మధ్యయుగాల నాటి ప్రజలు ఇలా చెక్క బీరువాలలో తలుపులు వేసుకుని పడుకునేవారు... ఎందుకలా?

ఎక్కువ మంది ఒకే చోట పడుకునేందుకు వరుసగా చెక్క పెట్టెలను ఒకే చోట అమర్చేవారు

ఫొటో సోర్స్, Alamy

ఫొటో క్యాప్షన్, ఎక్కువ మంది ఒకే చోట పడుకునేందుకు వరుసగా చెక్క పెట్టెలను ఒకే చోట అమర్చేవారు
    • రచయిత, జరియా గొర్వెట్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

బీరువాలలో సౌకర్యవంతంగా నిర్మించిన చెక్క పలకలపై అయిదుగురు వ్యక్తులు నిద్రించేవారు. ఈ అలవాటు ఎలా మొదలైంది? ఇది ఒకప్పుడు మానవ సంస్కృతిలో భాగంగా మారిపోవడానికి కారణాలేంటి?

ఉత్తర స్కాట్లండ్‌లోని విక్ పట్టణంలోని ఓ మ్యూజియం లోపలకు వెళ్లి చూస్తే, పైన్ చెక్కతో చేసిన చెక్క బీరువాలు బారులు తీరి కనిపిస్తాయి. ఈ చెక్క పెట్టె ముందు వైపున రెండు పొడవాటి చెక్క తలుపులు, వాటి మీద సూట్ కేసులు, దీన్ని చూస్తే అధునిక కాలంలో బెడ్ రూమ్ అని ఎవరూ అనుకోరు.

అవి కనీసం ఫర్నీచర్‌ను అమర్చేందుకు పని కొస్తాయని కూడా భావించలేం. వాటిని తేలిగ్గా ఎక్కడికైనా కదిలించి మళ్లీ నిర్మించవచ్చు. ఈ కప్‌బోర్డులు చొక్కాలు, ప్యాంటులు భద్రపరిచేందుకు కాదు. వాటిలో అరలు, హ్యాంగర్లు ఏమీ లేవు. ఇదొక బాక్స్ బెడ్. దానిలో ప్రజలు నిద్రపోయేవారు.

వీటిని అల్మరా మంచాలు లేదా తలుపులు మూసుకునే వీలున్న మంచాలు అని పిలిచేవారు. మధ్య యుగంతో పాటు 20వ శతాబ్ధపు తొలి నాళ్ల వరకూ యూరప్ అంతటా ఇవి బాగా పాపులర్.

భారీ బోషాణపు పెట్టె మాదిరిగా కనిపించే ఇందులో ఓ బెడ్ ఉంటుంది. ఇందులో కొన్ని నునుపుగా లోపల ఎలాంటి చెక్క పెట్టెలు లేకుండా ఉండేవి.

మరి కొన్ని అందంగా చెక్కి, నగిషీలతో, అరలు అరలుగా, రంగులు వేసి ఉండేవి. ఈ కప్ బోర్డులకు తలుపులు కూడా ఉండేవి.

ఇందులో పడుకున్న వారు, లోపలకు వెలుగు రాకుండా ఈ తలుపులను మూసుకునేందుకు వీలుండేలా ఏర్పాటు చేసేవారు. తలుపులు లేకపోతే కర్టెన్లను అమర్చేవారు.

బాగా ఫ్యాన్సీగా ఉండే బాక్స్ బెడ్‌కి డ్రాయర్లు, కూర్చునేందుకు వీలుగా సీటు కూడా ఉండేది.

వందల సంవత్సరాల పాటు, నిద్రమత్తుతో ఉన్న వ్యవసాయ కార్మికులు, కాలువల్లో చేపలు పట్టేవాళ్లు, ఉన్నత వర్గాలకు చెందిన వారు కూడా ప్రతీ రాత్రి ఈ చెక్క అరల్లో నిద్రించేవారు.

ఇందులోకి వెళ్లేటప్పుడు భుజాలు, తలకు దెబ్బ తగలకుండా జాగ్రత్తగా లోపలకు వెళ్లి తలుపులు మూసేకునే వారు.

మధ్యయుగపు ప్రజలు ఇలాంటి పెట్టెల్లో నిద్రించేవారు

ఫొటో సోర్స్, Alamy

ఫొటో క్యాప్షన్, మధ్యయుగపు ప్రజలు ఇలాంటి పెట్టెల్లో నిద్రించేవారు

మధ్యయుగాల ప్రజల సామగ్రిలో బాక్స్ బెడ్లు ప్రత్యేకమైనవి. వీటిని చిన్న సైజు బెడ్ రూములుగా ఉపయోగించేవారు. వీటిని ఎక్కడ పడితే అక్కడ ఉంచుకుని అందులో నిద్రపోయేవారు.

1980లో పెద్ద స్కాటిష్ కుటుంబం ఒకటి ఒకే గదిలో నివశించేది. దీంతో కొంతమంది కుటుంబ సభ్యులు పశువుల కొష్టంలో ఈ బాక్స్ బెడ్లు ఏర్పాటు చేసుకుని అందులో నిద్రపోయేవారని విక్ సొసైటీ చెబుతోంది.

చేపలు పట్టే సీజన్‌లో కొంతమంది వలసదారులు కాలువ పక్కన ఇలాంటి బెడ్లు ఏర్పాటు చేసుకుని రాత్రి పూట అందులోనే పడుకునేవారు. ఐదుగురు లేదా ఆరుగురు ఒకే బెడ్ బాక్స్‌లో పడుకునేవారు.

వాస్తవానికి, ఒకే కుటుంబానికి చెందినవారు, ఒకే సమూహానికి చెందినవారు ఒకే బాక్స్‌బెడ్‌లో పడుకోవడం అసాధారణ అంశం ఏమీ కాదు.

1825లో మెలొడ్రమ పట్టణంలోని ఓ ఫ్యాక్టరీలో యువకులు, కార్మికులు చెక్క పెట్టె బెడ్లను వరుసగా ఏర్పాటు చేసుకున్నారు. ఒక్కో దానిలో ఇద్దరు లేదా ముగ్గురు నిద్రించేవారు.

వీటిలో కొన్నింటికి వెలుతురు కోసం రంద్రాలు చేశారు. అయితే ఒకే బెడ్‌లో ఎక్కువ మంది పడుకుంటే ఊపిరందక చనిపోయే ప్రమాదం ఉంది. 13వ శతాబ్ధంలో ఫ్రాన్స్‌లో ఒక మహిళ ఒక బాక్స్ బెడ్‌లో ముగ్గురు రహస్య అతిధులును దాచి పెట్టింది. దీంతో వారు లోపల ఊపిరాడక చనిపోయారు.

బ్రిటన్‌తో పాటు యూరోపియన్ దేశాల్లో చెక్క పెట్టె బెడ్లు సర్వ సాధారణం. 1840లో బ్రిటన్, ఫ్రాన్స్‌లోని అధిక శాతం కాటేజ్‌లలో ఇలాంటి చెక్క పెట్టెలు ఉండేవి.

వీటిని ఎక్కువగా ఓక్ చెక్కతో తయారు చేసేవారు. చెక్క పెట్టె బెడ్ నాలుగడుగుల ఎత్తుండేది. ఒకే గదిలో మరిన్ని ఏర్పాటు చేస్తే వాటన్నింటికీ ఒకే చెక్క మీద ఏర్పాటు చేసేవారు.

“ఇది ఎల్లప్పుడూ గౌరవంగా ఉండేది. అతిధులకు సేవ చేయడానికి వీలుగా, వారిని తన ఒడిలోకి ఆహ్వనిస్తున్నట్లుగా ఉండేది” అని రచయిత థామస్ అడాల్ఫస్ ట్రాలప్ రాశారు.

చెక్క పెట్టె బెడ్లను సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ఉపయోగించేవారు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, చెక్క పెట్టె బెడ్లను సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ఉపయోగించేవారు

చలికాలంలో వేడిని అందించే చెక్క పెట్టె బెడ్లు

ఈ చెక్క పడకల పేటికల వల్ల మరికొన్ని ఉపయోగాలు కూడా ఉన్నాయి. యూరోపియన్ దేశాల్లో చలికాలం వచ్చిందంటే ఇల్లంతా చల్లగా ఉండేది.

సాధారణ బెడ్రూమ్‌లు చల్లగా ఉండేవి. పడుకున్నప్పుడు చలి పుట్టకుండా శరీరాన్ని పెద్ద దుప్పట్ల కింద దాచుకునే యూరోపియన్లు, తలకు చలి తగలకుండా టోపీ పెట్టుకునేవారు.

అయితే చెక్క పెట్టె బెడ్లలో హీటర్లు, ఇతర ఏర్పాట్లేమీ అవసరం లేకుండానే వెచ్చగా ఉండేవి.

14వ శతాబ్ధం నుంచి 19వ శతాబ్ధం వరకు యూరప్ దేశాలు, నార్త్ అమెరికాలో కొంత బాగం తీవ్రమైన చలికాలాన్ని ఎదుర్కొంది అని వర్జీనియా టెక్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌, ఎట్ డేస్ క్లోజ్: ఎ హిస్టరీ ఆఫ్ నైట్ టైమ్ పుస్తక రచయిత రోజర్ ఎక్రిచ్ వివరించారు.

లండన్‌లో థేమ్స్ నది 18 సార్లు గడ్డకట్టింది. 1963 నుంచి ఇప్పటి వరకూ అలాంటిది జరగలేదు.

“అగ్ని ప్రమాదం జరిగినప్పుడు మండుతున్న కట్టెల్లో నుంచి వచ్చే తేమ, కట్టె కాలుతూ ఉండగానే గడ్డ కట్టిపోయేదని డైరీల్లో రాసుంది. ఇళ్లలోని ఇంకు సీసాలు కూడా గట్టేవి” అని ఆయన రాశారు.

గ్రామీణ ప్రాంతాల్లో పశువులకు దగ్గరగా పడుకునేందుకు ఇవి మంచి ఏర్పాటు

ఫొటో సోర్స్, Alamy

ఫొటో క్యాప్షన్, గ్రామీణ ప్రాంతాల్లో పశువులకు దగ్గరగా పడుకునేందుకు ఇవి మంచి ఏర్పాటు

కాలక్రమంలో అంతరించిన సంస్కృతి

చెక్క పెట్టె బెడ్లు నిద్రను ఆకర్షణీయంగా మార్చడమే కాదు. పర్యావరణ హితమైనవి కూడా. బయటి గాలి లోపలకు రాకుండా, లోపలిగాలి బయటకు పోకుండా వెచ్చగా ఉంచేవి.

చెక్క పెట్టెల్లో పడుకోవడం కాల క్రమేణా పేదరికానికి, గ్రామీణ జీవితానికి ప్రతీకగా మారింది. అదొక ఫ్యాషన్ అనే ధోరణి పోయింది.

20వ శతాబ్ధం మధ్యకాలం వరకూ అక్కడక్కడా అరుదుగా కనిపించేవి. ఏదేమైనప్పటికీ అలాంటి సామగ్రి ఇప్పుడు మళ్లీ వస్తోంది.

ప్రస్తుతం ప్రైవసీ కోసం, ప్రత్యేక సందర్బాల్లో క్యాంపింగ్ బెడ్లు, టెంట్ బెడ్లను ఉపయోగిస్తున్నారు.

చెక్క పెట్టె బెడ్ల తరహాలో రూపొందించిన నూక్స్ అని పిలిచే మంచాలు ప్రస్తుతం కాటేజ్‌లలోని బెడ్‌రూమ్‌లలో ఏర్పాటు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత కథనాలు