విలియం లై: చైనాను చిరాకు పెట్టే ఈ తైవాన్ నాయకుడిని ప్రజలు అధ్యక్షుడిగా ఎందుకు ఎన్నుకున్నారు?

ఫొటో సోర్స్, GETTY IMAGES
‘సమస్యల సృష్టికర్త’, ‘ప్రమాదకర వేర్పాటువాది’ అని చైనా భావించే వ్యక్తే ఇప్పుడు తైవాన్‌కు అధ్యక్షుడు కాబోతున్నారు.
తైవాన్‌పై చైనా ఆరోపణలు కొత్తవేమీకాదు.
తైవాన్ తమ దేశంలో అంతర్భాగమని చైనా ఎప్పటి నుంచో చెబుతున్నదే.
ఎప్పటికైనా మాతృభూమి పునరేకీకరణలో భాగంగా తైవాన్‌ను చైనాలో కలిపేయడమే లక్ష్యమని అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ కూడా చెబుతూ ఉంటారు.
గడిచిన కొన్నేళ్ళుగా చైనా ‘బెదిరింపులు’ తారస్థాయికి చేరాయి.
ఈ నేపథ్యంలో తైవాన్ అధ్యక్ష ఎన్నికల్లో చైనాను చికాకు పెట్టే డెమోక్రటిక్ పీపుల్స్ పార్టీ అధ్యక్షుడు విలియమ్ లై విజయం సాధించారు.
ఆయన ప్రస్తుతం తైవాన్ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు.
డెమోక్రటిక్ పీపుల్స్ పార్టీ(డీపీపీ)కి ప్రత్యర్థి అయిన కోమింగ్‌టాంగ్ పార్టీ(కేఎంటీ)కి చెందిన హు యు-యి తన ఓటమిని అంగీకరించడంతో లై విజయం ఖరారైంది.
విలియమ్ లై 50 లక్షల ఓట్లు సాధించిన మొదటి అధ్యక్ష అభ్యర్థి అని స్థానిక మీడియా తెలిపింది.
లై ఎప్పటి నుంచో చైనాను చికాకు పెడుతున్నారు. అందుకే చైనా ఆయనను ‘సమస్యల సృష్టికర్త’గా పిలుస్తోంది.
లై ప్రత్యర్థి కొమింటాంగ్ పార్టీ చైనాతో సంబంధాలు మెరుగుపరుచుకుంటామని ఎన్నికల్లో వాగ్దానం చేసింది.
లైకు ఓటు వేయవద్దని ప్రజలను అభ్యర్థించింది.
తైవాన్ అధ్యక్ష ఎన్నికల బరిలో తైవాన్ పీపుల్స్ పార్టీ కూడా నిలిచింది. ఈ పార్టీ అధ్యక్ష అభ్యర్థి వెన్-జీ తన ఓటమిని అంగీకరించారు.
జనవరి 13న అధ్యక్ష ఎన్నికలతోపాటు తైవాన్ పార్లమెంట్‌లోని 113 స్థానాలకూ ఎన్నికలు జరిగాయి.
తైవాన్ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి పార్టీలన్నీ కలసికట్టుగా పనిచేయాలని లైతో తలపడి ఓడిపోయిన హు యు-యి పిలుపు ఇచ్చారు.
తనపై విజయం సాధించిన లైకు ఆయన శుభాకాంక్షలు చెప్పారు.
‘‘మనకు ఎన్నో సమస్యలు ఉన్నాయి. అందుకే వీటిని పరిష్కరించేందుకు మనకో ప్రభుత్వం కావాలి. యువత కోసం పనిచేసే ప్రభుత్వం కూడా మనకు కావాలి. కోమింగ్‌టాంగ్ పార్టీ మరింత బలంగా ముందుకు సాగుతుందని ఆశిస్తున్నాను’’ అని ఆయన తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
చైనా-తైవాన్ సంబంధాలపై విలియం లై ఏమన్నారు?
ఎన్నికల్లో గెలిచాక విలియం లై ఆచితూచి మాట్లాడారు. తైవాన్, చైనా సంబంధాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటామని ఆయన చెప్పారు.
పరస్పర గౌరవం ఆధారంగానే చైనాతో మాట్లాడతామని చెప్పారు.
అయితే తైవాన్ స్వతంత్రం విషయంలో చైనా ఆయన్ను ఎప్పుడూ దోషిగానే చూస్తుంటుంది.
తైవాన్, చైనా సంబంధాలపై ఆయనెప్పుడూ గట్టిగానే మాట్లాడేవారు.
అయితే తన మునుపటి అధ్యక్షురాలు త్సై ఇంగ్ వెన్ మాదిరే తానూ సమన్వయ విధానాన్నే అవలంబిస్తానని అమెరికా లాంటి తమ మిత్రదేశాలకు ఆయన చెబుతూ వస్తున్నారు.
తైవాన్ స్వాతంత్య్రాన్ని చైనా నిరాకరిస్తోంది, ఆ దేశాన్ని చైనాలో భాగంగా భావిస్తోంది.
స్వయంపాలిత ద్వీపమైన తైవాన్‌లో జరిగిన ఎన్నికలపై అటు అమెరికా, ఇటు చైనా రెండూ ఓ కన్నేసి ఉంచాయి.
ఈ రెండు దేశాలకు ఈ ప్రాంతం వ్యూహాత్మకంగా కీలకమైనది కావడమే అందుకు కారణం.
తైవాన్‌లో తాజా సాధారణ ఎన్నికల ఫలితాలు ఈ దేశంతో చైనా వ్యవహరిస్తున్న తీరును ప్రభావితం చేస్తాయని, ఉద్రిక్తతలు మరింత పెరిగే ప్రమాదముందని, దీని ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పడుతుందని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
తైవాన్ ప్రస్తుత అధ్యక్షురాలు త్సై ఇంగ్ వెన్ తన పదవి నుంచి దిగిపోతున్నారు.
ఆమె రెండుసార్లు తైవాన్ అధ్యక్షురాలిగా పనిచేశారు.
అక్కడి రాజ్యాగం ప్రకారం రెండుసార్లకు మించి అధ్యక్షస్థానాన్ని చేపట్టేందుకు వీలులేదు.
ఈమె పార్టీని చైనా పరిగణనలోకి తీసుకునేది. కానీ ఈమె ప్రాతినిధ్యం వహిస్తున్న డెమోక్రటిక్ పీపుల్స్ పార్టీని మాత్రం విభజనవాదిగా చూస్తోంది.

ఫొటో సోర్స్, SOCIAL MEDIA
అధ్యక్ష ఎన్నికల్లో లైతో తలపడింది ఎవరు?
హు యు -యి, కోమింగ్‌టాంగ్ పార్టీ: హు ఓ మాజీ పోలీసు అధికారి. 2002లో ఆయన తైవాన్ రాజధాని తైపే పొలిమేరల్లోని తైపే సిటీ మేయర్ పీఠాన్ని తేలికగా గెలుచుకున్నారు.
ఆయనకు ఉదారవాది, సమర్థవంతమైన నాయకుడిగా పేరుంది.
చైనాతో బలమైన బంధాలు, ఆ దేశంలో కలిసిపోవడంపై పనిచేసే పాన్ బ్లూ సంకీర్ణానికి ఆయన నాయకుడిగా ఉన్నారు.
ఇటీవల కాలంలో ఆయన ‘యథాతథ స్థితికి’ కట్టుబడి ఉంటానని చెప్పారు.
అంటే తైవాన్‌ను స్వతంత్రదేశంగా ప్రకటించడం లేదా చైనాతో ఏకీకరణ గురించి మాట్లాడనని తెలిపారు.
కో వెన్ -జె, తైవాన్ పీపుల్స్ పార్టీ (టీపీపీ): కో వెన్ -జె 2014లో తైవాన్ రాజధాని తైపే మేయర్ పీఠానికి పోటీపడ్డారు. ఆయన వృత్తి రీత్యా సర్జన్.
ఆయన 2019లో తైవాన్ పీపుల్స్ పార్టీని స్థాపించారు.
డీపీపీ, కేఎంటీ పార్టీలతో విసిగిపోయిన ప్రజలకు మూడో గొంతుకగా తన పార్టీ నిలుస్తుందని ఆయన చెప్పారు.
టీపీపీ మూడో ప్రత్యామ్నాయం కాగలదా?
తైవాన్ రాజకీయాలు బహుముఖంగా ఉండాలని అక్కడి యువత కోరుకుంటున్నారు.
కొంత కాలంగా డీపీపీ, కేఎంటీ మధ్యే రాజకీయాలు నడవడంతో కీలక సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని ఎక్కువ మంది ప్రజలు భావిస్తున్నారు.
ఈ క్రమంలో తైవాన్ పీపుల్స్ పార్టీ వారికో ఆశాకిరణంలా కనిపిస్తోంది. అందుకే ఆ పార్టీ వ్యవస్థాపకుడు కో వెనె జేకు యువత సహా తైవాన్ ఓటర్లలో దాదాపు మూడో వంతు ఓటు వేశారు.
ఎవరూ మెజార్టీ సీట్లు గెలుచుకోని పార్లమెంటులో టీపీపీ 8 పార్లమెంటు స్థానాలు గెలుచుకుంది.
అధ్యక్ష పోటీలో అట్టడుగున నిలిచిన కో వెన్ తైవాన్ రాజకీయాలను మలుపుతిప్పే నేతగా నిలుస్తున్నారని పరిశీలకులు చెబుతున్నారు.
‘‘ఇకపై ఇదెంత మాత్రం రెండు గుర్రాల పోటీ కాదు. ఇప్పుడిది మూడు గుర్రాల పోటీ’’ అని రాజకీయ శాస్త్రవేత్త వెన్ - తి- సంగ్ చెప్పారు.
తాజా ఎన్నికల్లో తైవాన్ పీపుల్స్ పార్టీకి వచ్చిన ఓట్లు, ఆ పార్టీ సామర్థ్యం భవిష్యత్తులో తైవాన్ రాజకీయాల్లో బహుళత్వం ప్రాధాన్యాన్ని సూచిస్తోంది. ముఖ్యంగా తైవాన్ యువత ఈ బహుళత్వాన్ని కోరుకుంటోంది.

ఫొటో సోర్స్, GETTY IMAGES
తైవాన్ ప్రజలు ఇచ్చిన సందేశం ఏమిటి?
చైనా, తైవాన్ మధ్య ఉద్రిక్తతలను పక్కన పెడితే ఆర్థికాభివృద్ధి ఎంతో కీలకమని తైవాన్ యువత భావిస్తున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి.
నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ 2023లో జరిపిన ఓ అధ్యయనంలో 34.2 శాతం మంది ప్రజలు ఆర్థికాభివృద్ధి ఎంతో ముఖ్యమైనదని, తరువాత వచ్చే అధ్యక్షుడు ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు.
గడిచిన ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను అధ్యక్షురాలు త్సై ఇంగ్ వెన్ చాలా వరకు నెరవేర్చలేదనే ఈ సర్వేలో పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు.
అయినా కూడా చాలా మంది అధ్యక్షురాలికి చెందిన పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి అయిన విలియమ్ లైపై విశ్వాసం ఉంచారు.

ఫొటో సోర్స్, AFP
చైనా దూకుడుపై జపాన్, దక్షిణ కొరియా, అమెరికా ఆందోళన ఏమిటి?
చైనాకు ఆగ్నేయ తీరాన 161 కిలోమీటర్ల దూరంలో తైవాన్ ఉంది.
1949లో చైనాలో జరిగిన అంతర్యుద్ధంలో నేషనలిస్ట్ పార్టీ కోమింగ్‌టాంగ్‌పై చైనా కమ్యూనిస్టు పార్టీ ఆధిపత్యం సాధించడంతో కోమింగ్‌టాంగ్ పార్టీ తైవాన్ ద్వీపంలో పరిపాలన ప్రారంభించింది.
అప్పటి నుంచి తైవాన్ స్వయంపాలిత కేంద్రంగా ఉండిపోయింది.
కొన్ని దశాబ్దాల తరువాత తైవాన్ నిరంకుశత్వాన్ని వదిలించుకుని కొత్త రాజ్యాంగాన్ని రచించుకుని ప్రజాస్వామ్య పాలనను స్వీకరించింది.
తైవాన్ ప్రజలలో చాలా మంది చైనా ప్రధాన భూభాగం నుంచి ఈ ద్వీపం విడిపోయిందని భావిస్తుంటారు.
కానీ చైనా కమ్యూనిస్టు పార్టీ మాత్రం తైవాన్‌పై నియంత్రణను జాతీయ భద్రతలో భాగంగా చూస్తుంటుంది.
చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ తరుచూ చెప్పే ‘‘పునరేకీకరణ’’ను సాధించడానికి , ఆ దేశం సైన్యంతో దిగడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి.
చైనా ఇలాంటి మిలటరీ చర్యలకు దిగితే వాటిని ఎదుర్కోవడానికి అమెరికా కూడా ఎప్పటికప్పుడు సమాయత్తంగానే ఉంటోంది.
అమెరికాకు మిత్రదేశాలుగా ఉన్న జపాన్, దక్షిణకొరియా ద్వీపదేశాల గొలుసులో తైవాన్ మొదటిది. అందుకే అది అమెరికా విదేశాంగ విధానంలో కీలకంగా ఉంది.
తైవాన్‌ను చైనా స్వాధీనం చేసుకుంటే పశ్చిమ పసిఫిక్ ప్రాంతంలో చైనా తన అధికారాన్ని విస్తరించడానికి అవకాశం కలుగుతుంది.
దీంతోపాటు అమెరికా సైనిక స్థావరాలైన గువామ్, హవాలీకి కూడా ముప్పుగా పరిణమిస్తుందని కొంత మంది పశ్చిమదేశాల నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
కానీ చైనా మాత్రం తన ఉద్దేశాలన్నీ శాంతియుతమైనవేనని చెబుతోంది.
తైవాన్‌పై తరచూ ఒత్తిడి పెంచుతూనే ఉంది.
కిందటేడాది రోజూ చైనా యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు పదేపదే తైవాన్ సరిహద్దులను దాటాయి.
ప్రస్తుతం తైవాన్‌కు కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన లై చైనా, అమెరికాలను దృష్టిలో ఉంచుకుని తన విధానాలను రూపొందించుకోవాల్సి ఉంటుంది.
ఇవి కూడా చదవండి:
- మనుషులు పాలు, కూరగాయలు కూడా అరిగించుకోలేని రోజులవి.. 5 వేల సంవత్సరాల కిందట ఏం జరిగింది
- అభినందన్ వర్ధమాన్ : ఈ భారత పైలట్ పాకిస్తాన్ కస్టడీలో ఉన్న సమయంలో తెరవెనుక ఏం జరిగింది?
- అమెజాన్ అడవుల్లో బయటపడ్డ పురాతన నగరం.. అత్యాధునిక రహదారి వ్యవస్థ, కాల్వల నిర్మాణంతో వేలమంది నివసించిన ఆనవాళ్లు
- కుక్క మాంసంపై దక్షిణ కొరియాలో వివాదమెందుకు? బీఫ్, పోర్క్ కంటే ఇది ఆరోగ్యకరమా?
- El Dorado: బంగారంతో మెరిసే భూభాగం కోసం చరిత్రలో సాగిన సాహస యాత్రలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














