డ్రీమ్ ఇంజనీరింగ్: మనం ఎలాంటి కలలు కనాలో మనమే నిర్ణయించుకోవచ్చా?

అసలు కలలు ఎందుకొస్తాయి? వాటితో ఉపయోగమేంటి? అనేవి అర్థం చేసుకునేందుకు మనిషి కొన్ని వందల ఏళ్లుగా ప్రయత్నిస్తున్నాడు.
మనకొచ్చే కలల్ని మనం అర్థం చేసుకునే రోజు త్వరలోనే వస్తుందని, అంతేకాకుండా కలల్ని మనకు కావాల్సిన విధంగా మలచుకోవచ్చని కొంతమంది పరిశోధకులు భావిస్తున్నారు.
నిద్రపోతున్నప్పుడు, మన మనసులో ఆలోచనలను నాటడం ద్వారా స్వప్నాలను మనకు నచ్చినట్లు మలచుకోవడం సాధ్యమవుతుందని "డ్రీమ్ ఇంజనీరింగ్" అనే అభివృద్ధి చెందుతున్న రంగంలో పనిచేస్తున్న శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
దీని వల్ల నేర్చుకోవడం మెరుగుపడుతుందని, సృజనాత్మక శక్తి పెరగడంతో పాటు మానసిక ఆందోళనలను తగ్గించుకోవచ్చని గతంలో జరిగిన పరిశోధనలు సూచిస్తున్నాయి.


ఫొటో సోర్స్, Getty Images
మనం కోరుకున్న కల..
తాను 'సగం ప్రొఫెషనల్ డ్రీమర్"గా మారినట్లు అనిస్తోందని అమెరికాలోని మసాచుసెట్స్‌లో బ్రెయిన్ ట్రీకు చెందిన రచయిత, కళాకారుడు విల్ దౌద్ చెప్పారు.
దృష్టి లోపంతో పాటు తన కదలికలను దెబ్బతీసిన వ్యాధి కారణంగా ఆయన సరిగ్గా చదవలేకపోయేవారు. ఆ తర్వాత ఆయన 'డ్రీమ్ ఇంక్యుబేషన్' అనే టెక్నిక్‌పై ప్రయోగం ప్రారంభించారు. నిద్రపోయే ముందు చిన్న ఆడియో సందేశాలను మెదడులోకి పంపించడమే డ్రీమ్ ఇంక్యుబేషన్.
"సాహిత్యంతో నా కలలను ప్రోగ్రామ్ చేయవచ్చని తెలిసి ఆశ్చర్యమేసింది" అని ఆయన చెప్పారు. నిద్రపోయేందుకు ఆయన కవితలకు సంబంధించిన రికార్డింగ్స్ వినేవారు.
నిద్రపోయిన తర్వాత తనకు రకరకాల కలలు వచ్చినట్లు దౌద్ గుర్తించారు. అందులో "భారీ వరదల్లో మునిగిపోయిన అంతు చిక్కని నగరంలో ప్రయాణించినట్లు, పౌర్ణమి రాత్రుల్లో నక్కలతో పోటీపడి పరుగులు తీస్తున్నట్లు" కలలు వచ్చినట్లు ఆయన చెప్పారు.
"నేను దీన్ని జెట్ వేగంతో కలలు కనడంగా చెబుతాను" అని ఆయన అన్నారు. ఆ కలలు రాబోయే పుస్తక రచనకు ఆధారంగా మారనున్నాయి.
ఆ కలలు తన కష్టాల నుంచి బయటకు వచ్చేందుకు కీలకంగా మారాయి. "నేను వేరే ప్రపంచంలోకెళ్లి తిరిగొచ్చినట్లు అనిపించింది" అని దౌద్ చెప్పారు.
దీని వెనకున్న సైన్స్ ఏంటి?
'డ్రీమ్ ఇంక్యుబేషన్' కొత్తదేమీ కాదు. పురాతన గ్రీక్, థాయ్ సంస్కృతిలో కలల మార్గనిర్దేశనం కోసం ఆలయాలకు వెళ్లేవారు.
టెట్రిస్ అనే వీడియో గేమ్ ఆడే వాళ్లకు నిద్రపోయిన తర్వాత తమకు కలలో పడిపోతున్న ఆకారాలు కనిపించినట్లు 2000 సంవత్సరంలో అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ రాబర్ట్ స్టిక్‌గోల్డ్ గుర్తించారు. ఆ తర్వాత కలలను ప్రభావితం చేసే అంశాల గురించి ఆసక్తి పెరిగింది.
"మేం చాలా ఆనందంగా ఉన్నాం. కలలను ప్రభావితం చేయొచ్చని మేం మొదటిసారి చూపించాం" అని స్టిక్‌గోల్డ్ చెప్పారు.
ప్రస్తుతం, మనకు నచ్చిన కలలు కనే కొత్త సాంకేతికతను అభివృద్ధి చేసేందుకు డాక్టర్ ఆడం హార్ హోరోవిట్జ్ వంటి పరిశోధకులు హార్వర్డ్ యూనివర్సిటీ, అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్‌స్టిట్‌ట్యూట్ ఆఫ్ టెక్నాలజీతో కలిసి పనిచేస్తున్నారు.

ఫొటో సోర్స్, Roos Koole via Getty Images
ఆందోళన నుంచి బయటపడవచ్చా?
కొత్త సాంకేతికతలో భాగంగా ఆయన డోర్మియో అనే పరికరాన్ని సృష్టించారు. ఇది ఒక వ్యక్తి నిద్రలోకి జారుకునే సమయంలో సందేశాన్ని పంపిస్తుంది. ఉదాహరణకు, "నీటి గురించి కలలు కనాలని గుర్తుంచుకోండి" అనే ప్రాంప్ట్ ఇచ్చి, నిద్రపోయిన తర్వాత శరీరం నుంచి వచ్చే సంకేతాలను డోర్మియో పర్యవేక్షిస్తుంది.
మనం నిద్ర పోయిన తర్వాత స్పష్టమైన వివిధ రకాల దృశ్యాలు కనిపించడం మనకు తెలుస్తుంది. డోర్మియో ఒక ప్రత్యేక అంశం గురించి సూచన చేసినప్పుడు 70 శాతం కంటే ఎక్కువ మందికి.. అదే అంశం గురించి కలలు వచ్చినట్లు ఒక అధ్యయనంలో తేలింది.
హార్ హోరోవిట్జ్ తన వ్యక్తిగత అనుభవాల మూలాల్లోకి వెళ్లారు. చిన్నతనంలో ఆయన మానసిక ఆందోళన ఎదుర్కొన్నప్పుడు ఆయన తల్లి ఓదార్పు మాటలు చెప్పేది. నిద్రలోకి జారుకోవడానికి ముందు అవి వినడం వల్ల పదేపదే వచ్చే పీడకలల నుంచి ఆయన బయటపడ్డారు.
"అది నా కలలను మార్చేసింది. నేను ఆ పీడకలల నుంచి బయటపడ్డాను. ఆ తర్వాత అంతగా భయపడలేదు" అని ఆయన చెప్పారు.
డ్రీమ్ ఇంజనీరింగ్ పూర్తిగా కొత్త మార్గాన్ని చూపిస్తుందని ఆయన నమ్ముతున్నారు. ఒకసారి మీకు కావాల్సిన కలల్ని నిర్దేశించుకుంటే, శాస్త్రీయంగా పర్యవేక్షించగలిగిన, పోల్చదగిన అంశాలను సృష్టించడం మొదలుపెట్టవచ్చని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
మానసిక సమస్యలకు ఊరట
కొంతమంది విషయంలో బాధను ఎదుర్కోవడంలో కలలు అనూహ్య పాత్ర పోషిస్తాయి. యుక్త వయసులో ఉన్న తన కుమారుడు జేన్ చనిపోయిన తర్వాత కాలిఫోర్నియాకి చెందిన మేర్ లూకాస్ చాలా సంవత్సరాలు పీడకలలతో బాధపడ్డారు.
అయితే, బ్రెస్ట్ క్యాన్సర్ సర్జరీలో భాగంగా ఆమెకు ఇచ్చిన మత్తుమందు నుంచి బయటపడేటప్పుడు, తన కుమారుడి గురించి ప్రేమతో కూడిన, ఆనందకరమైన కలలు కన్నారు. ఆ తర్వాత ఆమెకు వచ్చే పీడకలలు ఆగిపోయాయి.
"రెండున్నరేళ్లుగా ఒక్క పీడకల కూడా రాలేదు. అది నా జీవితాన్ని మార్చేసింది" అని ఆమె చెప్పారు.
ఆమె అనుభవం ప్రస్తుతం స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలోని ఓ బృందం అధ్యయనం చేస్తున్న పరిశోధనను ప్రతిబింబిస్తోంది.
అనస్థీషియా సహజ నిద్రకు సమానం కాదు. రోగులకు మత్తుమందు ఇచ్చినప్పుడు అసాధారణంగా సానుకూల కలలనే కంటారు. సర్జరీ తర్వాత వారిని వారిని మత్తు నుంచి మెల్లగా బయటకు తీసుకువస్తే బలమైన ప్రభావం ఉంటుందని చెప్పవచ్చని డాక్టర్ పిల్లెరిన్ సిక్కా చెప్పారు.
ఆందోళన, డిప్రెషన్ లాంటి పోస్ట్ ట్రమాటిక్ స్ట్రెస్ డిజార్డర్ పరిస్థితుల నుంచి బయటకు తీసుకురావడానికి డ్రీమ్ ఇంజనీరింగ్ అనేది ఏదో ఒక రోజు సాయపడుతుంది.
"శస్త్ర చికిత్స కాకుండా చికిత్స అందించడానికి ఇదొక మార్గం కావొచ్చు. ఏదో ఒకరోజు డ్రీమ్ క్లినిక్స్ కూడా అందుబాటులోకి వస్తాయి" అని సిక్కా అన్నారు.

ఫొటో సోర్స్, PM Images via Getty Images
నైతికత గురించిన చర్చ
డ్రీమ్ ఇంజనీరింగ్‌పై శాస్త్రీయపరమైన ఆసక్తి పెరుగుతున్న కొద్దీ, ఇది నైతికంగా సరైనదేనా అనే చర్చ కూడా విస్తృతమవుతోంది.
2021లో అమెరికాకు చెందిన కూర్స్ బీర్ కంపెనీ ఒక డ్రీమ్ ఇన్‌క్యుబేషన్ యాడ్‌ను రూపొందించింది. అందులో నిద్రలోకి జారుకోవడానికి ముందు కొండలు, లోయలు, జలపాతాల వంటి అద్భుతమైన కలల వంటి దృశ్యాలను చూపించారు.
నిద్రపోవడానికి ముందు తమ యాడ్ చూడాలని బీర్ కంపెనీ ప్రచారం చేసింది. అలా చేస్తే వారు నిద్ర పోయిన తర్వాత కూడా తమ కంపెనీ ఉత్పత్తులకు సంబంధించిన కలలు, అనుభూతులు కలుగుతాయని భావించింది.
అయితే, ఈ ప్రకటన మీద కొన్ని విమర్శలు వచ్చాయి. కలల గురించి పరిశోధనలు చేస్తున్న స్టిక్‌గోల్డ్, హార్ హోరోవిట్జ్‌తో పాటు ఇతర శాస్త్రవేత్తలు కలలు కనే టెక్నిక్‌ను వ్యాపారంగా మలచుకోవడాన్ని విమర్శిస్తూ బహిరంగ లేఖ రాశారు.
"అడ్వర్టైజింగ్ పరిశ్రమ మా నిద్రను మాకు వదిలేయాలి. మా వ్యక్తిగత జీవితానికి ఇదే కోట" అని స్టిక్‌గోల్డ్ చెప్పారు.
కలల గురించి భయపడాల్సిన అవసరం లేదని, రోజువారీ వాణిజ్య ప్రకటనల ప్రభావం కలల మీద చాలా తక్కువగా ఉంటుందని హార్వర్డ్ యూనివర్సిటీలో పరిశోధకుడు డాక్టర్ డీర్డ్రే బారెట్, మరికొంతమంది పరిశోధకులు విశ్వసిస్తున్నారు.
డ్రీమ్ ఇంక్యుబేషన్‌ను ప్రజలకు పరిచయం చేయడానికి కూర్స్ సంస్థ ప్రకటన ఒక మార్గమని బారెట్ చెబుతున్నారు. బీరుకు సంబంధించిన ప్రకటన రూపకల్పన సమయంలో కూర్స్ సంస్థ బారెట్‌ను సంప్రదించింది.
కూర్స్ ప్రకటనపై విమర్శలకు సమాధానం కోసం బీబీసీ ప్రతినిధి కూర్స్ మాతృ సంస్థ మోల్సన్ కూర్స్‌ను సంప్రదించారు. అయితే వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు.

ఫొటో సోర్స్, skaman306 via Getty Images
అసలు కలలు ఎందుకు?
డ్రీమ్ ఇంజనీరింగ్ కేవలం సైన్స్ లేదా టెక్నాలజీ కాదు. ఇది మన జీవితంలో కొంత భాగాన్ని తెలుసుకోవడం అనేది హార్ హోరోవిట్జ్ అభిప్రాయం.
"ప్రతీ రోజూలో మూడో వంతు, ఒక ఏడాదిలో మూడో వంతు అవుతుంది. కలలో మీరు మీ సామర్థ్యాన్ని మించి ఏదైనా చేయగలరు. ఆలోచించగలరు. నిర్మించగలరు. అందుకే నేను నా శక్తిలో మూడో వంతు కోల్పోవడానికి సిద్ధంగా లేనని చెప్పాలనుకుంటున్నాను" అని హోరోవిట్జ్ అన్నారు.
పరిశోధనల్లో కొత్త అంశాలు వెలుగులోకి వచ్చే కొద్దీ కలల ప్రపంచం మనసు, ఆలోచనల సరిహద్దులను దాటి వెళుతుంది. మానసిక ఆరోగ్యాన్ని బలోపేతం చేసే ప్రదేశంగా చూసే వారికి, ఉత్పత్తులను అమ్ముకోవాలని భావించే వారికి మన కలల ప్రపంచం వేదికగా మారింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














