలిపారు. "గడిచిన కొన్ని దశాబ్దాలుగా పెరుగుతున్న పారిశ్రామికీకరణ సముద్ర జలాల్లో జీవరాశులకు ప్రాణసంకటంగా మారుతోంది. ముఖ్యంగా తీరాన్ని అనుకుని నిర్మించిన పరిశ్రమల నుంచి వచ్చే విష వ్యర్థాలు నేరుగా సముద్రం పాలవుతున్నాయి. పలు నిబంధనలు ఉన్నప్పటికీ ఆచరించే వారి సంఖ్య అడుగంటుతోంది. పర్యవేక్షణ ప్రశ్నార్థకం అవుతోంది. దాంతో కాలుష్యం వేగంగా పెరుగుతోంది. అదే సమయంలో సముద్ర అంతర్భాగంలో ఆయిల్ కంపెనీల కార్యకలాపాలు కూడా పెరుగుతున్నాయి. ముఖ్యంగా కేజీ బేసిన్ లో ఇవి ఎక్కువగా సాగుతున్నాయి. మత్ససంపద పునరుత్పత్తికి ఇవి కూడా ఆటంకంగా మారుతున్నాయి. వాటి మీద దృష్టి పెడితే మరిన్ని ఫలితాలు వస్తాయి. మత్స్యసంపదను పరిరక్షించుకోగలుగుతాం" అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
"మా ఆడోళ్లే పోషిస్తున్నారు"
చేపల వేటకు విరామం వచ్చినప్పుడు మత్స్యకార కుటుంబాల్లో మహిళల సంపాదనే ఆధారమని కోనపాపపేటకు చెందిన కోర్ని గోపి తెలిపారు.
"మామూలుగా మేము వేసుకెళ్లే బోట్లు చాలా చిన్నవి. పెద్ద పెద్ద ట్రాలర్లు వచ్చిన తర్వాత మాకు చేపలే దొరకడం లేదు. అయినా వేట నిషేధం పెడుతున్నారు. ఈ సమయంలో మాకు ఆడోళ్ల సంపాదనే ఆధారం. రొయ్యల కంపెనీల్లో చిన్న చిన్న పనులకు వెళ్లి తీసుకొచ్చే డబ్బులతోనే కుటుంబాలు నెట్టుకొస్తాము. మామూలుగా మాకు వేట ఉంటే రోజుకి 300 నుంచి వెయ్యి వరకూ సంపాదిస్తాం. కానీ ప్రభుత్వం మాత్రం పరిహారం కింద నెలకు రూ. 2వేలు ఇస్తోంది. రూ. 10 వేలకు పెంచుతామని ఎన్నికల్లో చెప్పారు. కొత్త ప్రభుత్వం కనికరిస్తే కొంత మేలు జరుగుతుంది". అంటూ గోపి తెలిపారు.
974 కిలోమీటర్ల పొడవునా సముద్ర తీరం ఉన్న ఆంద్రప్రదేశ్ లో 9 కోస్తా జిల్లాల పరిధిలో సుమారు 8లక్షల మంది మత్స్యకారులు సముద్ర వేట మీద ఆధారపడి జీవిస్తున్నారు. అనుబంధంగా సముద్ర ఉత్పత్తులు మార్కెట్ చేసుకుంటూ మరింత మంది జీవనోపాధి గడుపుతున్నారు. ముఖ్యంగా మత్స్యకార మహిళలు సముద్రం నుంచి వచ్చిన చేపలను మార్కెట్ చేసుకుంటూ పొట్ట నింపుకుంటారు. రెండు నెలల పాటు వేట లేకపోవడంతో పచ్చి చేపలు, ఎండు చేపలు మార్కెట్ చేసుకునే మహిళల ఉపాధికి గండి పడుతుంది. అయినా మహిళలకు ప్రభుత్వం పరిహారం చెల్లించడం లేదు. సముద్రంలో వేటకు విరామం ప్రకటించడంతో వేటకు వెళ్లే మత్స్యకారులకు మాత్రమే వర్తించేలా నిబంధనలున్నాయి.
పరిహారం మహిళలకు కూడా ఇవ్వాలి
చేపల వేట సాగుతున్నంత సేపు మాకు చేతినిండా పని ఉంటుందని మత్స్యకార మహిళ మంగారత్నం బీబీసీతో మాట్లాడుతూ తెలిపారు. "వేటకు విరామం ప్రకటించే సమయంలో మా కష్టాలు అన్నీ ఇన్నీ కావు. చేపలు వ్యాపారం చేసుకుని బతికే ఒంటరి మహిళలను కూడా ప్రభుత్వం గుర్తించడం లేదు. అమ్ముకుందామంటే చేపలు లేక, చేతిలో పని లేక, ప్రభుత్వ సాయం లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వం ఆదుకోవాలి. మత్స్యకారులతో పాటు మత్స్యకార మహిళలకు కూడా పరిహారం ఇవ్వాలి." అంటూ కోరుతోంది.
చేపల వేట సాగుతున్నంత సేపు కళకళలాడే పలు హార్బర్లు ప్రస్తుతం వెలవెలబోతున్నాయి. జూన్ మధ్య వరకూ ఈ పరిస్థితి కొనసాగుతుంది. విశాఖ, బందరు, కాకినాడ, నిజాంపట్నం, కళింగపట్నం సహా అన్ని ప్రధాన తీర ప్రాంతాల్లోనూ మత్స్యకారుల వేట నిషేధం కారణంగా నిశ్శబ్దం తాండవిస్తోంది. సముద్రం కూడా బోసిపోయి కనిపిస్తోంది. మత్స్యసంపద పెంచడానికి చేస్తున్న ప్రయత్నాలు మరింత పరిపుష్టం కావాలని పలువురు కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- ‘వైమానిక దాడి జరిగిన’ బాలాకోట్ నుంచి BBC Exclusive రిపోర్ట్
- ఏపీలో అర్ధరాత్రి దాటాక కూడా పోలింగ్ ఎందుకు జరిగింది...
- లక్ష్మీ పార్వతి ఏ నియోజకవర్గం నుంచి గెలిచారు?- బీబీసీ క్విజ్
- ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు: ఈవీఎంలో ఉన్న మీ ఓటు కౌంటింగ్ కేంద్రానికి వెళ్లే వరకు ఏం జరుగుతుంది?
- తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ ఇలా జరిగింది
- ఎడిటర్స్ కామెంట్: ఆంధ్రలో ఏ పార్టీది పైచేయి?
- ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు: ఇక ఫలితాల కోసం 42 రోజులు ఆగాల్సిందే
- ఎగ్జిట్ పోల్స్: ఎలా నిర్వహిస్తారు.. కచ్చితత్వం ఎంత
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.










