చైనీస్ మాంజా మెడకు చుట్టుకోవడంతో హైదరాబాద్‌లో జవాన్ కోటేశ్వర్ రెడ్డి మృతి... ఈ పతంగి దారం ఎందుకంత ప్రమాదకరం?

ఫొటో సోర్స్, Venkateswara rao/GettyImages
- రచయిత, హరికృష్ణ పులుగు
- హోదా, బీబీసీ ప్రతినిధి
మకర సంక్రాంతి సందర్భంగా దేశవ్యాప్తంగా పలు నగరాలలో మాదిరిగానే హైదరాబాద్‌లో కూడా రంగురంగుల పతంగులు ఆకాశంలో సందడి చేస్తున్నాయి.
భోగి పండుగకు ముందు రోజు హైదరాబాద్‌లోని తన ఇంటికి వెళ్తున్న కోటేశ్వర్ రెడ్డి అనే ఆర్మీ ఉద్యోగి, ఈ పతంగులకు ఉపయోగించే దారాలలో ఒకటి తన ప్రాణం తీస్తుందని ఊహించి ఉండరు.
విశాఖపట్నంకు చెందిన కోటేశ్వర్ రెడ్డి ఆర్మీలో అంబులెన్స్ డ్రైవర్‌గా పని చేస్తున్నారు. శనివారం లంగర్ హౌస్ ప్రాంతంలో ఉన్న తన ఇంటికి బైక్ మీద వెళుతున్న సమయంలో పతంగులను ఎగరవేసే దారం ఒకటి ఆయన మెడకు చుట్టుకుంది. అది నిషేధిత చైనీస్ మాంజా రకం నైలాన్ దారం.
ఈ దారం మెటకు చుట్టుకోవడంతో కోటేశ్వర్ రెడ్డి మెడ కోసుకుపోయిందని, ఆయన్ను ఆసుపత్రికి తరలించగా అప్పటికే తీవ్ర రక్తస్రావం కారణంగా మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పారని పోలీసులు వెల్లడించారు.
‘‘ఐదు నిమిషాల్లోనే నా కొడుకును ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయినా ప్రాణాలు దక్కలేదు. అంబులెన్సును నడిపే నా కొడుకును అంబులెన్స్‌లోనే ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది’’ అని కోటేశ్వర్ రెడ్డి తండ్రి వరప్రసాద్ రెడ్డి వాపోయారు.

ఫొటో సోర్స్, Getty Images
దేశవ్యాప్తంగా మాంజా మరణాలు
కోటేశ్వర్ రెడ్డి మరణం ఈ తరహా ఘటనల్లో మొదటిది కాదు. ఒక్క హైదారాబాద్‌కే పరిమితమైంది కూడా కాదు. 2023 జూన్‌లో దిల్లీలోని పశ్చిమ విహార్‌లో తండ్రి బైక్ మీద ముందు కూర్చుని ప్రయాణిస్తున్న ఏడేళ్ల బాలిక కూడా ఇలా మాంజా మెడకు చుట్టుకుని గొంతు తెగిపోవడంతో మరణించింది.
తెలంగాణ, గుజరాత్, రాజస్థాన్, దిల్లీ, పంజాబ్...ఇలా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఈ తరహా ఘటనలు గత పది పదిహేనేళ్లుగా రిపోర్టు అవుతూనే ఉన్నాయి.
‘‘పాప మెడకు చుట్టుకునే వరకు నా కంటికి ఆ దారం కనిపించ లేదు. అది పాపకు చుట్టుకున్నట్లు అర్ధం కాగానే వాహనాన్ని సడన్ బ్రేక్ వేసి నిలిపేశాను. కానీ, అప్పటికే పాపకు తీవ్రమైన గాయం అయ్యింది.’’ అని దిల్లీకి చెందిన బాధిత బాలిక తండ్రి సందీప్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తో అన్నారు.
కోటేశ్వర్ రెడ్డి విషయంలోనూ ఇలాగే జరిగింది. సాధారణంగా ఈ దారం అంత త్వరగా కంటికి కనిపించదు. చీకటి పడటంతో దారం కనిపించే అవకాశాలు అసలే ఉండవు. వాహనం మీద మామూలు వేగంతో వెళుతున్నా ఈ ప్రమాదాన్ని నివారించడం దాదాపు అసాధ్యం.
సన్నగా, పదునుగా ఉండే ఈ మాంజా శరీరాన్ని మామూలు వేగంతో తాకినా గాయం అవుతుంది. అలాంటిది వాహనం మీద వెళుతున్నప్పుడు వేగం కారణంగా గాయాలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
ఏడేళ్ల కిందట దిల్లీలో మూడేళ్ల బాలిక కార్ రూఫ్ టాప్‌లో నిలబడి ప్రయాణిస్తుండగా, చైనీస్ మాంజా దారం మెడకు చుట్టుకుని మరణించినట్లు ఇండియా టీవీ రిపోర్ట్ చేసింది.

ఫొటో సోర్స్, Getty Images
ఒక సన్నని గట్టి దారం సొరకాయ, దోసకాయలాంటి వాటిని ఎంత సులభంగా కోసేయగలదో చూపించే దృష్టాంతాలు సోషల్ మీడియాలో అనేకం కనిపిస్తుంటాయి. గట్టిదనంతోపాటు, సన్నగా, పదునుగా ఉండే చైనీస్ మాంజాలాంటి దారాలు సున్నితమైన శరీర భాగాలను సులభంగా గాయపరచగలవు.
వాహనం మీద వెళుతున్న సందర్భంలోనే ఈ ప్రమాదాలు ప్రాణాంతకంగా మారుతున్నట్లు కోటేశ్వర్ రెడ్డి ఘటనతోపాటు, దేశవ్యాప్తంగా జరిగిన అనేక ప్రమాదాలను బట్టి అర్ధమవుతోంది. మెడకు దారం చుట్టుకున్నట్లు అర్ధమైన వెంటనే వాహనాన్ని నిలిపేసినా ప్రమాదాల నుంచి తప్పించుకోలేకపోతున్నారు.
దారం మెడకు చుట్టుకోగానే కోటేశ్వర్ రెడ్డి వాహనం మీద అదుపు కోల్పోయారని, కిందపడిపోయిన ఆయనను స్థానికులు హుటాహుటిన పక్కనే ఓ ప్రైవేట్ ఆసుపత్రికి, ఆ తర్వాత మిలిటరీ ఆసుపత్రికి తరలించారని, అప్పటికే తీవ్ర రక్తస్రావంతో ఆయన మరణించారని పోలీసులు వెల్లడించినట్లు డెక్కన్ క్రానికల్ పత్రిక తెలిపింది.
“నాలుగు తరాలుగా మా కుటుంబం ఆర్మీలో పని చేస్తుంది. నేను, మా తాత, ముత్తాత, ఇప్పుడు నా కుమారుడు అంతా ఆర్మీలోనే పని చేశాం. నా కుమారుడు మాంజా చుట్టుకుని చనిపోవడం జీర్ణించుకోలేకపోతున్నాం. రెండేళ్ల క్రితమే మా వివాహమైంది. చిన్న పాప కూడా ఉంది. ఈ పండుగ పూట ఇలా జరగడం మా దురదృష్టం. పైగా ఇవాళ ఆర్మీ డే. మా ఇంట్లో దీనిని సెలబ్రేట్ చేసుకుంటాం. కానీ ఇదే రోజూ ఇలా జరగడం ఏం మాట్లాడాలో కూడా తెలియడం లేదు.” అని కోటేశ్వర్ రెడ్డి తండ్రి వరప్రసాద్ రెడ్డి బీబీసీతో అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
చైనీస్ మాంజాపై నిషేధాలు
పండగలు, పర్వదినాలో గాలి పటాలు ఎగరవేసే సంప్రదాయం భారతదేశం నలుమూలలా కనిపిస్తుంది. అయితే, వినోదంగా మొదలైన ఈ సంప్రదాయం అటు పర్యావరణపరంగా, ప్రమాదాల కారణంగా నిత్యం చర్చనీయాంశంగా మారుతోంది.
సాధారణ నూలు దారాలకు భిన్నంగా, చైనీస్ మాంజా పేరుతో వాడే ఈ నైలాన్ దారం వల్ల ప్రమాదాలు మరింత పెరిగినట్లు ప్రభుత్వాలు, పర్యావరణ సంస్థలు గుర్తించాయి. దీనివల్ల కలుగుతున్న ప్రమాదాలను గుర్తించిన నిషేధాలు కూడా విధించాయి.
2017 సంవత్సరంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చైనీస్ మాంజా వాడకాన్ని దేశవ్యాప్తంగా నిషేధించింది. పలురాష్ట్రాలు ఈ రకం దారంపై బ్యాన్‌ను అమలు చేస్తున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
చైనీస్ మాంజా ఎలా తయారు చేస్తారు?
నూలుతో తయారయ్యే దారాలకు భిన్నంగా నైలాన్‌తో తయారయ్యేదే ఈ చైనీస్ మాంజా దారం. ఈ దారం సన్నగా, గట్టిగా ఉండటమే కాకుండా భూమిలో కలిసిపోయే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఇవి నాన్ బయోడీగ్రేడబుల్ (మట్టిలో కలిసిపోని) సింథటిక్‌తో తయారైన దారాలు. వీటిని మెటల్, గాజు పౌడర్లు ఉన్న గమ్‌ను పూసి సిద్ధం చేస్తారు. అందువల్ల ఇవి రఫ్‌గా, శరీరానికి తగిలినప్పుడు గాయపరిచేలా ఉంటాయి.
నైలాన్‌తో తయారైన ఈ దారాలను చైనీస్ మాంజా అంటున్నారు. నూలు దారాలకు కూడా ఇలాంటి గ్లాస్, మెటల్ పౌడర్ల మిశ్రమాన్ని అతికించడం ద్వారా కూడా పదునైన మాంజా తయారవుతుంది. వీటితో కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి.
గాలిపటాల పోటీలు జరిగే సమయంలో ప్రత్యర్ధులను వారి పతంగుల దారాలను తెంచడం ద్వారా ఓడించేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇందుకోసం ఈ ‘పదునైన’ దారాన్ని ఉపయోగిస్తుంటారు.
అయితే, మిగతా దారాలకు భిన్నంగా ఈ చైనీస్ మాంజా మనుషులు, పశుపక్ష్యాదులకు తగిలినప్పుడు గాయాలు కావడం, పలు సందర్భాలలో మరణాలు సంభవించడం సమస్యగా మారింది.

ఫొటో సోర్స్, Getty Images
పర్యావరణ పరంగా చూసినప్పుడు కూడా ఈ దారాలు పక్షుల కాళ్లకు, మెడకు చుట్టుకోవడంతో అవి గాయాలపాలపై మరణిస్తున్నాయని ‘పెటా’(People for the Ethical Treatment of Animals) వంటి జంతు సంరక్షణ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
చైనీస్ మాంజాపై నిషేధానికి ప్రభుత్వంపై ఒత్తిడి చేసిన సంస్థల్లో ‘పెటా’ కూడా ఒకటి.
ఈ రకం మాంజాపై నిషేధం విధించాల్సిందిగా 2016లో పెటా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో పిటిషన్ వేసింది.
ఈ దారానికి చేసిన మెటల్ కోటింగ్ కారణంగా విద్యుత్ అంతరాయాలతోపాటు, మనుషులకు ప్రాణాలకు కూడా షాక్ రూపంలో ముప్పుగా పరిణమిస్తోంది. కరెంటు తీగలకు చుట్టుకోవడం వల్ల ఇందులోని మెటల్ కోటింగ్ ద్వారా విద్యుత్ ప్రసారమై గాలిపటం ఎగరేస్తున్న వారు మరణించిన ఘటనలు కూడా ఉన్నాయి.
గత శనివారం హైదరాబాద్‌లోని అత్తాపూర్‌లో 11 ఏళ్ల బాలుడు చైనీస్ మాంజా ఉన్న గాలిపటం ఎగరేసినప్పుడు అది విద్యుత్ తీగలకు తగలడంతో షాక్‌కు గురై మరణించినట్లు డెక్కన్ క్రానికల్ పత్రిక రిపోర్ట్ చేసింది.
మకర సంక్రాంతి, రక్షాబంధన్ పండుగ సమయాల్లో ఉత్తరాదిలో అనేక మెట్రోలతోపాటు, సాధారణ రైళ్లు కూడా ఈ మాంజా కారణంగా జరిగిన విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల రవాణాలో అంతరాయాలను ఎదుర్కొనట్లు హిందుస్థాన్ టైమ్స్ పత్రిక రిపోర్ట్ చేసింది.
చైనీస్ మాంజా మీద నిషేధం ఉన్నప్పటికీ పలు ప్రాంతాలలో ఇప్పటీ ఈ రకం దారం తయారు చేస్తూనే ఉన్నారు. ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.
‘‘నిషేధాలు ఉన్నాయని ప్రభుత్వం చెబుతోంది. దాడులు చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. కానీ, ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి దారం మార్కెట్‌లోకి రాకుండా ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి’’ అని విశాఖపట్నంలోని పెదవాల్తేరులో ఉంటున్న కోటీశ్వర్ రెడ్డి బంధువొకరు మీడియాతో అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
పండగల సందర్భంలో పతంగులు ఎగరవేసే సమయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాల్సి ఉంది.
నిషేధం ఉన్నా చైనీస్ మాంజాలాంటివి మార్కెట్‌లోకి వస్తున్నాయి కాబట్టి, రోడ్డు మీద ప్రయాణిస్తున్నప్పుడు తగు భద్రతా చర్యలు తీసుకోవడం మంచిది. ముఖ్యంగా పండుగల సమయంలో ప్రయాణాలు చేసే సమయంలో జాగ్రత్తతో మెలగాలి.
గొంతు ప్రాంతంలో ఈ మాంజా చుట్టుకున్నప్పుడు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి వాహనం మీద వెళుతున్నప్పుడు తగు రక్షణ చర్యలు తీసుకోవడం మంచిది.
పతంగులు ఎక్కువగా కనిపించే సమయాల్లో వాహనాల మీద వెళుతున్నప్పుడు వేగంగా వెళ్లకపోవడం ఉత్తమం.
పిల్లలు పతంగులు ఎగరవేసే సమయంలో నిషేధిత చైనీస్ మాంజా జోలికి వెళ్లకుండా చూడాల్సి ఉంది. ఇలాంటివి వాడటంపై నిషేధం ఉండటంతోపాటు, ఇతరుల ప్రాణాలకు హాని కలిగిస్తే అదనంగా చట్టపరమైన సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
పతంగుల పోటీలను ఆరోగ్యకరమైన వాతావరణంలో నిర్వహించేలా చూడటం ముఖ్యం.
విద్యుత్ లైన్లకు సమీపంలో గాలిపటాలకు ఎగరేయకుండా చూడటం వల్ల విద్యుత్ షాక్ ప్రమాదాలను, షార్ట్ సర్క్యూట్‌లను నివారించవచ్చు.
చైనీస్ మాంజా తయారు చేసేవారు, అమ్మకాలు జరిపేవారిని గుర్తించినప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి.
ఇవి కూడా చదవండి:
- మనుషులు పాలు, కూరగాయలు కూడా అరిగించుకోలేని రోజులవి.. 5 వేల సంవత్సరాల కిందట ఏం జరిగింది
- అభినందన్ వర్ధమాన్ : ఈ భారత పైలట్ పాకిస్తాన్ కస్టడీలో ఉన్న సమయంలో తెరవెనుక ఏం జరిగింది?
- అమెజాన్ అడవుల్లో బయటపడ్డ పురాతన నగరం.. అత్యాధునిక రహదారి వ్యవస్థ, కాల్వల నిర్మాణంతో వేలమంది నివసించిన ఆనవాళ్లు
- కుక్క మాంసంపై దక్షిణ కొరియాలో వివాదమెందుకు? బీఫ్, పోర్క్ కంటే ఇది ఆరోగ్యకరమా?
- El Dorado: బంగారంతో మెరిసే భూభాగం కోసం చరిత్రలో సాగిన సాహస యాత్రలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















