భారత్-మాల్దీవ్స్ వివాదం: 'బాయ్‌కాట్ మాల్దీవ్స్'పై అక్కడి ప్రజలు ఏం అంటున్నారు

ఫొటో సోర్స్, ANBARASAN ETHIRAJAN
- రచయిత, అన్బరసన్ ఎతిరాజన్
- హోదా, బీబీసీ న్యూస్
మాల్దీవుల రాజధాని మాలెలోని ఇరుకు వీధుల్లో ఉన్న రెస్టారెంట్లు, కెఫేల్లో ఒక చర్చ జరుగుతోంది. భారత్‌తో తాజాగా చోటు చేసుకున్న వివాదం ఎలా చేయిదాటింది, భారత్ ఇప్పుడు ఎలా స్పందిస్తుంది అనేది చర్చనీయమైంది.
భారత ప్రధాని నరేంద్ర మోదీపై మాల్దీవుల ప్రభుత్వంలోని ముగ్గురు మంత్రులు చేసిన అవమానకర వ్యాఖ్యల కారణంగా భారత పర్యాటకుల నుంచి మాల్దీవుల పర్యాటక రంగం బాయ్‌కాట్ ప్రమాదాన్ని ఎదుర్కొంటోంది. మాల్దీవులకు ఆర్థిక వనరైన పర్యాటక రంగం నుంచి లభిస్తున్న ఆదాయంలో భారత టూరిస్టులది మెజార్టీ వాటాగా చెప్పొచ్చు.
మాల్దీవుల ఆర్థిక వ్యవస్థలో మూడో వంతు పర్యాటక రంగానిదే. నిరుడు మాల్దీవుల్లో పర్యటించిన విదేశీయుల్లో భారతీయులే ఎక్కువ.
మాల్దీవుల ప్రభుత్వం సస్పెండ్ చేసిన మంత్రులు భారత ప్రధాని మోదీని జోకర్, ‘టెర్రరిస్ట్’, ఇజ్రాయెల్ చేతిలో కీలుబొమ్మ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేశారు.
ఈ వ్యాఖ్యలు వివాదాన్ని రాజేయడంతో భారత సోషల్ మీడియాలో బాయ్‌కాట్ మాల్దీవ్స్ ప్రచారం విస్తృతమైంది.
దీంతో గందరగోళం తలెత్తడంతో వివాదాస్పద పోస్టులను తొలగించారు. మంత్రుల వ్యాఖ్యలు పూర్తిగా వ్యక్తిగతమని, వారి అభిప్రాయాలు ప్రభుత్వ అభిప్రాయాలు కావని మాల్దీవుల విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది.
హిందూ మహాసముద్రం మధ్యలో ఉన్న 1200 పగడపు దీవులతో మాల్దీవులు దేశం ఉంటుంది. భారత జనాభా 140 కోట్ల మంది కాగా, మాల్దీవుల జనాభా 5,20,000.
ఆహారం, మౌలిక సదుపాయాలు, నిర్మాణాలు, టెక్నాలజీ కోసం పొరుగునే ఉన్న పెద్ద దేశం భారత్‌పై ఈ చిన్న ద్వీప దేశం ఆధారపడుతుంది.
తాజా పరిణామాల నేపథ్యంలో ఈ దౌత్యపరమైన వివాదం ఇరుదేశాల మధ్య సంబంధాలను దెబ్బతీస్తుందేమోనని మాలె వాసులు కొందరు ఆందోళన చెందుతున్నారు.
''బాయ్‌కాట్ నినాదాలతో మేం నిరాశకు గురయ్యాం. మా ప్రభుత్వ వైఖరి కూడా నిరాశపరిచింది. మా మంత్రులు మరింత అవగాహనతో వ్యవహరించి ఉండాల్సింది'' అని మాల్దీవియన్ నేషనల్ యూనివర్సిటీ విద్యార్థిని మరియం ఈమ్ షఫీగ్ బీబీసీతో అన్నారు.
మాల్దీవులకు భారత్‌తో బలమైన సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయని, అక్కడి ప్రజలు బాలీవుడ్ సినిమాలు, సీరియల్స్ చూస్తూ పెరిగారని మరికొందరు అభిప్రాయపడ్డారు.
''ఆహారం, విద్య, వైద్యం కోసం మేము భారత్‌పై ఆధారపడతాం'' అని మాల్దీవియన్ డెమొక్రటిక్ పార్టీ మద్దతుదారు షఫీగ్ అన్నారు.
మాల్దీవియన్ డెమొక్రటిక్ పార్టీ 'ఇండియా ఫస్ట్' విధానాన్ని అవలంబించింది. దిల్లీతో సన్నిహిత సంబంధాలు కలిగివుండేది.

ఫొటో సోర్స్, GETTY IMAGES
భారత పర్యాటక రంగానికి ప్రోత్సాహం అందించేలా లక్షదీవుల ఫోటోలను ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్‌లో షేర్ చేసిన అనంతరం మాల్దీవుల మంత్రులు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఈ వివాదం అనంతరం, మాల్దీవులకు వెళ్లాలనే తమ ప్లాన్స్‌ను రద్దు చేసుకుంటున్నట్లు చాలా మంది భారతీయులు సోషల్ మీడియాలో పోస్టులు చేశారు.
తమ కంపెనీ మాల్దీవులకు విమాన టికెట్ బుకింగ్స్‌ను రద్దు చేస్తున్నట్లు భారతీయ టికెట్ బుకింగ్ వెబ్‌సైట్ 'ఈజ్ మై ట్రిప్ సీఈవో ప్రకటించారు.
మాల్దీవ్స్ అసోసియేషన్ ఆఫ్ ట్రావెల్ ఏజెంట్స్ అండ్ టూర్ ఆపరేటర్స్ అధ్యక్షులు అబ్దుల్లా ఘియాస్ ఈ విషయంపై మాట్లాడుతూ ''రిసార్టులు, హోటళ్ల బుకింగ్స్ భారీగా ఏమీ రద్దు కాలేదు. అయితే, బుకింగ్స్‌లో తగ్గుదల కనిపించింది'' అన్నారు.
మాల్దీవుల అధ్యక్షులు మహమ్మద్ మయిజ్జు చైనా పర్యటనలో ఉన్న సమయంలో ఈ వివాదం చెలరేగింది. చైనా అనుకూల విధానాలతో ముందుకెళ్తున్న మయిజ్జు, పనిలో పనిగా ఎక్కువ సంఖ్యలో పర్యాటకులను పంపాలని చైనాను అభ్యర్థించారు.
కోవిడ్-19 మహమ్మారికి ముందు చైనా నుంచి టూరిస్టులు భారీగా మాల్దీవులకు వచ్చేవారు. అయితే, ఆ తర్వాత చైనా పర్యాటకుల సంఖ్య బాగా తగ్గిపోయిందని టూర్ ఆపరేటర్లు చెబుతున్నారు. ఫ్లైట్ టికెట్ ధరలు ఎక్కువగా ఉండడం, ఫ్లైట్ సర్వీసులు తక్కువగా ఉండడం కూడా దానికి కారణం కావొచ్చని అంటున్నారు.
''కోవిడ్‌కు ముందు మాల్దీవులకు వచ్చే విదేశీ పర్యాటకుల్లో చైనాదే అగ్రస్ధానం. అది పునరావృతం కావాలని కోరుకుంటున్నాం'' అని చైనా పర్యటనలో మయిజ్జు కోరారు.

ఫొటో సోర్స్, ANBARASAN ETHIRAJAN
అయితే, వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రులపై కఠిన చర్యలు తీసుకోకపోవడమేంటని కొందరు మాల్దీవియన్లు మయిజ్జుపై విమర్శలు చేస్తున్నారు.
''ఆ మంత్రులను వెంటనే బర్తరఫ్ చేసి ఉండాల్సింది. ఆహారం కోసం భారత్‌పై ఆధారపడుతుంటాం. ఇప్పుడు భారత్ ఎలా స్పందిస్తుందోనని ఆందోళన చెందుతున్నాం'' అని ప్రతిపక్ష పార్టీలకు చెందిన లాయర్ ఐక్ అహ్మద్ ఇయాసా బీబీసీతో చెప్పారు.
దేశంలోని అతిపెద్ద వాణిజ్య సంస్థల్లో ఒకటైన ఆల్ ఇండియా ట్రేడర్స్ కాన్ఫెడరేషన్, అక్కడి అధికారులు క్షమాపణ చెప్పే వరకు మాల్దీవులతో వ్యాపారం చేయడం మానేయాలని తమ సభ్యులను కోరింది.
ఈ బాయ్‌కాట్ నినాదాలు మాల్దీవుల్లో నివసిస్తున్న భారతీయులపై కూడా ప్రభావం చూపుతాయని కొందరు అభిప్రాయపడుతున్నారు. దాదాపు 33 వేల మంది భారతీయులు మాల్దీవుల్లో నిర్మాణ రంగం, ఆతిథ్యం, రిటైల్ రంగాల్లో పనిచేస్తున్నారు.
''మాల్దీవుల టూరిజం సెక్టార్‌లోనూ మేనేజర్లుగా, కార్యాలయ నిర్వహణ సిబ్బందిగా చెప్పుకోదగ్గ స్థాయిలోనే భారతీయులు పనిచేస్తున్నారు'' అని ఘియాస్ చెప్పారు.
ఇప్పటికే ఇరుదేశాల మధ్య ఉద్రిక్తత నెలకొంది. నిరుడు నవంబర్‌లో అధికారంలోకి వచ్చిన వెంటనే 77 మంది భారతీయ సైనికుల బృందం దేశం విడిచి వెళ్లిపోవాలని మాల్దీవుల అధ్యక్షులు మయిజ్జు ప్రకటన చేయడంతో టెన్షన్ నెలకొంది.
తీరప్రాంత రక్షణ, నిఘా కోసం బహుమతిగా అందజేసిన ఎయిర్‌క్రాఫ్ట్‌ల నిర్వహణ కోసమే భారత సైన్యం మాల్దీవుల్లో ఉందని ఇండియా చెబుతోంది.
హిందూ మహాసముద్రంలోని ఈ ద్వీప దేశంపై భారత్ ప్రభావం చాలా ఏళ్లుగా ఉంది. ఆ పాత పద్ధతిని నూతన అధ్యక్షులు మయిజ్జు మార్చేయాలని అనుకుంటున్నారు. తన ఎన్నికల ప్రచారంలోనూ 'ఇండియా అవుట్' విధానాన్ని అమలు చేస్తామని, భారత సైన్యాన్ని వెనక్కి పంపి, మాలెపై దిల్లీ ప్రభావాన్ని తగ్గిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
''మయిజ్జు వ్యాఖ్యలు ఓటర్లలో భారత వ్యతిరేక సెంటిమెంట్‌ను రగిల్చాయి. అదే భారత్‌కు వ్యతిరేకంగా జూనియర్ మంత్రులు వివాదాస్పద వ్యాఖ్యలు చేసేందుకు దారితీసి ఉండొచ్చు'' అని మాల్దీవుల రాజకీయ విశ్లేషకుడు అజీమ్ జహీర్ అన్నారు.
భారత్, మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలను కొందరు తప్పుబడుతున్నప్పటికీ, దిల్లీ నుంచి దౌత్యపరంగా బలమైన ప్రతిస్పందన ఉండొచ్చనే వాదన కూడా వ్యక్తమవుతోంది.
''ఇది మయిజ్జును చైనాకు, లేదా ఈ ప్రాంతంలో మరో శక్తివంతమైన దేశానికి దగ్గరయ్యేలా ప్రోత్సహించొచ్చు'' అని జహీర్ అభిప్రాయపడ్డారు.
సోషల్ మీడియాలో బాయ్‌కాట్‌కి పిలుపునిచ్చిన నేపథ్యంలో మాలేకి భరోసా ఇచ్చేందుకు దిల్లీ రంగంలోకి దిగొచ్చని భారత్‌కు చెందిన మాజీ సీనియర్ దౌత్యవేత్త నిరుపమ మేనన్ రావ్ అన్నారు.
''ఇక్కడే భారత ప్రభుత్వ ప్రతినిధులు కీలకమైన భద్రత, వ్యూహాత్మక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పరిస్థితిని చక్కదిద్దాలి. మాల్దీవులు మనకు క్యూబా కాదు'' అని ఆమె ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
ఇవి కూడా చదవండి:
- బంగ్లాదేశ్:షేక్ హసీనాను ఇందిరా గాంధీ ఎందుకు ఇండియా రప్పించి రహస్యంగా ఉంచారు?
- సుచనా సేథ్: 'నాలుగేళ్ళ కొడుకును చంపి, బ్యాగులో కుక్కి, రహస్యంగా కారులో తీసుకెళుతున్న ఈ తల్లి’ ఎలా దొరికిపోయారంటే....
- ఉమర్ ఖలీద్ బెయిల్ పిటిషన్ 2023లో ఒక్కసారి కూడా విచారణకు రాలేదు... ఆయనపై ఉన్న ఆరోపణలేంటి?
- బిల్కిస్ బానో కేసు: సుప్రీంకోర్టు తీర్పులోని తీవ్రమైన వ్యాఖ్యలేంటి?
- ఫుడ్ ప్యాకెట్స్ కొనేప్పుడు మీరు లేబుల్స్ చదువుతారా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















